సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్‌లో చేసిన తప్పుల సవరణ కోసం వెళ్తే బేరం కుదిరి డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ దక్కింది... ఇక జాబ్ గ్యారంటీ అంటూ ఆనందంలో మునిగితేలుతున్న వేళ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చి అరెస్టులు మొదలవడంతో వారిలో వణుకు పుట్టింది... దాదాపు 25 రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ తప్పును కాయాలని మొక్కుకున్నా చివరకు నేరం బట్టబయలైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ‘సిట్’పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఖమ్మం జంట సాయి సుస్మిత, సాయి లౌకిక్‌ల వ్యవహారమిది.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదులుకొని...
కార్ల వ్యాపారి అయిన లౌకిక్ భార్య సుస్మిత వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉద్యోగాన్నీ వదిలేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసినప్పటికీ ఓఎంఆర్ షీట్‌లో రాంగ్ బబ్లింగ్ (ఒకే కాలమ్‌లో రెండు చోట్ల మార్కింగ్ చేయడంతో) ఆమె ఫలితం ఆగిపోయింది.
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పలుమా ర్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చి వెళ్లే క్రమంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పలు పరీక్షల ప్రశ్నపత్రాల విక్రయాలు మొదలెట్టిన అతను సుస్మి త డీఏఓ పరీక్షకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని బేరం పెట్టాడు. దీంతో లౌకిక్ రూ. 6 లక్షలు చెల్లించి ఫిబ్రవరి 23న డీఏఓ పరీక్ష మాస్టర్ పేపర్ తీసుకొని భార్యకు అందించాడు.
దీని ఆధారంగా రెండ్రోజులపాటు పరీక్షకు సిద్ధమైన సుస్మిత... అదే నెల 26న పరీక్ష రాసింది. తన చేతికి వచి్చన పేపర్‌లోని ప్రశ్నలే కావడంతో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసింది. ఒకవేళ గ్రూప్–1 పరీక్ష ఫలితం తేలకపోయినా డీఏఓ పోస్టు తప్పకుండా వస్తుందని భార్యాభర్తలు భావించారు.
లీకేజీ బయటపడటంతో గుబులు...
మార్చి 11 వరకు ఆనందంగా గడిపిన దంపతులు... టీఎస్‌పీఎస్సీలో పరీక్ష పేపర్ల లీకేజీ అంశం మార్చి 12న వెలుగులోకి రావడం, పోలీసులు ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర నిందితులను అరెస్టు చేయడంతో ఆందోళనకు లోనయ్యారు. డీఏఓ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాకూడదని, తాము ఈ కేసులో ఇరుక్కోకూడదని ప్రార్థనలు మొదలెట్టారు. నిద్రలేని రాత్రులు గడిపిన ఈ జంట... ఆ ఒత్తిడిని జయించడానికి తిరుపతి, షిర్డీ సహా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లింది. అయితే ప్రవీణ్‌కు రూ. 6 లక్షల సొమ్మును లౌకిక్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడంతో ఈ క్లూ ఆధారంగా ‘సిట్’పోలీసులు వారిని ఈ నెల 7న అరెస్టు చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ
Comments
Please login to add a commentAdd a comment