computer course
-
కంప్యూటర్ కోర్సుల్లో 98 శాతం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపును సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన సోమవారం విడుదల చేశారు. కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించారు. బ్రాంచీలు, కాలేజీలు మార్పు కోరిన 16,981 మందికి సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో 175 కాలేజీలు పాల్గొన్నాయి. కన్వినర్ కోటా కింద మొత్తం 86,943 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడో దశతో కలిపి 81,904 (92.40 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. గతంలో సీట్లు పొందిన విద్యార్థులు బ్రాంచీలు, కాలేజీల మార్పిడి కోసం ఆప్షన్లు ఇచ్చారు. కొత్తగా మరికొంతమంది ఇచ్చినవి కలుపుకుని మొత్తం 23,98,863 ఆప్షన్లు అందినట్టు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,460 సీట్లు కేటాయించారు. ఆరు యూనివర్సిటీలు, 84 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలని, సంబంధిత కాలేజీల్లో 13 నుంచి 17వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెలాఖరులోగా క్లాసులు మొదలు వాస్తవానికి మూడోదశ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపట్టాలని నిర్ణయించారు. కానీ సీట్ల పెంపు, అదనపు సీట్ల కేటాయింపు, సీట్ల మదింపునకు సంబంధించిన ప్రైవేటు కాలేజీల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీట్లు రావని తెలియడంతో, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి, ఇంజనీరింగ్ క్లాసులను ఈ నెలాఖరులో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆయా కాలేజీలు వెల్లడించాలని ఆదేశించారు. దీంతో కన్వీనర్ కోటా కింద సీట్లు రాని విద్యార్థులు మిగిలిపోయే యాజమాన్య కోటా సీట్లకు ప్రయత్నించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. 98 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే.. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్‌లో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర అనుబంధ కోర్సుల్లోనే అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ వంటి బ్రాంచీల్లో సీట్లు తగ్గించాయి. దీంతో ఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. ఐటీ, ఐవోటీ బ్రాంచీల్లో మార్పిడికి అనుమతించారు. దీనికి తోడు కొన్ని సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో స్వల్పంగా సీట్లు పెరిగాయి. ఈ బ్రాంచీల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉంటే, 60,362 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,225 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. 98.01 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈసీఈలో 94.38 శాతం, ఈఈఈలో 76.38 శాతం, సివిల్ ఇంజనీరింగ్‌లో 80.16 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 72.38 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సహా అనుబంధ కోర్సుల్లో 7,458 సీట్లు ఉంటే, 5,782 సీట్లు భర్తీ అయ్యాయి. 1,676 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్రి్టకల్ కోర్సుల్లో 16,692 సీట్లు ఉంటే, 14,907 సీట్లు భర్తీ అయ్యాయి. 1,785 సీట్లు మిగిలిపోయాయి. -
ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్ మేజిక్‌లో మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ముంబైకి మొదటి ప్రాధాన్యం సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. ఎన్ఐటీల్లో చాన్స్ పెరిగేనా? వచ్చే సంవత్సరం ఎన్ఐటీల్లో కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
అదనంగా 1,410 ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా మార్చారు. ♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్టీయూహెచ్ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ–ఎంఎల్ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి. ♦ ఘట్కేసర్లోని కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్‌లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. ♦ హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. పెరిగిన సీట్లూ కంప్యూటర్ కోర్సుల్లోనే కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. 18వ తేదీ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ (కొత్తవారు) 17–22 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 26న సీట్ల కేటాయింపు 26–28 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27–29 తేదీల్లో కాలేజీలో రిపోరి్టంగ్ -
8వేల లోపు ర్యాంకొస్తే.. కంప్యూటర్స్ కోర్సుల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి కౌన్సెలింగ్ నుంచి ఎంత మంది తప్పుకొంటారు, ఎన్నిసీట్లు మిగులుతాయి, కోరుకున్న బ్రాంచ్‌లో సీటు వస్తుందా అన్న అంచనాలు వేసుకుంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను రద్దు చేసుకునే గడువును ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈ నెల 15వ తేదీనే జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెలువడనున్నాయి. అందులో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులు.. ఇప్పటికే ఎంసెట్ తొలి కౌన్సెలింగ్‌లో పొందిన సీట్లను వదులుకునే అవకాశం ఉంది. అలా ఖాళీ అయ్యే సీట్లు తమకు కలిసొస్తాయని రెండో కౌన్సెలింగ్ కోసం చూస్తున్న విద్యార్థులు ఆశిస్తున్నారు. గత ఏడాది సీట్ల కేటాయింపు, ఈ ఏడాది పరిస్థితి ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. 8 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు.. మంచి కాలేజీల్లోని కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్లు రావచ్చని నిపుణులు అంటున్నారు. 20 తర్వాతే రెండో విడత.. తొలిదశలో సీట్ల రద్దు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన నేపథ్యంలో.. ఆ తర్వాత వీలైనంత త్వరగా మలివిడత కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఆ తేదీనాటికల్లా కాలేజీల్లో సీట్ల ఖాళీలపై స్పష్టత రావచ్చని విద్యార్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో కలిపి లక్ష వరకు సీట్లు ఉన్నాయి. అందులో 71,853 కన్వీనర్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీచేస్తారు. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లుదక్కిన వారిలో 59,143 మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. పోటీ అంతా కంప్యూటర్స్ గ్రూపులకే.. ఎంసెట్ అర్హుల్లో ఎక్కువ భాగం కంప్యూటర్, కంప్యూటర్ అనుబంధ గ్రూపులకే ప్రాధాన్యమిచ్చారు. ఆ బ్రాంచీల్లో ఎక్కువ శాతం సీట్లు భర్తీ అయ్యాయి. టాప్ కాలేజీల నుంచి సాధారణ కాలేజీల వరకు అన్నిచోట్లా ఈ సీట్లకే పోటీ నెలకొంది. కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో మిగిలిన కొద్దిసీట్లు కూడా మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉండటం గమనార్హం. కొత్తగా వచ్చిన ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. సీఎస్సీలో 18,614 సీట్లకుగాను 53 సీట్లే మిగిలాయి. సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 5,884 సీట్లకు 455, ఐటీలో 5,262 సీట్లకు 39, సీఎస్సీ డేటా సైన్స్‌లో 3,528 సీట్లకు 299, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీలో 583 సీట్లకు 43 సీట్లు మాత్రమే మిగిలాయి. జేఈఈ ఫలితాల తర్వాత.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ఈ నెల 15న వెలువడతాయి. మరుసటి రోజు నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కటాఫ్‌ను బట్టి ఏయే ర్యాంకులకు ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుంది. ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్‌లో జనరల్ కేటగిరీలో టాప్ టెన్ కాలేజీల్లో 5 వేల ర్యాంకు వరకూ సాధించిన విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు దక్కాయి. వారిలో సుమారు 1,500 మంది నిట్, ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందే అర్హత సంపాదించే అవకాశం ఉంది. వీరిలో కోరుకున్న బ్రాంచ్ రానివారు రాష్ట్రంలోనే కొనసాగినా.. మరో వెయ్యి మంది వరకు జాతీయ కాలేజీల్లో చేరుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు హైకోర్టు ఆదేశా ల మేరకు.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచీల్లో మరో 4 వేల సీట్ల వరకూ వచ్చే వీలుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుంటే 8 వేలలోపు ర్యాంకు వరకు సాధించిన వి ద్యార్థులకు టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ కోర్సు ల్లో సీట్లు లభించే వీలుందని పేర్కొంటున్నారు. -
కంప్యూటర్ విద్య.. మిథ్య
ఒక విద్యాలయం గొప్పతనం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై ఆధారపడి ఉంటుందే గానీగొప్ప భవనాలను బట్టి కాదని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలు నేడు వ్యతిరేకార్థంలో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా వాటిలో చదివేవిద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులను నియమించడంలేదు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ అధ్యాపకులు లేకుండానే ఆ కోర్సులు పూర్తి చేయాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. తణుకు టౌన్ : దేశంలో, రాష్ట్రంలో కంప్యూటర్ వ్యవస్థను తానే ప్రవేశపెట్టినట్టు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్ విద్యకు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం దారుణం. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు అధ్యాపకులు లేకుండానే తమ కంప్యూటర్ విద్యను కొనసాగిస్తున్నారు. ప్రతి పని కంప్యూటర్ ఆధారంగా జరగాలని కోరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలు బోధించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలనే ఆలోచన ఇప్పటికీ కలగపోవడం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చేసుకున్న పాపమేమో! అని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక అటానమస్ కాలేజ్, ఆరు ప్రభుత్వ పెద్ద కళాశాలలు, మరో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వుండగా వాటిలో డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి. కానీ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులున్నారు. అదీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో అసలు కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులే లేకుండా విద్యార్థులు తమ చదువులు కానిచ్చేస్తున్నారు. డిగ్రీలో కంప్యూటర్ కోర్సుకు సంబంధించి విద్యార్థి నుంచి రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకూ ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం, రూ.7,500 వరకూ వసూలు చేసుకోవచ్చని యూనివర్సిటీలు ఆదేశిస్తున్నాయి. ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఆదేశించిన ప్రభుత్వం విద్యార్థులకు కావలసి బోధన సిబ్బందిని నియమించాలనే విషయం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ అధ్యాపకులను నియమించకపోవడంతో కంప్యూటర్ విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులు ఫీజులు భారమైనా ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. కళాశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనకు అధ్యాపకులను నియమించని ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ క్లాస్ రూమ్‌ల పేరుతో ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్లు ల్యాబ్‌ల్లో భద్రంగా ఉంటున్నాయేగానీ అవి విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం. 30 ఏళ్ల క్రితమే రాష్ట్రంలో మొదటిసారిగా పెనుగొండ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌తో, అధ్యాపకులతో బీఎస్సీ కంప్యూటర్ కోర్సును ప్రారంభించాం. దీంతో ప్రైవేట్ కంప్యూటర్ సంస్థలతో పోటీగా అక్కడ విద్యార్థులు కంప్యూటర్ రంగంలో రాణించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ కోర్సుకు సంబంధించి ఆధునిక సదుపాయాలు ఎన్ని కల్పించినా అవి అధ్యాపకుడు లేకుండా పరిపూర్ణం కావు. – డాక్టర్ గుబ్బల తమ్మయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్, తణుకు -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యూరు..!
కూసుమంచి :అతడు పుట్టుకతోనే అంధుడు. ఆమె కూడా అంతే. వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. దానిని వివాహ బంధంతో మరింత పటిష్టపరుచుకోవాలనుకున్నారు. పెద్దల సమక్షంలో దైవ సన్నిధిలో ఆదివారం ఒక్కటయ్యూరు.మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సద్దుల ఆంజనేయులు పుట్టుకతోనే అంధుడు. ఇతడు కెనారా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ఖమ్మంలోని కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా తొలి పోస్టింగ్. ఖమ్మం జిల్లా ఇల్లెందు నెహ్రూ నగర్‌కు చెందిన శ్రీలత కూడా పుట్టు అంధురాలు. ఈమె ప్రస్తుతం ఖమ్మంలోని ప్రకాష్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఉద్యోగంలో చేరడానికి ముందు వీరిద్దరికీ హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సు శిక్షణలో పరిచయం ఏర్పడింది. మనసుతోనే ఒకరినొకరు చూసుకున్నారు. వారి స్నేహం ప్రేమ బంధంగా మారింది. ఉద్యోగంలో చేరి, జీవితాల్లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగాలు వచ్చారుు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఆదివారం జీళ్ళచెరువులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. సద్దుల ఆంజనేయులు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘నాకు గురువు, గైడ్ అన్నీ ఖమ్మం డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి. ఆయన ప్రోద్బలంతోనే నేను, శ్రీలత ఉద్యోగం పొందాం. ఇప్పుడు ఓ ఇంటివాళ్లం అయ్యాం’’ అని అన్నారు. తమ వివాహానికి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. వీరి వివాహానికి ఖమ్మం డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు ఆశీర్వదించారు. -
మనమే చొరవ చూపాలి
‘‘ఏంటే... ఎప్పుడూ అలా ఒంటరిగా ఉంటావ్. సరదాగా ఉండొచ్చుగా’’... ఆఫీసు నుంచి వస్తూనే స్నేహితురాలితో అంది రవళి. ‘‘ఎలా ఉంటాను? ఇక్కడ నాకెవరూ తెలీదు. పైగా కొత్త ప్రదేశం. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’... దిగులుగా అంది గాయత్రి. రవళి నవ్వింది. గాయత్రి సమస్య ఆమెకు తెలుసు. డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ కోర్సు చేయడానికి పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చింది. ఇక్కడి అమ్మాయిల దూకుడు చూసి వచ్చీ రావడంతోనే కంగారుపడింది. వాళ్లలా తాను లేను కాబట్టి, వాళ్లతో కలవలేనని ముందే మనసులో పెట్టేసుకుంది. దాంతో గదిలోనే ముడుచుకుని కూచుంటోంది. ఆ బెరుకును వీలైనంత త్వరగా వీడకపోతే ఆమె ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని రవళికి అర్థమైంది. అందుకే గాయత్రికి కొన్ని విషయాలు చెప్పింది. అవేంటంటే... మనుషుల మీద ఆసక్తి పెంచుకోవాలి. వాళ్లెవరు, ఎలా ఉన్నారు, వాళ్లు ఏం చేస్తారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనేవన్నీ పరిశీలించాలి. దాన్నిబట్టి వాళ్లతో మనం ఎలా మెలగాలో మనకు అర్థమవుతుంది. అందరూ నీలాంటివాళ్లే అని అనుకోవాలి. అంటే... అందరికీ పుట్టుకతోనే అన్నీ రావు. వాళ్లు కూడా మనలాంటి వాళ్లే అయి ఉండొచ్చు. తర్వాత అన్నీ నేర్చుకుని ఉండొచ్చు. ప్రయత్నిస్తే మనమూ అలా అవుతాం కదా! నీ బలహీనతలను ఒప్పేసుకోవాలి. ఇతరుల్లా తయారవడం, మాట్లాడటం మనకు రాకపోవచ్చు. దానికి సిగ్గుపడి దూరంగా ఉండిపోనక్కర్లేదు. నాక్కూడా అలా ఉండటం నేర్పిస్తావా అని అడగవచ్చు, నేర్చుకోవచ్చు. అభిమానించడం నేర్చుకోవాలి. ఒక మనిషితో మనం మాట్లాడాలంటే ముందు వారి మీద ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం దూరాన్ని తగ్గిస్తుంది. అభిమానం ఉన్నప్పుడు అవతలివాళ్లు ఒక మాట అన్నా నొచ్చుకోం. మెచ్చుకోలు మంచి బంధాన్ని పెంచుతుంది. అవతలివారి దగ్గరకు వెళ్లి... మీ మాట తీరు బాగుంటుంది, మీరు చక్కగా ఉంటారు అంటూ ప్రశంసిస్తే వాళ్లు మన లోపాలను ఎత్తి చూపరు. మనకు దగ్గరవుతారు. మనమే ముందుండాలి. పరిచయం చేసుకోవడంలోనైనా, పలకరించడంలోనైనా, స్నేహం చేయడంలోనైనా మొదటి అడుగు మనమే వేయాలి. వాళ్లంతా ఎప్పటి నుంచో ఉన్నవాళ్లు. కొత్తగా వచ్చినవాళ్లని కలుపుకోవాల్సిన అవసరం వారికి లేకపోవచ్చు. కాని వారి తోడు కొత్తగా వచ్చినవారికి అవసరం. అందుకే ఎవరో పలకరిస్తారని చూడకుండా మనమే వాళ్లకి హాయ్ చెప్పాలి. నాలుగుసార్లు పలకరిస్తే ఐదోసారి వాళ్లే మనల్ని పలకరిస్తారు. పరిచయం పెరిగి స్నేహితులవుతారు. సరళ మాటలతో ఎక్కడ లేని హుషారొచ్చేసింది గాయత్రికి. తను చెప్పినవన్నీ చేయాలని నిర్ణయించుకుంది. వారం పది రోజుల్లోనే ఫలితం కనిపించింది. ఇప్పుడామెకి అందరూ స్నేహితులే. సరళ చెప్పినవి గాయత్రికే కాదు... అందరికీ పనికొస్తాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి! -
కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఏడీసీఏ, ఎంఎల్ డీటీపీ కంప్యూటర్స్ కోర్సుల శిక్షణ కోసం నవంబరు ఏడో తేదీలోగా మిర్యాలగూడలోని ఉర్దూ అకాడమీ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలని కేంద్రం నిర్వాహకులు ఎస్కె హైదావలి, ఖాదీఖానా చైర్మన్ హఫీజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ తొమ్మిదిన ఉంటుందని, ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం మిర్యాలగూడలోని శిక్షణ కేంద్రం సెల్- 9492473272, 994838471, 9441210182 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.