ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్‌ మేజిక్‌లో మార్పు  | Under 300 seat in Mumbai IIT | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్‌ మేజిక్‌లో మార్పు 

Published Mon, Jan 15 2024 2:20 AM | Last Updated on Mon, Jan 15 2024 2:20 AM

Under 300 seat in Mumbai IIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి.

కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్‌ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు.  ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. 

ముంబైకి మొదటి ప్రాధాన్యం 
సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్‌ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్‌ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్‌ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. 

ఎన్‌ఐటీల్లో చాన్స్‌ పెరిగేనా? 
వచ్చే సంవత్సరం ఎన్‌ఐటీల్లో కటాఫ్‌ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్‌ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది.

సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్‌ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్‌ సైన్స్‌ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్‌ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్‌ఐటీలో సీఎస్‌సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్‌ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement