ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య | international appreciation on andhra pradesh education | Sakshi
Sakshi News home page

ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య

Published Fri, May 10 2024 3:41 AM | Last Updated on Fri, May 10 2024 3:42 AM

international appreciation on andhra pradesh education

విద్యా వ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాం 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు.. ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా ఏపీ విద్యార్థులు 

ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం ఆకట్టుకుంది 

ప్రపంచ సమకాలీన సవాళ్లను అధిగమించేలా ఏపీ విద్య 

సీఎం వైఎస్‌ జగన్‌ పేద పిల్లల భవిష్యత్‌కు గొప్ప బాటలు వేశారు 

అంతర్జాతీయ మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధుల ప్రశంసలు 

నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: 
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, పథకాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురు­స్తోంది. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంస్కరణ­లకు తెరతీసింది.

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాసంస్కరణలపై ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతిని­ధులు అభినందనల జల్లు కురిపి­స్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతిని­ధులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విద్యా సంస్కరణలు, పథకాల తీరుతె­న్నులను పరిశీలించి వెళ్లారు. 

తమ దేశాల్లోనూ వాటి­ని అమలు చేస్తామని చెప్పడం ఏపీ విద్యకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపునకు నిదర్శనం. ఇలా ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి­యం విద్యను వారికి దూరం చేయాలని కుట్రలు పన్నుతోంది. 

నాణ్యమైన విద్యే మార్గం..
‘పేదరికాన్ని జయించాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఒక్కటే మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. అన్ని దేశాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని ఐదేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేయడం గొప్ప ముందడుగు’.. స్విట్జర్లాండ్‌ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో క్యాసిస్‌ ఇచ్చిన కితాబు ఇది. గతేడాది ఫిబ్రవరిలో జెనీవాలో ‘ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ అంశంపై మాట్లాడిన ఇగ్నాజియో.. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విద్యా పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. 

కోవిడ్‌ తర్వాత ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచాన్ని ప్రగతి వైపు నడిపించే విద్యా బోధన, సంస్కరణలను ఏపీ అమలు చేయడం గొప్ప ముందడుగని పేర్కొన్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జెఫ్రీ సాచ్‌ ఏపీ విద్యా విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో గ్లోబల్‌ విద్యా విధానం అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప అంశంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్‌ విద్య, ట్యాబ్స్‌ పంపిణీ, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు, టోఫెల్‌ శిక్షణ భవిష్యత్‌ తరాలకు ఎంతో అవసరమన్నారు. తాజా­గా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతిని«­దులు సాక్షి ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రపంచ పౌరులుగా పేద విద్యార్థులు..
పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ అమలు చేయడం పేద పిల్లలకు దక్కిన గొప్ప గౌరవం. విద్యా సాధనలో అట్టడుగు స్థాయిల్లో ఇలాంటి సంస్కరణలనే కోరుకుంటున్నాం.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి కార్యాలయం అట్టడుగు స్థాయిలో నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నా.    – లిడియా గ్రిగొరెవా, చీఫ్‌ ఆఫ్‌ క్యాబినెట్, యూఎన్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫీస్, జెనీవా 

ఏపీ పాఠశాలల్లో మార్పులను చూసి ఆశ్చర్యపోయా 
కంపారిటివ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో దక్షిణా­సియా స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (ఎస్‌ఐజీ) చైర్‌గా నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠ­శాలల్లో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోయాను. గతే­డాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కొలంబియా విశ్వవిద్యాలయంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏపీలో విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి వారు అనర్గళంగా వివరించారు. 

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులతో పోటీపడుతూ మాట్లాడారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ బోర్డులు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని వినియోగించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ మార్పులతో ఏపీ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు.     – రాధిక అయ్యంగార్, సెంటర్‌ ఆఫ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌    డైరెక్టర్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌

ప్రపంచ అవసరాలకు తగ్గట్టు ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఆకర్షించింది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌ అందించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఏపీ విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు. ఇది ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునేందుకు, పరస్పరం సహాయానికి, భవిష్యత్‌ను అద్భుతంగా మార్చుకునేందుకు దోహదం చేస్తుంది.

బాలికల డ్రాపవుట్లను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10 లక్షల మంది బాలికలకు ఉచిత బ్రాండెడ్‌ శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేసింది. అంతేకాకుండా రన్నింగ్‌ వాటర్‌ సదుపాయంతో మరుగుదొడ్లను నిర్మించింది. యుక్త వయసు బాలికల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నాను.    – దివ్యాన్షి వాధ్వా, ప్రపంచ బ్యాంక్‌ డేటా సైంటిస్ట్, వాషింగ్టన్‌

ఏపీలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్య
ఆకలిని, పేదరికాన్ని జయించాలంటే మొదట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదే చేస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అనేక మంది పేద విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.

దీనిద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను, వేతనాలను పొందగలరు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానం సమకాలీన ప్రపంచ సవాళ్లను అధిగమించి అవకాశాలను అందుకునేదిగా ఉంది. ప్రీ–స్కూల్‌ నుంచి ఉన్నత విద్య వరకు చేసిన మార్పులతో నాణ్యమైన విద్యాభివృద్ధిని సాధిస్తుంది. – రజనీ ఘోష్, బ్యూరో ఆఫ్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియన్‌ ఎఫైర్స్‌ ఇండియా డెస్క్‌ ఆఫీసర్, అమెరికా ప్రభుత్వం

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నా చిన్నప్పటికి, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ విద్య, విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, ఇంగ్లిష్‌ మీడియం బోధన వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా మారడం గర్వకారణం.

ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ అమలుతో ప్రతిభ గల నాణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావచ్చు. పేద విద్యార్థులకు ఆంగ్లంలో మంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది. పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 
   – ఉపేందర్‌రెడ్డి గాదె, విజ్‌డమ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్, సిడ్నీ, ఆస్ట్రేలియా

ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంత గొప్ప మార్పు..
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణలను ప్రభుత్వ విద్యా­ర్థులే నేరుగా ఐక్యరాజ్యసమితిలో వివరించారు. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప మార్పును ఏపీలో చూస్తున్నామని ప్రపంచ దేశాల ప్రతినిధులు అభినందించారు. కొలంబియా యూనివర్సిటీలో మన విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్‌లో మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

స్టాన్‌ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్, జెనీవా యూనివర్సిటీ, యునెస్కో, యునైటెడ్‌ నేషన్స్‌ గర్ల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిషియేటివ్, యునైటెడ్‌ నేషన్స్‌ గ్లోబల్‌ స్కూల్స్‌ ఫోరమ్, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ ఇన్‌క్లూజన్‌ వంటి వాటిలో గత ఐదేళ్లుగా ఏపీ విద్య సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ప్రతిచోటా ఏపీ విద్యకు ప్రశంసలు లభిస్తున్నాయి.     – ఉన్నవ షకిన్‌ కుమార్, ఐక్యరాజ్యసమితి స్పెషల్‌ స్టేటస్‌ సభ్యుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement