సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం.
చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్‌లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.
చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.
చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment