సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం.
అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి.
ఇలా భర్తీ చేయాలి...
అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్‌సైట్‌లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి.
మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఈ విభాగానికి వర్తించదు.
ఎన్‌ఆర్‌ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది.
ముందుగానే బేరాలు...
నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు.
ఆన్‌లైన్‌లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది.
ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి
యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment