అనంతపురం : వారు పేరుకు అన్నదమ్ములైనా స్నేహితుల్లా ఉండేవారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అందులో ఒకరికి ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. పిల్లలు కలసిమెలసి ఉండడం చూసి తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆనందపడేవారు. అయితే, రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పిల్లలిద్దరినీ మింగి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలి్చంది. మండలంలోని ఎంగిలి బండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనాన్ని ఎదురుగా కారు ఢీకొనడంతో అన్నదమ్ములు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాచమల్లు రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంపతులకు రాచమల్లు ద్రశేఖర్‌రెడ్డి(26),శివానందరెడ్డి(24) సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులతో కలసి వ్యవసాయం చేస్తుండగా శివానందరెడ్డి గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాగా, త్వరలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే బుధవారం గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో బాట సుంకులమ్మ జాతరకు శివానందరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వచ్చారు.
జాతరలో భోజనం చేసుకొని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎంగిలిబండ శివారులో లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి నేరుగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న రంగనాథ, చంద్రశేఖర్, రేణుక, శాంతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. బొలెరో వాహనంలో చంద్రశేఖర్‌రెడ్డి, శివానందరెడ్డిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిని సీఐ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఎంత పనిచేశావు దేవుడా..
ప్రమాద విషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలు కలసిమెలసి తిరుగుతుంటే ఎంతో సంతోషం చేవాడిని, అంతలోనే ఇంత పెద్ద శిక్ష వేశావు కదా దేవుడా అంటూ రోదించారు. తల్లి ఉమామహేశ్వరమ్మకు కుమారులు మృతి చెందిన విషయం చెప్పలేదని వారి బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment