అలల ఉధృతికి ఆరుగురు గల్లంతు.. ముగ్గురి మృతి
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి.
వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.
స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతు
అదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.
పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్‌డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment