
రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశాల నిబంధనలకు సర్కారు సవరణ
85% తెలంగాణ వారికి.. 15% తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15శాతం నాన్–లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ 15 శాతం కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో... ఈ 15శాతం కోటా గడువు ముగిసిపోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే వివిధ ప్రవేశపరీక్షల ప్రకటనలు విడుదలవడంతో నాన్–లోకల్ కోటాను అమలు చేశారు.
కమిటీ నివేదిక మేరకు సవరణలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్–లోకల్ కోటాకు సవరణలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 1974లో తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. దాని ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ లోకల్ జోన్‌గా పేర్కొంటారు.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85శాతం సీట్లు స్థానికులకు, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాలు, తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు.
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని.. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
60వేలకుపైగా విద్యార్థులకు నో చాన్స్
రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు. నాన్–లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు 60 వేలకుపైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వారంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ (టీజీఈఏపీసెట్)కు గతేడాది 3,54,803 మంది హాజరవగా.. అందులో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు 49,071 మంది, అగ్రి, ఫార్మాకు 12,349 మంది కలిపి 61,420 మంది హాజరయ్యారు.
ఎవరెవరు అర్హులు?
– ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మిని్రస్టేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తాయి.
– ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజియన్‌గా పరిగణిస్తారు. ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. వారు 85శాతం లోకల్, 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు.
– ఇక తెలంగాణ వెలుపల చదువుకున్న సమయాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు... తెలంగాణ వెలుపల ఉద్యోగ కాలాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులున్న అభ్యర్థులు.. 15శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ స్థానికత ఉండి, ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వారిని కూడా అన్–రిజర్వుడ్ కోటా కిందకు తెచ్చారు.
– తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
– రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి తెలంగాణ పరిధిలో భార్య, భర్త (స్పౌజ్) పనిచేస్తే.. వారి పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment