ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత తెలుగుదేశపు కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖకు సంబంధించి చేసిన సమీక్షలను, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్షను పోల్చి చూడండి. అప్పట్లో జగన్ విద్యకు అత్యధిక ప్రాదాన్యత ఇచ్చారు. పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యేనని చెప్పేవారు. విద్యార్ధులకు తన పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు గురించి ప్రోగ్రెస్ అడిగేవారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేసిన అభివృద్ది పనుల గురించి మాట్లాడేవారు. ఆంగ్ల మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్‌ను, టోఫెల్ వంటి వాటిని విద్యార్దులకు అందుబాటులోకి తేవడం ద్వారా వారిని ఎలా పైకి తేవాలా? అనే ఆలోచన చేసేవారు.
స్కూళ్లలో పిల్లలకు టాయిలెట్ సదుపాయంతో సహా అన్ని వసతులు, వాటి పర్యవేక్షణ మొదలైనవాటి గురించి జగన్ తన సమీక్షలో చర్చించేవారు. పిల్లలకు గోరుముద్ద కింద పెట్టే ఆహార పదార్దాల నాణ్యత, వారికి డ్రెస్ లు సకాలంలో అందాయా?లేదా?బూట్లు సరిగా ఉన్నాయా?లేదా?టీచర్లకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?వారికి ఇవ్వవలసిన శిక్షణ గురించి మాట్లాడేవారు. పిల్లలు చదువులు మానకుండా ఉండడానికి తల్లులకు ఇచ్చిన అమ్మ ఒడి పథకం డబ్బులు అందరికి చేరాయా?లేదా? అని పరిశీలించేవారు. అలా జగన్ విద్యారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తే.. చంద్రబాబు నాయుడు తన సమీక్షలో గత ప్రభుత్వంపై విమర్శలు కురిపించడానికి ప్రాముఖ్యత ఇచ్చారు.
గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ స్కూళ్లలోవిద్యా ప్రమాణాలు పడిపోయాయని అన్యాయమైన ఆరోపణ చేశారు. తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో విద్యార్ధులకు, వారి తల్లులకు ఇచ్చిన హామీలేమిటి?. వాటి అమలు పరిస్తితిపై సమీక్ష జరిపినట్లు కనిపించదు. ఈ విషయాల గురించి టీడీపీ అధికార మీడియా ఈనాడు పత్రికలో కనీస ప్రస్తావన చేయదు. గతంలో జగన్ పై దారుణమైన అబద్దాలను వండి వార్చిన ఈ మీడియాకు టీడీపీ అధికారంలోకి రాగానే అంతా బ్రహ్మాండం అయిపోయినట్లు బాజా వాయించడమే సరిపోతోంది. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ పత్రిక హెడింగ్ పెట్టింది. మంచిదే. చంద్రబాబు ఆ మాట అనడం సరైనదే. కానీ ఎవరూ చదువులు మానకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకుంటున్నది మాత్రం మాట్లాడినట్లు కనిపించలేదు. జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద తల్లులకు పదిహేనువేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే.. చంద్రబాబు, పవన్,లోకేష్ లు తమ ప్రచారంలో తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు.
18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఇలా ఇస్తామని, ఆ తర్వాత నెలకు రూ.1,500 స్కీమ్ అమలు చేస్తామని ఊదరగొట్టారు. అమాయక ప్రజలు కూడా దీనిని నమ్మారనే అనుకోవాలి. పైగా ఇంకా పిల్లలను కనండి అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఒక బిడ్డ ఉంటే పదిహేనువేలు, ఇద్దరు ఉంటే ముప్పైవేలు, ముగ్గురు ఉంటే నలభై ఐదువేలు అంటూ ఊరించారు.కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకు పదిహేనువేలు ఇచ్చి సరిపెడదామని ఆలోచన చేశారు. అయితే ప్రజలలో వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ స్కీమ్ ను వాయిదా వేశామని విద్యా మంత్రి లోకేష్ ప్రకటించారు.అవసరమైన డేటా సేకరణకు టైమ్ కావాలని ప్రభుత్వం తెలిపింది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు మొత్తం పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినప్పుడు వేరే డేటాతో అవసరం ఏమిటో తెలియదు. చంద్రబాబు తన సమీక్షలో దీని గురించి ప్రస్తావించాలి కదా!. ఎప్పటి నుంచి ఏ రకంగా ఈ స్కీమ్ అమలు చేసేది చెప్పాలి కదా!.
బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీలు లేదని చంద్రబాబు అంటున్నారు. జగన్ ఆ ఉద్దేశంతోనే కదా అమ్మ ఒడిని అమలు చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆర్ధిక సాయం చేసింది. జగన్ టైమ్ లో బడి మానేసినవారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పడం అసత్యమో కాదో అందరికి తెలుసు. బడి మానేసినవారందరిని స్కూల్ కు తీసుకకు రావడానికి అమ్మ ఒడి కింద 15వేల డబ్బు ఇస్తామని చెప్పారు కదా?. హామీ ప్రకారం అమ్మ ఒడి అమలు చేస్తే పిల్లలు స్కూళ్లు మానారా?.
ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయకపోయినా పిల్లలంతా స్కూళ్లకు ఎగబడుతున్నారా?. ఏమి లాజిక్ అండి. చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటివి ప్రచారం చేయగలరు.కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన జాతీయ విద్యా విధానాన్ని జగన్ అమలు చేస్తే, నానా రకాలుగా విమర్శలు చేసిన టీడీపీ ,జనసేనలు ఇప్పుడు అదే విధానాన్ని పాలో అవుతాయా? లేక వ్యతిరేకిస్తాయా?ఈ ఏడాది సకాలంలో డ్రెస్ లు,పుస్తకాలు అందలేదని అంటున్నారు. అది నిజమా?కాదా?అన్నదానిపై అదికారులను చంద్రబాబు ప్రశ్నించాలి కదా!.
ఆంగ్ల మీడియం కు వ్యతిరేకం కాదని ఒకసారి, ఇంగ్లీష్ చదివితేనే పైకి వెళతారా అని ఇంకోసారి ప్రశ్నించిన వీరు ఇప్పుడు స్పష్టమైన ఆలోచన వెల్లడిస్తారా?. జగన్ తెలుగును ఒక పాఠ్యాంశం చేసి, మిగిలిన సబ్జెక్టులను ఆంగ్లంలో బోదించడానికి,ఎవరైనా తెలుగులో చదువుతామని కోరితే వారికోసం ద్విభాష పుస్తకాలను తయారు చేయించారు. ఇప్పుడు అదే పద్దతి అనుసరిస్తారా? లేక ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు పెట్టి, మిగిలినవాటిని తెలుగులో బోధించాలన్నది చంద్రబాబు ఉద్దేశమా?. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే వివరంగా చెప్పాలి కదా!.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల టాయిలెట్ల పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యం ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోవడం మానివేశారని వార్తలు వస్తున్నాయి. టీచర్లు సకాలంలో వస్తున్నారా?లేదా? అనేదానిని చెక్ చేయడానికి ఉన్న యాప్ లను ఎత్తివేస్తామని అంటున్నారు. అది మంచిదేనా?కాదా?. ఇవేవి చర్చించకుండా ప్రభుత్వ స్కూళ్లకు రేటింగ్ ఇస్తామని, ప్రతి విద్యార్ధికి శాశ్వత నెంబర్ ఇవ్వాలని,ఇలాంటి ఏవేవో ఉబుసుపోక విషయాల గురించి ఆదేశాలు ఇస్తే ఏమి ఫలితం ఉంటుంది.
గతంలో వివిధ యాప్ ల ద్వారా పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని తీసివేశారట. అంటే కేవలం టీచర్ల సంఘాలను సంతృప్తిపరచడానికే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందా?ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఉందా?మరి పేదవారి పరిస్థితి ఏమిటి?గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు అనేవారు. ఇప్పటికీ అదే ఆయన ఉద్దేశమా?. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లపై జగన్ పూర్తి స్థాయి దృష్టి పెడితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ సీరియస్ నెస్ తో వ్యవహరించడం లేదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment