Shrines
-
దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్ షా
మైసూరు: ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై దేశ సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంతోపాటు యోగ, ఆయుర్వేద, భారతీయ భాషల పరిరక్షణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆదివారం ఆయన మైసూరు సమీపంలోని సుత్తూరు జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మైసూరులోని చాముండి హిల్స్‌పై కొలువుదీరిన చాముండేశ్వరీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
దేవుడా దొరక్కుండా చూడు.. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన పేపర్ లీక్ జంట
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్లో చేసిన తప్పుల సవరణ కోసం వెళ్తే బేరం కుదిరి డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ దక్కింది... ఇక జాబ్ గ్యారంటీ అంటూ ఆనందంలో మునిగితేలుతున్న వేళ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చి అరెస్టులు మొదలవడంతో వారిలో వణుకు పుట్టింది... దాదాపు 25 రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ తప్పును కాయాలని మొక్కుకున్నా చివరకు నేరం బట్టబయలైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ‘సిట్’పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఖమ్మం జంట సాయి సుస్మిత, సాయి లౌకిక్‌ల వ్యవహారమిది. సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని... కార్ల వ్యాపారి అయిన లౌకిక్ భార్య సుస్మిత వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉద్యోగాన్నీ వదిలేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసినప్పటికీ ఓఎంఆర్ షీట్లో రాంగ్ బబ్లింగ్ (ఒకే కాలమ్‌లో రెండు చోట్ల మార్కింగ్ చేయడంతో) ఆమె ఫలితం ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పలుమా ర్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి వెళ్లే క్రమంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పలు పరీక్షల ప్రశ్నపత్రాల విక్రయాలు మొదలెట్టిన అతను సుస్మి త డీఏఓ పరీక్షకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని బేరం పెట్టాడు. దీంతో లౌకిక్ రూ. 6 లక్షలు చెల్లించి ఫిబ్రవరి 23న డీఏఓ పరీక్ష మాస్టర్ పేపర్ తీసుకొని భార్యకు అందించాడు. దీని ఆధారంగా రెండ్రోజులపాటు పరీక్షకు సిద్ధమైన సుస్మిత... అదే నెల 26న పరీక్ష రాసింది. తన చేతికి వచి్చన పేపర్లోని ప్రశ్నలే కావడంతో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసింది. ఒకవేళ గ్రూప్–1 పరీక్ష ఫలితం తేలకపోయినా డీఏఓ పోస్టు తప్పకుండా వస్తుందని భార్యాభర్తలు భావించారు. లీకేజీ బయటపడటంతో గుబులు... మార్చి 11 వరకు ఆనందంగా గడిపిన దంపతులు... టీఎస్పీఎస్సీలో పరీక్ష పేపర్ల లీకేజీ అంశం మార్చి 12న వెలుగులోకి రావడం, పోలీసులు ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర నిందితులను అరెస్టు చేయడంతో ఆందోళనకు లోనయ్యారు. డీఏఓ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాకూడదని, తాము ఈ కేసులో ఇరుక్కోకూడదని ప్రార్థనలు మొదలెట్టారు. నిద్రలేని రాత్రులు గడిపిన ఈ జంట... ఆ ఒత్తిడిని జయించడానికి తిరుపతి, షిర్డీ సహా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లింది. అయితే ప్రవీణ్‌కు రూ. 6 లక్షల సొమ్మును లౌకిక్ ఆన్లైన్లో బదిలీ చేయడంతో ఈ క్లూ ఆధారంగా ‘సిట్’పోలీసులు వారిని ఈ నెల 7న అరెస్టు చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల సందర్శన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. తొలి దశలో భాగంగా విజయవాడ కేంద్రంగా మూడు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు తెలిపారు. రెండో దశలో విశాఖ నుంచి మరో మూడు సర్క్యూట్లను ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ప్రయాస లేకుండా.. తక్కువ ఖర్చులో పుణ్యక్షేత్రాల సందర్శనను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గైడ్‌తో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో సర్క్యూట్లో 7 నుంచి 10 దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు మాట్లాడుతూ.. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా, సురక్షితంగా ఆలయాలను సందర్శించేలా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఏపీటీడీసీ చైర్మన్, ఎండీ కలిసి పర్యాటక శాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఏపీటీడీసీ ఈడీ (ఆపరేషన్స్) గోవిందరావు, ఈడీ (ప్రాజెక్ట్స్) మల్రెడ్డి, రిలీజియస్ టూరిజం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ట్రాన్స్‌పోర్టు మేనేజర్ జగదీశ్ పాల్గొన్నారు. తొలి దశలోని ఆధ్యాత్మిక సర్క్యూట్లు.. విజయవాడ–తిరుపతి: విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి, తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుచానూరు, కాణిపాకం. విజయవాడ–శ్రీశైలం: ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. విజయవాడ–సింహాచలం: ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అన్నవరం, లోవ తలుపులమ్మ, పిఠాపురం శక్తి, దత్తాత్రేయపీఠం, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ర్యాలి లక్ష్మీజగన్మోహినీ కేశవస్వామి, సింహాచలం. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు.. విశాఖ–శ్రీకాకుళం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామతీర్థం. విశాఖ–తిరుపతి: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, కాణిపాకం. విశాఖ–శ్రీశైలం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్‌లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
భారతీ తీర్థమాశ్రయే
సనాతన ధర్మానికి, ఆర్ష సంస్కృతికి చిరునామా శ్రీ శృంగేరీజగద్గురు మహాసంస్థానం. నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటిగా, గురుపరంపరతో అలరారుతున్న ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారు. అపర శారదా స్వరూపులుగా భాసిల్లే వీరి ముప్ఫై సంవత్సరాల పీఠాధిపత్యం జనాలలో శృంగేరిపట్ల గల గౌరవమర్యాదలను రెట్టింపు చేసింది.సంప్రదాయ కుటుంబమైన వేంకటేశ్వర అవధాన్లు–అనంతలక్ష్మి దంపతులకు 1951వ సంవత్సరంలో చైత్ర శుక్ల షష్ఠి నాడు జన్మించారు శ్రీస్వామివారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సీతారామాంజనేయులు. శృంగేరీ పీఠానికి 35వ అధిపతి శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారితో ఒకానొక సందర్భంలో సీతారామాంజనేయులుకి ఏర్పడిన పరిచయానికి తోడు శ్రీశారదాదేవీ ఆశీస్సులు కూడా లభించడంతో 1989లో సీతారామాంజనేయులును శృంగేరి మహాసంస్థానానికి 36వ పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులను చేసి వారికి పీఠసంప్రదాయాల ప్రకారం భారతీతీర్థ అనే పేరును ఇచ్చారు. ధర్మమే పునాది... ఒకనాడు జగద్గురువులను దర్శించుకున్న ఒక శిష్యుడు ‘‘ప్రపంచమంతా భౌతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధివైపు దూసుకుపోతున్న ఈ తరుణంలో ధర్మం అవసరమేమిటి?’’ అని అడిగాడు.దానికి శ్రీ భారతీ తీర్థ స్వామివారు ‘‘ధర్మోవిశ్వస్య జగత:ప్రతిష్ఠా..’’ అంటే వేదం విశ్వం అస్తిత్వం ధర్మంమీదనే ఆధారపడి ఉందని చెబుతోంది. సనాతన ధర్మ ఆచార విచారాలు కొనసాగుతున్నంత కాలం దేశం సుభిక్షంగా ఉంటుంది. భౌతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా ధర్మానికి దూరమయితే ప్రమాదం ఎదురవుతుంది. అందుకే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఆదిశంకరులు శృంగేరీ పీఠాన్ని స్థాపించారు’’ అని చెప్పిన తీరు అందరికీ మార్గనిర్దేశనం అవుతుంది. సన్మార్గం వైపు... జగద్గురువుల ఆదేశంతో శృంగేరి పీఠం, దేశవ్యాప్తంగా ఉన్న దాని అనుబంధ సంస్థలద్వారా అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహింపబడుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాలో మౌలికవసతుల కల్పనకు పీఠం తరుపున గట్టిప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ విద్య, వైద్యం మొదలైన అవసరాలను తీరుస్తోంది పీఠం. సమాజాన్ని మంచిమార్గంవైపు మరల్చే దిశగా శృంగేరి శంకరమఠాలు కృషి చేస్తున్నాయి. వైదిక వాజ్ఞ్మయాన్ని ఈనాటి తరం వారికి అందించాలనే ఉన్నతాశయంతో వేదవిద్యాబోధనకు, ప్రాచీనగ్రంథ పరిరక్షణకు నడుం బిగించింది శృంగేరి సంస్థానం. శృంగేరీలో నేటి కార్యక్రమాలు నేడు జగద్గురువుల 69వ వర్ధంతి సందర్భంగా (శృంగేరీ పీఠాధిపతుల పుట్టినరోజును వర్ధంతి అని వ్యవహరిస్తారు. అది ఆ మఠ సంప్రదాయం) పీఠంలో ఉదయంనుండి సహస్రమోదక మహాగణపతియాగం, మహారుద్రయాగం, శతచండియాగం మొదలైన కార్యక్రమాలు జగద్గురువుల పర్యవేక్షణలో, దేశం నలుమూలనుండి విచ్చేసిన వేదశాస్త్ర పండితులచేత అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతాయి. ఒకవైపు వేదఘోషతో, మరోవైపు కళాకారుల సాంస్కృతిక శోభతో శృంగేరి మారుమ్రోగుతుంది. అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేద పండితులు -
పుష్కరుడికి ఘన వీడ్కోలే...
అంత్యపుష్కరాలు సందర్భం ‘నర్మదా తీరం తపస్సుకు... గంగాతీరం మరణానికి.. కురుక్షేత్రం దానానికి శ్రేష్ఠమైనది.. అయితే ఈ మూడింటికన్నా గౌతమీ తీరం పరమపవిత్రం’ అని గౌతమీ మాహాత్మ్యం చెబుతోంది. అంతటి మహత్యమున్న గౌతమీ గోదావరి తీరం అంత్యపుష్కరాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఏ నదికి.. చివరకు హిందువులు అత్యంత పవ్రితంగా భావించే గంగానదికి కూడా లేనివిధంగా గోదావరికి అంత్యపుష్కరాలు ఉన్నాయి. జులై 31, ఆదివారం నాడు ఆరంభమైన ఈ అంత్యపుష్కరాలు పన్నెండు రోజులపాటు అంటే ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మహాక్రతువులో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పితృదేవతలకు పిండప్రదానం చేసే మహత్కార్యంలో నిమగ్నమవనున్నారు. పుష్కరాలు.. అంత్య పుష్కరాల సమయంలోనే కాదు.. ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరుడి ప్రవేశం దేశంలో గోదావరితోనే మొదలవుతోంది. ఇక్కడ ఏడాది పాటు ఉండి మిగిలిన నదుల్లోకి ప్రవేశిస్తాడు. ‘స్కందపురాణం, గౌతమీ మహత్యం’లో పేర్కొన్నట్టు... బ్రహ్మదేవుడు పుష్కరుడిని గురుడు సింహారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులు, చివరి 12 రోజులు మాత్రమే కాకుండా ఏడాదంతా మధ్యాహ్నం రెండుగంటలపాటు నివసించమని కోరాడు. ఈ కారణంగానే గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో నదీస్నానం, పితృదేవతలకు పిండప్రదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని భక్తుల విశ్వాసం. పుష్కరాలు, అంత్యపుష్కరాల సమయంలో గోదావరి నదీస్నానం చేస్తే మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంత్యపుష్కరం మూఢంలో మొదలవుతున్నా ఆ ప్రభావం ఉండదంటున్నారు అన్నవరం దేవస్థానం ప్రధానసలహాదారుడు, రాజగురువు ఎం.ఆర్.వి.శర్మ. ‘తీర్థాలను తొలిసారిగా సందర్శించేటప్పుడు మూఢమి మంచిది కాదని ధర్మశాస్త్రం చెబుతోంది. కాని గోదావరికి ఆ దోషం లేదు. తొలిసారి మూఢమిలో సైతం సందర్శించుకోవచ్చు. ఎందుకంటే పుష్కరుడు గోదావరిలో ఏడాది పొడవునా ఉంటారు’ అని ఆయన అన్నారు. పుణ్యఫలాన్నిచ్చే పితృతర్పణాలు పుష్కరాల సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఎంత పుణ్యఫలమో... అంత్య పుష్కరాల సమయంలో ఇచ్చినా అంతే పుణ్యఫలం దక్కుతుందని వేదపండితులు చెబుతున్నారు. పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. ఎక్కువ మంది ఉత్తరాంధ్రావాళ్లే! గోదావరి పుష్కరాలకే కాదు.. అంత్యపుష్కరాలకు సైతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వీరితోపాటు ఈసారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ఎంపిక చేసిన ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిండప్రదానాలకు అనుమతి ఇచ్చారు. వైదిక విధులకు సంబంధించిన సామగ్రిని ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచారు. నదిలో భక్తులు గల్లంతవకుండా పడవలతో రక్షణచర్యలు చేపట్టనున్నారు. వీటిపై గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాజమహేంద్రవరం, కొవ్వూరులో భక్తుల విశ్రాంతికి సత్రాలు, కమ్యూనిటీ భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్ బస్సులతోపాటు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్టీసీ సుమారు 150 బస్సులను నడుపుతోంది. - నిమ్మకాయల సతీశ్ కుమార్, సాక్షి అమలాపురం తెలంగాణ లో అంత్యపుష్కరాల ఏర్పాట్లు గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం బాసర, సోన్ (నిర్మల్), మంచిర్యాల, చెన్నూరు గోదావరి వంటి నాలుగు ప్రధాన ఘాట్లను ఎంపిక చేసింది. నిన్నటి నుంచి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జిల్లాలో నాలుగు ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. బాసర వద్ద నాలుగు స్నాన ఘాట్టాలు, సోన్‌లో రెండు, మంచిర్యాల, చెన్నూరులో ఒక్కొక్కటి చొప్పున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. బాసరలో ఏకకాలంలో 20వేల మంది భక్తులు స్నానమాచరించే వీలుంది. సోన్‌లో 6వేల మంది, మంచిర్యాలలో 10 వేలు, చెన్నూరులో 5వేల మంది పుష్కర స్నానం చేసే వీలుంది. గోదారిలో దిగి సాన్నాలు చేసేలా అన్ని ఘాట్ల వద్ద మెష్యూలు ఏర్పాటు చేయనున్నారు. బాసరలో 30 మందిని, మిగిలిన మూడు ఘాట్ల వద్ద పన్నెండు మంది చొప్పున గజ ఈతగాళ్లను నియమించారు. ఘాట్ల వద్ద దుస్తులు మార్చేందుకు గదులు.. ఆశ్రయం పొందే విధంగా తడకలతో నిర్మించిన గదులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను తరలించే విధంగా.. ఆర్టీసీ ముందస్తుగా 11 ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో... గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం, బూర్గంపాడు మణుగూరు మండలాలల్లో ఎనిమిది పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పర్ణశాల, ఇరవెండి పుష్కర ఘాట్లలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర పుణ్య స్నానాలు చేశారు. భద్రాచలం, పర్ణశాలలో ఎక్కువ సంఖ్యలో అంత్య పుష్కరాల సమయంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్ల విస్తీర్ణం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. తాగునీరు, వసతి, ఇతర సౌకర్యాలపై ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. భద్రాచలం పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో పాటు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీనిపై జిల్లా స్థాయి అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష జరగలేదు. భద్రాచలం సబ్ కలెక్టర్ మాత్రమే ఈ నెల 26న భద్రాచలంకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా... అంత్యపుష్కరాలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. పురాణ ప్రసిద్ధి, చారిత్రిక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు, పితృదేవతలకు తర్పణాలు వదలనున్నారు. అంత్యపుష్కరాలకు చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం, కొవ్వూరులతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరఘాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పుష్కరాలకు 284 ఘాట్ల నిర్మాణం జరిగింది. అంత్యపుష్కరాలకు తక్కువ మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న 33 ఘాట్లను ఏ-1గా ప్రభుత్వం గుర్తించింది. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 16 ఘాట్లు.. పశ్చిమగోదావరి జిల్లాలో 17 ఘాట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోటిలింగాలు, పుష్కరఘాట్లతోపాటు మరో ఐదు ఘాట్లు, కోటిపల్లి, అప్పనపల్లి, ముక్తేశ్వరం తొగరపాయతోపాటు పశ్చిమాన కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నర్సాపురం వలంధరరేవు ఘాట్లతో సహా రెండు జిల్లాల్లో కలిపి రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముంది. అంత్యపుష్కరాలకూ అంతే ప్రభావం! ఆది పుష్కరాలకు ఎంత ప్రభావం ఉంటుందో, అంత్యపుష్కరాలు కూడా అంతే ప్రాశస్త్యం, ప్రభావం కలిగి ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రజల్లోనే అంత్య పుష్కరాల గురించిన అవగాహన లేకపోవడం విచారకరం. ఈ విషయంలో పండితులు, మీడియా ప్రచారం చేయడం అవసరం. అంత్యపుష్కరాలలో కూడా స్నానం జపం త ర్పణం పిండప్రదానం వంటి కర్మలను ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోక్తి. ఆది పుష్కరాలలో స్నానం చేశాం కదా, మళ్లీ అంత్య పుష్కరాలలో చేయవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే అవకాశం ఉంటే ఎన్నిరోజులయినా, ఎన్ని సార్లయినా చేయవచ్చు. ప్రజలందరూ ఈ అంత్యపుష్కరాలను సద్వినియోగం చేసుకుని భగవదనుగ్రహాన్ని పొందవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ ప్రచారకులు ఆది పుష్కరవిధులు నిర్వర్తించని వారికి ఊరట! బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరశోభ వస్తుంది. అది మొదటి 12 రోజులూ, ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో రెండు గడియలు, సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించడానికి ముందు మరొక పన్నెండు రోజులు గోదావరి జలాలలో పుష్కరుడితో పాటు బృహస్పతి, బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు అందరూ ఉంటారు. ఆది పుష్కరాలలో గోదావరిలో పుష్కరస్నానం కానీ, దాన జపతపాదులు కానీ, పితృకర్మలు కానీ చేయడం వీలు కానివారు అంత్యపుష్కరాలుగా చెప్పబడే చివరి 12 రోజులూ చేసుకోవచ్చును. పుష్కరాలలో చేసే ఈ కర్మలకు ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది. ఎప్పుడు చేసినా ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. ఎందుకో కానీ ఈ సౌలభ్యాన్ని గురించి ఎవరూ అంతగా పట్టించుకున్నట్లు కనపడదు. రాబోయే కృష్ణాపుష్కరాల మీద చూపే శ్రద్ధ, దానికి ముందుగా వస్తున్న గోదావరి అంత్యపుష్కరాల మీద కూడా చూపిస్తే, ఆది పుష్కరాలలో పుష్కరవిధులు నిర్వర్తించడం కుదరని వారికి ఎంతో ఊరట కలుగుతుంది. కృష్ణానది ఆదిపుష్కరాల రద్దీ తగ్గుతుంది. - డా.ఎన్.అనంతలక్ష్మి పౌరాణిక ప్రవచకులు పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. -
అమ్మ కోసం
ఆ అభినవ శ్రవణకుమారుడి పేరు కైలాస్గిరి. ఎవరీ కైలాస్గిరి? ఆయన చేస్తున్న పని ఏమిటి? ఆయనపై ఎందుకీ ప్రశంసల జల్లులు..? వివరాలు తెలుసుకోవాలంటే... కైలాస్ గిరి వెళ్లే దారిలో మనమూ ఆయనతో పాటే కాసేపు ప్రయాణించాలి. నలభై ఎనిమిదేళ్ల ఏళ్ల కైలాస్గిరి బ్రహ్మచారి. ఇరవై ఏళ్ల కిందటి వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ సమీపంలోని స్వగ్రామమైన పిపరియాలో జీవించేవాడు. తొంభై ఏళ్ల అంధురాలైన తల్లి కేతకీదేవీ తప్ప అతనికి మరో బంధం లేదు. పెళ్లి చేసుకోమని ఊళ్లో చాలామందే చెప్పి చూశారు. తల్లి కూడా ఎంతగానో చెప్పింది ‘అంధురాలైన నన్ను చూసుకోవడానికి ఒకరు తోడుంటారు’ కదా! అని. కైలాస్గిరి వినలేదు. పైగా తను చేయాలనుకుంటున్న పని ఒకటుందని చెప్పాడు. ఆ మాట విన్న తల్లి మొదట ఆశ్చర్యపోయింది. ఎందుకంత కష్టం? అని బాధపడింది. అమ్మకు మెల్లగా నచ్చజెప్పాడు కైలాశ్. ఆమె అప్పటికి సరేనంది. కానీ, ఆ తర్వాత ఎన్నో సందేహాలు వెలిబుచ్చింది. తీర్థయాత్రలు అంటే బోలెడంత డబ్బు కావాలి. అంతంత దూరం నడకమార్గం అంటే... ఏడు పదుల వయసులో తన వల్ల అయ్యే పని కాదని, పైగా తన అంధత్వం ఈ ప్రయాణానికి అడ్డంకి అని చెప్పింది. కైలాస్ బాగా ఆలోచించాడు. ఓ ఆలోచన అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. మందపాటి వెదురు కర్రకు రెండువైపులా బుట్టలు ఏర్పాటు చేశాడు. ముందు బుట్టలో తల్లిని కూర్చోమన్నాడు. వెనక బుట్టలో కావల్సిన వస్తువులను కట్టుకున్నాడు. అలా తయారుచేసుకున్న కావడిని భుజానికెత్తుకున్నాడు. ఇలా 20 ఏళ్ల కిందట భుజానికెత్తుకున్న కావడితో అలుపులేకుండా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాడు. దారి పొడవునా కనిపించిన విశేషాలను, దర్శించుకున్న క్షేత్రాల ప్రశస్తిని అమ్మకు కళ్లకు కట్టినట్టు చెబుతూనే ఉన్నాడు. తల్లి ఆకాంక్షే పెట్టుబడిగా! జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలించుకుంటున్న బిడ్డలున్న మన సమాజంలో కన్నతల్లిని 20 ఏళ్లుగా మోస్తూ ప్రముఖ దేవాలయాలను దర్శింపజేస్తూ తల్లి ఆకాంక్షను నెరవేరుస్తున్న ఈ అభివన శ్రవణ కుమారుడిని అంతా ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు భుజాన కావడిలో తల్లిని మోసుకుంటూ కాలినడకన 36,582 కిలోమీటర్లు ప్రయాణించాడు. దారిలో మీడియా ప్రతినిధులు పలకరించిన ప్రతీసారి అతను వినమ్రంగా వివరాలు తెలుపుతూనే ఉన్నాడు. ‘‘నా పదేళ్ల వయసులో మా నాన్న, అన్న, అక్క చనిపోయారు. నాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు చెట్టు మీద నుంచి పడిపోయాను. స్థోమత లేకపోయినా అప్పులు చేసిన నాకు వైద్యం చేయించింది అమ్మ. అయినా నేను బతకడం కష్టమన్నారు వైద్యులు. మా అమ్మ ఎన్నో పూజలు చేసింది. ఎంతోమంది దేవుళ్లకు, ఎన్నో పుణ్యతీర్థాలకు నడిచి వస్తానని మొక్కుకుంది. ఆమె ప్రార్థనల ఫలితంగానే నేను బతికాను. కానీ, ఈ పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే తను పుట్టు అంధురాలు. తోడు ఎవరూలేనిదే ఎటూ వెళ్లలేదు. నేను కాకపోతే ఆమె మొక్కులను, ఆకాంక్షలను ఇంకెవరు తీరుస్తారు’’ అంటూనే దించిన కావడిని మళ్లీ భుజానికెత్తుకుంటూ ముందుకు సాగుతాడు కైలాస్గిరి. ఈ దేశవ్యాప్త పర్యటన తనకెంతో సంతోషం కలిగించిందని, దారిలో ఎంతోమంది తమకు సాయం చేశారని, వారిందరికీ కృతజ్ఞతులు తెలుపుతుంటాడు ఈ బాటసారి. ఆశీస్సులే జీవితం దారిలో వెళుతుంటే ఎవరో ఒకరు ఆ రోజుకి తల్లీ, కొడుక్కి ఆహారం పెట్టడం, చేతి ఖర్చులకు ఎంతో కొంత పైకం ఇవ్వడం ఇస్తుంటారు. లేదంటే, కైలాస్ తానే వంట చేసి తల్లికి తినిపిస్తాడు. ఆమెకు ఇష్టమైన రోటీలను చేస్తాడు. ‘‘నా కొడుకు చాలా గొప్పవాడు. వాడి కష్టం నాకు అర్థమవుతోంది. నేనూ అవసాన దశలో ఉన్నాను. త్వరగా అలసిపోతున్నాను. కొన్నిసార్లు ఇంకెప్పుడు ఇంటికెళ్లిపోతామని అడుగుతుంటాను’ తలమీదుగా తెల్లటి పైటకొంగును ముందు జరుపుకుంటూ చెబుతుంది కేతకీదేవి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నింటికీ కైలాస్గిరి తన తల్లిని తీసుకుపోయాడు. ‘ఇప్పటికే చాలా క్షేత్రాలను దర్శించుకున్నాను. ఇక భగవంతుడిలో ఐక్యం కావడమే మిగిలి ఉంది’ సంతృప్తిగా అంటారు కేతకీదేవి. -
ఓం హ్రీం బుస్!
మా యంత్రం ధరిస్తే మీ దరిద్రాలన్నీ పోయి అదృష్టవంతులవుతారు. దేశంలోని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన యంత్రాలు తెప్పిస్తాం. నేరుగా మీకు అక్కడ నుంచి రావాలంటే రూ. 5 వేలకు పైగా ఖర్చవుతుంది. మేమైతే రూ.1500కే ఇచ్చేస్తాం. గుంటూరులో మా బ్రాంచి పెట్టడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఇది. అంటూ ఈ మధ్య కాలంలో కొందరు టెలీకాలర్ ద్వారా ఫోన్లు చేసి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు. సాక్షి, గుంటూరు : కొంత మంది యంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. 2013 నుంచి 2015 మధ్య కాలంలో ఒక్క గుంటూరు నగరంలోనే పదుల సంఖ్యలో యంత్రాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏదో పేరుతో ఆర్సీలు తీసుకుని బుకింగ్ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ అధికారులకు భారీ స్థాయిలో మామూళ్లు వెళుతుండడంతో కిమ్మనకుండా ఉంటున్నారు. మోసం జరుగుతుంది ఇలా... విజయవాడ మార్కెట్లో రూ. 80లకు అమ్మే యంత్రాలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి గుంటూరు చుట్టుపక్కల గోడౌన్లలోకి చేర్చి వాటిని ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం వాటిని పోస్టాఫీస్‌ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. పోస్టాఫీస్ ద్వారానే చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఒక్కో యంత్రానికి రూ. 1200 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఇదిఅత్యంత లాభసాటి వ్యాపారంగా మారడంతో నిర్వాహకులు కోట్లు గడిస్తున్నారు. చంద్రమౌళీనగర్ పోస్టాఫీస్‌కు రోజుకు రూ.70 వేల ఆదాయం ... యంత్రాల పేరుతో గుంటూరులో భారీగా వ్యాపారం జరుగుతుండటంతో పోస్టాఫీస్‌లకు సైతం అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. గుంటూరులోని అన్ని పోస్టాఫీసుల ద్వారా యంత్రాలను పార్శిల్ చేసి ప్రజలకు పంపుతున్నారు. నగరంలోని చంద్రమౌళీనగర్ పోస్టాఫీస్ ద్వారా రోజుకు 1500 బాక్సుల వరకు వెళుతుంటాయి. ఒక్కో బాక్సుకు రూ. 41 నుంచి రూ. 60 వరకు పోస్టాఫీస్‌కు ఆదాయం వస్తోంది. అంటే ఒక్క చంద్రమౌళీనగర్ పోస్టాఫీసుకు రోజుకు రూ. 70వేల వరకు ఆదాయం వస్తోంది. మిగిలిన పోస్టాఫీస్‌లను కూడా కలిపితే ఆ శాఖకు ఎంత ఆదాయం వస్తుందో లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. -
చూసొద్దాం రండి
పరమ పవిత్రమైన కార్తీకమాసాన పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి తరించాలని అందరూ ఆశ పడతారు. వనభోజనాలకు వెళ్లి కుంటుంబమంతా జాలీగా గడపాలనుకుంటారు. అందుకే.. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ ప్రాంతాలు, సముద్రతీరాలు, నదీపాయలు, వాగులు, వంకలు, తోటలు, అడవులు అన్నీ పర్యాటకులతో కళకళలాడుతుంటారుు. యూత్రికుల ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ కార్తీకమాసానికి వారం రోజుల ముందే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. పంచారామాలతో పాటు పట్టిసీమ, శబరిమల యూత్రలకు ఈ బస్సులు నడుస్తారుు. గతంలో ఉన్న చార్జీల రేట్లలో ఏమాత్రం తేడా లేకుండా, ప్రయాణికుల సౌలభ్యం కోసమే ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుదేష్కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిటీఎం (సిటీ) జి.నాగేంద్రప్రసాద్, రూరల్ సీటీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ వివరాలు తెలుసుకుని పుణ్యక్షేత్ర దర్శనానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి - విజయవాడ పంచరామాలకు స్పెషల్ సర్వీసులు అమరావతిలోని అమరారామం, భీమ వరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని దక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను ఒక్కరోజులో దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజూ వేకువజామున 3 నుంచి 4 గంటల సమయంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరే ఈ బస్సులు అమరావతి నుంచి భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో దర్శనానంతరం తిరిగి రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ చేరుకుంటుంది. ఎప్పుడెప్పుడు? టికెట్ల ధర ఎంత? పంచరామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈనెల 26, 27 తేదీలు, నవంబరు 2, 3, 4, 6, 10, 16, 17,18, 20 తేదీల్లో బస్సులు నడుపుతారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ఏర్పాటుచేయగా, లగ్జరీలో పెద్దలకు రూ.770, చిన్నపిల్లలకు రూ.580, డీలక్స్ సర్వీసుల్లో పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.490 వసూలు చేస్తారు. అసౌకర్యం కలగకుండా చర్యలు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ఆయా దేవస్థానాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ఆయా ఏరియాల సిబ్బంది భక్తుల దర్శనం కోసం, వారికి తగిన సమయపాలన కోసం ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు ఎన్ని బస్సులు వస్తున్నారుు.. ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు.. వంటి వివనాలను ముందురోజు రాత్రే చర్చించుకుని తగిన ఏర్పాట్లు చేస్తారు. శబరిమలకు స్పెషల్ బస్సులు కార్తీకమాసంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసింది. విజయవాడ నుంచి శ్రీరంగం, కుర్తాళం, ఎరిమేలి మీదుగా పంబ చేరుకుంటారు. శబరిమలలోని అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయూణంలో మధురై, మేల్మరువత్తూరు మీదుగా బస్సు విజయ వాడకు చేరుతుంది. ఈ టూర్ కేవలం ఐదు రోజుల్లోనే ముగుస్తుంది. టికెట్ల వివరాలు సూపర్ లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.4,300, చిన్నపిల్లలకు రూ.3,200 వసూలు చేస్తారు. అద్దె ప్రాతిపదికన అయ్యప్ప భక్తులు ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతి పదికన కూడా తీసుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేశారు. రోజుకు 420 కిలోమీటర్ల అంచనాతో సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.42, డీలక్స్‌కు రూ.41, ఎక్స్‌ప్రెస్ రూ.45గా నిర్ణయించారు. పర్మిట్ ఫీజు, టోల్‌గేటు, పార్కింగ్ చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. స్వాముల కోరిక మేరకు మార్గంమధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఇద్దరు వంటమేస్త్రీలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అటెండర్‌కు సీట్లు లేకుండా అనుమతించే అవకాశం ఉంది. పట్టిసీమకు ప్రత్యేక బస్సులు ప్రకృతి సోయగాల మేళవింపుతో గోదావరి పరవళ్లు, పాపికొండల అందాలు తిలకించాలనుకునే ప్రయూణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం వేకువజామున 3 గంటల సమయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి అదేరోజు రాత్రి తిరిగి విజయవాడ వస్తుంది. రాజమండ్రి నుంచి బోటు షికారు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటు షికారు చేసి సాయంత్రం బస్సు వద్దకు చేరుకుని తిరుగు ప్రయూణమవుతారు. టికెట్ల వివరాలు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.400, బోటు షికారుకు పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.350. భక్తులకు ఆర్టీసీ సౌకర్యాలు అద్దె ప్రాతిపదికన, వ్యక్తిగత టికెట్లు కొన్న భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటుచేసింది. వాటి వివరాలు.... భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వీడియో కోచ్ ఉన్న కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రైలులో శబరిమలకు వెళ్లే భక్తులు పంబకు 150 కిలోమీటర్ల దూరంలో దిగాలి. అందుకు భిన్నంగా ఆర్టీసీ పంపానది వద్దకు బస్సు నడుపుతోంది. ఆయా ప్రాంతాల అధికారులతో ఆర్టీసీ అధికారులు చర్చించి అన్ని వసతులతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆఫీసర్లు, సూపర్ వైజర్లు అన్నివేళలా భక్తులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తారు. హెల్ప్‌లైన్ నంబరు కూడా ఏర్పాటుచేశారు. ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రయాణికులకు మరిన్ని సేవలందిస్తారు. ఆర్టీసీ రిజర్వేషన్ ఆన్లైన్లో.. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పంచారామాలు, పట్టిసీమ, శబరిమలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్లను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. టికెట్లు ఆర్టీసీ ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెంట్ల వద్ద తీసుకోవాలి. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ సెల్ నంబరు 9959225475లో సంప్రదించవచ్చు. -
పుణ్యక్షేత్రాల బాటపట్టిన అభ్యర్థులు
సాక్షి, ముంబై: ఎన్నికలు సమీపించడంతో బరిలో దిగిన అభ్యర్థుల్లో కొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం తప్పకుండా వరించాలని, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని కోరుతూ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరికొందరు తమ పరువు పోకుండా కనీసం డిపాజిట్ దక్కేలా చూడు స్వామి అని వేడుకుంటున్నారు. లోక్‌సభ, శాసన సభ, స్థానిక సంస్థలకు ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా అభ్యర్థులను గెలిపించేది ఓటరు మహాశయులే. అయినప్పటికీ అభ్యర్థులు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అప్పుడే బయలుదేరారు. కొందరు స్థానికంగా ఉన్న గుళ్లు, గోపురాల్లో పూజలుచేయగా మరికొందరు సాధు, సంతువులు, సన్యాసుల ఆశీర్వాదం పొందేందుకు వారు బసచేసిన మఠాలకు బయలుదేరారు. ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక, మహాలక్ష్మి మందిరాలతోపాటు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీలోని సాయిబాబాను, తిరుపతిలోని బాలాజీ, కొల్హొపూర్లోని మహాలక్ష్మి ఆలయం, వాషి, శేగావ్, యావత్మాల్, నాగపూర్‌లోని దుర్గమాత మందిరాలు, బుల్డాణ జిల్లాలో ప్రముఖ ఆలయం, మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భయ్యూజీ మహారాజ్ కొందరైతే దర్గాను కూడా వదలడం లేదు. అందులోని ముస్లీం మత గురువులకు మొక్కుతున్నారు. కాని ఎన్ని గుళ్లకు, గోపురాలకు మొక్కుకున్న, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసిన చివరకు ఎన్నికల్లో అంతిమ తీర్పునిచ్చేది ఓటర్లు మాత్రమేనని వీరు గుర్తించకపోవడం గమనార్హం. -
నగరానికి క్షేమంగా యాత్రికులు
సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు. ప్రార్థనలు ఫలించాయి.. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు. అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్సర్, సెకండ్ లాన్సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు. నగరం నుంచి.. ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
బాప్రే..బస్టాండ్ !
సాక్షి, కర్నూలు: జిల్లాలో కర్నూలు తర్వాత అధిక ఆదాయాన్ని ఇచ్చే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మహానంది, తిరుపతి, అహోబిలం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు నంద్యాల మీదుగా వెళ్లాల్సిందే. ఇలా నిత్యం రద్దీగా ఉండే ప్రాంగణాన్ని అధికారులు ఆధునికీకరించడం లేదు. బస్టాండుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో యాజమాన్యం ప్రయాణికుల నుంచి సెస్ వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహా మిగిలిన అన్ని సర్వీసుల్లో టికెట్‌పై ఓ రూపాయి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వసూలు చేసిన నిధులు ఇంత వరకు అభివృద్ధి కోసం ఒక్క పైసా వెచ్చించలేదు. కర్నూలు రీజియన్‌లో రూ.1.20కోట్లు వసూలై నట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మొత్తం నంద్యాల డిపోకు కేటాయించాల్సి ఉంది. బస్టాండ్‌లో సమస్యల గురించి చెప్పుకోవాలంటే దుర్వాసనది మొదటి స్థానం. ఈ బస్టాండ్ చుట్టూ అపరిశుభ్రత నెలకొనడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లలేని పరిస్థితి. పందులు అధికంగా సంచరిస్తూ ప్రయాణికుల అడ్డు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మరుగు నీరు అక్కడే నిల్వ ఉండటంతో రాత్రి వేళలో దోమలు సైర్యవిహారం చేస్తున్నాయి. నిమిషం కూడా నిల్వ లేక పోతున్నారు. ఇక్కడి రెండు మరుగుదొడ్లను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. శుభ్రత విషయంలో నిబంధనలు పాటించడం లేదు. పురుషుల మూత్రశాలలో నీటి సౌకర్యం లేక దుర్గంధాన్ని వెదజల్లుతోంది.