ఇంజి'నీరుగారొద్దు'.. | engineers day special story | Sakshi
Sakshi News home page

ఇంజి'నీరుగారొద్దు'..

Published Fri, Sep 15 2017 9:24 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

ఇంజి'నీరుగారొద్దు'..

ఇంజి'నీరుగారొద్దు'..

కోరుకున్న విద్య కొరివవుతున్నవైనం  
పట్టాపై ఉన్న శ్రద్ధ పట్టుపై కరువు
బోధనలోనూ నాణ్యత కరువు     
ప్రావీణ్యం ఉంటే ప్రాభవం మీదే..


పెద్దయ్యాకా ఏమవుతావురా? అని చిన్నపిల్లాడినడిగితే టక్కున చెప్పే సమాధానం ‘ఇంజినీరునవుతా’. గుర్తింపు, సంపాదన పుష్కలంగా ఉంటుందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ఇంజినీర్‌ అనే మాట బుల్లి బుర్రల్లో కూడా ఎక్కించేశారు. తీరా క్షేత్ర స్థాయిలో ఆ విద్య తీరుతెన్నులు భిన్నంగా ఉంటున్నాయన్నది వాస్తవం. ఇంజనీర్స్‌ డే సందర్భంగా సాంకేతిక విద్య తీరుతెన్నులపై ఓ విశ్లేషణాత్మక కథనం...– కపిలేశ్వరపురం (మండపేట)

ఇంజినీర్స్‌ డే నేపథ్యం ఇదీ...
ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఏటా ఇంజనీర్స్‌ డే గా నిర్వహిస్తుంటారు. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యంగల కోలార్‌ జిల్లాలోని ముద్దెనహళ్లి గ్రామంలో 1860 సెప్టెంబరు 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. వాస్తవానికి ఆయన పూర్వీకులు కర్నూలు జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు కావడంతో ఆయనతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉంది. ఇంజనీరింగ్‌ చదివిన అనంతరం ఈయన హైదరాబాద్‌ నగరంలోని మూసీ నదితోపాటు దేశంలోని అనేక నగరాల్లో డ్యాంలు, భవనాల రూపకల్పనలో ప్రత్యేకత కనబర్చారు. ఈయన సేవలను గుర్తిస్తూ 100వ పుట్టిన రోజున భారత ప్రభుత్వం స్టాంపును ముద్రించింది. 1955లో భారత రత్న పురస్కారం అందించింది. నిబద్ధత గల ఇంజనీర్‌గా నేటి ఇంజనీర్లకు ఈయన ఆదర్శప్రాయుడనడంలో అతిశయోక్తిలేదని చెప్పొచ్చు. ఇంజనీర్స్‌ డే సందర్భంగా జిల్లాలో సాంకేతిక విద్య తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.

పుట్టగొడుగుల్లా పెరుగుతున్న కళాశాలలు
1989 వరకూ ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు మాత్రమే జిల్లాలో ఉండేవి. 1989 నుంచి 2006 మధ్య కాలంలో కళాశాల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడంతో ప్రస్తుతానికి 32 కళాశాలలు పెరిగాయి. కళాశాలలకు అనుమతులిచ్చిన పాలకులు విద్యార్థులకు కొలువులివ్వడంపై శ్రద్ధ చూపడంలేదన్నది నగ్న సత్యం.

ఆల్‌ ఫ్రీ వ్యవహారంతో కొరవడిన నాణ్యత
ప్రభుత్వ నిర్ణయాలు, కంపెనీల వ్యవస్థాపన సమస్యలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థిరత్వం కోల్పోయింది. బయట ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పుడు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అలాంటిప్పుడు రూ.కోట్లు ఖర్చు చేసి స్థాపించిన కళాశాలను నిర్వహించడం యాజమాన్యానికి భారంగా మారుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటును మాత్రమే ఆశించి మిగిలిన అంశాల్లో ఆల్‌ఫ్రీ అంటూ ప్రత్యేక  పథకాలను యాజమాన్యం ప్రవేశపెడుతుంది. దీంతో అర్హత, ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరి భారాన్ని మోయలేక భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. కళాశాలను  మూసివేయాలంటే  ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మూసివేతకు తమకు అభ్యంతరం లేదంటూ విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ తదితర అంశాలను ఏఐసీటీకి తెలియపరచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేసే కంటే ఇబ్బందులతో నెట్టుకురావడమే మేలని యాజమాన్యాలు భావించి నాణ్యత లేకుండానే కళాశాలలను కొనసాగిస్తున్నారు.

కొలువుల కల్పనపై అలసత్వం
జిల్లాలోని కళాశాలలు ద్వారా ఏడాదికి సుమారు 13 వేల మంది చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వెనకబడుతుందని విశ్లేషకుల అంచనా.  కాకినాడ కేంద్రంగా పనిచేస్తూ 150 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న వికాసకు  ఉద్యోగావకాశాలు కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి 2,34,610 దరఖాస్తులొచ్చాయి. నిరుద్యోగులకు దక్కిన ప్రైవేటు ఉద్యోగాలు కేవలం 30,798 మాత్రమే.

విద్యార్థులను కలవరపెడుతున్న కంపెనీల కలతలు:
ఇంజినీరింగ్‌ చేసే ప్రతీ విద్యార్థి అంతిమంగా మంచి ఉద్యోగంలో చేరాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకుంటాడు. భారత ఆర్థిక వ్యవస్థలోని ఒడుదుడుకులు నేపథ్యంలో పరిశ్రమలు, ఉపాధి సంస్థలు, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దాని ప్రభావంగానే దేశీయ కార్పొరేట్‌ రంగంలో తరచూ తలెత్తుతున్న సంస్థాగత కలతలు చదువుకుంటున్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో టాటా–మిస్త్రీ వార్, ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు, యాజమాన్యానికి మధ్య కలతలతో వారికి దక్కే అవకాశాలపై ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు
గురయ్యారు.  

పట్టా కాదు..పట్టు సాధించాలి..
ఇంజినీరింగ్‌ చదవాలన్న కోరిక కొలువు కల్పించదన్న విషయాన్ని నేటి విద్యార్థులు గమనించాలి. సాంకేతిక విద్యపై అవగాహన లేక ఇంటర్మీడియట్‌లో అధిక మార్కులు వచ్చిన వారు కూడా ఇంజినీరింగ్‌ కోర్సులో ఫెయిల్‌ అవుతున్నారు. ఉత్తీర్ణులైనా ఇంటర్వ్యూల్లో నెగ్గుకురాలేకపోతున్నారు. సబ్జెక్టుపై పట్టు లేకపోతే చుక్కాని లేని నావలా జీవితం ఉంటుందని గుర్తించాలి. పట్టా ఎంత ముఖ్యమో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విషయంపై పట్టు సాధించడం మరెంతో ముఖ్యమని గ్రహించాలి. పరీక్షల ముందు మాత్రమే సమయం కేటాయించి బట్టీ పట్టే విధానం సరికాదు. చదవడం, అధ్యాపకుల నుంచి సమగ్రతను పొందడం, ఆ పై విశ్లేషణ చేయడం, సెమినార్ల్లలో ప్రెజెంటేషన్‌ ఇవ్వడం విద్యార్థికి అలవాటుగా ఉండాలి.

సాంకేతిక విద్యా సంస్థలు ఇవీ..
జిల్లాలో జేఎన్‌టీయూకేకు అనుబంధంగా 32 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వివిధ శాఖల ద్వారా ఏటా 12వేల సీట్లకు ఎంసెట్‌ నిర్వహించి భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావిత విద్యా సంవత్సరమైన 2016లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 16,535 మంది పరీక్ష రాయగా 11,067 మంది అర్హత సంపాదించినప్పటికీ 7,400 మంది మాత్రమే కోర్సుల్లో చేరారు. 2017లో 12 వేల సీట్ల్లకు 7,440 మంది చేరడంతో 62శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 4560 సీట్లు అనగా 38 శాతం సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సుమారు 10 కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఏటా టాప్‌ బ్రాంచిలుగా ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌కు విశేష ఆదరణ ఉంటుంది.

నిలకడలేని ప్రభుత్వ విధానాలతో మానసిక క్షోభ
ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవితవ్యాన్ని రాష్ట్ర ప్రభత్వ విధానాలు ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర విభజన జరగగానే కంపెనీలు వస్తాయని ఆశించిన విద్యార్థులకు నిరాశ ఎదురైంది. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలనే నమ్మలేని విధంగా ఉండడంతో కొలువుల తీరు కొరివిగా కనబడుతోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కోర్సులో చేరినప్పుడు గొప్పదనుకున్న బ్రాంచి చదువు పూర్తయ్యాకా తీసికట్టుగా మారుతున్న వైనాన్ని తల్లిదండ్రులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకేషనల్‌ విద్యార్థికి లైబ్రరీయే అమ్మ ఒడి..
నేటి విద్యార్థులు వినోద కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తాను చేరింది వృత్తివిద్యా కోర్సు అని అధిక సమయం పుస్తకాలతో సావాసం చేయాలన్న సంగతిని మర్చిపోయి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వృత్తి విద్యా కోర్సు విద్యార్థికి లైబ్రరీ అమ్మ ఒడిలాంటిదని గుర్తించాలి. చదువు పూర్తిచేసి బయటకు వచ్చిన తర్వాత లైబ్రరీలోని విలువైన పుస్తకాలను చదువుదామన్నా అందుబాటులో ఉండవు. కొందామన్న ఆర్థిక భారాన్ని మోయలేమని గుర్తించాలి. సాధ్యమైనంత సమయాన్ని లైబ్రరీలో గడపాలి.

ఆంగ్లంలో ఆరితేరాలి..
భాషాపరమైన నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని విద్యార్థులు గుర్తించాలి. చదివిన చదువు మార్కులను మాత్రమే ప్రతిబింబిస్తే సరిపోదు. నైపుణ్యంపై నడిపించేలా ఉండాలి. పని ప్రదేశంలో ఆంగ్లానికి ప్రాధాన్యమిస్తారు. ఆంగ్ల దినపత్రికలను మొదటి సంవత్సరం నుంచే చదవనారంభించాలి. అవకాశమొస్తే మొహమాటం పడకుండా సెమినార్లలో మాట్లాడుతుండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement