భ్రస్టాండ్లు | Bus stands | Sakshi
Sakshi News home page

భ్రస్టాండ్లు

Published Thu, Jan 16 2014 2:46 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Bus stands

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘అనంత’ ఆర్టీసీ బస్టాండ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. యాజమాన్యం ఆదాయానికే ప్రాధాన్యత ఇస్తుండడంతో మౌలిక సదుపాయాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బస్టాండ్లలో ఏది కొనాలన్నా ప్రయాణికుడి జేబుకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 12 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రతి డిపోకు ఓ బస్టాండ్‌తో పాటు, 17 మండల కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో కూడేరు, కొత్తచెరువు, పెద్దవుడుగూరు, పామిడి, నల్లమాడ, వజ్రకరూరు, యాడికి, సోమందేపల్లి, తనకల్లు బస్టాండ్లు వినియోగంలో లేవు. ఊరికి దూరంగా ఉండడంతో అక్కడికి ప్రజలు వెళ్లడం లేదు.
 
 ఆర్టీసీ బస్సులు కూడా ఆయా బస్‌స్టేషన్లకు వెళ్లకుండా నేరుగా వచ్చేస్తుండడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లడమే మానేశారు. చాలా బస్టాండ్లు కనీసం కూర్చోవడానికి కూడా అనుకూలంగా లేవు. బస్టాండ్లలో ఏది కొనుగోలు చేయాలన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అధికారులు కేవలం ఆదాయం కోసం ఆలోచించడం తప్ప ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాలపై నిఘా, పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అధిక ధరలపై తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నా.. ఫిర్యాదు అందుకునే వారు ఎక్కడుంటారన్న విషయం స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం బస్టాండ్లలో కూడా సమాచారం అందుబాటులో ఉంచడం లేదు.
 
 ‘అనంత’ ఆధ్వానం
 జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎటు చూసినా అపరిశుభ్రతే కన్పిస్తుంది. బస్టాండ్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లోపలికి వచ్చే ప్రాంతంలో ఉన్న హోటల్ (బెల్ట్ షాపు)లోని చెత్తనంతా రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో బస్సు లోపలికి వచ్చేటప్పుడు గాలికి చెత్తంతా ప్రయాణికులపై పడుతోంది. మరుగుదొడ్లు ఉన్నా వాటిని సరిగా వినియోగించడం లేదు. దుకాణాలదారులు అడ్డదిడ్డంగా రేట్లు వేసి దోచేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌పై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రయాణికులు ప్రశ్నిస్తే తాము నెలకు రూ. వేలకు వేలు చెల్లిస్తున్నామని, అందుకే ధరలు పెంచుతున్నామని వారు చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండి పోతున్నారు. మంచి నీరు సరిగా లేనందున డబ్బులు వెచ్చించి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా స్టేషన్ మేనేజర్, ఇతర అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 ఎమ్మార్పీకి అమ్మడం లేదు
 అనంతపురం బస్టాండ్‌లో ఒక్కచోట కూడా ఎమ్మార్పీకి ఏదీ అమ్మడం లేదు. ప్రతి దానిపై రూ.5 వ్యత్యాసం ఉంటోంది. డబ్బులున్నోళ్లు కొంటారు. లేనోళ్ల పరిస్థితేంది? తప్పని పరిస్థితుల్లో కొనుక్కోవాల్సి వస్తోంది.
 - నారాయణరెడ్డి, చెన్నంపల్లి  
 
 కంపు కొడుతుంటుంది  
 బస్టాండుకు ఎప్పుడు వచ్చినా దుర్వాసన భరించలేకపోతున్నాం. బస్సు ఆలస్యమైతే కొద్ది సేపు కూడా కూర్చోలేకపోతున్నాం. మౌలిక సదుపాయాలు లేవు. అధికారులు పట్టించుకోవాలి.
 - సాంబశివమ్మ, ప్రభుత్వ ఉద్యోగి
 
 చర్యలు తీసుకుంటాం
 జిల్లా వ్యాప్తంగా 9 బస్టాండ్‌లు వినియోగంలో లేవు. ఊరికి దూరంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారస్తులు డొంకతిరుగుడు సమాధానమిస్తే ఉపేక్షించేది లేదు. టెండర్ వేసేటప్పుడు తెలియదా?   
 - వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement