సోరియాసిస్‌ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..? | psoriasis myths and truths check here | Sakshi
Sakshi News home page

సోరియాసిస్‌ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..?

Published Tue, May 28 2024 12:12 PM | Last Updated on Tue, May 28 2024 12:37 PM

psoriasis myths and truths check here

చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ ( Psoriasis)  దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.   రకాలను బట్టి  ఒక్కొక్కరిలో ఒ‍క్కోలా లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్‌లో ప్రధానంగా తెల్లటి పొలుసులు , లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు వస్తాయి. మంట,  విపరీతైన దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.  ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది.  ప్రధానంగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. 

చేతులు లేదా కాళ్ళపై సోరియాసిస్ రోజువారీ కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. అలాగే  గజ్జ లేదా పిరుదుల వంటి ప్రాంతాలలో సోరియాసిస్ వస్తే కూర్చోవడం లేదా టాయిలెట్‌కు వెళ్లడం కూడా బాధాకరంగా ఉంటుంది.

సోరియాసిస్  భౌతిక అంశాలను పక్కన పెడితే దీనిపై అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి.  ఒక అధ్యయనం ప్రకారం సోరియాసిస్‌ సోకినవారి దూరంపెట్టడం, అది అంటు వ్యాధి ఏమో అని భయపడటం లాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోరియాసిస్ చుట్టూ ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాం

సోరియాసిస్ అంటువ్యాధి: కాదు ఇది అంటువ్యాధి  కాదు.  ప్రాణాంతకం అంతకన్నా  కాదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. 

వ్యక్తి-నుండి-వ్యక్తికివ్యాపించదు. పరిచయం లేదా శారీరక ‍స్రావాల ద్వారా వ్యాపించదు. ఉదాహరణకు, ముద్దు పెట్టుకున్నా, ఆహారం లేదా పానీయాలను పంచుకున్నా, ఈత కొలనులు లేదా ఆవిరి స్నానాలలో లాంటి సన్నిహిత బహిరంగ ప్రదేశాలలో ఇది ఇతరులకు సోకదు. 

సోరియాసిస్ కేవలం పొడి చర్మంవారికే వస్తుంది. కానే కాదు. చర్మ నిర్మాణం చాలా వేగంగా మారుతుంది - సాధారణ స్కిన్ టర్నోవర్ ప్రతి 28 రోజులు అయితే, సోరియాసిస్‌లో  4-5 రోజులలోపే ఉంటుంది. రక్తనాళాలు కూడా మారుతాయి అందుకే   గోకిన ప్రాంతాలు  ఎర్రగా మారతాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో, సోరియాసిస్ చర్మం పగుళ్లు ,రక్తస్రావం అవుతుంది.

సోరియాసిస్‌లో చాలా  రకాలు
సోరియాసిస్‌ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయని భావిస్తారు. కానీ గట్టెట్ సోరియాసిస్, ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్, పస్ట్యులర్ సోరియాసిస్, ప్లాంటార్‌ సొరియాసిస్‌, ఇన్‌వర్స్‌ సొరియాసిస్‌, ఫేస్‌ సొరియాసిస్‌,  స్కాల్ప్‌ సోరియాసిస్‌ లాంటి పలు రకాలు ఉన్నాయి. లక్షణాలు బట్టి ఏ రకం సోరియాస్‌ అనేది  నిర్ధారిస్తారు.

పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే. అయితే సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు స్వీయ-సంరక్షణ గురించి జాగ్రత్తపడాలి. నిరంతరం సంరక్షణ అవసరం.

సోరియాసిస్‌ను నయం చేయవచ్చు
ఇది మరొక అపోహ.  ప్రస్తుతానికి సోరియాసిస్‌కు నివారణ సాధ్యం కాదు కానీ నిర్వహణ, ఉపశమన చికిత్స ఉంది. వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రభావితమయ్యాడనే దానిపై ఆధారపడి, సోరియాసిస్ లక్షణాల నుండి ఉపశమన మార్గాలున్నాయి.

సోరియాసిస్ చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? కానేకాదు ఒక్కోసారి  చర్మం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో 6–42శాతం సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు దారి తీయవచ్చు.

చికిత్స లేనప్పటికీ, చికిత్స ఎంపికలు లేవు అనేది మరో అపోహ. సోరియాసిస్ అనేది జీవితకాలం పాటు ఉండే దీర్ఘకాలిక పరిస్థితి. క్రీములు, లేపనాలు , జెల్స్‌, సమయోచిత (చర్మానికి వర్తించే), లైట్ థెరపీ లాంటి చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది వైద్యునిమార్గదర్శకత్వంలో తీసుకోవాలి. దీనిపై శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి.  భవిష్యత్తులో  నివారణ చికిత్స మార్గాలు వెలుగులోకి వస్తాయిని  ఆశిద్దాం. 

 ఏం చేయాలి?
సోరియాసిస్ ఎగ్జిమా లాంటిదే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా యుక్తవసులో ప్రారంభమై జీవిత కాలం ఉంటుంది.  పిల్లలు, శిశువుల్లో ఇది చాలా అరుదు. అలాగే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల సోరియాసిస్‌ను నయం  చేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతారు.

ఊబకాయం, ఆల్కహాల్, ధూమపానం వంటి కారకాలు సోరియాసిస్ లక్షణాల తీవ్రతను పెంచుతాయి. అందుకే  ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం,  బరువు నియంత్రణలో ఉండేలా చేసుకోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం  విధిగా పాటించాలి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement