private engineering college
-
సీట్లొచ్చినా.. చేరేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పెంపును ప్రభుత్వం అడ్డుకుంటే, కాలేజీలే సీట్లు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. క్లాసులు కూడా మొదలయ్యాయి. విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా ఇతర రాష్ట్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పెరిగే దాదాపు 3 వేల సీట్లు ఎలా భర్తీ అవుతాయనేది అర్థం కావడం లేదు. కోర్టు తీర్పు రాగానే ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాయి. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నాయి. విద్యాజ్యోతి కాలేజీలో 120 సీట్లు పెరిగితే 15 మంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరారు. మిగతా మూడు కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత మేర జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీట్ల పెంపును అడ్డుకునేందుకు ప్రభుత్వం.. ఎలాగైనా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు న్యాయపోరాటానికీ వెనుకాడటం లేదు.వచ్చే ఏడాదిపైనే ఆశడిమాండ్ లేని ఇతర కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. అనుమతులూ తెచ్చుకున్నాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడం, వివాదం కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఆలస్యంగా తీర్పు వచ్చినా ప్రైవేటు కాలేజీలు సీట్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. కాలేజీలు ఈ సంవత్సరాన్నే దృష్టిలో పెట్టుకోలేదు.ఇప్పుడు సీట్లు పెరిగితే, వచ్చే ఏడాదీ ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రవేశాలు కాకున్నా, కంప్యూటర్ సీట్లు కావడం వల్ల వచ్చే ఏడాది అన్నీ భర్తీ అయ్యే వీలుంది. ఒక్కో బ్రాంచీలో 120 సీట్లు ఉంటే, మేనేజ్మెంట్ కోటా కింద దాదాపు 33 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక్కో సీటు రూ.16 లక్షలపైనే పలుకుతుంది. డిప్లొమా కోర్సుల ద్వారా రెండో ఏడాదిలోనూ ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఇందులోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచుకునే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కాలేజీలు సిద్ధపడుతున్నాయి.ప్రభుత్వం పట్టుదల ఎందుకు?హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్పాట్ ద్వారా చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. సీట్ల పెంపును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ దిశగా వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ విషయం కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సీట్ల పెంపును అనుమతిస్తే, భవిష్యత్‌లో ప్రతీ కాలేజీ సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకునే ప్రమాదం ఉందని, సీఎస్ఈ దాని అనుబంధ కోర్సులే ఉండే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ పోరాడుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.ఇది ప్రభుత్వం కక్షేమౌలిక వసతులన్నీ ఉండటం వల్లే సీట్ల పెంపును కోరాం. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ అనుమతించింది. కోర్టు కూడా పెంచుకోవచ్చని తెలిపింది. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. విద్యారంగంలోకి రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదు. సీఎస్ఈ సీట్ల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీట్లు లేకుండా చేయడం సమంజసం కాదు. - సూర్యదేవర నీలిమ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకురాలు) -
‘మేనేజ్’ చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతవిద్య అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలిసింది. దీని ఆధారంగా సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎంఓ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సహా అన్ని యూనివర్సిటీల వీసీలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో సీట్ల అమ్మకాలపైనా ఆరా తీశారు. ఆ తర్వాతే వర్సిటీల ప్రక్షా ళన దిశగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా తనిఖీలుండాల్సిందే... ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేస్తారు. ఇవి ప్రతీ కాలేజీకి వెళతాయి. అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల పరిస్థితిని సమీక్షిస్తాయి. ఈ వ్యవహారం మొత్తం నామమాత్రంగానే సాగుతోందనే ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. చాలా కాలేజీల్లో మౌలిక వసతులు లేకున్నా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎంఓ ఆదేశించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో వీసీలనే కాకుండా, ఇతర అధికారులను కూడా భాగస్వామ్యం చేసే ఆలోచననలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి గత ఏడాది రాష్ట్రంలో 14 వేల వరకూ కంప్యూటర్ దాని అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు పెరిగాయి. సీఎస్సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచ్‌లలో సీట్లను యాజమాన్యాలు రూ.12 నుంచి రూ.18 లక్షల వరకూ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చా యి. ఉన్నత విద్యామండలికి కూడా ఇలాంటి ఫిర్యాదులు 145 వరకూ వచ్చాయి. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయమై సీఎంఓ ఆరా తీసింది. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు వీటిని పక్కన బెట్టడంపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటేనే అఫ్లియేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికా రులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏమేర పెంచాలనే దిశగా అధికారులు చర్చించారు. ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) సమీక్షిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి, కాలేజీల ప్రతిపాదనలు స్వీకరించింది. గడచిన మూడేళ్లలో మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల వల్ల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రైవేటు కాలేజీలు ఆడిట్ రిపోర్టులు సమరి్పంచాయి. అయితే, కాలేజీలు సూచించిన స్థాయిలో ఫీజుల పెంపు సరికాదన్న వాదన ప్రభుత్వ వర్గాల నుంచి విని్పస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజులపై సలహాలు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక అంశాలను చర్చించింది. త్వరలో అన్ని విషయాలపైనా సమగ్రంగా చర్చించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఫీజుల పెంపు దిశగా ప్రవేశాలు, నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఫీజుకు దాదాపు 15 శాతం పెంపునకు ఎఫ్ఆర్సీ అంగీకరించినట్టు కాలేజీల యాజమాన్యాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంనుంచి పెంచిన ఫీజులు అమలులోకి వచ్చే అవకాశముంది. 2019లో నిర్ధారించిన ఇంజనీరింగ్ ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంపు కోసం ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన ఆడిట్ రిపోర్టులపై ఎఫ్ఆర్సీ పరిశీలన తుదిదశకు చేరుకుంది. గత మూడేళ్లలో మౌలిక సదుపాయాల కోసం వెచ్చించిన మొత్తం, విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజులు, ఇంకా ఎంత లోటు ఉంటుందనే వివరాలను కాలేజీ యాజమాన్యాలు ఎఫ్ఆర్సీ ముందుంచాయి. కోవిడ్ వల్ల కాలేజీలు పూర్తిస్థాయిలో తెరవకపోయినా ఖర్చును మాత్రం పెంపునకు సరిపడా చూపించాయి. కంప్యూటర్ కోర్సులతో ఖర్చు మూడేళ్లుగా విద్యార్థులు 95.56 శాతం కంప్యూటర్, అనుబంధ కోర్సులనే ఎంచుకున్నారని ఎక్కువ కాలేజీలు ఎఫ్ఆర్సీ ముందు పేర్కొన్నాయి. గతేడాది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో ఆయా కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. ఈ కోర్సులకు అదనంగా అప్లికేషన్స్, కంప్యూటర్స్, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాల్సి వచ్చిందని, వీటికి అదనంగా ఖర్చు చేశామని చెబుతున్నాయి. సైన్స్ గ్రూపుల ఫ్యాకల్టీకి కూడా అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నాయి. ప్రస్తుతం ఫీజులు రూ.35 వేల నుంచి 1.40 లక్షల వరకూ ఉన్నాయి. కాలేజీలు 25 శాతం మేర ఫీజులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. అయితే, కనీసం 10 నుంచి 15 శాతం పెంపు అనివార్యమనే వాదన ఎఫ్ఆర్సీ వర్గాల నుంచి విన్పిస్తోంది. ఇదో మాయాజాలం కొత్త కోర్సులను అడ్డుపెట్టుకుని ప్రైవేటు కాలేజీలు మరోసారి ఫీజుల మాయాజాలానికి తెరలేపుతున్నాయి. కంప్యూటర్ కోర్సుల బోధనకు అవసరమైన నైపుణ్యం గల ఫ్యాకల్టీ లేదని ప్రభుత్వ కమిటీనే పేర్కొంది. . డబ్బుల కోసం కాలేజీలు చేస్తున్న వాదన పేదలకు నష్టం చేస్తుంది. ఫీజుల నియంత్రణ కమిటీ జోక్యం చేసుకుని, వాస్తవాలు పరిశీలించాలి. అడ్డగోలుగా ఫీజులు పెంచితే విద్యార్థిలోకం ఆందోళన చేపట్టడం మినహా మరోమార్గం లేదు. –టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవి బోగస్ రిపోర్టులు ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టుల్లో విశ్వసనీయత లేదు. నిర్వహణ ఖర్చులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి, జేఎన్టీయూ, ఎఫ్ఆర్సీకి వేర్వేరు నివేదికలకు ఇస్తున్నాయి. 2019లో పెంచిన ఫీజులకు అనుగుణంగా ఫ్యాకల్టీకి చాలా కాలేజీలు వేతనాలు ఇవ్వడం లేదు. కరోనా కాలంలో మెజారిటీ కాలేజీలు 50 శాతం జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఫీజులపెంపుపై నిర్ణయం తీసుకోవాలి. –అయినేని సంతోష్ కుమార్, టీఎస్టీసీఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు -
ఫేక్ పీహెచ్డీ ఫ్యాకల్టీలదే హవా!
సాక్షి, కాకినాడ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో నకిలీ పీహెచ్‌డీలతో విద్యాబోధన యథేచ్ఛగా కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్టీయూ (కాకినాడ) వర్సిటీ ఏపీలోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 180 అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే పీహెచ్డీ తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలల్లో నియమిస్తే నెలకు రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఇవ్వాలి. ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతానికి వచ్చే ఫేక్ పీహెచ్డీ అభ్యర్థులకు రూ.40 వేల వరకు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎక్కడివీ ఫేక్ పీహెచ్‌డీలు.. కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని వర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని నకిలీ పీహెచ్డీ పట్టా తెచ్చుకుంటున్నారు. తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. వారు సైతం ఖర్చు తక్కువ అవుతుందని భావించి.. అతి తక్కువ జీతాలిస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారు. కీలక ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అనుభవం లేని నకిలీ అధ్యాపకులు పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమావిలా మారింది. నిద్రమత్తులో వర్సిటీ యంత్రాంగం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ పీహెచ్‌డీలపై దృష్టి సారించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో మచ్చుకు కొన్ని.. రాష్ట్రంలో నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు, నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే తంతు సాగుతోంది. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారని తెలుస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో కళాశాలల్లో పనిచేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిజనిర్ధారణ కమిటీలు తనిఖీ సైతం నిర్వహించాయి. – డాక్టర్ సుమలత, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(కే) ఫేక్ పీహెచ్‌డీలను గుర్తించాలి.. నకిలీ పీహెచ్డీ అభ్యర్థులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు పీహెచ్డీ పూర్తి చేసిన వారి డేటా వర్సిటీ వెబ్సైట్లలో ఉంచుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా పాటిస్తే పారదర్శకత పెరుగుతుంది. –డాక్టర్ జ్యోతిలాల్ నాయక్, విద్యావేత్త -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 91,607
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో కలిపి 91,607 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది. బీ ఫార్మసీ సీట్లు 4,550 ఉన్నట్టు వెల్లడించింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 141 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు, 71 ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బీటెక్ సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో.. ఆయా కాలేజీలు, సీట్ల వివరాలను ప్రకటించింది. ►బీ ఫార్మసీకి సంబంధించి.. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు వర్సిటీల పరిధిలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఈ వర్సిటీల అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలు 109 ఉండగా.. వాటిలో 4,470 సీట్లు ఉన్నాయి. ఇందులో 3,130 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ►ఫార్మాడీ కోర్సులో వర్సిటీల అనుబంధ గుర్తింపు పొంది న కాలేజీలు 53కాగా.. వాటిల్లో 741 సీట్లు ఉన్నాయి. ఇందులో 520 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. -
ఇదీ సంగతి: అర్హతలేని అధ్యాపకులు... అనుభవం లేని ప్రిన్సిపాళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 90 శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని గుర్తించినట్లు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ–హెచ్) వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కాలేజీలకు ఈసారి గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనల అమలు కచ్చితంగా పాటించడం సాధ్యం కాదని, ఈసారికి మినహాయింపు ఇవ్వాలంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ–హెచ్ అఫిలియేషన్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయితేనే ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. కమిటీ తేల్చిందేంటి? రాష్ట్రవ్యాప్తంగా 148 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 955 కోర్సులను నిర్వహిస్తున్నారు. 2021–22 లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో 89,400 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వాటన్నింటికీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ–హెచ్ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్థితిగతులు తెలుసుకొనేందుకు ఎంసెట్ నిర్వహణకు ముందే జేఎన్టీయూ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలను సేకరించింది. జేఎన్టీయూ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయాలు ఇవీ... ►రాష్ట్రంలోని 90 శాతం కాలేజీల్లో మౌలిక వసతుల లేమి కనిపించింది. సీఎస్ఈ కోర్సులకు కీలకమైన ఆధునిక కంప్యూటర్లు లేవు. అవసరమైన సాఫ్ట్వేర్ సైతం అందుబాటులో లేదు. కొన్ని కాలేజీల్లో ఇంకా కాలం చెల్లిన కంప్యూటర్లే కనిపించాయి. ►అనుభవం లేని అధ్యాపకులు, అర్హతల్లేని ప్రిన్సిపాళ్లతో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ►చాలా కాలేజీలు అధికారికంగా చూపించే ఫ్యాకల్టీ అధ్యాపకులు కనిపించలేదు. ►దాదాపు ఐదేళ్లుగా పేరున్న ఒక్క కంపెనీ కూడా ఆయా కాలేజీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిన దాఖలాల్లేవు. ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి... ►కాలేజీ ప్రిన్సిపాల్ పీహెచ్డీ చేసి ఉండాలి. కనీసం 15 ఏళ్ల అధ్యాపక అనుభవం కలిగి ఉండాలి. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శిగా పనిచేసి ఉండాలి. ►సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు తప్పనిసరిగా పీహెచ్డీ చేసి ఉండాలి. ఇది లేనప్పుడు నెట్, స్లెట్.. ఏదో ఒకటి చేసుండాలి. ►కాలేజీలు ఎంపిక చేసే అధ్యాపకులను అఫిలియేషన్ ఇచ్చే యూనివర్సిటీ పరిశీలించి, ఆమోదించాలి. బోధించే అర్హతలున్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే గుర్తింపు ఇవ్వాలి. -
ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
పెనుబల్లి: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుప్పెనకుంట్లకి చెందిన కావటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన బొల్లెద్దు నితిన్ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా (ఈసీఈ) చదువుతూ ప్రేమలో పడ్డారు. తేజస్విని ఫైనలియర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుకుంటోంది. నితిన్ ఖమ్మంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. తేజస్విని వారి బంధువుల అబ్బాయితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఫోన్లో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో నితిన్ కుప్పెనకుంట్లకు ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్లాడు. మాట్లాడేందుకు బయటకు రావాలని తేజస్వినికి ఫోన్లో మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె అతడి బైక్‌పై వెళ్లింది. కుక్కలగుట్ట వద్దకు చేరుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై గొడవ జరిగింది. నితిన్ తన వద్ద ఉన్న కర్చీఫ్‌ను తేజస్విని మెడకు బిగించి హత్య చేశాడు. ఆమెను పెట్రోల్ పోసి కాల్చి వేయాలని భావించాడు. అయితే, సంఘటనా స్థలం రాష్ట్రీయ రహదారికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం.. లారీలు, బస్సులు తిరుగుతుండటంతో భయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. కాగా.. తమ కూతురు కనిపించడం లేదని తేజస్విని తండ్రి సత్యనారాయణ వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నితిన్‌ను మంగళవారం ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. -
చట్నీలో ఎలుక, తాగునీటిలో కప్ప
అన్నానగర్: చెన్నై సమీపంలో సోమవారం ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల క్యాంటిన్ ఆహారంలో ఎలుక, తాగునీటి తొట్టెలో కప్ప ఉండడంతో విద్యార్థులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. చెన్నై సమీపం సెమ్మంజేరిలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ ఉంది. ఇక్కడ రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో పాటూ ఇతర రాష్ట్రాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్థితిలో సోమవారం ఆహారం తినేందుకు విద్యార్థులు కళా శాల క్యాంటిన్‌కి వెళ్లారు. అక్కడ గిన్నెలో ఉంచిన కొబ్బరి చట్నీలో ఎలుక ప్రాణాలతో తిరుగుతూ ఉంది. ఇది చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతి చెం దారు. అక్కడున్న క్యాంటీన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తరువాత అనుమానంతో అక్కడున్న తాగునీటి ట్యాంక్‌ను తెరచి చూడగా అందులో కప్ప ఉంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కళాశా ల నిర్వాహకులు వచ్చి విద్యార్థులతో చర్చలు జరి పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంటిన్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. -
ఇంజి'నీరుగారొద్దు'..
♦ కోరుకున్న విద్య కొరివవుతున్నవైనం ♦ పట్టాపై ఉన్న శ్రద్ధ పట్టుపై కరువు ♦ బోధనలోనూ నాణ్యత కరువు ♦ ప్రావీణ్యం ఉంటే ప్రాభవం మీదే.. పెద్దయ్యాకా ఏమవుతావురా? అని చిన్నపిల్లాడినడిగితే టక్కున చెప్పే సమాధానం ‘ఇంజినీరునవుతా’. గుర్తింపు, సంపాదన పుష్కలంగా ఉంటుందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ఇంజినీర్ అనే మాట బుల్లి బుర్రల్లో కూడా ఎక్కించేశారు. తీరా క్షేత్ర స్థాయిలో ఆ విద్య తీరుతెన్నులు భిన్నంగా ఉంటున్నాయన్నది వాస్తవం. ఇంజనీర్స్ డే సందర్భంగా సాంకేతిక విద్య తీరుతెన్నులపై ఓ విశ్లేషణాత్మక కథనం...– కపిలేశ్వరపురం (మండపేట) ఇంజినీర్స్ డే నేపథ్యం ఇదీ... ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఏటా ఇంజనీర్స్ డే గా నిర్వహిస్తుంటారు. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యంగల కోలార్ జిల్లాలోని ముద్దెనహళ్లి గ్రామంలో 1860 సెప్టెంబరు 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. వాస్తవానికి ఆయన పూర్వీకులు కర్నూలు జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు కావడంతో ఆయనతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉంది. ఇంజనీరింగ్ చదివిన అనంతరం ఈయన హైదరాబాద్ నగరంలోని మూసీ నదితోపాటు దేశంలోని అనేక నగరాల్లో డ్యాంలు, భవనాల రూపకల్పనలో ప్రత్యేకత కనబర్చారు. ఈయన సేవలను గుర్తిస్తూ 100వ పుట్టిన రోజున భారత ప్రభుత్వం స్టాంపును ముద్రించింది. 1955లో భారత రత్న పురస్కారం అందించింది. నిబద్ధత గల ఇంజనీర్‌గా నేటి ఇంజనీర్లకు ఈయన ఆదర్శప్రాయుడనడంలో అతిశయోక్తిలేదని చెప్పొచ్చు. ఇంజనీర్స్ డే సందర్భంగా జిల్లాలో సాంకేతిక విద్య తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న కళాశాలలు 1989 వరకూ ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే జిల్లాలో ఉండేవి. 1989 నుంచి 2006 మధ్య కాలంలో కళాశాల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడంతో ప్రస్తుతానికి 32 కళాశాలలు పెరిగాయి. కళాశాలలకు అనుమతులిచ్చిన పాలకులు విద్యార్థులకు కొలువులివ్వడంపై శ్రద్ధ చూపడంలేదన్నది నగ్న సత్యం. ఆల్ ఫ్రీ వ్యవహారంతో కొరవడిన నాణ్యత ప్రభుత్వ నిర్ణయాలు, కంపెనీల వ్యవస్థాపన సమస్యలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థిరత్వం కోల్పోయింది. బయట ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పుడు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అలాంటిప్పుడు రూ.కోట్లు ఖర్చు చేసి స్థాపించిన కళాశాలను నిర్వహించడం యాజమాన్యానికి భారంగా మారుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటును మాత్రమే ఆశించి మిగిలిన అంశాల్లో ఆల్‌ఫ్రీ అంటూ ప్రత్యేక పథకాలను యాజమాన్యం ప్రవేశపెడుతుంది. దీంతో అర్హత, ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరి భారాన్ని మోయలేక భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. కళాశాలను మూసివేయాలంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మూసివేతకు తమకు అభ్యంతరం లేదంటూ విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ తదితర అంశాలను ఏఐసీటీకి తెలియపరచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేసే కంటే ఇబ్బందులతో నెట్టుకురావడమే మేలని యాజమాన్యాలు భావించి నాణ్యత లేకుండానే కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొలువుల కల్పనపై అలసత్వం జిల్లాలోని కళాశాలలు ద్వారా ఏడాదికి సుమారు 13 వేల మంది చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వెనకబడుతుందని విశ్లేషకుల అంచనా. కాకినాడ కేంద్రంగా పనిచేస్తూ 150 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న వికాసకు ఉద్యోగావకాశాలు కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి 2,34,610 దరఖాస్తులొచ్చాయి. నిరుద్యోగులకు దక్కిన ప్రైవేటు ఉద్యోగాలు కేవలం 30,798 మాత్రమే. విద్యార్థులను కలవరపెడుతున్న కంపెనీల కలతలు: ఇంజినీరింగ్ చేసే ప్రతీ విద్యార్థి అంతిమంగా మంచి ఉద్యోగంలో చేరాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకుంటాడు. భారత ఆర్థిక వ్యవస్థలోని ఒడుదుడుకులు నేపథ్యంలో పరిశ్రమలు, ఉపాధి సంస్థలు, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దాని ప్రభావంగానే దేశీయ కార్పొరేట్ రంగంలో తరచూ తలెత్తుతున్న సంస్థాగత కలతలు చదువుకుంటున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో టాటా–మిస్త్రీ వార్, ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు, యాజమాన్యానికి మధ్య కలతలతో వారికి దక్కే అవకాశాలపై ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. పట్టా కాదు..పట్టు సాధించాలి.. ఇంజినీరింగ్ చదవాలన్న కోరిక కొలువు కల్పించదన్న విషయాన్ని నేటి విద్యార్థులు గమనించాలి. సాంకేతిక విద్యపై అవగాహన లేక ఇంటర్మీడియట్లో అధిక మార్కులు వచ్చిన వారు కూడా ఇంజినీరింగ్ కోర్సులో ఫెయిల్ అవుతున్నారు. ఉత్తీర్ణులైనా ఇంటర్వ్యూల్లో నెగ్గుకురాలేకపోతున్నారు. సబ్జెక్టుపై పట్టు లేకపోతే చుక్కాని లేని నావలా జీవితం ఉంటుందని గుర్తించాలి. పట్టా ఎంత ముఖ్యమో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విషయంపై పట్టు సాధించడం మరెంతో ముఖ్యమని గ్రహించాలి. పరీక్షల ముందు మాత్రమే సమయం కేటాయించి బట్టీ పట్టే విధానం సరికాదు. చదవడం, అధ్యాపకుల నుంచి సమగ్రతను పొందడం, ఆ పై విశ్లేషణ చేయడం, సెమినార్ల్లలో ప్రెజెంటేషన్ ఇవ్వడం విద్యార్థికి అలవాటుగా ఉండాలి. సాంకేతిక విద్యా సంస్థలు ఇవీ.. జిల్లాలో జేఎన్టీయూకేకు అనుబంధంగా 32 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వివిధ శాఖల ద్వారా ఏటా 12వేల సీట్లకు ఎంసెట్ నిర్వహించి భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావిత విద్యా సంవత్సరమైన 2016లో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 16,535 మంది పరీక్ష రాయగా 11,067 మంది అర్హత సంపాదించినప్పటికీ 7,400 మంది మాత్రమే కోర్సుల్లో చేరారు. 2017లో 12 వేల సీట్ల్లకు 7,440 మంది చేరడంతో 62శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 4560 సీట్లు అనగా 38 శాతం సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సుమారు 10 కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఏటా టాప్ బ్రాంచిలుగా ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్‌కు విశేష ఆదరణ ఉంటుంది. నిలకడలేని ప్రభుత్వ విధానాలతో మానసిక క్షోభ ఇంజినీరింగ్ విద్యార్థుల భవితవ్యాన్ని రాష్ట్ర ప్రభత్వ విధానాలు ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర విభజన జరగగానే కంపెనీలు వస్తాయని ఆశించిన విద్యార్థులకు నిరాశ ఎదురైంది. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలనే నమ్మలేని విధంగా ఉండడంతో కొలువుల తీరు కొరివిగా కనబడుతోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోర్సులో చేరినప్పుడు గొప్పదనుకున్న బ్రాంచి చదువు పూర్తయ్యాకా తీసికట్టుగా మారుతున్న వైనాన్ని తల్లిదండ్రులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేషనల్ విద్యార్థికి లైబ్రరీయే అమ్మ ఒడి.. నేటి విద్యార్థులు వినోద కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తాను చేరింది వృత్తివిద్యా కోర్సు అని అధిక సమయం పుస్తకాలతో సావాసం చేయాలన్న సంగతిని మర్చిపోయి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వృత్తి విద్యా కోర్సు విద్యార్థికి లైబ్రరీ అమ్మ ఒడిలాంటిదని గుర్తించాలి. చదువు పూర్తిచేసి బయటకు వచ్చిన తర్వాత లైబ్రరీలోని విలువైన పుస్తకాలను చదువుదామన్నా అందుబాటులో ఉండవు. కొందామన్న ఆర్థిక భారాన్ని మోయలేమని గుర్తించాలి. సాధ్యమైనంత సమయాన్ని లైబ్రరీలో గడపాలి. ఆంగ్లంలో ఆరితేరాలి.. భాషాపరమైన నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని విద్యార్థులు గుర్తించాలి. చదివిన చదువు మార్కులను మాత్రమే ప్రతిబింబిస్తే సరిపోదు. నైపుణ్యంపై నడిపించేలా ఉండాలి. పని ప్రదేశంలో ఆంగ్లానికి ప్రాధాన్యమిస్తారు. ఆంగ్ల దినపత్రికలను మొదటి సంవత్సరం నుంచే చదవనారంభించాలి. అవకాశమొస్తే మొహమాటం పడకుండా సెమినార్లలో మాట్లాడుతుండాలి. -
వారు ఇంజనీరింగ్ పాఠాలు చెప్పొచ్చు
ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులకు ఏఐసీటీఈ ఊరట విజయవాడ (గుణదల): ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత ఉన్నవారు ఇంజనీరింగ్ పాఠాలు బోధించవచ్చని జాతీయ సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సోమవారం ప్రకటించింది. ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్హత ఉన్నవారికి ఇంజనీరింగ్ చదువులు బోధించే సామర్థ్యం లేదని ఈ ఏడాది జనవరి 6న ఏఐసీటీఈ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఇంజనీరింగ్ కళాశాలల ఫ్యాకల్టీ అసోసియేషన్ వినతిపత్రం సమర్పించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆయా విద్యార్హత కలిగిన ఫ్యాక ల్టీలు రోడ్డున పడతారని ఆమె దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీటీఈ సమావేశం.. ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఇంజనీరింగ్ పాఠాలు బోధించవచ్చని తీర్మానిస్తూ వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపరిచింది. -
లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపు
మే నెలలో 4వ విడత తనిఖీలు ఉప ముఖ్యమంత్రి కడియం స్పష్టీకరణ హైదరాబాద్: రాష్ట్రంలోని 288 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన వసతులపై మే నెలలో నాలుగో విడత తనిఖీలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మూడు విడతల తనిఖీల అనంతరం గుర్తింపు (అఫిలియేషన్) కోల్పోయిన 163 కళాశాలలు నాలుగో విడత తనిఖీల నాటికి లోపాలు సరిదిద్దుకుంటే గుర్తింపును పునరుద్ధరిస్తామన్నారు. నాలుగో విడత తనిఖీల ఆధారంగానే కళాశాలల్లో 2015-16కు సంబంధించి ప్రవేశాలు, గుర్తింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. శనివారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. సదస్సు వేదిక మారియట్ హోటల్ బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల గుర్తింపు కోల్పోయిన 163 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి గుర్తింపు పొడిగింపు లభించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఏఐసీటీఈ అనుమతి లభిస్తే వర్సిటీల గుర్తింపునకు హక్కు కల్పించినట్లు కాదన్నారు. ఇది పూర్తిగా విశ్వవిద్యాలయాల పరిధిలోని అంశమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐఐటీహెచ్, బిట్స్ పిలానీ, నీట్ సంస్థల నిపుణులతో నిర్వహించిన మూడో విడత తనిఖీల నివేదికలను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థుల కోసమేనని, ప్రైవేటు కాలేజీల మనుగడ కోసం కాదన్నారు. 2014-15లో ప్రవేశాలు పొందిన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. గుర్తింపు రద్దయిన 163 కాలేజీల్లో ప్రవేశాలు పొంది న ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో జేఎన్టీయూ-హెచ్ లేదని, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్రీ జోన్ పరిధిలోకి రావన్నారు. ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సవరణలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని వర్సిటీలకు శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమిస్తామన్నారు. 5 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు రాష్ట్రంలోని 5 వర్సిటీలకు ప్రభుత్వం ఇన్చార్జ్ వీసీ లను నియమించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్లను ఇన్చార్జ్ వీసీలుగా నియమించారు. పాలమూరు, శాతవాహన, తెలుగు వర్సిటీలకు పాతవారినే కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
హైకోర్టు తీర్పుతో జేఎన్టీయూహెచ్ డైలమా
గుర్తింపు కోసం యాజమాన్యాల పడిగాపులు తీర్పు ప్రతి అందాకే తదుపరి నిర్ణయమన్న రిజిస్ట్రార్ సాక్షి, సిటీబ్యూరో/మలేషియన్ టౌన్షిప్: ప్రైవేటు కళాశాలలకు అఫిలియేషన్ విషయమై హైకోర్టు వెలువరించిన తీర్పుతో జేఎన్టీయూహెచ్ అధికారులు డైలామాలో పడ్డారు. అర్హతలున్న కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని గురువారం హైదరాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లోపాలు ఉన్నాయనే నెపంతోనే 174 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిలిపివేసిన జేఎన్టీయూహెచ్కు, వీటిలో అర్హతలున్న కళాశాలలను ఎంపిక చేయడం కత్తిమీద సామే. కొన్ని కళాశాలలకు అవకాశం కల్పిస్తే.. విగినవాటితో వివాదం తప్పేలా లేదు. అలాగని.. హైకోర్టు ఆదేశాలను అమలు పరచకుంటే పరిస్థితి మరింత క్లిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎటూ తేల్చుకోలేని వైనం.. జేఎన్టీయూహెచ్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సిబ్బంది, లాబొరేటరీలు తదితర వసతులు లేవంటూ వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ నుంచి యాజమాన్యాలకు గత వారం నోటీసులు అందాయి. వీటిపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీ అఫిలియేషన్ వేటుకు గురైన 174 కళాశాలల యాజమన్యాలు.. లోపాలను సవరించుకున్నామని, తక్షణం తమకు వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని రిపోర్టు సమర్పించాయి. హైకోర్టు తీర్పు కూడా తమకు సానుకూలంగా రావడంతో.. వర్సిటీ అధికారుల అనుమతి కోసం మంగళవారం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు జేఎన్టీయూహెచ్కు వచ్చారు. సాయంత్రం వరకు వీసీ, రిజిస్ట్రార్ తమ కార్యాలయాలకు రాకపోవడంతో నేరుగా రిజిస్ట్రార్ ఇంటికే వెళ్లి కలిశారు. అయితే, హైకోర్టు తీర్పు కాపీ అడ్వకేట్ జనరల్ నుంచి తమకు ఇంకా అందలేదని, కాపీ అందాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యాలతో రిజిస్ట్రార్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై వీసీ, రిజిస్ట్రార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా వారు స్పందించలేదు. అయితే, వెబ్ కౌన్సెలింగ్‌కు కొన్ని కళాశాలలకు అనుమతి ఇచ్చి, మరికొన్నింటికి ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నారు. -
