కొటేషన్ లేకుండా కొట్టేస్తున్నారు!
Published Fri, Jul 8 2016 2:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
నిబంధనలకు విరుద్ధంగా పనుల అప్పగింత
టెండర్లు లేకుండా ఇష్టారాజ్యంగా పరికరాల కొనుగోలు
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అభివృద్ధి పనుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోగా.. ఇద్దరు ఉద్యోగులకు ఏకంగా నిబంధనలు పక్కన బెట్టి రెండింతలు పదోన్నతి కట్టబెట్టారు. జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో రూ.50 వేలకు పైబడి పనులకు టెండర్ల ద్వారా చేపట్టాలని, అదీ వర్సిటీ అజమాయిషీలో నిర్వహించుకోవాలన్న నిబంధనలున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెరైక్టర్ పర్యవేక్షణలోనే అభివృద్ధి పనులు జరగాలి. కానీ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అవేమీ పట్టనట్లు అన్ని తతంగాలు నడిపేశారన్న విమర్శలున్నాయి.
ఆరు నెలల్లో అరకోటి ఖర్చు
గత ఆరు నెలల కాలంలో రూ. 54,31,000 నిధులు ఖర్చుపెట్టేశారు. పరికరాల కొనుగోలులో కనీసం కొటేషన్లు లేకుండా కొట్టేశారు. మార్కెట్‌లో దొరికే ధర కంటే రెండింతలు ఎక్కువ ధర చూపించి, వస్తువులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జేఎన్‌టీయూ కళాశాలలో పని చేసే ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లకు డీఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులు డిప్యుటేన్‌పై కట్టబెట్టారు. అయితే వీరు వర్సిటీ డెరైక్టర్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్) ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలి. కానీ వీరిద్దరూ లక్షలాది రూపాయల పనులు మంజూరు చేస్తూ, బిల్లులు చేస్తున్నారు. తమ ఛాంబర్‌కు రూ.5 లక్షలు ఖర్చుపెట్టి ఏసీలు, కంప్యూటర్లు కొనుగోలు చేసేశారు. వాటిని కూడా జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపల్ ఆమోదిస్తున్నారు. సివిల్ పనుల ప్రక్రియ, వస్తువులు కొనుగోలు అంశాలపై వర్సిటీ నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా కళాశాల అధికారులు వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి.
ప్రతి పనినీ విభజించి.. కట్టబెట్టారు ఏదైనా నిర్మాణాన్ని అత్యవసరం అయితే తప్ప విభజించి నామినేషన్ పద్ధతిపై అప్పగించరాదు. కానీ ఇప్పటి దాకా చేసిన ప్రతి పనినీ విభజించి అస్మదీయులకు కట్టబెట్టారు. రూ.2లక్షల పనులను నలుగురు, ఐదుగురికి కేటాయించారు. ఇది కూడా ఉద్యోగులే బినామీలను పెట్టి కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఒకే రోజు రూ. 3 లక్షలు ఖర్చుపెట్టి ఖరీదైన ఏసీలు కొనుగోలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్యూటీ ఇంజనీరును డిప్యూటేషన్‌పై ని యమించారు. నామినేషన్ పద్ధతిపై ఎలాంటిపనులూ కట్టబెట్టే అధికారం డీఈకి లేదని నిబంధనలున్నా ఆ యన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లక్షలాది రూపాయల పనులు చేయించారు. వీటిని నియంత్రించాల్సిన ప్రిన్సిపల్ మౌనంగా ఉంటున్నారు.
Advertisement
Advertisement