
పెనుబల్లి: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుప్పెనకుంట్లకి చెందిన కావటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన బొల్లెద్దు నితిన్ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా (ఈసీఈ) చదువుతూ ప్రేమలో పడ్డారు. తేజస్విని ఫైనలియర్‌లో 3 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుకుంటోంది. నితిన్ ఖమ్మంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. తేజస్విని వారి బంధువుల అబ్బాయితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఫోన్‌లో తరచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో నితిన్ కుప్పెనకుంట్లకు ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్లాడు. మాట్లాడేందుకు బయటకు రావాలని తేజస్వినికి ఫోన్‌లో మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె అతడి బైక్‌పై వెళ్లింది. కుక్కలగుట్ట వద్దకు చేరుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై గొడవ జరిగింది. నితిన్ తన వద్ద ఉన్న కర్చీఫ్‌ను తేజస్విని మెడకు బిగించి హత్య చేశాడు. ఆమెను పెట్రోల్ పోసి కాల్చి వేయాలని భావించాడు. అయితే, సంఘటనా స్థలం రాష్ట్రీయ రహదారికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం.. లారీలు, బస్సులు తిరుగుతుండటంతో భయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. కాగా.. తమ కూతురు కనిపించడం లేదని తేజస్విని తండ్రి సత్యనారాయణ వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నితిన్‌ను మంగళవారం ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment