దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన చేనేతల బతుకులు గత ప్రభుత్వాల పాలనలో కునారిల్లాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేయగలిగిన నైపుణ్యం ఉన్న చేనేతలు పాలకుల ఆదరణలేక, మెతుకు దొరక్క, పస్తులతో బతుకులీడ్చలేక ప్రాణాలొదలాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. నేత వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే నేతన్నల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా వైఎస్సార్ నేతన్న నేస్తంతోపాటు నవరత్న పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి జీవం పోశాయి. తాజాగా నాలుగో విడత లబ్ధి చేకూర్చనున్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: చేనేత కుటుంబాలు స్వర్ణయుగం వైపు పయనిస్తున్నాయి. ఆకలి మరణాల నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాల ఆదరణ లేక మూలన పడేసిన మగ్గాలు మళ్లీ ఊపందుకున్నాయి. సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న చేనేతలు పూర్వవైభవం వైపు పరుగులు తీస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేతల బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రదానంగా మాధవరం, ఖాజీపేట, మైలవరం, పుల్లంపేట, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 6–7 వేల మందికి పైగా మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలను నేస్తున్నారు. అలాగే వీరు కాకుండా అనుబంధ కార్మికులు కూడా ఉన్నారు.
మూడేళ్లలో నాల్గవ దఫా నేతన్న నేస్తం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చేనేతలకు వైఎస్సార్‌నేతన్న నేస్తం అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి యేటా రూ. 24 వేల నగదు సాయం అందుతోంది. తొలి విడతలో ఎవరికైనా సాంకేతిక కారణాలతో సాయం అందకపోతే తిరిగి మళ్లీ అందజేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును ఈనెల 25న గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చేనేతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 72 వేల సాయం అందింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 2019–20లో 11,774 మందికి రూ. 28,25,76,000, 2020–21లో 10774 మందికి రూ. 25 కోట్ల 85 లక్షల,76 వేలు, 2021–22లో 8636 మందికి రూ. 19 కోట్ల,76 లక్షల,64 వేలు అందగా, 2022–23లో 9291 మందికి రూ. 22కోట్ల,29 లక్షల,84 వేలు సాయం అందనుంది.
మారిన బతుకులు: ప్రభుత్వం యేటా అందిస్తున్న రూ.24 వేలతో చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదు గుతున్నాయి. అప్పులు తెచ్చుకుని నేత ముడి సరుకులు కొనుగోలు చేసే పనిలేకుండా ఈ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుని ధీమాగా బతుకుతున్నారు.
చేనేతల జీవితాల్లో వెలుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేతల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అతలాకుతలమైన చేనేతల కుటుంబాల్లో ఈ పథకం వల్ల ఎంతో మార్పు చోటుచేసుకుంది. పథకం లబ్ధి చేకూరడంతో కష్టాలు పడుతున్న చేనేత కుటుంబాలు నేడు సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. ఇలాంటి పథకం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టలేదు.
– శ్రీరామదాసు, మాధవరం
మగ్గం చేతబట్టాం
అనాదిగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాము. గత ప్రభుత్వాల సహకారం లేక మగ్గాన్ని మూలన పడేసి వేరే వృత్తిలోకి వెళ్లి బతుకులు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేతన్న నేస్తం సాయంతో మగ్గాన్ని నేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. దానితో కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేసి వృత్తి మీదనే ఆధారపడుతున్నాం.
– సామల సుబ్రమణ్యం, మాధవరం–1
ఆర్థికంగా బలోపేతం కావాలి
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద మంజూరైన ఆర్థికసాయాన్ని గురువారం ఖాతాలకు జమ చేయనున్నాం. 9291 మంది లబ్ధిదారులకు నగదును అందించనున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా చేనేతలు బలోపేతం కావాలి.
– భీమయ్య, సహాయ సంచాలకులు, జిల్లా చేనేత జౌళిశాఖ, కడప
Comments
Please login to add a commentAdd a comment