సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల పాలనాపరమైన వ్యవహారాల్లో సమూలమార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని యూనివర్సిటీల సమగ్ర నివేదికలు తెప్పించుకుంది. ఉన్నతవిద్యలో కీలక పదవులు నిర్వహించినవారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలతో వర్సిటీల్లో చోటుచేసుకున్న ఘటనలపై సీఎంకు నివేదికలు అందాయి.
ఇటీవలి విద్యాశాఖ సమీక్షలో సీఎం వీటిని ప్రస్తావించినట్టు తెలిసింది. వర్సిటీల వీసీలు, ఉన్నతవిద్య ఉన్నతాధికారుల మధ్య వైరం, వర్సిటీల్లో కీలకవ్యక్తుల మధ్య వివాదాలు వంటి అంశాలపై సీఎంకు స్పష్టత ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. త్వరలో కీలక మార్పులకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోపణలపై ఆరా
విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ ప్రాధాన్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తోందని పలువురు ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీని నియమించేటప్పుడు సెర్చ్ కమిటీ అన్ని విషయాలపై నివేదిక ఇస్తుంది. కానీ ఈ కమిటీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు.
ఓ వర్సిటీ వీసీ నియామకాన్ని సెర్చ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టినా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేసే విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ఇలాంటి వ్యక్తిని వీసీగా పెట్టడం వల్ల పాలనపరమైన పోస్టుల భర్తీలోనూ అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని సీఎంకు తెలిపారు.
మితిమీరిన ఐఏఎస్‌ల ప్రభావం
విద్యాశాఖ కమిషనర్ల పాత్ర కూడా వర్సిటీల్లో కొత్త సమస్యలకు దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనకు నచ్చిన విషయాలను వర్సిటీ పాలక మండలిలో ఆమోదం పొందేందుకు ఒత్తిడి తెచ్చినట్టు విమర్శలున్నాయి. దీంతో ఆయనకు, వీసీకి మధ్య జరిగిన ప్రచ్ఛన్నపోరు వర్సిటీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు. అధికారులపై తన మాట నెగ్గించుకునేందుకు చేసిన ఒత్తిడి వల్ల అనేక కొత్త సమస్యలు ఎదురైనట్టు తెలిపారు.
మరో యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని రిజిస్టర్గా కొనసాగించిన తీరు కూడా అనేక విమర్శలకు కారణమైంది. దీని వెనుక వీసీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఈ తరహా పరిణామం గతంలో ఎన్నడూ లేదని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్‌లో అయితే ఇష్టారాజ్యం
హైదరాబాద్‌లోని కొన్ని యూనివర్సిటీల్లో వీసీల ఇష్టారాజ్యం నడుస్తోందని ఓ ప్రొఫెసర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వర్సిటీ వీసీ ఇష్టానుసారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం చేపట్టారు. ఇందులో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్టు విమర్శలున్నాయి.
అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలోనూ ఆయన ప్రైవేటు కాలేజీల నుంచి వసూళ్లు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యార్థులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్న వీసీలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనల పేరుతో ఒక వీసీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సీఎం ఆరా తీసినట్టు తెలిసింది.
బాసరపై ప్రత్యేక దృష్టి
బాసర ట్రిపుల్ ఐటీపై వస్తున్న ఆరోపణలపై సీఎం సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా అక్కడ అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టుల వ్యవహారంలో అవినీతి, వీసీ, డైరెక్టర్ బాసర ట్రిపుల్ ఐటీకి ఎప్పుడో ఓసారి వెళుతున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రక్షాళన అనివార్యమని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment