పుష్కరుడికి ఘన వీడ్కోలే... | special story to krishna ample | Sakshi
Sakshi News home page

పుష్కరుడికి ఘన వీడ్కోలే...

Published Mon, Aug 1 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

పుష్కరుడికి ఘన వీడ్కోలే...

పుష్కరుడికి ఘన వీడ్కోలే...

అంత్యపుష్కరాలు
సందర్భం


‘నర్మదా తీరం తపస్సుకు... గంగాతీరం మరణానికి.. కురుక్షేత్రం దానానికి శ్రేష్ఠమైనది.. అయితే ఈ మూడింటికన్నా గౌతమీ తీరం పరమపవిత్రం’ అని గౌతమీ మాహాత్మ్యం చెబుతోంది. అంతటి మహత్యమున్న గౌతమీ గోదావరి తీరం అంత్యపుష్కరాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఏ నదికి.. చివరకు హిందువులు అత్యంత పవ్రితంగా భావించే గంగానదికి కూడా లేనివిధంగా గోదావరికి అంత్యపుష్కరాలు ఉన్నాయి. జులై 31, ఆదివారం నాడు ఆరంభమైన ఈ అంత్యపుష్కరాలు పన్నెండు రోజులపాటు అంటే ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మహాక్రతువులో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పితృదేవతలకు పిండప్రదానం చేసే మహత్కార్యంలో నిమగ్నమవనున్నారు.


పుష్కరాలు.. అంత్య పుష్కరాల సమయంలోనే కాదు.. ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరుడి ప్రవేశం దేశంలో గోదావరితోనే మొదలవుతోంది. ఇక్కడ ఏడాది పాటు ఉండి మిగిలిన నదుల్లోకి ప్రవేశిస్తాడు. ‘స్కందపురాణం, గౌతమీ మహత్యం’లో పేర్కొన్నట్టు... బ్రహ్మదేవుడు పుష్కరుడిని గురుడు సింహారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులు, చివరి 12 రోజులు మాత్రమే కాకుండా ఏడాదంతా మధ్యాహ్నం రెండుగంటలపాటు నివసించమని కోరాడు. ఈ కారణంగానే గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో నదీస్నానం, పితృదేవతలకు పిండప్రదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని భక్తుల విశ్వాసం. పుష్కరాలు, అంత్యపుష్కరాల సమయంలో గోదావరి నదీస్నానం చేస్తే మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంత్యపుష్కరం మూఢంలో మొదలవుతున్నా ఆ ప్రభావం ఉండదంటున్నారు అన్నవరం దేవస్థానం ప్రధానసలహాదారుడు, రాజగురువు ఎం.ఆర్.వి.శర్మ. ‘తీర్థాలను తొలిసారిగా సందర్శించేటప్పుడు మూఢమి మంచిది కాదని ధర్మశాస్త్రం చెబుతోంది. కాని గోదావరికి ఆ దోషం లేదు. తొలిసారి మూఢమిలో సైతం సందర్శించుకోవచ్చు. ఎందుకంటే పుష్కరుడు గోదావరిలో ఏడాది పొడవునా ఉంటారు’ అని ఆయన అన్నారు.

 

పుణ్యఫలాన్నిచ్చే పితృతర్పణాలు
పుష్కరాల సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఎంత పుణ్యఫలమో... అంత్య పుష్కరాల సమయంలో ఇచ్చినా అంతే పుణ్యఫలం దక్కుతుందని వేదపండితులు చెబుతున్నారు. పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్‌ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు.

 

ఎక్కువ మంది ఉత్తరాంధ్రావాళ్లే!
గోదావరి పుష్కరాలకే కాదు.. అంత్యపుష్కరాలకు సైతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వీరితోపాటు ఈసారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ఎంపిక చేసిన ఘాట్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిండప్రదానాలకు అనుమతి ఇచ్చారు. వైదిక విధులకు సంబంధించిన సామగ్రిని ఘాట్‌ల వద్ద అందుబాటులో ఉంచారు. నదిలో భక్తులు గల్లంతవకుండా పడవలతో రక్షణచర్యలు చేపట్టనున్నారు. వీటిపై గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాజమహేంద్రవరం, కొవ్వూరులో భక్తుల విశ్రాంతికి సత్రాలు, కమ్యూనిటీ భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్ బస్సులతోపాటు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్టీసీ సుమారు 150 బస్సులను నడుపుతోంది.  - నిమ్మకాయల సతీశ్ కుమార్, సాక్షి అమలాపురం


తెలంగాణ లో అంత్యపుష్కరాల ఏర్పాట్లు
గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం బాసర, సోన్ (నిర్మల్), మంచిర్యాల, చెన్నూరు గోదావరి వంటి నాలుగు ప్రధాన ఘాట్లను ఎంపిక చేసింది. నిన్నటి నుంచి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జిల్లాలో నాలుగు ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు.  బాసర వద్ద నాలుగు స్నాన ఘాట్టాలు, సోన్‌లో రెండు, మంచిర్యాల, చెన్నూరులో ఒక్కొక్కటి చొప్పున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. బాసరలో ఏకకాలంలో 20వేల మంది భక్తులు స్నానమాచరించే వీలుంది. సోన్‌లో 6వేల మంది, మంచిర్యాలలో 10 వేలు, చెన్నూరులో 5వేల మంది పుష్కర స్నానం చేసే వీలుంది. గోదారిలో దిగి సాన్నాలు చేసేలా అన్ని ఘాట్ల వద్ద మెష్యూలు ఏర్పాటు చేయనున్నారు. బాసరలో 30 మందిని, మిగిలిన మూడు ఘాట్ల వద్ద పన్నెండు మంది చొప్పున గజ ఈతగాళ్లను నియమించారు. ఘాట్ల వద్ద దుస్తులు మార్చేందుకు గదులు..  ఆశ్రయం పొందే విధంగా తడకలతో నిర్మించిన గదులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను తరలించే విధంగా.. ఆర్టీసీ ముందస్తుగా 11 ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది.


ఖమ్మం జిల్లాలో...
గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం, బూర్గంపాడు మణుగూరు మండలాలల్లో ఎనిమిది పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పర్ణశాల, ఇరవెండి పుష్కర ఘాట్లలో అధిక సంఖ్యలో భక్తులు  పుష్కర పుణ్య స్నానాలు చేశారు. భద్రాచలం, పర్ణశాలలో ఎక్కువ సంఖ్యలో అంత్య పుష్కరాల సమయంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్ల విస్తీర్ణం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. తాగునీరు, వసతి, ఇతర సౌకర్యాలపై ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. భద్రాచలం పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో పాటు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది.  దీనిపై జిల్లా స్థాయి అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష జరగలేదు. భద్రాచలం సబ్ కలెక్టర్ మాత్రమే ఈ నెల 26న భద్రాచలంకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇలా...
అంత్యపుష్కరాలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. పురాణ ప్రసిద్ధి, చారిత్రిక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు, పితృదేవతలకు తర్పణాలు వదలనున్నారు. అంత్యపుష్కరాలకు చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం, కొవ్వూరులతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరఘాట్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పుష్కరాలకు 284 ఘాట్‌ల నిర్మాణం జరిగింది. అంత్యపుష్కరాలకు తక్కువ మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న 33 ఘాట్‌లను ఏ-1గా ప్రభుత్వం గుర్తించింది. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 16 ఘాట్‌లు.. పశ్చిమగోదావరి జిల్లాలో 17 ఘాట్‌లు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోటిలింగాలు, పుష్కరఘాట్‌లతోపాటు మరో ఐదు ఘాట్‌లు, కోటిపల్లి, అప్పనపల్లి, ముక్తేశ్వరం తొగరపాయతోపాటు పశ్చిమాన కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నర్సాపురం వలంధరరేవు ఘాట్‌లతో సహా రెండు జిల్లాల్లో కలిపి రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముంది.


అంత్యపుష్కరాలకూ అంతే ప్రభావం!
ఆది పుష్కరాలకు ఎంత ప్రభావం ఉంటుందో, అంత్యపుష్కరాలు కూడా అంతే ప్రాశస్త్యం, ప్రభావం కలిగి ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రజల్లోనే అంత్య పుష్కరాల గురించిన అవగాహన లేకపోవడం విచారకరం. ఈ విషయంలో పండితులు, మీడియా ప్రచారం చేయడం అవసరం. అంత్యపుష్కరాలలో కూడా స్నానం జపం త ర్పణం పిండప్రదానం వంటి కర్మలను ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోక్తి. ఆది పుష్కరాలలో స్నానం చేశాం కదా, మళ్లీ అంత్య పుష్కరాలలో చేయవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే అవకాశం ఉంటే ఎన్నిరోజులయినా, ఎన్ని సార్లయినా చేయవచ్చు. ప్రజలందరూ ఈ అంత్యపుష్కరాలను సద్వినియోగం చేసుకుని భగవదనుగ్రహాన్ని పొందవచ్చు.  - మద్దికుంట శ్రీకాంత్ శర్మ

 
హిందూ ధర్మ ప్రచారకులు
ఆది పుష్కరవిధులు నిర్వర్తించని వారికి ఊరట!
బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరశోభ వస్తుంది. అది మొదటి 12 రోజులూ, ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో రెండు గడియలు, సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించడానికి ముందు మరొక పన్నెండు రోజులు గోదావరి జలాలలో పుష్కరుడితో పాటు బృహస్పతి, బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు అందరూ ఉంటారు. ఆది పుష్కరాలలో గోదావరిలో పుష్కరస్నానం కానీ, దాన జపతపాదులు కానీ, పితృకర్మలు కానీ చేయడం వీలు కానివారు అంత్యపుష్కరాలుగా చెప్పబడే చివరి 12 రోజులూ చేసుకోవచ్చును. పుష్కరాలలో చేసే ఈ కర్మలకు ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది. ఎప్పుడు చేసినా ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. ఎందుకో కానీ ఈ సౌలభ్యాన్ని గురించి ఎవరూ అంతగా పట్టించుకున్నట్లు కనపడదు. రాబోయే కృష్ణాపుష్కరాల మీద చూపే శ్రద్ధ, దానికి ముందుగా వస్తున్న గోదావరి అంత్యపుష్కరాల మీద కూడా చూపిస్తే, ఆది పుష్కరాలలో పుష్కరవిధులు నిర్వర్తించడం కుదరని వారికి ఎంతో ఊరట కలుగుతుంది. కృష్ణానది ఆదిపుష్కరాల రద్దీ తగ్గుతుంది.  - డా.ఎన్.అనంతలక్ష్మి  పౌరాణిక ప్రవచకులు


పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్‌ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement