రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
ఇద్దరు నిందితుల అరెస్టు, టిప్పర్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు
మార్కాపురం: మార్కాపురం మండలం కుంట – జమ్మనపల్లి గ్రామాల మధ్య ఈ నెల 9వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కుట్రకోణాన్ని వెలికితీశారు పోలీసులు. హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సీఐ సుబ్బారావుతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని తమ ఎస్సై అంకమరావు, సిబ్బంది దర్యాప్తు చేపట్టి 3 రోజుల్లోనే సంఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మరొకరిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్నపాటి సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం ఈర్నపాటి వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. 2005లో తిప్పనబోయిన వెంకట నారాయణతో తన భార్య సుబ్బలక్ష్మమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకట నారాయణను గొడ్డలితో నరికి చంపడంతో 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి 2019లో జైలునుంచి వెంకటేశ్వర్లు విడుదలయ్యాడు. అయితే, తన భార్య సుబ్బలక్ష్మమ్మ పద్ధతి మార్చుకోలేదని, కుటుంబ పరువు తీస్తోందని, ఆస్తి విషయంలో గొడవపడుతోందని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్న కారణంతో సుబ్బలక్ష్మమ్మను చంపాలని భర్త పెద్ద వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు తమ్ముళ్‌లైన చిన్న వెంకటేశ్వర్లు, వెంకట రమణ కలిసి నిర్ణయించుకున్నారు. సుబ్బలక్ష్మమ్మ కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో నివాసముంటూ దుస్తుల వ్యాపారం చేస్తోంది.
అందులో భాగంగా ఈ నెల 9న సుబ్బలక్ష్మమ్మ కొత్తపల్లి గ్రామానికి వెళ్లి దుస్తులమ్ముకుని తన మేనకోడలైన ఏడుమళ్ల రాధ అలియాస్ రాధాంజలి (17)ని తన టూవీలర్‌పై ఎక్కించుకుని మార్కాపురం బయలుదేరింది. కోమటికుంట జంక్షన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుబ్బలక్ష్మమ్మను తమ టిప్పర్‌తో ఢీకొట్టించి చంపాలనే ఆలోచనతో ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న రమణయ్య ప్రోద్భలంతో చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ నడుపుకుంటూ వచ్చాడు. పథకం ప్రకారం స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే రాధాంజలి మృతి చెందింది. సుబ్బలక్ష్మమ్మ కూడా లారీ కింద పడి గాయాలతో ఉండటంతో ఆమె చనిపోలేదని భావించి చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ దిగి కర్రతో ఆమైపె హత్యాప్రయత్నం చేయబోయాడు.
కానీ, రోడ్డుపై వెళ్తున్న జనాలు గమనించడంతో అక్కడే కర్ర వదిలి పారిపోయాడు. ఈ సంఘటనపై ముందుగా యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేసి కుట్రకోణం బయటకు రావడంతో హత్యకేసుగా మార్చారు. పూర్తిగా దర్యాప్తు చేసి ఆదివారం చిన్న వెంకటేశ్వర్లు, రమణయ్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మరో నిందితుడైన పెద్ద వెంకటేశ్వర్లును త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టి 3 రోజుల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసిన సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావును ఎస్పీ దామోదర్ అభినందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment