శశికళ, రమేష్‌నాయక్ పెళ్లినాటి ఫొటో
పెళ్లి వేడుక సందడి.. తీపి జ్ఞాపకాల్లోంచి బంధువులు, ఆత్మీయులు ఇంకా బయటకురానేలేదు. పైళ్లె పట్టుమని వారం రోజులు కూడా గడవలేదు.. కట్టుకున్న భర్తతో మూడు రోజులు కలసి లేదు. ఏం కష్టమొచ్చిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఓ యువతి అయినవాళ్లను శోకంసంద్రంలోకి నెట్టింది. పెళ్లి సందడిగా జరగడంతో మొక్కు తీర్చుకుందామని తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త హతాశులయ్యారు. విగతజీవిగా పడిఉన్న కుమార్తె మృతదేహం వద్ద వారు రోదించిన తీరు కలచి వేసింది.
సాక్షి, అనంతపురం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు అనుమానస్పద స్థితిలో తనువు చాలించింది. త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. బళ్లారి జిల్లా, కూడ్లిగి తాలూకా, చిరుమనెహళ్లికి చెందిన శశికళ నగరంలోని స్థానిక ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పనిచేసేది. ఆత్మకూరు మండలం, పంపనూరు తండాకు చెందిన రమేష్‌నాయక్‌కు ఈ నెల 12న ఈమెతో వివాహం జరిగింది.
13న కొత్త దంపతులు శశికళ పుట్టింటికి వెళ్లారు. ఈ నెల 14న అనంతపురం వచ్చారు. ఇల్లు ఇంకా ఎక్కడా సరిపోలేదని రెండు రోజులు శశికళను హాస్టల్‌లో ఉంచిన రమేష్‌నాయక్ 16న నాల్గవరోడ్డు సమీపంలోని ఎస్‌వీఎన్‌ఆర్ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు గాని మరుసటి రోజు అంటే 17వ తేది రాత్రి శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
భర్త ప్రవర్తనపై అనుమానాలు..
కొత్త దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి శశికళకు ఆమె భర్త రమేష్‌నాయక్‌కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శశికళ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘర్షణ జరిగిన కొద్దిసేపటికే తనను లోపలి గదిలో పెట్టి బయట తలుపులకు శశికళ తాళం వేసినట్లు రమేష్‌నాయక్ చెబుతున్నాడు. బయట వాళ్ల సాయం కోసం గట్టిగా కేకలు వేస్తే వచ్చి తలుపులు విరగ్గొట్టారని తెలిపాడు. అయితే, అపార్ట్‌మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లోకి వచ్చి తలుపులు తీసిన వారెవరో చెప్పడంలేదు.
పైగా శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ఎత్తు కోసం ఎలాంటి చైర్‌గాని ఉపయోగించలేదు. దీంతో రమేష్‌పై బాధిత కుటుంబ సభ్యులకు మరింత అనుమానం పెరుగుతోంది. ఇంత జరిగినా శశికళ కుటుంబ సభ్యులకు ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 11 గంటల సమయంలో ఫోన్ చేసి మీ పాప ఉరివేసుకుంది, కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో శశికళ చనిపోయిందని తెలిపాడు. పోలీసులకు కూడా ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
హతమార్చాడని బంధువుల ఆరోపణ
రమేష్‌నాయక్ వ్యవహారంపై శశికళకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి మరొకరితో సంబంధాలున్నాయిన ,ఈ విషయం శశికళకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను హతమార్చి ఉండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కన్నీరు మున్నీరైన కన్నవారు..
నాలుగు రోజుల క్రితం నవ్వుతూ అత్తారింటికి వెళ్లొస్తానని చెప్పిన కూతురుని గుర్తు చేసుకుని తండ్రి ఠాగూర్‌నాయక్ రోదించిన తీరు అందరిని కలచి వేసింది. ఠాగూరునాయక్‌ది అతి పెద్ద కుటుంబం. ఏడుగురు అన్నదమ్ములు. అంతా కలసే ఉంటున్నారు. ఠాగూర్‌నాయక్‌కి ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అందరిలో చిన్నదైన శశికళంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. తిరుమల వెంకన్న స్వామి దయతో చిన్నబిడ్డ పెళ్లి కూడా బాగా జరిపించానని సంబరపడ్డానని తెలిపారు. నా బాధ్యతలు సంతృప్తిగా తీర్చుకోవడానికి తిరుమల వెంకటేశ్వరస్వామి దయే కారణమని, ఈక్రమంలో మొక్కు తీర్చుకునేందుకు 16వ తేదీ భార్య జయబాయితో కలిసి వెళ్లానని, తీరా ఉదయం ఫోన్ వస్తే తిరుమల నుంచి ఇటే అనంతకు చేరుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు.
అక్కకు బంగారం ఇద్దామని..
శనివారం ఉదయం శశికళ తమ్ముడు వైద్య విద్యార్థి విశ్వనాథ్‌నాయక్ అనంతపురం రావాల్సి ఉంది. ఈ విషయంపై నిన్న అక్కతో మాట్లాడాను. రేపు మా ఇంటికి వస్తావా? అని అక్క పిలిచింది. ఉదయాన్నే అక్కబావల వద్దకు వెళ్లాలని ఎంతో సంతోష పడ్డాను. ఇంతలో ఇలా జరిగిపోయిందంటూ సోదరుడు గుండెలవిసేలా రోదించాడు.
కేసు నమోదు: నవ వధువు ఆత్మహత్య సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బిడ్డ చావుకు అల్లుడే కారణమని బాధితు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment