గతేడాది అక్టోబరులో గుంటూరు జిల్లాలో ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్ వీరారెడ్డి (63) తనకు ముందుగా వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. బైకుపై వెళ్తున్న శ్రీనివాసరెడ్డి, శ్రీరంగమ్మలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆ సంఘటనతో గుండెపోటు వచ్చి.. డ్రైవరు వీరారెడ్డి బస్సులోనే కుప్పకూలిపోయి మరణించాడు. అయితే వీరారెడ్డి కంటి చూపు సమస్యలతో బాధపడటం వల్ల రెండు నిండు ప్రాణాలతోపాటు తాను కూడా మృత్యువాత పడ్డాడు.
ఇటీవలే భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో కాజ టోల్‌గేట్ వద్ద రవాణా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించగా, వంద మంది పరీక్షల్లో ఐదుగురికి కలర్ బ్లైండ్‌నెస్ తేలింది. శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో అన్ని విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తే, నలుగురికి కలర్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. యాభై మంది పరీక్షలకు హాజరైతే పది మందికి పైగా దృష్టి సమస్యలున్నట్లు తేల్చారు.
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా వేలాదిమంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణమనే విషయం మాత్రమే అధికారులు చెబుతున్నారు. కానీ.. మరెన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్ చూపు సరిగ్గా లేకపోవడమేనని గణాంకాలు చెబుతున్నాయి.
ఏపీలో 35 శాతం డ్రైవర్లకు సమస్య..
ఆంధ్రప్రదేశ్‌లోని 65 లక్షల మంది డ్రైవర్లలో 35 శాతం మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అంటే 22.75 లక్షల మంది డ్రైవర్లకు కంటి చూపు సమస్యలున్నాయి. కంటి చూపు సమస్యల కారణంగా 12 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఏటా కలర్ బ్లైండ్‌నెస్ పెరుగుతుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సర్వేలు చెబుతున్నా పట్టించుకోరా
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీలు విశ్లేషణలతో కూడిన సర్వేలు నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా, పోలీస్ శాఖలు కేసు నమోదు చేసి డ్రైవరు మద్యం తాగి ఉన్నాడా? లేదా? అన్న పరీక్షలు చేయడం మినహా డ్రైవరు ఫిట్‌నెస్, కంటి సమస్యలపై పరీక్షలు చేయించడం లేదు. డ్రైవింగ్ లైసెన్సు జారీ, రెన్యువల్ సమయాల్లో రవాణా శాఖ అధికారులు కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రాథమికంగా కంటి పరీక్షలు చేసే పరికరాలైనా రవాణాశాఖకు సమకూర్చడం లేదు. 40 ఏళ్లు దాటిన వారికి లైసెన్సు ఇవ్వాలంటే, ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలని రవాణా అధికారులు కోరుతున్నారే.. తప్ప కంటి చూపు సమస్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
ప్రమాదాలకు కారణాలు..
ఓవర్ స్పీడ్ – 40 శాతం
డ్రంకన్ డ్రైవ్ – 20 శాతం
కంటి చూపు సమస్యలు – 12 శాతం
రెస్ట్ లేకుండా డ్రైవింగ్ – 18 శాతం
సాంకేతిక కారణాలు – 5 శాతం
నిర్లక్ష్య డ్రైవింగ్ – 5 శాతం
Comments
Please login to add a commentAdd a comment