అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్‌ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం | Private engineering college principal murdered in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్‌ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం

Published Mon, Mar 11 2024 12:01 PM | Last Updated on Mon, Mar 11 2024 3:51 PM

Private engineering college principal murdered in Anantapur - Sakshi

మాజీ ప్రిన్సిపల్ హత్యతో ఉలిక్కిపడిన అనంతపురం

మేనల్లుడి చేతిలో హత్యకు గురైన ఎస్కే వర్సిటీ మాజీ ప్రిన్సిపల్

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి

అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్‌టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...

అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. 

భార్య కళ్లెదుటే దారుణం..
మూర్తిరావుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్‌ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.

అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.

హతుడి పక్కనే కూర్చొని..
మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

వివాదరహితుడు
మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement