convener quota
-
‘బి’ గ్యాంగ్ బేరాల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుకు గిరాకీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు. సీఎస్సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
2.28 లక్షల ర్యాంక్‌కు.. ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరగడంతో ఈసారి తక్కువ మార్కులు.. ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా మూడో విడత కౌన్సెలింగ్ ఉంది. అందులో సీట్లు మిగిలితే మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. రెండో విడతలో బీసీ ‘ఏ’కేటగిరీ కింద, నీట్లో 2,28,059వ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఆ విద్యార్థికి 360 మార్కులు వచ్చాయి. ఇంత తక్కువ మార్కులకు, ఎక్కువ ర్యాంకుకు సీటు రావడం ఇదే తొలిసారని కాళోజీ వర్సిటీ వర్గాలంటున్నాయి. జనరల్ కోటాలో 451 మార్కులతో 1,25,070వ ర్యాంకు పొందిన విద్యార్థికి కూడా ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడి ర్యాంకుల కంటే ఇక్కడ రెట్టింపు ఉన్నా తెలంగాణలో సీటు రావడం గమనార్హం. పెరిగిన సీట్లతో చిగురించిన ఆశలు రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. అవన్నీ కూడా కన్వీనర్ సీట్లే కావడం గమనార్హం. ప్రభుత్వ కాలేజీల్లో అన్నిసీట్లు, ప్రైవేట్‌లో సగం సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారు. ప్రైవేట్‌లో ఏడాదికి రూ.60 వేలు, ప్రభుత్వంలో ఏడాదికి రూ.10 వేల ఫీజు ఉంటుంది. ఇంత తక్కువ ఫీజు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ సీట్లకు గట్టి పోటీ ఉంటుంది. కాగా, గత వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 3,303 ఉండగా, ఈ ఏడాది మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 4,425కు పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ఏకంగా 1,122 సీట్లు పెరిగాయి. దీంతో ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. మరోవైపు బీ కేటగిరీలో స్థానిక రిజర్వేషన్‌ను 85 శాతం చేయడంతో అదనంగా వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. దీంతో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది ఏపీ ఈఏపీసెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. -
ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం కోటా అమలుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెట్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, చీఫ్ క్యాంపు ఆఫీసర్ (అడ్మిషన్స్) డాక్టర్ బల్లా కళ్యాణ్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కాలేజీల్లోని కోర్సుల్లో పది శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లోని సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తున్నారు. కన్వీనర్ కోటాలో 7 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 3 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా కేటాయిస్తున్నారు. అయితే కన్వీనర్ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తోంది. వారిపై పైసా భారం పడదు. మేనేజ్మెంట్ కోటా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఆ కోటాలో సీట్లు పొందే ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు ఫీజు వారే చెల్లించాలి. ఇది కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై ఇంత ఫీజు భారం సరికాదన్న ప్రభుత్వ అభిప్రాయం మేరకు మొత్తం 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల ఆ విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ప్రైవేటు యూనివర్సిటీల్లో కేంద్ర చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాకు అవకాశం లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ఆ కోటా అమలు కాదు. నేడు ఈఏపీ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీ సెట్–2021 సీట్ల కేటాయింపు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీనే సీట్లు కేటాయించాల్సి ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకోవలసి ఉండటంతో వాయిదా పడింది. గురువారం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నుంచి సీట్లు కేటాయిస్తారు. -
ప్రైవేట్ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్న ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లకు సంబంధించి ప్రభుత్వం కోర్సుల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం జీఓ 57ను విడుదల చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (అమరావతి), వీఐటీ ఏపీ (అమరావతి), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (విజయనగరం), భారతీయ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ–బెస్ట్ (అనంతపురం)లోని బీటెక్, బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీ, సెంచూరియన్ వర్సిటీల్లో బీటెక్ కోర్సులకు, బెస్ట్ వర్సిటీలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీలో బీటెక్ కోర్సు ఫీజును రూ.70 వేలు, సెంచూరియన్‌లో రూ.50 వేలు, బెస్ట్ వర్సిటీలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లకు రూ.70 వేలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2021–22 నుంచి 2023–24 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఫీజులకు అదనంగా డబ్బు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజులు ఈ ఫీజులో కలసి ఉండవని పేర్కొంది. కాగా ఈ వర్సిటీల్లో మొత్తంగా 2,330 బీటెక్ సీట్లు, బెస్ట్ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పేద విద్యార్థుల కల సాకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను మాత్రమే ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఆయా వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోకి తీసుకు వచ్చింది. తద్వారా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదవాలనే మెరిట్ ఉన్న పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 2,330 బీటెక్ సీట్లు, 105 ఏజీ బీఎస్సీ సీట్లు కన్వీనర్ కోటా ద్వారా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. -
60,941 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్ అర్హులకు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. -
కన్వీనర్ కోటాలో 70వేలకు పైగా సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో కన్వీనర్ కోటా ద్వారా కేటాయింపు జరిగే మొత్తం సీట్లు 70,030 అని, ఇందులో ఇంజనీరింగ్ 66,290 కాగా ఫార్మాసీ 3740 సీట్లు ఉన్నాయని టీఎస్ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపునకు విద్యార్థులు ఆప్షన్ల నమోదును ఈ నెల 16వ తేదీ (గురువారం) అర్ధరాత్రి 12 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. ఎంసెట్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న విద్యార్థులు 71,186 కాగా వారిలో ఇప్పటి వరకు 47,471 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంచి కాలేజీల్లో సీట్లు రావడానికి ఒక విద్యార్థి ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని, ఈసారి ఒక విద్యార్థి కౌన్సెలింగ్ కోసం ఏకంగా 1,186 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 47,471 మంది మొత్తంగా 18,97,052 ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోర్సుల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆయన వెల్లడించారు.. సీట్ల వివరాలు.. సీఎస్ఈ(16,801), ఈసీఈ(12,582), ఈఈఈ(6,366), సీఐవీ(5,766), ఎంఈసీ(5,355), సీఎస్ఎం(5,037), ఐఎన్ఎఫ్(4,713), సీఎస్డీ(3,003), సీఎస్సీ(1,638), సీఎస్ఓ(1,029), ఏఐడీ(420), ఎంఐఎన్(388), సీఎస్ఐ(336), ఏఐఎం(270), సీఎస్బీ(252), సీహెచ్ఈ(246), ఏఎన్ఈ(210), సీఎస్డబ్లు్య(210), ఈఐఈ(196), ఏఐ(126), సీఐసీ(126), ఈసీఎం(126), ఏయూటీ(84), సీఎస్ఎన్(84), ఎఫ్‌డీటీ(84), టీఈఎక్స్(80), డీటీడీ(60), ఎఫ్ఎస్పీ(60), ఎంఈటీ(60), బీఎంఈ(51), సీఎంఈ(42), సీఎస్జీ(42), సీఎస్టీ(42), ఈసీఐ(42), ఈటీఎం(42), ఎంసీటీ(42), ఎంఎంటీ(42), పీహెచ్ఈ(42), పీఎల్జీ(40), ఎంఎంఎస్(30), ఎంటీఈ(30), ఐపీఈ(28), ఏజీఆర్(24), బీఆర్జీ(22), బీఐఓ(21), పీహెచ్ఎం(3,220), పీహెచ్డీ(520) -
దిగివచ్చిన సీబీఐటీ యాజమాన్యం
సాక్షి, మణికొండ: గండిపేటలోని చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల( సీబీఐటీ) విద్యార్థులు వారం రోజుల పాటు చేపట్టిన ఆందోళనలతో యాజమాన్యం దిగి వచ్చింది. మొదటి, రెండో సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు గతంలో ఉన్న ఫీజు రూ. 1,13,500 నుంచి ఏకంగా రూ. 2లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఫీజులను పెంచుతూ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకున్న మరుసటిరోజు నుంచే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలు విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థుల ఆం దోళనకు మద్దతు ప్రకటించి విద్యార్థులతో పాటు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆందోళన మరింత ఉధ్రుతం అవుతుండడంతో కళాశాలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. తల్లితండ్రులతో జరిగిన సమావేశంలోను పెంచిన ఫీజులను చెల్లించేందుకు వారు ససేమిరా అన్నారు. బోర్డు కమిటీ శనివారం సాయంత్రం మరో మారు సమావేశ మైంది. పేద విద్యార్థులపై పడుతున్న ఫీజు భారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా అధ్యక్షుడు డాక్టర్ వి.మాలకొండారెడ్డి ప్రకటించారు. కన్వీనర్ కోటాలో ఏ క్యాటగిరీ కింద సీట్లు పొందిన విద్యార్థులు మాత్రం పూర్తి ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే కన్వీనర్‌కోటాలో చేరిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులపైన ఈ భారం పడదని, వారు చెల్లించాల్సిన ఫీజులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకుంటామన్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన వారిలోను ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి స్కాలర్షిప్లను అందజేస్తామని తెలిపారు. మిగతా ఎన్ఆర్ఐ కోటా వారి ఫీజులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరుకావాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి ఉన్న సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 57,940 మందికి సీట్లు
- మొదటి కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు - కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు 11,183 - యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం కేటాయింపు - 100 ప్రైవేటు కాలేజీల్లో నూటికి నూరు శాతం భర్తీ - రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇవ్వలేదు - 9 మందిలోపే ఆప్షన్లు ఇచ్చిన కాలేజీలు మూడు - ఆప్షన్లు సరిగా ఇవ్వక ఏ కాలేజీలో సీట్లు రానివారు 8,626 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డి తొలిదశ ప్రవేశాల్లో భాగంగా సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని 308 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,123 సీట్లు అందుబాటులో ఉండగా 57,940 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగతా 11,183 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 21లోగా ట్యూషన్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో చలానా రూపంలో చెల్లించాలని, 22వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. చివరి దశ ప్రవేశాల కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 27న సీట్లు కేటాయిస్తామని, 29 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. 66,566 మంది విద్యార్థులు 34,29,835 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో ఒక విద్యార్థి అత్యధికంగా 848 ఆప్షన్లు ఇవ్వగా, ఒక విద్యార్థి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 57,940 మందికి సీట్లను కేటాయించారు. కేటాయింపు వివరాలను ఎంసెట్ వెబ్సైట్లో ఉంచారు. 8,626 మంది ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇవ్వనందున ఏ కాలేజీలో సీటు లభించలేదు. ఇంజనీరింగ్ 8,906 సీట్లు మిగులు రాష్ట్రంలోని 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో (14 ప్రభుత్వ, 184 ప్రైవేటు) కన్వీనర్ కోటాలో 66,695 సీట్లు ఉండగా.. అందులో 57,789 సీట్లు భర్తీ అయ్యాయి. 8,906 సీట్లు మిగిలిపోయాయి. ఈసారి బీ-ఫార్మసీలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 81 బీఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్) కాలేజీల్లో 2,138 సీట్లు అందుబాటులో ఉండగా 116 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2,022 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29 ఫార్మ్-డి కాలే జీల్లో 290 సీట్లు అందుబాటులో ఉండగా.. 35 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 255 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే నూటికి నూరు శాతం సీట్ల కేటాయింపు జరిగింది. రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇచ్చుకోలేదు. మరో 3 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 30 బ్రాంచీల్లో ప్రవేశాలను చేపట్టినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. అందులో 19 బ్రాంచీల్లోనే వంద శాతం సీట్ల కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. ఇవీ సీట్ల కేటాయింపు వివరాలు.. కోర్సు కేటగిరీ కాలేజీల మొత్తం కేటాయించినది ఖాళీ కేటాయింపు% సంఖ్య సీట్లు సీట్లు ఇంజనీరింగ్ వర్సిటీ 14 3040 3040 0 100 ప్రైవేటు 184 63,655 54,749 8906 86.0 మొత్తం 198 66,695 57,789 8,906 86.6 బీఫార్మసీ(ఎంపీసీ) వర్సిటీ 3 80 36 44 45 ప్రైవేటు 78 2058 80 1,978 3.9 మొత్తం 81 2138 116 2,022 5.4 ఫార్మ్-డి ప్రైవేటు 29 290 35 255 12 మొత్తంగా 308 69,123 57,940 11,183 83.8 -
కన్వీనర్ కోటాలో 65,379 సీట్లు
ఇంజనీరింగ్, ఫార్మసీల్లో ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు - ప్రభుత్వ కాలేజీల్లో 3,040, ప్రైవేటు కాలేజీల్లో 62,339 సీట్లు - బీఫార్మసీలో కన్వీనర్ కోటాలో 2,888 సీట్లు - భారీగా తగ్గిన ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు - 282 ప్రైవేటు కాలేజీల్లో 178 కాలేజీలకే అనుబంధ గుర్తింపు - 26,716 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 65,379 సీట్ల భర్తీకి ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. మంగళవారం (ఈనెల 5) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 178 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 89,055 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. ఇందులో 62,339 సీట్లు (70 శాతం), 17 ప్రభుత్వ కాలేజీల్లోని 3,040 సీట్లు కలిపి మొత్తంగా 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ప్రైవేటు కాలేజీల్లోని మిగతా 26,716 (30 శాతం) సీట్లను యాజమాన్యాలే మేనేజ్మెంట్ కోటా (ఇందులో 15 శాతం ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా)లో భర్తీ చేసుకోనున్నాయి. టాప్ కాలేజీల్లో గతేడాది ఉన్న సీట్లు కొనసాగింపు ఈసారి టాప్ కాలేజీల్లో సీట్లకు, బ్రాంచీలకు పెద్దగా కోత పడలేదు. దాదాపుగా గతేడాది ఉన్నట్లుగానే ఈసారీ అనుబంధ గుర్తింపు లభించింది. సాధారణ కాలేజీల్లోనే ఎక్కువగా బ్రాంచీలు, సీట్లకు కోత పడింది. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేని కాలేజీల్లో భారీగా బ్రాంచీలు, సీట్లు తగ్గిపోయాయి. కాలేజీల సంఖ్య కూడా తగ్గింది. వాస్తవానికి రాష్ట్రంలోని 282 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. అందులో 40 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరో 47 కాలేజీల్లో లోపాలున్నట్లు యూనివర్సిటీలు, విజిలెన్స్ నివేదికల్లో తేలడంతో వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. మిగతా 178 ప్రైవేటు కాలేజీలు, 17 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఫార్మసీ కాలేజీల్లోని బీఫార్మసీ సీట్ల భర్తీకి, వెబ్ ఆప్షన్లకు చర్యలు చేపట్టింది. 52 వేల సీట్లు కోత ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన లెక్కన కాలేజీల్లో మొత్తంగా 1.42 లక్షల సీట్లు ఉండగా... యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చింది 178 కాలే జీల్లోని 89,055 సీట్లకే. అంటే 52,945 సీట్లకు కోత పడింది. మొత్తంగా ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలుపుకొని 92,095 సీట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇందులో 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించిన ప్రకారం దాని పరిధిలోని కాలేజీల్లో 79,705 సీట్లకు అనుమతి ఇచ్చారు. సోమవారం నాటికి సీట్ల సంఖ్య 81,424కు చేరుకుంది. అంటే 1,719 సీట్లు పెరిగాయి. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వండి ఇంజనీరింగ్ ఎంసెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇందులో 63,777 మంది మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా ఈనెల 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి, క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాగిన్ ఐడీని సోమవారమే వారి మొబైల్ ఫోన్లకు పంపించినట్లు చెప్పారు. జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలని వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వారికి 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
పది ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు శూన్యం
♦ 110 ఇంజనీరింగ్ కాలేజీల్లో 50లోపే విద్యార్థులు ♦ 15 మందిలోపు విద్యార్థులు చేరినవి 56 కాలేజీలు ♦ 25 మందిలోపు విద్యార్థులు చేరినవి 79 కాలేజీలు ♦ 100 మందిలోపు విద్యార్థులు చేరినవి 160 కాలేజీలు ♦ 91 కాలేజీల్లో పూర్తిగా సీట్లు భర్తీ ♦ కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ ప్రవేశాల తీరిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఐదులోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21. పది మందిలోపే విద్యార్థులు చేరిన కళాశాలలు 42. ఇక 56 కాలేజీల్లోనైతే 15 మందిలోపే విద్యార్థులు చేరారు. ఇదీ ఇటీవల చేపట్టిన ఇంజనీరింగ్‌లో కన్వీనర్ కోటా ప్రవేశాల తీరు. 79 కాలేజీల్లో 25 మందిలోపే విద్యార్థులు చేరగా, 110 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. 160 కాలేజీల్లో 100 మందిలోపే చేరినట్లు సాంకేతిక విద్యాశాఖ లెక్కలు వేసింది. మొత్తానికి 91 కాలేజీల్లో మాత్రమే కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కతేల్చారు. 110 కళాశాలల భవితవ్యం అగమ్యగోచరం రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు ఇవ్వకపోయినా కోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తంగా 304 కాలేజీల్లో ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాలను ఇటీవల చేపట్టింది. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కన్వీనర్ కోటా ప్రవేశాలను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ కోటా లెక్కలపై దృష్టి సారించింది. ఎన్ని కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు చేరారన్న లెక్కలు వేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒక్కో కాలేజీలో 50 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 110 ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆయా కాలేజీల భవితవ్యం గందరగోళంగా మారింది. స్పాట్ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయో తెలియదు. -
కన్వీనర్ కోటాలోనే భారీగా మిగులు
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్లు 86,103 వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 61,662 మందే హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లకుపైగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు ఉండగా.. 62,457 మంది విద్యార్థులు మాత్రమే వెబ్ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 61,662 మంది మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లు మిగిలిపోనున్నాయి. అసలు ఈసారి అందుబాటులో ఉండనున్న మొత్తం సీట్లు 1,34,783కాగా.. కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు, యాజమాన్య కోటాలో 39,499 సీట్లు అందుబాటులోనున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లోని 2,110 సీట్లను వాటి యాజమాన్యాలే కన్సార్షియంగా ఏర్పడి భర్తీ చేసుకుంటాయని, సొంత పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే ఎస్డబ్ల్యూ-3లో 3,304 సీట్లు అందుబాటులో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఈనెల 17 నుంచి చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 22 రాత్రి వరకు ఆప్షన్లలో మార్పులతో పాటు కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లను కేటాయిస్తారు. వెబ్ఆప్షన్ల వివరాలు.. ►సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 66,362 మంది ►ఆప్షన్లకు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నవారు 62,457 ► మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినవారు 61,133 ► పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నా ఆప్షన్లు ఇవ్వని వారు 1,324 ► మొత్తం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు 22,91,583 ►ఒక విద్యార్థి అత్యధికంగా ఇచ్చిన ఆప్షన్లు 594 -
పైకంతోనే ప్రైవేట్ మెడికల్ సీటు !
* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకే ఇక ఎంసెట్! * కన్వీనర్, ‘బి’ కేటగిరీ సీట్లూ ‘ప్రైవేట్’ చేతుల్లోకి! * ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్ష? * ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోనే కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ప్రతిభ చూపిస్తే చాలు.. ఒకవేళ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటు రాకపోయినా ర్యాంకును బట్టి కన్వీనర్ కోటా లేదా కనీసం ‘బి’ కేటగిరీ సీటుతో ప్రైవేట్ కాలేజీల్లో చేరవచ్చనేది విద్యార్థుల ఆశ. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడిక ఆ పరిస్థితి తారుమారు కానుంది. డబ్బు పెడితేనే ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడుగుపెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఇటీవలే వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్ష మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ రాశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాలుగు వేలకు పైగా సీట్లున్నాయి. ఇకపై ఎంసెట్ కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు మాత్రమే వర్తిస్తుందని వైద్య విద్యాశాఖ వర్గాల నుంచి సమాచారం. 2014-15 సంవత్సరానికి నిర్వహించిన ఎంసెట్ కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే జరుగుతుంది. మొన్నటి వరకూ ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 10 శాతం సీట్లను ‘బి’ కేటగిరీ కింద భర్తీ చేసేవారు. కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ. 60 వేలు, బి కేటగిరీ సీట్లకు రూ.2.4 లక్షలు చొప్పున ఫీజు ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాలలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించినా... ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజు రూ.3.10లక్షల నుంచి రూ. 3.75 లక్షల వరకు ఏటా విద్యార్థులు చెల్లించాల్సిందే. ఎంసెట్ తరహాలోనే ప్రైవేటు ప్రైవేశపరీక్ష ‘ఎంసెట్‌ఏసీ’ (మెడికల్ కామన్ ఎంట్రెన్ టెస్ట్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ఉంటుంది. ఈ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు కౌన్సెలింగ్ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఎంసెట్ఏసీపై రెండ్రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం వెలువరించేలా యాజ మాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడితే కన్వీనర్ కోటా సీట్లను వదులుకోవడానికి అంగీకరించబోవని, ఈ లోగానే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. మొత్తం 3,800 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 1,900 సీట్లు (మొత్తం ప్రైవేట్ సీట ్లలో 50 శాతం), ‘బి’ కేటగిరీ కింద 380 సీట్ల (మొత్తం ప్రైవేటు సీట్లలో 10 శాతం) ను ప్రభుత్వమే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేది. ఇప్పుడా అవకాశం ఉండదు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు కోత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 వైద్య కళాశాలలు ఉన్నాయి. మొత్తం 2,450 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈఏడాది మౌలిక వసతులు లేవన్న కారణంగా భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) ఒంగోలు రిమ్స్‌లో 100 సీట్లు, నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ వైద్య కళాశాలలో 50 సీట్లు, ఎస్వీ వైద్య కళాశాలలో 50 సీట్లు, కర్నూలు మెడికల్ కాలేజీలో 50 సీట్లు, గుంటూరు వైద్య కళాశాలలో 50 సీట్లకు కోత విధించింది. ఇలా మొత్తం 400 సీట్లు విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇక మిగిలిన 2,050 సీట్లకు మాత్రమే ఎంసెట్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ సీట్లకు 1.11 లక్షల మంది ఎంసెట్ ద్వారా పోటీపడుతున్నారు. -
కన్వీనర్ సీటూ ఖరీదే?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్నా పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య భారం కానుంది. ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు భారీగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. మళ్లీ డిసెంబర్ మొదటి వారంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరపాలని వైద్య విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. గత ఏడాదే ఫీజుల పెంపునకు ప్రైవేటు కళాశాలలు తీవ్రంగా యత్నించినా చివరి నిమిషంలో పెంపు ఆగిపోయింది. అయితే ఈ ఏడాది ఫీజులు పెంచక తప్పదని అధికారులే చెబుతున్నారు. అందరికీ ఒకే రకంగా (కామన్) ఫీజు నిర్ణరుుంచాలని ప్రైవేటు కళాశాలలు డిమాండ్ చేస్తుండగా, కేటగిరీల వారీగా పెంచాలని అధికారులు అంటున్నారు. దీంతో కన్వీనర్, బీ కేటగిరీ, సీ కేటగిరీ సీట్ల విషయంలో దేనికి ఎంత ఫీజు పెంచుతారో తేలాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా అధికారులు చెబుతున్నారు. అరుుతే ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందే ప్రతి అభ్యర్థికీ కామన్ ఫీజుగా రూ.9 లక్షలు నిర్ణయించాలని యూజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా నిర్ణయిస్తే యాజమాన్య కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆయా కళాశాలలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేటగిరీలా వారీగా ఫీజులు నిర్ణయించాలని భావిస్తోంది. ఏ కేటగిరీ (కన్వీనర్ కోటా) ఫీజును రూ.60 వేల నుంచి రూ.3 లక్షలకు, బీ కేటగిరీ (కన్వీనర్ భర్తీ చేసే యూజమాన్య కోటా) ఫీజును రూ.2.40 లక్షల నుంచి రూ.5 లక్షలకు, సీ కేటగిరీ (పూర్తిగా యాజమాన్య కోటా) ఫీజును రూ.5.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని కేటగిరీలకూ రూ.9 లక్షలు నిర్ణయిస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోలా యాజమాన్య కోటా సీట్లను ఇష్టమొచ్చినట్టుగా భర్తీ చేసుకోవడానికి కుదరదని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) తేల్చిచెప్పింది. ఈ ఏడాది ప్రతిభ ఆధారంగా భర్తీ చేసుకోవాలని చెప్పింది. అయితే ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారా, ఎంసెట్ మెరిట్ ఆధారంగా చేస్తారా, లేదంటే ప్రైవేటు వైద్య కళాశాలలన్నీ కలిసి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి (కర్ణాటక తరహాలో) భర్తీ చేసుకుంటారో మీరే తేల్చుకోవాలని సూచించింది. డిసెంబర్ లోగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తాయి. ఈలోగానే ఫీజులు వ్యవహారం కూడా తేలిపోయే అవకాశం ఉంది. -
2 లక్షల సీట్లు ఖాళీయే !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మొత్తం 2 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే లక్ష సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీలో కేవలం 558 సీట్లు మాత్రమే భర్తీ కాగా ఇంకా 7,927 సీట్లు ఖాళీ ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. విద్యార్థులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేసింది. ఈఏడాది ఎంసెట్‌లో 2,18,893 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అనేక అడ్డంకుల నడుమ ఆగస్టు 19న ప్రారంభమై ఈనెల 3న ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేవలం 1,30,290 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో 1,28,724 మంది వెబ్ఆప్షన్లు ఇవ్వగా.. 1,26,390 మందికి సీట్లు లభించాయి. ఎంపీసీ విభాగంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 2,34,488 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండింట్లో కలిసి 1,08,098 సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్‌లో 99,802, ఫార్మసీ(ఫార్మా-డితో కలుపుకొని)లో 8,296 సీట్లు మిగిలాయి. మరోవైపు యాజమాన్య కోటాలో లక్షా 10 వేల సీట్లు అందుబాటులో ఉండగా దాదాపు లక్ష సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది మొత్తం రెండు లక్షల సీట్లు మిగిలిపోతాయన్నమాట. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయినా పరిస్థితి పెద్దగా మెరుగయ్యే అవకాశాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 23లోగా ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో ‘క్యాండిడేట్స్ లాగిన్’ అనే లేబుల్‌ను క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలను టైప్ చేయడం ద్వారా సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును చలానా ద్వారా ఇండియన్ బ్యాంకులోగానీ, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ రశీదును కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. సీటు వద్దనుకున్నా లేదా రానిపక్షంలో..: తొలివిడతలో సీటు లభించినా చేరేందుకు ఆసక్తిలేని విద్యార్థులు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దనుకుంటే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయించి సీటును రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కితీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీటు మాత్రమే రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకుని సర్టిఫికెట్లు అక్కడే ఉంచి తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీటు రానివారు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిస్తే సర్టిఫికెట్లను హెల్ప్‌లైన్ సెంటర్లోనే ఉంచాలి. ఏదైనా ఇతర సమస్యలు ఉంటే సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అక్కడినుంచి విన్నపాలు కన్వీనర్‌కు చేరుతాయి. 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి 27 వరకు తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. 29న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఒకటి నుంచి చివరి ర్యాంకుల వరకు ఎవరైనా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలివిడతలో సీట్లు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థుల వివరాలను కళాశాలల ప్రిన్సిపల్స్ 01.10.2013లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ జాయినింగ్ రిపోర్ట్ అయ్యిందా? లేదా అన్న వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంచి అవకాశం కోసం తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకుంటే తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు ఈనెల 24 నుంచి 27 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావొచ్చు. ఆ తరువాత వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈసీఈకే ఎక్కువ డిమాండ్ ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది ఈసీఈ బ్రాంచికే ఎక్కువ ఆదరణ లభించింది. ఆ తరువాతి స్థానం కంప్యూటర్ సైన్స్‌కు దక్కింది. మెకానికల్ బ్రాంచి మూడోస్థానంలో ఉంది. ఐటీని పట్టించుకున్నవారే లేరు. ఈసీఈలో 55 శాతం సీట్లు నిండగా.. ఆ తరువాత అత్యధిక సీట్లు అందుబాటులో ఉన్న సీఎస్ఈలో కేవలం 48 శాతం సీట్లు నిండాయి. మెకానికల్ బ్రాంచీలో తక్కువ సీట్లే ఉన్నప్పటికీ 68 శాతం సీట్లు నిండాయి. ఇక సివిల్‌లో కూడా తక్కువ సీట్లే ఉన్నప్పటికీ దీనిలోనూ 70 శాతం సీట్లు నిండాయి. -
రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!
సంక్షోభం దిశగా ఇంజనీరింగ్ కళాశాలలు 2.17 లక్షల మంది అర్హులు ఉన్నా 1.30 లక్షల మందే వెరిఫికేషన్‌కు హాజరు గత ఏడాది మిగిలిన సీట్లు 1.75 లక్షలు.. ఈ ఏడాది మిగలనున్న 2 లక్షల సీట్లు విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతుండటమే కారణం రాష్ర్టంలో కాలేజీల డొల్లతనం, ఫీజుల భారం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటమూ కారణమే గత ఏడాది పెద్ద సంఖ్యలో మూతపడ్డ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు ఈ ఏడాది కూడా విద్యార్థులు లేక మరిన్ని కాలీజీలు మూతపడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి రాష్ట్రంలో 3.40 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు లక్షా 30 వేల మంది మాత్రమే ఉండటం కళాశాలలను కలవరపెడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గత ఏడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గింది. దాదాపు 2.17 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు 1,30,278 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గత ఏడాది దాదాపు 1.75 లక్షల సీట్లు మిగలగా ఈ ఏడాది 2 లక్షల పైచిలుకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంకృతాపరాధం కారణంగానే కళాశాలలు ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పలు యాజమాన్య సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం నాటికి కోర్టుల్లో కేసులు వేస్తుండటంతో కాలాతీతమై ఏటా వేలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల వైపు వెళుతున్నారు. గత ఏడాది ఫీజుల నిర్ధారణలో జాప్యం జరిగి 30 వేల మంది బయటికివెళ్లగా.. ఈ ఏడాది కళాశాలల ఎత్తుగడలను ఊహించని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించటం.. కోర్టుల్లో కేసులు ఎదురుకావడంతో ప్రవేశాల షెడ్యూలు రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారని కళాశాలలు అంచనా వేస్తున్నాయి. ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవటం, ఉత్తీర్ణత శాతాలు ఆశాజనకంగా లేకపోవటం, ఫీజులు భారమవటం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటం కారణంగా విద్యార్థులు సాంప్రదాయక డిగ్రీల వైపు మొగ్గుచూపుతున్నట్టు అంచనావేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇంజ నీరింగ్ కళాశాలల డొల్లతనం బయటపడటంతో రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది కేవ లం అగ్రశ్రేణి క ళాశాలల్లోనే కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మూసివేత దిశగా కాలేజీలు... ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేలాది సీట్లు మిగిలిపోతుండటంతో పలు కళాశాలలు ఏకంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది 678 ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా 50 శాతానికి పైగా సీట్లు నిండిన కళాశాలలు కేవలం 339 మాత్రమే. కనీసం 50 శాతం సీట్లు నిండనిపక్షంలో కళాశాల నిర్వహణ కష్టమేనని యాజమాన్యాలు చెప్తున్నాయి. 2013-14కు కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క దరఖాస్తు రాగా మూతపడిన కాలేజీలే ఎక్కువగానే ఉన్నాయి. ప్రవేశాలు లేక 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 ఫార్మసీ, 40 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మూతపడ్డాయి. మరో 134 కాలేజీలు ఐటీ కోర్సును రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ బ్రాంచీలను కూడా రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త కళాశాలలు వద్దని, ఇన్‌టేక్ 420కి పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఏఐసీటీఈకి పంపింది. అయితే ఏఐసీటీఈ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల సీట్లు మిగిలిపోతుండటంతో మరిన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం ఈ నెల 17న సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తరువాత కళాశాలల భవితవ్యం తేటతెల్లమవుతుంది.