సాక్షి, హైదరాబాద్: మేనేజ్‌మెంట్ కోటాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతవిద్య అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలిసింది. దీని ఆధారంగా సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎంఓ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సహా అన్ని యూనివర్సిటీల వీసీలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో సీట్ల అమ్మకాలపైనా ఆరా తీశారు. ఆ తర్వాతే వర్సిటీల ప్రక్షా ళన దిశగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పక్కాగా తనిఖీలుండాల్సిందే...
ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేస్తారు. ఇవి ప్రతీ కాలేజీకి వెళతాయి. అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల పరిస్థితిని సమీక్షిస్తాయి. ఈ వ్యవహారం మొత్తం నామమాత్రంగానే సాగుతోందనే ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. చాలా కాలేజీల్లో మౌలిక వసతులు లేకున్నా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎంఓ ఆదేశించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో వీసీలనే కాకుండా, ఇతర అధికారులను కూడా భాగస్వామ్యం చేసే ఆలోచననలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి
గత ఏడాది రాష్ట్రంలో 14 వేల వరకూ కంప్యూటర్ దాని అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు పెరిగాయి. సీఎస్‌సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచ్‌లలో సీట్లను యాజమాన్యాలు రూ.12 నుంచి రూ.18 లక్షల వరకూ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చా యి. ఉన్నత విద్యామండలికి కూడా ఇలాంటి ఫిర్యాదులు 145 వరకూ వచ్చాయి. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయమై సీఎంఓ ఆరా తీసింది. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు వీటిని పక్కన బెట్టడంపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటేనే అఫ్లియేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికా రులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment