సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన హరితహారం కార్యక్రమం కింద మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ స్వగ్రామాలు, ఎమ్మెల్సీ కె.కవిత అత్తగారి ఊరిలో నాటిన మొక్కలు ఎన్ని? ప్రస్తుతం ఎన్ని చెట్లు ఉన్నాయి? చేసిన ఖర్చు ఎంత? వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అటవీ శాఖను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం హరితహారం ఫలితాలను సమీక్షించింది. హరితహారం కింద 2015–23 మధ్యకాలంలో రూ.10,822 కోట్ల ను వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 273.33 కోట్ల మొక్క లు నాటినట్టు అటవీ శాఖ అధికారులు మంత్రివర్గానికి నివేదించారు. పదేళ్లలో ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ రీతిలో పచ్చదనం ఎందుకు పెరగలేదని మంత్రివర్గం అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ప్రముఖ ప్రజాప్రతినిధుల సొంత ఊళ్లలో పథకం అమలు తీరుతెన్నులపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖను ఆదేశించినట్టు తెలిసింది. వచ్చే ఆర్థిక ఏడాదిలో కొత్తగా ఎన్ని మొక్కలు నాటాల్సి ఉంది? ఎంత బడ్జెట్ అవసరం? వంటి అంశాలు సైతం నివేదికలో ఉండాలని మంత్రివర్గం కోరినట్టు తెలిసింది.
వాస్తవ పరిస్థితి ఏమిటి?
హరితహారం కింద 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,011 బృహత్ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రహదారి వనాలు. 12,000 కిలోమీటర్ల బహుళ రహదారి వనాలు, 13.44 లక్షల ఎకరాల అడవుల్ని పునరుద్ధరించినట్టు గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రకటించుకుంది. దీనిపై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులతో సమగ్ర నివేదిక సమర్పించాలని అటవీ శాఖను మంత్రివర్గం కోరినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment