కొత్త కోర్సులకు ఎన్‌వోసీ అవసరం లేదు | Telangana High Court Stays JNTU Guidelines | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సులకు ఎన్‌వోసీ అవసరం లేదు

Published Fri, Oct 8 2021 2:27 AM | Last Updated on Fri, Oct 8 2021 2:27 AM

Telangana High Court Stays JNTU Guidelines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలన్న జేఎన్‌టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది.

ఈ మేరకు జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్‌ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్‌టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్‌ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్‌ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్‌ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్‌టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్‌ కళాశాలల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్‌వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement