
భార్యను చంపి.. బెయిల్‌పై బయటకు..
ఆపైన అత్తా హతం ఎనిమిది నెలల తర్వాత పట్టుబడ్డ నిందితుడు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సంచలనం
మార్కాపురం: అనుమానంతో భార్యను, ఆపై ఆమె తల్లిని హత్య చేసిన నిందితుడు పరారై.. పోలీసులకు దొరక్కుండా ఎనిమిది నెలలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేళ్ల శ్రీనుకు, వేములకోట గ్రామానికి చెందిన కన్నెసాని నారాయణమ్మ కుమార్తె సునీతతో వివాహమైంది.
భార్యపై అనుమానంతో తరచుగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 14న వేములకోటలోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకలిబండతో హత్యచేసి పరారయ్యాడు. పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీను తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకుని గతేడాది జూన్ 30వ తేదీ రాత్రి వేములకోటలోని తన ఇంటిలో నిద్రపోతున్న ఆమెను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణ్యక్షేత్రాల్లో నివాసం..
నిందితుడైన శ్రీను హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు పుణ్యక్షేత్రాల్లో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ వాడితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించి దారిన పోయేవారి సెల్‌ఫోన్ తీసుకుని తెలిసిన వారికి ఫోన్‌చేస్తూ సమాచారం కనుక్కుంటూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శ్రీనుకు తెలిసిన వారి ఫోన్‌నంబర్లపై నిఘా పెట్టారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడైన శ్రీను షిరిడీ, కాశీ, వేములవాడ, రామేశ్వరం, చెన్నై, పూణే తదితర ప్రాంతాల్లో ఉంటూ ఒక చోట టీ మాస్టరుగా, మరోచోట దోసె మాస్టరుగా హోటల్‌లో పనిచేస్తూ ఎక్కడా పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా మకాంలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చాడు. కాగా నిందితుడు ఎక్కడ ఉన్నా శివాలయానికి వెళ్తాడని పోలీసులు గుర్తించి మాటు వేశారు. తిరుత్తణి దగ్గర త్రుటిలో తప్పించుకున్న శ్రీను శ్రీశైలం నుంచి త్రిపురాంతకం వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా శనివారం దేవరాజుగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. అరెస్ట్ అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
పోలీసు సిబ్బందికి రివార్డులు..
ఎనిమిది నెలలలుగా తప్పించుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన శ్రీనును అరెస్టు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సైలు ఎస్‌కే జిలానీ, డీ శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, అరుణగిరి ఆంజనేయులు, జె వెంకటేశ్వర్లును ఎస్‌పీ దామోదర్ అభినందించారు. డీఎస్పీ నాగరాజు పలువురికి నగదు బహుమతి అందజేశారు. ప్రెస్‌మీట్‌లో సీఐ సుబ్బారావు, ఎస్సైలు అంకమరావు, సైదుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment