ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యూరు..!
కూసుమంచి :అతడు పుట్టుకతోనే అంధుడు. ఆమె కూడా అంతే. వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. దానిని వివాహ బంధంతో మరింత పటిష్టపరుచుకోవాలనుకున్నారు. పెద్దల సమక్షంలో దైవ సన్నిధిలో ఆదివారం ఒక్కటయ్యూరు.మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సద్దుల ఆంజనేయులు పుట్టుకతోనే అంధుడు. ఇతడు కెనారా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ఖమ్మంలోని కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా తొలి పోస్టింగ్. ఖమ్మం జిల్లా ఇల్లెందు నెహ్రూ నగర్‌కు చెందిన శ్రీలత కూడా పుట్టు అంధురాలు. ఈమె ప్రస్తుతం ఖమ్మంలోని ప్రకాష్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
ఉద్యోగంలో చేరడానికి ముందు వీరిద్దరికీ హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సు శిక్షణలో పరిచయం ఏర్పడింది. మనసుతోనే ఒకరినొకరు చూసుకున్నారు. వారి స్నేహం ప్రేమ బంధంగా మారింది. ఉద్యోగంలో చేరి, జీవితాల్లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగాలు వచ్చారుు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఆదివారం జీళ్ళచెరువులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. సద్దుల ఆంజనేయులు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘నాకు గురువు, గైడ్ అన్నీ ఖమ్మం డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి. ఆయన ప్రోద్బలంతోనే నేను, శ్రీలత ఉద్యోగం పొందాం. ఇప్పుడు ఓ ఇంటివాళ్లం అయ్యాం’’ అని అన్నారు. తమ వివాహానికి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. వీరి వివాహానికి ఖమ్మం డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు ఆశీర్వదించారు.