సూసైడ్ నోట్ రాసి.. హాస్టల్ గదిలో ఉరేసుకుని..
అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
కళాశాల ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన
దుండిగల్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్‌లో ఉంటోంది.
రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్‌కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment