Replacement of seats
-
సీఎస్‌ఈకే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్ఐటీల్లో 24,226, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కలిసొచ్చిన కటాఫ్... సీట్ల పెరుగుదలఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్ వంటి సంస్థల్లో సీఎస్ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు. ఐఐటీ అడ్వాన్స్డ్ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.సీఎస్ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్ఐటీల్లో, రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. – ఎంఎన్.రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
‘ఉద్యాన’ ప్రవేశాలకు రెండో దశ వెబ్ ఆప్షన్స్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో బీఎస్సీ (హానర్సు) హార్టీకల్చర్ కోర్సుకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 12, 13, 14 తేదీల్లో రెండోదశ వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో చేరిన విద్యార్థులు, ఈ కోర్సు కోసం దరఖాస్తు ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెబ్ ఆప్షన్స్‌కు అర్హులు అని పేర్కొన్నారు. హార్టీసెట్–2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల వివరాలు సెమిస్టర్ ఫీజు జనరల్ సీటు రూ.51,083 పేమెంట్ సీటు రూ.1,38,488 ఫీజులు, ఇతర వివరాల కోసం... ప్రభుత్వ ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెం, 7382633648 అనంతరాజుపేట –7382633651 పార్వతీపురం–7382633660 చినలాటరపి–7382633443 నంబర్లలో సంప్రదించవచ్చు. వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో ఫీజులు ఎన్ కాలేజ్ ఆఫ్ హార్టీ సైన్సెస్, మార్కాపురం రూ.44,000 శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, అనంతపురం రూ.77,000 జేసీ దివాకరరెడ్డి హార్టికల్చర్ కాలేజ్, తాడిపత్రి రూ.65,000 కేబీఆర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సీఎస్.పురం రూ.38,700 -
మెడిసిన్‌లో బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభమవుతున్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు స్విమ్స్, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన విద్యార్థులు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://ugmq.ysruhs.com వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. నియమాలు, నిబంధనలపై స్పష్టత కోసం 8978780501, 7997710168, 9391805238, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, పేమెంట్ గేట్‌వేలో స్పష్టత కోసం 8333883934 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. నీట్ యూజీలో వచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా నిబంధనలకు లోబడి సీట్ల కేటాయింపు ఉంటుందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సీటు వచ్చేలా చేస్తామని కొందరు వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని ఆమె స్పష్టంచేశారు. -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
‘బీ’టెక్ బేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఇప్పటికే ద్వారాలు తెరిచాయి. బేరసారాల కోసం ఆయా కాలేజీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులూ ప్రముఖ కాలేజీల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యస్థంగా ఉండే కాలేజీలు డిమాండ్ సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కన్సల్టెన్సీలు, పీఆర్వోల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంసెట్‌లో 50 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాదని భావిస్తున్నారు. దీంతో యాజమాన్య కోటాలో సీటు తెచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ కాలేజీల్లో రోజూ 20 మంది వరకూ కళాశాల ప్రతినిధులతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ కేటగిరీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. వాస్తవానికి కన్వినర్ కోటా సీట్ల భర్తీ తర్వాతే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉంటుంది. కానీ కాలేజీలు అనధికారికంగా ముందే బేరం కుదుర్చుకుంటున్నాయి. నిబంధనలకు పాతరేస్తున్నా అధికారులు మాత్రం ఇవేవీ తమ దృష్టికి రావడం లేదని చెబుతున్నారు. రూ.లక్షల్లో బేరం రాష్ట్రంలో దాదాపు 176 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 145 ప్రైవేటు కాలేజీలే. 71 వేల ఇంజనీరింగ్ సీట్లు కన్వినర్ కోటా కింద, 30 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. ఇందులో సగం సీట్లను జేఈఈ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుం తీసుకోవాలి. కాకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. మిగిలిన సగం సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు, ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేసే వారికి ఇవ్వాలి. ఈ సీట్లకు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. అందుకే ముందుగానే అనధికారికంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. 8 నుంచి 12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులతో కలిపి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదిరితే ఇప్పుడే సగం కట్టాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ హాట్ కేక్ యాజమాన్య కోటా కింద సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్, అనుబంధ బ్రాంచ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలు సీఎస్సీ సీటుకు వార్షిక ఫీజుకు అదనంగా రూ.8–10 లక్షలు అడుగుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులైతే రూ.12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో కన్వినర్ కోటా కిందే సీట్లు భర్తీ కావడం లేదు. కాబట్టి ఎంసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వాళ్లు, క్వాలిఫై కాని వాళ్లే ఈ సీట్లను ఆశిస్తున్నారు. ప్రముఖ కాలేజీలైతే రూ. 2 లక్షల వరకూ అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి యాజమాన్య కోటా సీట్లయినా నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలి. ఈ విషయంలో మండలి సీరియస్‌గా ఉంది. బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెరిట్ పద్ధతి పాటించాల్సిందే. అందుకు విరుద్ధంగా డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపిస్తాం. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరు కోం. తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ రాకుండా యాజమాన్య కోటా సీట్లు ఆశించడం సరికాదు. - ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) -
‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత యాజమాన్యాలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 32, 33 విడుదల చేసింది. ఈ సీట్ల భర్తీ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మెరిట్ ప్రాతిపదికన జరిగేలా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ సీట్ల భర్తీ కోసం ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్లను నిర్వహించే సాంకేతిక విద్యాశాఖ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరించనుంది. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నేరుగా లేదా ఆయా కాలేజీలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించవచ్చు. కాలేజీలకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ విద్యార్థులను ఆయా సీట్లకు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా అందరికీ తెలిసేలా ఎప్పటికప్పుడు నిర్దేశిత పోర్టల్‌లో వివరాలు పొందుపరుస్తారు. మొత్తం సీట్లలో 70 శాతం ‘ఏ’ కేటగిరీ కింద కన్వీనర్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగతా 30 శాతంలో సగం సీట్లను ఎన్నారై కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు. వాటిలో మిగిలిన సీట్లను, నాన్ ఎన్నారై సీట్లను ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా భర్తీ చేస్తారు. ఎన్నారై సీట్లకు 5 వేల డాలర్లను, నాన్ ఎన్నారై సీట్లకు ‘ఏ’ కేటగిరీకి నిర్ణయించిన ఫీజులకు మూడు రెట్ల వరకు ఆయా కాలేజీలు వసూలు చేయవచ్చు. బీ కేటగిరీ భర్తీ మార్గదర్శకాలు ఇలా: ► ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసే వరకు బీ కేటగిరీ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదు. కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలి. ► ఏఐసీటీఈ అనుమతి ఉన్న సంస్థలు ఆయా కోర్సులకు మంజూరైన ఇన్‌టేక్‌లో 15 శాతం మించకుండా ఎన్ఆర్ఐ సీట్లను సొంతంగా భర్తీ చేయవచ్చు. గ్రూప్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులకు తగ్గకుండా లేదా అర్హత పరీక్షలో 50 శాతం మార్కులతో లేదా 10 స్కేల్లో 5కి సమానమైన క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ► మిగిలిన సీట్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్, నీట్లో ర్యాంక్ సాధించిన వారు, అర్హత పరీక్షలో నిర్దేశిత గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులకు తక్కువ కాకుండా సాధించిన వారు, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారితో సహా అందరు అభ్యర్ధులను ఎంపిక చేయవచ్చు. ► జేఈఈ, నీట్ ర్యాంకర్లు లేని పక్షంలో మెరిట్ ప్రాతిపదికన ఈఏపీ సెట్ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ► ఆ తర్వాత ఏవైనా సీట్లు ఇంకా మిగిలిపోతే, నిర్దేశించిన గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం (రిజర్వుడు) కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే 40 శాతం) మార్కులను లేదా మొత్తం మార్కులలో ఆ మేరకు మార్కులు పొందిన అభ్యర్థులతో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ► వెబ్ పోర్టల్ ద్వారా కేటగిరీ ‘బీ’ సీట్ల కోసం విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలకు వెళ్లి అందచేసే దరఖాస్తులను యాజమాన్యాలు వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ’బీ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకునే విధంగా కాంపిటెంట్ అథారిటీ షెడ్యూల్ ప్రకటిస్తుంది. ► ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సంబంధిత కళాశాల యాజమాన్యం ఆ జాబితాను లాగిన్ ద్వారా వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఎంపికలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జాబితాను తిరస్కరిస్తారు. -
1న వ్యవసాయ వర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయంలో వివిధ డిప్లమో కోర్సుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబర్ 1న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30కి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదివరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. -
'నీట్'గా!
సాక్షి, చెన్నై : నీట్ గందరగోళానికి తెర పడడంతో రాష్ర్టంలో వైద్య విద్యా కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆన్లైన్ దరఖాస్తుల పర్వానికి బుధవారం శ్రీకారం చుట్టగా, గురువారం నుంచి కళాశాలల ద్వారా దరఖాస్తుల పంపిణీ సాగనున్నది. జూన్ 20వ తేదీన కౌన్సెలింగ్, ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్య విద్యా డెరైక్టర్ విమల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజనీరింగ్, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సీట్లను అన్నా వర్సిటీ ద్వారా, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. ఆ మేరకు ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ప్లస్‌టూ ఫలితాలు వెలువడటంతో ఇంజనీరింగ్‌లోని ప్రధాన కోర్సుల సీట్లను దక్కించుకోవడం లక్ష్యంగా పెద్ద ఎత్తున విద్యార్థులు దరఖాస్తుల కొనుగోలు, ఆన్లైన్ ద్వారా నమోదుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక, వైద్య కోర్సుల దరఖాస్తుల పర్వానికి నీట్ అడ్డు వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం(నీట్)తో సీట్ల భర్తీ అమలుకు సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం బయలు దేరింది. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఎట్టకేలకు ఈ ఏడాదికి నీట్ రద్దు అయింది. ఈ గందరగోళానికి తెర పడడంతో ఇక, దరఖాస్తుల పర్వం మీద వైద్య విద్యా డెరైక్టరేట్ దృష్టి పెట్టింది. ఇక దరఖాస్తులు : నీట్ రద్దుతో దరఖాస్తుల పంపిణీ, ర్యాండం నంబర్లు, ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్ తదితర అంశాలపై రాష్ర్ట వైద్య విద్యా డెరైక్టర్ విమల దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. అలాగే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల నమోదుకు శ్రీకారం చుట్టారు. త దుపరి మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల మొదలు నుంచి కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించిన వివరాలను, సీట్ల వివరాలను విమల ప్రకటించారు. రాష్ట్రంలో 20 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2,650 సీట్లు ఉండగా, పదిహేను శాతం (397) సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2253 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో ఉన్న 760లో ప్రభుత్వ కోటా సీట్లుగా 470, కేకేనగర్ ఈఎస్ఐలోని వంద సీట్లలో 65 రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్ల పరిధిలోకి రానున్నాయి. ఈ సీట్లను సైతం వైద్య విద్యా డెరైక్టరేట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 ,17 స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన దంత వైద్య కళాశాలల్లో 970 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. వీటిని కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక, విద్యార్థులు నీట్ గురించిన ఆందోళన అవసరం లేదని, కౌన్సెలింగ్ మీద దృష్టి పెట్టాలని విమల సూచించారు. జూన్ 20 కౌన్సెలింగ్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఆయా కళాశాలల్లో దరఖాస్తుల్ని పంపిణీ చేయనున్నారు. రూ. ఐదు వందలు డీడీ చెల్లించి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. జూన్ ఆరో తేదీ వరకు దరఖాస్తుల పంపిణీ, ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించేందుకు అవకాశం కల్పించారు.జూన్ పదిహేడో తేదిన ర్యాండం నంబర్ల ప్రకటన, తదుపరి ర్యాంకుల వివరాలు, జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు చర్యలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి మలి విడతగా జూలై 18న కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులతో కులధ్రువీకరణ పత్రాలు, మార్కుల జాబితా నకలు తదితర పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఆన్లైన్ సౌకర్యంగా www.tnhealth.org వెబ్ సైట్‌ను ప్రకటించారు. కోయంబత్తూరు ఈఎస్ఐకు అనుమతి ఇచ్చిన పక్షంలో వంద సీట్లు అదనంగా వచ్చి చేరుతాయి. ఇందులో 65 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేజిక్కించుకునేందుకు వీలు ఉంది. శాశ్వత రద్దుకు ఒత్తిడి : రాష్ట్రంలో వైద్య కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టడంతో, ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న విద్యా విధానం గురించి వివరిస్తూ, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని , తమిళనాడుకు నీట్ నుంచి శాశ్వతంగా మినహాయింపు కల్పించాలని కోరారు. -
రండి బాబూ.. రండి!
►విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల ఎర్ర తివాచీ ►ఏ గ్రేడ్ కళాశాలల్లో 90 శాతం సీట్లు భర్తీ ►పలు కళాశాలల్లో 100 లోపు సీట్లే భర్తీ ►తుది విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలు గుంటూరు ఎడ్యుకేషన్: కన్వీనర్ కోటాలోని ఇంజినీరింగ్ సీట్లే అరకొరగా భర్తీ అవటంతో జిల్లాలోని చాలా కళాశాలల యూజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించటానికి నానాపాట్లూ పడుతున్నారుు. ఎలాగోలా సీట్లు భర్తీ అయ్యేలా చూసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారుు. రండి బాబూ.. రండంటూ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నారుు. ఎంసెట్ ర్యాంకుల వారీగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల జాబితా వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం రాత్రి ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. జిల్లాలో 41 ఇంజినీరింగ్ కళాశాలు ఉండగా టాప్ టెన్ కళాశాలల్లో మాత్రమే దాదాపు 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బీ, సీ గ్రేడ్ కళాశాలల్లో సగానికి మించి భర్తీ కాలేదు. ఇటీవల ప్రారంభించిన కళాశాలల్లో సీట్లు భర్తీకి నోచుకోకపోవడం యాజమాన్యాలకు షాకిచ్చింది. పీఆర్వోలను నియమించుకుని భారీఎత్తున ప్రచారం చేపట్టినా ఫలితం లేకపోవడంతో అవి తలలు పట్టుకుంటున్నాయి. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాల పరిస్థితి మరింత దయనీయంగా తయూరైంది. అధ్యాపకులు, బోధన వసతులు, ఉత్తీర్ణత శాతం, ఉద్యోగ అవకాశాల కల్పనలో కళాశాలల ట్రాక్ రికార్డ్‌పై విద్యార్థులు దృష్టి సారించడంతో చాలా కళాశాలలు తొలి దశ కౌన్సెలింగ్‌లో అసలు బోణీ కొట్టలేదు. పదుల సంఖ్యలోని కళాశాలల్లో అన్ని విభాగాల్లో కలిపి 50 నుంచి 100 లోపు సీట్లే భర్తీ అయినట్లు తెలుస్తోంది. దీంతో మలి విడత కౌన్సెలింగ్‌పైనే యూజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 19,250 మంది ఎంసెట్ రాయగా నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గత నెల 7న మొదలై 23న ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలనకు 8,839 మంది హాజరయ్యారు. జిల్లాలో కాకినాడ జేఎన్టీయూ, ఏఎన్‌యూ పరిధిలో ఉన్న 41 కళాశాలల్లో దాదాపు 16 వేల సీట్లు ఉన్నాయి. అలాట్మెంట్ ఆర్డర్ పొందిన విద్యార్థులు సీటును ధ్రువీకరించుకునేందుకు సోమవారం నుంచి ఆయూ హెల్ప్‌లైన్ కేంద్రాల కు హాజరుకావాలి. అక్కడి కోఆర్డినేటర్ నుంచి సీటు కేటాయింపు ధ్రువీకరణపత్రం పొందాలి. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పొందిన సీటు కేటాయింపు ధ్రువీకరణ పత్రం, ఫీజు చెల్లింపు రసీదును సెప్టెంబర్ 6వ తేదీలోగా ఆయా కళాశాలల్లో సమర్పించాలి. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు రూ.35 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు మొత్తం రూ. 35 వేలు ఉంటే విద్యార్థి కళాశాలకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు.తమకు కేటాయించిన కళాశాలలో చేరేందుకు ఆసక్తి లేని పక్షంలో విద్యార్థులు వెళ్లనవసరం లేదు. వీరు మలి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.