గంజాయి కోసం ఓ విద్యార్థి బంధువుకు రూ.50 వేలు చెల్లింపు
సరుకు పంపక పోవడంతో ఆ విద్యార్థిని ఎత్తుకొచ్చిన వైనం
కిడ్నాపర్‌ను, విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చీమకుర్తి: గంజాయి రవాణా విషయంలో పదో తరగతి విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్‌లు గంజాయి వ్యాపారంలో ఆరితేరారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. ఈ విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్ వద్ద పని చేస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న వారు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుని గంజాయి కావాలని అడిగారు. ఆ విద్యార్థి తన బంధువుకు తొలి విడతగా రూ.50 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు పోగా, గంజాయి కూడా రాకపోవడంతో వారు నేరుగా అరకు ప్రాంతానికి వెళ్లి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.లక్ష ఇస్తే విడిచి పెడతామని చెప్పారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం చీమకుర్తి మీదుగా కారులో వినుకొండ తీసుకెళ్లారు. రాత్రి అక్కడి గాంధీనగర్‌లోని శ్రీనాథ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు.
బాడుగ కోసం కారు డ్రైవర్ గొడవ చేయడంతో అతన్ని పంపించేశారు. అనంతరం కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండటాన్ని గమనించిన ఈ విద్యార్థి తప్పించుకున్నాడు. రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి చెప్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అంతలో వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంట పడిన క్రమంలో ఆటో ఒక చోట బోల్తా పడింది. యాసిన్ పోలీసులకు పట్టుబడగా, మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థిని, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. కాగా, ముగ్గురు కిడ్నాపర్లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15–20 కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment