సనాతన ధర్మానికి, ఆర్ష సంస్కృతికి చిరునామా శ్రీ శృంగేరీజగద్గురు మహాసంస్థానం. నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటిగా, గురుపరంపరతో అలరారుతున్న ఈ పీఠానికి ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారు. అపర శారదా స్వరూపులుగా భాసిల్లే వీరి ముప్ఫై సంవత్సరాల పీఠాధిపత్యం జనాలలో శృంగేరిపట్ల గల గౌరవమర్యాదలను రెట్టింపు చేసింది.సంప్రదాయ కుటుంబమైన వేంకటేశ్వర అవధాన్లు–అనంతలక్ష్మి దంపతులకు 1951వ సంవత్సరంలో చైత్ర శుక్ల షష్ఠి నాడు జన్మించారు శ్రీస్వామివారు.
తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సీతారామాంజనేయులు. శృంగేరీ పీఠానికి 35వ అధిపతి శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారితో ఒకానొక సందర్భంలో సీతారామాంజనేయులుకి ఏర్పడిన పరిచయానికి తోడు శ్రీశారదాదేవీ ఆశీస్సులు కూడా లభించడంతో 1989లో సీతారామాంజనేయులును శృంగేరి మహాసంస్థానానికి 36వ పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులను చేసి వారికి పీఠసంప్రదాయాల ప్రకారం భారతీతీర్థ అనే పేరును ఇచ్చారు.
ధర్మమే పునాది...
ఒకనాడు జగద్గురువులను దర్శించుకున్న ఒక శిష్యుడు ‘‘ప్రపంచమంతా భౌతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధివైపు దూసుకుపోతున్న ఈ తరుణంలో ధర్మం అవసరమేమిటి?’’ అని అడిగాడు.దానికి శ్రీ భారతీ తీర్థ స్వామివారు ‘‘ధర్మోవిశ్వస్య జగత:ప్రతిష్ఠా..’’ అంటే వేదం విశ్వం అస్తిత్వం ధర్మంమీదనే ఆధారపడి ఉందని చెబుతోంది. సనాతన ధర్మ ఆచార విచారాలు కొనసాగుతున్నంత కాలం దేశం సుభిక్షంగా ఉంటుంది. భౌతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా ధర్మానికి దూరమయితే ప్రమాదం ఎదురవుతుంది. అందుకే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఆదిశంకరులు శృంగేరీ పీఠాన్ని స్థాపించారు’’ అని చెప్పిన తీరు అందరికీ మార్గనిర్దేశనం అవుతుంది.
సన్మార్గం వైపు...
జగద్గురువుల ఆదేశంతో శృంగేరి పీఠం, దేశవ్యాప్తంగా ఉన్న దాని అనుబంధ సంస్థలద్వారా అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహింపబడుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాలో మౌలికవసతుల కల్పనకు పీఠం తరుపున గట్టిప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ విద్య, వైద్యం మొదలైన అవసరాలను తీరుస్తోంది పీఠం. సమాజాన్ని మంచిమార్గంవైపు మరల్చే దిశగా శృంగేరి శంకరమఠాలు కృషి చేస్తున్నాయి. వైదిక వాజ్ఞ్మయాన్ని ఈనాటి తరం వారికి అందించాలనే ఉన్నతాశయంతో వేదవిద్యాబోధనకు, ప్రాచీనగ్రంథ పరిరక్షణకు నడుం బిగించింది శృంగేరి సంస్థానం.
శృంగేరీలో నేటి కార్యక్రమాలు
నేడు జగద్గురువుల 69వ వర్ధంతి సందర్భంగా (శృంగేరీ పీఠాధిపతుల పుట్టినరోజును వర్ధంతి అని వ్యవహరిస్తారు. అది ఆ మఠ సంప్రదాయం) పీఠంలో ఉదయంనుండి సహస్రమోదక మహాగణపతియాగం, మహారుద్రయాగం, శతచండియాగం మొదలైన కార్యక్రమాలు జగద్గురువుల పర్యవేక్షణలో, దేశం నలుమూలనుండి విచ్చేసిన వేదశాస్త్ర పండితులచేత అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతాయి. ఒకవైపు వేదఘోషతో, మరోవైపు కళాకారుల సాంస్కృతిక శోభతో శృంగేరి మారుమ్రోగుతుంది.
అప్పాల శ్యామప్రణీత్ శర్మ
అవధాని, వేద పండితులు
Comments
Please login to add a commentAdd a comment