Blind Person
-
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్‌లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!
సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్ నరాలు మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్ సిస్టమ్ ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్‌ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్లెస్ ఇంప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్ పల్స్‌తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్‌లెస్‌గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఇది కస్టమ్ డిజైన్ హెడ్కేర్ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన హై రిజల్యుషన్ ఇమేజ్‌లు విజన్ ప్రాసెసర్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్‌లెస్‌గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్ అనే పరికరానికి రిసీవ్ అవుతాయి. అవి విజువల్ కార్టెక్స్‌లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్‌ని అందించడం విశేషం . (చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు
‘చూపున్నా చూడలేని అంధుల కంటే....అంధులు బాగా చూడగలరు’ అంటుంది పెర్షియన్ సామెత. కంటిచూపు బాగున్నా వాస్తవాలు చూడలేని వారిపై ఈ సామెత ఒక చురక అనుకున్నప్పటికీ.... చూపులేని మహిళలు వైద్యరంగంలో కొత్త కాంతితో వెలుగుతున్నారు. తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’తో ఎర్లీ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తిçస్తూ ఎంతోమంది మహిళలు ప్రమాదం బారిన పడకుండా చూస్తున్నారు...మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ్రపారంభ సంకేతాలను గుర్తించడంలో చూపులేని అయేషా వైద్యులకు సహాయపడుతుంది. ఈ పరీక్షల కోసం తన చేతి వేళ్లను ఉపయోగిస్తుంది. ‘మా చేతి వేళ్లలోని అధిక స్పర్శ జ్ఞానం వక్షోజాలలోని చిన్న లంప్స్‌ను కనిపెట్టడంలో సహాయపడుతుంది. ఈ వృత్తి నాలాంటి చూపులేని మహిళలకు బాగా సరిపోతుంది’ అంటుంది అయేషా.బెంగళూరులోని ‘సైట్‌కేర్’ హాస్పిటల్లో పనిచేస్తుంది అయేషా. రోజుకు తొమ్మిది పరీక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి అరగంట సమయం తీసుకుంటుంది.‘కంటిచూపు లేని అయేషాలాంటి యువతులు ఎర్లీ స్టేజిలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను డిటెక్ట్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు’ అంటున్నాడు ‘సైట్‌కేర్’ హాస్పిటల్స్ కో–ఫౌండర్, సీయివొ సురేష్ రాము. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన అయేషా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయేషా తన నెల జీతంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. (మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...)అయేషాలాగే కోలార్‌కు చెందిన 29 సంవత్సరాల నూరున్నీసా చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. తన ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా ఎంతోమంది మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంటుంది.బెంగళూరులోని ‘జ్యోతి నివాస్ కాలేజీ’లో డిగ్రీ చేసిన నూరున్నీసాకు ఉద్యోగం దొరకడం కష్టం అయింది. ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా తనకు ఉపాధి దొరకడమే కాదు గుర్తింపు కూడా లభించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ‘గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు చూపులేని వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది నూరున్నీసా.అయేషా, నూరున్నీసా...ఈ ఇద్దరిలో ఎవరికీ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి, టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించడానికి అయేషా, నూరున్నీసాలు దేశంలోని ఎన్నో ్రపాంతాలు తిరిగారు. టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు అనేవి చూపు లేని మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షలను నిర్వహించేవారిని మెడికల్ టక్ట్యల్ ఎగ్జామినర్స్(ఎంఐటీ)లుగా వ్యవహరిస్తారు. ‘ఎంఐటీ’లుగా ఎంతో మంది చూపు లేని మహిళలు ఉపాధి పొందడమే కాదు తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎర్లీ స్టేజీలో గుర్తిస్తున్నారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)డిస్కవరింగ్ హ్యాండ్స్దిల్లీకి చెందిన ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ టక్ట్యల్ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి చూపు లేని మహిళల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థ బెంగళూరులో కూడా శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళల్లో అయేషా, నూరున్నీసా ఉన్నారు. ‘మొదట్లో వైద్యానికి సంబంధించిన పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది’ అంటుంది లీనా మెహతా. పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె చూపు కోల్పోయింది. అయితే ట్రైనర్స్ ఒకటికి పదిసార్లు అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. త్రీడీ మోడల్స్‌తో శరీర పనితీరును సులభంగా అర్థం చేయించేవారు. -
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్‌గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్‌లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
Akshita Sachdeva: ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు..
మనం ఏ బాట ఎంచుకోవాలో అనేది విధి నిర్ణయిస్తుందో లేదోగానీ పరిస్థితులు మాత్రం నిర్ణయిస్తాయి. డాక్టర్ కావాలనుకున్న అక్షితా సచ్‌దేవా పరిస్థితుల ప్రభావం వల్ల పరిశోధన రంగంలోకి వచ్చింది. ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది అంధులతో మాట్లాడింది. వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుక్కోవాలనుకుంది. బెంగళూరు కేంద్రంగా ఆమెప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అంధులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ల్యాబ్స్ నుంచి వచ్చిన ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు....అక్షితా సచ్‌దేవా అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. అయితే కాలేజీ రోజుల్లో ఒక లెక్చరర్‌తో మాట్లాడిన తరువాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘డాక్టర్ కావాలి’ అనే తన లక్ష్యం గురించి చెప్పినప్పుడు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత, దాని ప్రాధాన్యతతో పాటు హెల్త్‌కేర్ రంగంలోని ఎన్నో ఆవిష్కరణల గురించి చెప్పారు ఆ లెక్చరర్.‘నా కళ్లు తెరిపించిన సందర్భం అది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంటుంది అక్షిత. ఆ రోజు నుంచి హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. ఫరీదాబాద్‌లోని మానవ్ రచన కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక గ్లోవ్‌ను రూపొందించింది అక్షితా సచ్‌దేవా. చూపుడు వేలిపై కెమెరా ఉండే ఈ హ్యాండ్గ్లోవ్ సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు చదవవచ్చు.ఈ గ్లోవ్ గురించి న్యూ దిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్ఏబీ)కి వివరించింది అక్షిత. దృష్టి లోపం ఉన్న ఒక యువకుడు ఈ గ్లోవ్‌ను ఉపయోగించి న్యూస్‌పేపర్ చదవగలిగాడు. ఈ విజయం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలను పెంచింది. అంధులకు జీవనోపాధి, విద్య, దైనందిన జీవన విషయాల్లో సహాయపడడానికి తన ఆవిష్కరణను ముందుకు తీసుకువెళ్లాలనుకుంది.అంధులు ఎదుర్కొనే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంది. బ్యాంకర్లు, పీహెచ్డీ స్కాలర్లు, గృహిణులు... వివిధ విభాగాలకు చెందిన అంధులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుంది. ఆ సమయంలోనే దీపాలి పవార్ అనే స్టూడెంట్‌తో మాట్లాడింది.కాలేజీలో ఒక సెమిస్టర్ పూర్తి చేసిన దీపాలి హటాత్తుగా చూపు కోల్పోయింది. ఆమెను తిరిగి తీసుకోవడానికి కాలేజి వారు నిరాకరించారు. బ్రెయిలీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. బ్రెయిలీ నేర్చుకోవడానికి దీపాలి రెండేళ్లు గడిపింది. అయితే అది ఆమెకు కష్టంగా ఉండేది. బ్రెయిలీ నేర్చుకున్న తరువాత కూడా ఆమెకు కాలేజీలో చదివే అవకాశం రాలేదు. యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీలో చేరడమే దీపాలి ముందు ఉన్న ఏకైక మార్గం అయింది.ఆడియో–రికార్డెడ్ పుస్తకాలను అందించే ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది దీపాలి. అయితే ఒక్కొక్క పుస్తకం కోసం నాలుగు నుంచి ఆరువారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆమె దగ్గర మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకాలను తీసుకువెళ్లిన అక్షిత వాటిని మొబైల్ అప్లికేషన్ ఫామ్‌లోకి మార్చి దీపాలికి ఇచ్చింది.మూడు నెలల తరువాత..దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. ‘సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ను సింగిల్ అటెంప్ట్‌లో పూర్తి చేశాను’ అని సంతోషంగా చెప్పింది. ఇది అక్షితకు మరో విజయం. మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన విజయం. ఈ ఉత్సాహ బలమే బోనీదేవ్తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీప్రారంభించేలా చేసింది.నాసిక్‌లోని ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్’లో పెద్దయంత్రాన్ని చూసింది అక్షిత. అయితే అది పెద్దగా ఉపయోగంలో లేదు. ఈ మెషిన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్‌ను చదవగలుగుతుంది. అయితే కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే. అప్పుడే అక్షితకు ఎన్నో భారతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలను చదవగలిగే యంత్రాన్ని రూపొందించాలనే ఐడియా తట్టింది.అది ‘కిబో’ రూపంలో సాకారం అయింది. ఈ పరికరం విజయం సాధించడంతో నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్, ఐఐఎం–అహ్మదాబాద్... మొదలైన సంస్థల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘భారతీయ భాషలపై దృష్టి కేంద్రీకరించిన తొలి అసిస్టివ్ టెక్ టూల్ కిబో’ అంటుంది అక్షిత.మరింతగా..అంధులకు ఉపకరించే దిశగా ఆసియా, ఆఫ్రికాలలో మా సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ‘కిబో’కు మరిన్ని భాషలను జోడించాలనుకొంటున్నాము. ఏఐ సాంకేతికతతో సెల్ఫ్–లెర్నింగ్, సెల్ఫ్–ట్రైనింగ్ మాడ్యూల్స్‌కు రూపకల్పన చేస్తాం. – అక్షితా సచ్‌దేవా, కో–ఫౌండర్, ట్రెస్టిల్ ల్యాబ్స్కిబో ఇలా..‘కిబో’ వాటర్ బాటిల్ ఆకారంతో ఉంటుంది. దీని ఎడమవైపు ఉన్న బటన్‌ను నొక్కితే టేబుల్ ల్యాంప్ ఆకారంలోకి మారుతుంది. యూఎస్బీ కేబుల్ దీన్ని ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేస్తుంది. పుస్తక పాఠాన్ని ‘కిటో’ సంగ్రహిస్తుంది.అరవై భాషలలో ఏ భాషలలోనైనా అనువాదం అడగవచ్చు. వ్యక్తులు, సంస్థల కోసం విడిగా నాలుగు ‘కిబో’ప్రాడక్ట్స్‌ను రూపొందించారు. ‘కిబో ఎక్స్ఎస్’ను స్కూలు, కాలేజీలలోని లైబ్రరీల కోసం అందుబాటులో ఉంచారు. ‘కిబో 360’ని వ్యాపారసంస్థలు, యూనివర్శిటీలు, ప్రచురణ సంస్థల కోసం రూపొందించారు. -
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్‌ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్‌న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్‌కు వెళ్లి వారి ఆన్సర్స్‌ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్‌గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్‌లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్‌కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్‌కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్) తన భర్త రాజ్‌కుమార్‌ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు. కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్మాస్టర్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు. అసలేం జరిగింది? ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్ హెడ్మాస్టర్. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్/చైల్డ్ కేర్ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్ కాగానే వారి కి ఫోన్ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్ పే/గూగుల్ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్మాస్టర్కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం.. ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్ తీసుకున్నారని తిరుమల–రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్.. తిమ్మాపూర్‌లో ఓ టీచర్ 2022 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్ జీతం డిసెంబర్లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్మాస్టర్ సదరు టీచర్‌ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్ హెచ్ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విదేశాలకు వెళ్లిన టీచర్‌కు డీఈవో అనుమతి కనికరం లేని పోలీసులు.. పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్మాస్టర్ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇవి చదవండి: ఏఆర్ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన -
‘నీ గొంతు గుర్తు పట్టాను సుమా’.. అంధుడి ముఖంపై చిరునవ్వు
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి.. ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో... విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు.. కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్లో తను.. తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు! కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది.. ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు.. చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు.. నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని! ఇదీ ఓ బంధమే. అపురూపమైంది! ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే.. ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు! View this post on Instagram A post shared by Priya Gamree (@gamreepriya) -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్‌లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్‌గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్‌ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్‌కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్‌లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్‌గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023 -
స్విమ్మింగ్‌తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
చూపు లేదు కాని క్యాన్సర్‌ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్‌తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్‌ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్‌కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్‌ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్‌ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్‌ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్‌మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్‌ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్‌లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్‌ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్‌ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవం అనే ఫీట్‌ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!
పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు. అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్ సులువుగా నడిచేలా.. చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్‌ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు. ♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్‌లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
అక్షర జ్యోతులు వెలిగిస్తున్న అంధురాలు
కై కలూరు: చీకట్లో చిరుదివ్వెలా.. నిశీధిలో కాంతి పుంజంలా.. అసమాన ప్రతిభతో ఆదర్శంగా నిలుస్తున్నారు అంధురాలు బొల్లా జోత్స్న ఫణిజా. విద్య, సంగీతం, రచన, వచన, గానం, అనువాదం, బోధన ఇలా పలు రంగాల్లో రాణిస్తూ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతున్నారు. ఆమె గాత్రం ఓ మధురస్వరం.. కంప్యూటర్ కోబోర్డు ఆమె క్లోజ్ ఫ్రెండ్.. మనోనేత్రంతో అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆమె కవిత చేరడం గర్వించదగిన విషయం. ఆంగ్ల సాహిత్యంలో రాణిస్తూ.. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి కుమార్తె జ్యోత్స్న ఫణిజా పుట్టుకతో అంధురాలు. అయినా తల్లిదండ్రులు ఏమాత్రం కుంగిపోలేదు. చిన్నతనం నుంచి ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహించారు. జ్యోత్స్న ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం అంధుల పాఠశాల, ఇంటర్ కై కలూరు, డిగ్రీ విజయవాడలో పూర్తిచేశారు. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో ఎంఏ ఆంగ్ల సాహిత్యం, ఇదే అంశంలో పీహెచ్డీ డాక్టరేట్, అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు, ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా ఇలా చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఫెయిర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు మిస్ కాలేజీ రన్నరప్‌గానూ ఆమె నిలిచారు. సంగీతం.. ఆమె ప్రాణం జ్యోత్స్న ఫణిజా కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యం పొందారు. కువైట్ తెలుగు కళాసమితి నిర్వహించిన సంగీత స్వరనీరాజనంలో సత్తాచాటారు. ‘సాక్షి టీవీ’ నిర్వహించిన ‘కచేరి’ సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపారు. అలాగే పలు టీవీ చానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ప్రతిభ చాటారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘ఆలపాన’ కార్యక్రమంలో పలు గీతాలు ఆలపించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి వేదికలపై సంగీత కచేరీలు ఇచ్చారు. కవితల్లో ఘనాపాటి ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ఆనర్స్ మూడో సంవత్సర సిలబస్‌లో జ్యోత్స్న రాసిన ‘సీ’ కవితను పాఠ్యాంశంగా చేర్చారు. ఇప్పటివరకూ ఆమె 120 వరకు కవితలు రాశారు. అమెరికా, లండన్, మలేషి యా, కెనడా, ఇంగ్లిష్ మేగజైన్లలో ఆమె ప్రచురితమయ్యాయి. ప్రముఖ కవి మోపూరు పెంచుల నరసింహం తెలుగులో రచించిన రెండు కవితా సంపుటాలను క్రింసన్ లేంప్, స్టోండ్ సాంగ్ పేరుతో ఆమె అనువదించారు. ఆమె రాసిన ‘నేడు కురిసినవాన’ కవితకు నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) కవితా పురస్కారం దక్కింది. పెన్నా రచయిత సంఘం ఉగాది పురస్కారం, సత్యశ్రీ సాహితీ పురస్కారం, రాధేయ ఉత్తమ పురస్కారం, పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం వంటివి ఆమె అందుకున్నారు. 25 ఏళ్లకే పీహెచ్డీ : ఫారెన్ లాంగ్వేజెస్ అంశంపై 25 ఏళ్లకే ఆమె పీహెచ్డీ సాధించి 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఆమె రాసిన సిరామిక్ ఈవ్నింగ్ పుస్తకాన్ని చదివిన ప్రధాని మోదీ అభినందన లేఖను పంపారు. వరల్డ్ ఐ రైట్ ఇన్ పుస్తకానికి ఎడిటర్‌గా ఆమె కూడా పనిచేశారు. 2009లో దగ్గర బంధువు రాధాకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు హరిచందన్ ఆదిత్య చిన్నతనం నుంచే కవితా రచనలో ఆసక్తి చూపుతున్నాడు. అతడు రాసిన జాస్మిన్ బడ్స్ అనే కవిత డిఫరెంట్ ట్రూట్స్ అనే మేగజైన్లో ప్రచురితమయ్యింది. అవార్డుల పరంపర : ఆమె వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో 100 వరకు బహుమతులు సాధించారు. రెటీనా ఇండియా అవార్డు, బాలా మెమోరియల్ అ వార్డు, సంఘ మిత్ర అసోసియేన్ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ అవార్డు, స్వరం ఓ వరం సంగీత సన్మానం, ఏలూరు వెల్ఫేర్ సొసైటీ మహిళా దినోత్సవ సన్మానం, సరిగమ సంగీత పరిషత్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతిభా పురస్కారం, ధీరూబాయ్ అంబానీ స్కాలర్షిప్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రతిభ పురస్కారం పొందారు. ఆత్మరాం సనాతన్ ధర్మా కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 2015లో అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ సెట్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. విద్యార్థులకు మాతృభాషలో సాహితీ విలువలను నేర్పించాలి. సమాజంలో మహిళలపై వివక్ష చూపరాదు. మనం సంపాదించిన డబ్బుతో ఒకరి ఆకలి తీర్చండి, తెలిసిన విద్యను నేర్పించి ఉపాధి మార్గం చూపండి. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చు. ప్రతిఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలి. – జ్యోత్స్న ఫణిజా, సాహితీవేత్త, కై కలూరు -
తానా: అమ్మభాషా సేవలో అంధమేధావుల సభవిజయవంతం
డాలస్, టెక్సాస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెలనెలా తెలుగువెలుగ్ఙు కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “జ్ఞాననేత్రులు తెలుగు దివ్వెలు అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొంటున్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుఅన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంమే ఆయుధాలుగా చేసుకుని జీవనపోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ ఆదర్శమంటూ స్వాగతం పలికారు. ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖముఖ్య కార్యనిర్వహణాధికారిఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు,విశ్రాంతతెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు,ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్),షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా.బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు,నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు. మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులకు, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
హైదరాబాద్: బ్లైండ్ స్కూల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ అంధ విద్యార్థుల స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో.. లక్ష్మి గౌతమ్ శ్రీకర్(12) అనే ఆరో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. ఈ క్రమంలో కిందపడి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
అంధుల స్కూల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది దుర్మరణం
కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్మాస్టర్ ప్రాన్సిస్ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్‌లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఇదీ చదవండి: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి -
ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం
పెద్దపప్పూరు: ఆస్తి కోసం అంధురాలిపై సొంత తమ్ముడి భార్యే హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పెద్దక్క, నాగార్జున అక్కాతమ్ముడు. పెద్దక్కకు కళ్లు కనిపించవు. ఆమె ఆస్తిపై కన్నేసిన తమ్ముడు నాగార్జున, అతని భార్య స్వాతి.. సోమవారం ఉదయం పెద్దక్కను గ్రామ శివారులోని అక్కమ్మ గుడి వద్దకు పిలుచుకెళ్లారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఆ సమయంలో పెద్దక్కతో నాగార్జున గొడవపడ్డాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పెద్ద బండరాయిని స్వాతి తీసుకుని పెద్దక్క తలపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నాగార్జున, స్వాతి పారిపోయారు. తలకు తీవ్రగాయమైన పెద్దక్కను స్థానికులు వెంటనే తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పెద్దక్క తండ్రికి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంధురాలైన పెద్దక్కకు పెళ్లి కాలేదు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమార్తెలతో పాటు కుమారుడికీ తండ్రి భాగ పరిష్కారాలు చేసిచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్న పెద్దక్క ఆస్తిని ఎలాగైనా తమ పేరున రాయించుకోవాలని నాగార్జున భార్య స్వాతి ప్రయత్నించి విఫలం కావడంతో హతమార్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా: సీఐ మధు) -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి)