RTC bus stands
-
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
భ్రస్టాండ్లు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘అనంత’ ఆర్టీసీ బస్టాండ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. యాజమాన్యం ఆదాయానికే ప్రాధాన్యత ఇస్తుండడంతో మౌలిక సదుపాయాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బస్టాండ్లలో ఏది కొనాలన్నా ప్రయాణికుడి జేబుకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 12 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రతి డిపోకు ఓ బస్టాండ్‌తో పాటు, 17 మండల కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో కూడేరు, కొత్తచెరువు, పెద్దవుడుగూరు, పామిడి, నల్లమాడ, వజ్రకరూరు, యాడికి, సోమందేపల్లి, తనకల్లు బస్టాండ్లు వినియోగంలో లేవు. ఊరికి దూరంగా ఉండడంతో అక్కడికి ప్రజలు వెళ్లడం లేదు. ఆర్టీసీ బస్సులు కూడా ఆయా బస్స్టేషన్లకు వెళ్లకుండా నేరుగా వచ్చేస్తుండడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లడమే మానేశారు. చాలా బస్టాండ్లు కనీసం కూర్చోవడానికి కూడా అనుకూలంగా లేవు. బస్టాండ్లలో ఏది కొనుగోలు చేయాలన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అధికారులు కేవలం ఆదాయం కోసం ఆలోచించడం తప్ప ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాలపై నిఘా, పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అధిక ధరలపై తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నా.. ఫిర్యాదు అందుకునే వారు ఎక్కడుంటారన్న విషయం స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం బస్టాండ్లలో కూడా సమాచారం అందుబాటులో ఉంచడం లేదు. ‘అనంత’ ఆధ్వానం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎటు చూసినా అపరిశుభ్రతే కన్పిస్తుంది. బస్టాండ్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లోపలికి వచ్చే ప్రాంతంలో ఉన్న హోటల్ (బెల్ట్ షాపు)లోని చెత్తనంతా రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో బస్సు లోపలికి వచ్చేటప్పుడు గాలికి చెత్తంతా ప్రయాణికులపై పడుతోంది. మరుగుదొడ్లు ఉన్నా వాటిని సరిగా వినియోగించడం లేదు. దుకాణాలదారులు అడ్డదిడ్డంగా రేట్లు వేసి దోచేస్తున్నారు. కూల్డ్రింక్స్పై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రయాణికులు ప్రశ్నిస్తే తాము నెలకు రూ. వేలకు వేలు చెల్లిస్తున్నామని, అందుకే ధరలు పెంచుతున్నామని వారు చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండి పోతున్నారు. మంచి నీరు సరిగా లేనందున డబ్బులు వెచ్చించి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా స్టేషన్ మేనేజర్, ఇతర అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మార్పీకి అమ్మడం లేదు అనంతపురం బస్టాండ్‌లో ఒక్కచోట కూడా ఎమ్మార్పీకి ఏదీ అమ్మడం లేదు. ప్రతి దానిపై రూ.5 వ్యత్యాసం ఉంటోంది. డబ్బులున్నోళ్లు కొంటారు. లేనోళ్ల పరిస్థితేంది? తప్పని పరిస్థితుల్లో కొనుక్కోవాల్సి వస్తోంది. - నారాయణరెడ్డి, చెన్నంపల్లి కంపు కొడుతుంటుంది బస్టాండుకు ఎప్పుడు వచ్చినా దుర్వాసన భరించలేకపోతున్నాం. బస్సు ఆలస్యమైతే కొద్ది సేపు కూడా కూర్చోలేకపోతున్నాం. మౌలిక సదుపాయాలు లేవు. అధికారులు పట్టించుకోవాలి. - సాంబశివమ్మ, ప్రభుత్వ ఉద్యోగి చర్యలు తీసుకుంటాం జిల్లా వ్యాప్తంగా 9 బస్టాండ్లు వినియోగంలో లేవు. ఊరికి దూరంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారస్తులు డొంకతిరుగుడు సమాధానమిస్తే ఉపేక్షించేది లేదు. టెండర్ వేసేటప్పుడు తెలియదా? - వెంకటేశ్వరరావు, ఆర్ఎం