మిగిలినవి మూడే
నిజామాబాద్ అర్బన్: ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలకు ఉన్నతాధికారుల నిర్ణయం మింగుడు పడడం లేదు. సరి అయిన సౌకర్యాలు లేవంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలకు కత్తెర వేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఏడు కళాశాలల సీట్లను రద్దు చేసింది. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అయోమయంలో పడిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కేవలం మూడు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు సీట్లు లభిస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నవి ఇవే ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశాలకు జిల్లాలో అందుబాటులో ఉన్నవి మూడు కళాశాలలే. మాక్లూర్ మండలం మానిక్భండార్లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లో విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలకు మాత్రమే జేఎన్టీయూ అనుమతినిచ్చింది. అసౌకర్యాల నేపథ్యంలో జిల్లాలోని ఏడు కళాశాలలకు అనుమతి నిరాకరించింది. ఇందులో సుధీర్‌రెడ్డి, జ్ఞానసర స్వ తి, ఎస్ఆర్ఐటీ, విజయ్ మహిళ, వీట్, తిరుమల, ఆర్.కె. కళాశాలలు ఉన్నాయి దీంతో భారీగా సీట్లు తగ్గిపోయాయి. జిల్లాలో 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా 3,0 60 సీట్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 1,060 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ‘రెండో’ విడత వరకు అయినా అనుమతి వస్తుందా! జిల్లావ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వీరికి సీట్ల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా విద్యార్థినుల కోసం కిట్స్ మహిళా కళాశాల మాత్రమే అందుబాటులో ఉంది. బోధన్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాలో కొనసాగుతోంది. మిగిలిన కళాశాలలు జేఎన్టీయూ పరిధిలో ఉన్నాయి. అనుమతి కోల్పోయిన కళాశాలలు తగు సౌకర్యాలను కల్పించి, రెండవ దఫా కౌన్సెలింగ్ వరకు అనుమతి పొందే అవకాశం ఉంది. దీనికొరకు ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మూడు కళాశాలలే అందుబాటులో ఉన్నాయి. క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఏజీఆర్, సీఐవీ, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి. మహిళా కిట్స్ కళాశాలలో సీఐవీ, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీలు ఉన్నాయి. వీఆర్సీలో సీఐవీ, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచీలు ఉన్నాయి. -
ఉన్నత చదువులకు వెళ్లి అనంతలోకాలకు...
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: మండలంలోని కోరుట్లపేటకు చెందిన తాడ సంధ్యారాణి (20) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె ఉదయం కళాశాలకు వెళ్లింది. అనంతరం కళాశాల భవనం నాలుగో అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంధ్యారాణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. సంధ్యారాణి తండ్రి మల్లారెడ్డి ఆమె చిన్నతనంలోనే మృతిచెందాడు. మృతురాలికి సోదరుడు మహేందర్ ఉండగా తల్లి శోభారాణి ఇద్దరు పిల్లలను కూలి పనులు చేస్తూ పోషించుకుంది. కొడుకును చదివించిన ఇంటర్ వరకు తల్లి కూతురును మాత్రం కష్టపడుతూ ఉన్నత చదువులు చదివిస్తోంది. పదో తరగతి బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సంధ్యారాణి అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కూతురు చదువును మధ్యలో ఆపకుండా అప్పులు చేస్తూ ఉన్నత చదువులకోసం సంధ్యారాణిని ఆమె తల్లి హైదరాబాద్‌కు పంపించింది. ఇంటర్ పూర్తయిన తరువాత ఆమె జనరల్ కౌన్సిలింగ్లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజురియింబర్స్‌మెంట్ కింద సీటు సంపాదించింది. ఇంకో రెండేళ్లలో ఉన్నత చదువు పూర్తయి కూతురు మంచి ఉద్యోగం సంపాదిస్తుందని ఆశించిన ఆ తల్లికి దుఃఖమే మిగిలింది. అయితే సంధ్యారాణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఫీజురియింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజమాన్యం సంధ్యారాణిని ఫీజుకోసం వేధించడంతోనే ఈ అఘాహిత్యానికి పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంధ్యారాణి మృతి వారి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. సంధ్యారాణి మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు సర్పంచ్ మౌలోజి సింహాద్రి, మాజీ సర్పంచ్ సుధాకర్‌రావు హైదరాబాద్‌కు వెళ్లారు.