పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం | University education free for poor children: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం

Published Mon, May 13 2024 12:30 AM | Last Updated on Mon, May 13 2024 12:32 AM

University education free for poor children: Andhra Pradesh

దేశంలోనే ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం జగన్‌ 

రాష్ట్రంలోని ప్రైవేట్‌ వర్సిటీల్లో పేదింటి బిడ్డలకు తొలిసారిగా ఉచిత విద్య 

గ్రీన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్‌ కోటాలో సీట్ల భర్తీ 

గతంలో ప్రైవేట్‌ వర్సిటీలకు మేలు చేసేలా చట్టాన్ని రూపొందించిన చంద్రబాబు 

భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీల కల్పన 

బాబు పాలనలో ఒక్క పేద విద్యార్థికి కూడా ప్రైవేట్‌ వర్సిటీల్లో సీటు దక్కని వైనం 

సీఎం జగన్‌ దార్శనికతతో ప్రైవేట్‌ వర్సిటీ చట్ట సవరణ 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు మేలు 

రూ.5 లక్షలకు పైగా ఫీజులు ఉండే ప్రైవేట్‌ వర్సిటీల్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు సీటు 

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఉచితంగా మెరుగైన ఉన్నత విద్య 

గడచిన రెండు విద్యా సంవత్సరాల్లో కన్వినర్‌ కోటాలో 6,996 సీట్లు భర్తీ 

నాడు
ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో మెరిట్‌ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్‌ వర్సిటీ బిల్లు. 

నేడు 
మెరిట్‌ సాధించిన పేద విద్యార్థులు ప్రైవేట్‌ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను సొంతం చేసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్‌ కోటా సీట్లను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం వారికే కేటాయించేలా సీఎం జగన్‌ ప్రైవేట్‌ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. 

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభ గల పేదింటి విద్యార్థులను టాప్‌ క్లాస్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో పైసా ఖర్చులేకుండా చదివిస్తూ, వారు ఉన్నత లక్ష్యాన్ని అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు మాత్రమే అందుకునే ప్రైవేట్‌ యూనివర్సిటీ విద్యను తొలిసారిగా పేదింటి విద్యార్థులకు చేరువ చేశారు. ఏపీఈఏపీ సెట్‌(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా మెరిట్‌ సాధించిన పేదింటి విద్యార్థులకు ప్రైవేట్‌ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పించి, ఉత్తమ విద్య అందేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. 

రెండేళ్లలో 6,996 సీట్లు భర్తీ 
ఏపీలోని ప్రైవేట్‌ వర్సిటీల్లో ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులన్నింటా ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయంతో పేద మెరిట్‌ విద్యార్థులకు గ్రీన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 35 శాతం సీట్లు, బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో 70 శాతం సీట్లు లభిస్తున్నాయి.

 

ఇందులో ఎస్‌ఆర్‌ఎం–అమరావతి, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ వీఐటీ), సెంచూరియన్, అపోలో వర్సిటీ, భారతీయ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్, మోహన్‌బాబు యూనివర్సిటీలలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో 6,996 సీట్లు పేద విద్యార్థులకు దక్కాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్‌ వర్సిటీల్లో కన్వినర్‌ కేటగిరీలో చేరిన విద్యార్థులకు ఉచితంగానే చదువులు చెప్పిస్తోంది.  

అప్పట్లో ప్రైవేట్‌ వర్సిటీలకు చంద్రబాబు అండ 
ప్రైవేట్‌ వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు పెట్టింది. ఆయా వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీలూ కల్పించింది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్నింటా వర్సిటీల ఇష్టానికే వదిలేసింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే కేటాయించేవి. ఫలితంగా పేద మెరిట్‌ విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది.  

సీఎం జగన్‌ దార్శనికత 
సీఎం జగన్‌ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది. ఉన్నత బోధన, వనరులు ఉన్న ప్రైవేట్‌ వర్సిటీ విద్య పేద విద్యార్థులకూ దక్కాలనుకున్నారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రీన్‌ఫీల్డ్‌ విధానంలో ఏర్పాటైన ప్రైవేట్‌ వర్సిటీల్లో చదువుకునే అవకాశాలపై తొలుత దృష్టి సారించారు. ప్రైవేట్‌ వర్సిటీల చట్ట సవరణ ద్వారా ఆయా వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 35 శాతం సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ప్రైవేట్‌ రంగంలో బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల ఏర్పాటుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.

ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు నిరీ్ణత నిబంధనలతో, వనరులను కలిగి ఉంటే ఆయా యాజమాన్యాలు తమ సంస్థలను బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీలుగా మార్చుకునే అవకాశమిచ్చారు. అయితే వర్సిటీగా మారక ముందు వరకు ఈ కాలేజీల్లోని సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో పేద మెరిట్‌ విద్యార్థులకు దక్కేవి. వర్సిటీగా మారాక 35 శాతం సీట్లే దక్కితే పేద మెరిట్‌ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని సీఎం జగన్‌ భావించారు. దీంతో బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లోని 70 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్‌ కోటాలో కేటాయించేలా చట్టాన్ని సవరించారు.

బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీగా ఏర్పాటయ్యాక కొత్త కోర్సులు ప్రారంభించినా, అదనపు సీట్లు తెచ్చుకున్నా వాటిలో మాత్రం గ్రీన్‌ఫీల్డ్‌ వర్సిటీల మాదిరి 35 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్‌ కోటాకు దక్కుతాయి. ఇటీవల మరో మూడు విద్యా సంస్థలు బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిల్లో మరిన్ని అదనపు సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement