ఎన్‌ఐటీల్లో పెరిగిన పోటీ.. ఐఐటీల్లో తగ్గిన జోష్
ఐదవ విడత జోసా సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు.
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్‌ఐటీల్లో 24,226, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
కలిసొచ్చిన కటాఫ్... సీట్ల పెరుగుదల
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్‌ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్ వంటి సంస్థల్లో సీఎస్‌ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు.
ఐఐటీ అడ్వాన్స్‌డ్ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
సీఎస్‌ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు
అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్‌ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్‌ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్‌ఐటీల్లో, రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్‌ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. – ఎంఎన్.రావు, గణిత శాస్త్ర నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment