Engineering course
-
1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2024 కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ నెల 22 లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఏపీఈ ఏపీసెట్‌లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధ్రువపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి మెరిట్ జాబితా రానందున ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని వివరించారు. -
Chandrababu : జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్‌ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్‌తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్‌తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్‌ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్‌ఖాన్‌కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్‌ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
నేడు ఏపీ ఈసెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–23 పరీక్షను మంగళవారం ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో అగ్రికల్చరల్, సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యాహ్నం సెషన్లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ మెటలర్జికల్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఈసెట్–2023 చైర్మన్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సోమవారం తెలిపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్(ఏపీ ఎంసెట్) ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభయ్యాయి. ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 19 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 47 పట్టణాలలో 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు గంటన్నర ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి పంపించగా.. నిమిషం ఆలస్యమైనా అనుమతించడం లేదు. అభ్యర్థులు తమతోపాటు హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఏపీఈఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్‌ను వెంట తీసుకురావాలి. సెల్‌ఫోన్, వాచీలు, తదితర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించరు. బయో మెట్రిక్ హాజరు కోసం విద్యార్తినులెవరూ కూడా చేతులకి మెహందీ పెట్టుకు రాకూడదని సూచించారు ఒక్కో విభాగంలో అబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో గణితానికి 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు.. బైపీసీలో బోటనీ 40, జువాలజీ 40 , ఫిజిక్స్ 40, కెమిస్డ్రీ 40 మార్కులకి ప్రశ్నలు ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకి తీసుకురాకూడదు. -
డిగ్రీకి డిమాండ్ పెరిగేనా?
విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు. మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌తో సమానమైన కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది. ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్‌ను ఆనర్స్ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. - సాక్షి , హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు. కారణాలేంటి? ♦ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ♦ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్వేర్ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. ♦ డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అకౌంటింగ్‌తోపాటు, కంప్యూటర్ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ♦ లైఫ్ సైన్స్కూ ఓ మోస్తరు డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ సెక్టార్లో ఉపాధికి అవకాశాలున్నాయని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శాతం మంది లైఫ్ సైన్స్‌ను ఎంచుకుంటున్నారు. తర్వాత స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులున్నాయి. డిమాండ్ పెరగొచ్చు ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులే.. ఉపాధిలో మేటి
సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, మేనేజ్మెంటు కోర్సులే ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ఈ రెండు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధుల్లోనే ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా స్కిల్ రిపోర్టు–2021 ఈ విషయాలను వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంబీఏ కోర్సులు చేసిన వారితో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి తక్కువగానే అవకాశాలు లభించాయి. విచిత్రమేమంటే బీకాం, బీఎస్సీల కన్నా 2021లో బీఏ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. దేశవ్యాప్తంగా యువత నుంచి నిపుణులు సేకరించిన అభిప్రాయాలు, వాటిని విశ్లేషించి రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. మహిళలకు పెరిగిన అవకాశాలు ఉద్యోగ, ఉపాధికి యోగ్యమైన ప్రతిభ పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా ఉండడంతో వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ► ఉద్యోగావకాశాల్లో పురుషులు 38.91 శాతం మంది ఉండగా మహిళలు 41.25 శాతంగా ఉండడం విశేషం. కాలేజీల్లో చేరుతున్న మహిళల శాతం కూడా పెరగడంతో అదే సంఖ్యలో ఉద్యోగాల శాతంలోనూ వారి పెరుగుదల ఉంది. ► కరోనా సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఎక్కువ ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందు వరసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రో స్థాయి నగరాలు లేనప్పటికీ 5వ స్థానంలో నిలబడడం అన్నది చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనుకున్న మేర పరిశ్రమలు, ఇతర సంస్థలు రాలేదు. అయినప్పటికీ ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ సంస్థలు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. ► ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ► అలాగే, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. ► మహిళలకు అత్యధికంగా 2015లో 30% మేర అవకాశాలు లభించగా మళ్లీ 2021లోనే అంతకన్నా అత్యధికంగా 41.25% ఉండడం విశేషం. ► ఇక పురుషుల్లో ఐటీతో పాటు ఆటోమోటివ్‌లో 79 శాతం, లాజిస్టిక్‌లో 75 శాతం, కోల్ అండ్ ఎనర్జీ రంగంలో 72 శాతం అవకాశాలు దక్కించుకోగలిగారు. కరోనాతో యువతలో తగ్గిన నైపుణ్యం కరోనా కారణంగా నైపుణ్యాల పరంగా చూస్తే యువతలో ఆ సామర్థ్యాలు 45.9 శాతం మేర తగ్గింది. 18–21 ఏళ్లలోపున్న యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి యువత 40 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే, కరోనావల్ల ఉద్యోగాల కల్పన 2018తో పోలిస్తే 1.48 శాతం మేర మందగించినా నైపుణ్యాలు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా తమకు కావలసిన మానవ వనరులను సంస్థలు సమకూర్చుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పన 2018లో 47.38 శాతం మేర ఉంటే 2021 నాటికి 45.9 శాతానికి తగ్గింది. ఇంటర్న్‌షిప్‌తోనే అవకాశాలు ఎంతోకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పారిశ్రామిక అవసరాలకు తగ్గ నైపుణ్యాలు విద్యార్థుల్లో ఉండడంలేదు. దీనికి కరోనా కూడా తోడైంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లో తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలను నెలకొల్పేందుకు ఆయా కాలేజీలు కోర్సుల్లో భాగంగానే ఇంటర్న్‌షిప్‌ను అమలుచేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలుగుతున్నారు. ఏపీలో గతంలో ఈ ఇంటర్న్‌షిప్ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల హానర్స్ కోర్సులుగా మార్పు చేయడంతోపాటు నైపుణ్యాల కోసం ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. దీంతో ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో 85.92 శాతం మందికి అవకాశాలు దక్కుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీలో ఇంకా నైపుణ్యాల కొరత నైపుణ్యాల విషయానికొస్తే ఐటీ రంగంలో చాలా అంతరం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న తరుణంలో అందుకు తగ్గట్లుగా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా విద్యారంగంలో మార్పులు రావలసి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బిగ్‌డేటా, రోబోటిక్స్, ఆటోమేటెడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ డిమాండ్ ఉంది. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఎనర్జీ, లాజిస్టిక్ రంగాల్లోనూ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఐటీ పరిశ్రమ పురోగమిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ ఇంజనీర్లకూ డిమాండ్ పెరగనుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో 48.27%, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 47.35%, కంప్యూటర్ సైన్స్‌లో 38.34 శాతం మందికి రానున్న కాలంలో అవకాశాలు దక్కనున్నాయని పేర్కొంది. -
నెలాఖరుకు ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్‌తో పాటు ఇతర సమగ్ర సమాచారాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని సోమవారం ఉన్నత విద్యామండలిలో నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఈఏపీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల(జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ.. జోసా) కౌన్సెలింగ్ 6 విడతల్లో జరుగనుండటం, చివరి విడత సీట్ల కేటాయింపు ఆయా సంస్థల్లో చేరికలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలను చేపట్టడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీఈఏపీ సెట్లో అగ్రస్థానంలో ఉన్న ర్యాంకర్లు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్లలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి సీట్లు కేటాయించి చేరికలు చేపడితే.. జేఈఈలో కూడా మెరిట్లో ఉన్న ఆ విద్యార్థులు ప్రస్తుత జోసా కౌన్సెలింగ్‌లో ఐఐటీ, ఎన్ఐటీ తదితర సంస్థల్లో సీట్లు పొంది అటు వైపు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి కాలేజీల్లో వారికి కేటాయించిన సీట్లు ఖాళీ అవ్వడం, వాటిని మళ్లీ తదుపరి కౌన్సెలింగ్‌లో కేటాయింపు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆయా సంస్థలకు ధ్రువపత్రాలిచ్చి, ఫీజులు చెల్లించి ఉంటే.. వాటిని తిరిగి పొందడం సమస్యగా మారుతుంది. జేఈఈ కౌన్సెలింగ్ తర్వాత ఏపీఈఏపీ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఈ ఇబ్బందులు తప్పడంతో పాటు.. తదుపరి మెరిట్లో ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇలా అన్ని అంశాలపై ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ దృష్టి సారించింది. జేఈఈ కౌన్సెలింగ్ అనంతరం నెలాఖరు నుంచి ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపట్టడం తదితర అంశాలపై లోతుగా చర్చించింది. ఈ నెల 21న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో మరోసారి సమావేశమై చర్చించి ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేస్తారు. కన్వీనర్ కోటాలోకి ప్రైవేట్ వర్సిటీల్లోని 35 శాతం సీట్లు ఇదిలా ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలలోని 35 శాతం సీట్లు కూడా ప్రస్తుత ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ యూనివర్సిటీలు తమ కోర్సులకు ఫీజుల ఖరారుకు ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు అందించాయి. ఈ నెలాఖరులోగా కమిషన్ ఫీజులు ఖరారు చేసే అవకాశముందని, వాటిపై ప్రభుత్వం తుది ఉత్తర్వులు విడుదల చేశాక కౌన్సెలింగ్‌లో ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటాలో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు కేటాయిస్తామని అడ్మిషన్ల కమిటీ అధికారి ఒకరు తెలిపారు. -
అడ్మిషన్లు అదుర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. గత నాలుగైదేళ్లలో లేని విధంగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు దృష్టి సారించారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చాలా ఆలస్యమైనప్పటికీ.. అడ్మిషన్లు గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉన్నాయి. ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర విద్యాసంస్థల్లో చేరికకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా నిధులు సమకూరుస్తుండడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లోకి విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 73 శాతానికి పైగా భర్తీ అవ్వడం దీనికి తార్కాణం. 75,515 సీట్లు భర్తీ ఏపీ ఎంసెట్–2020 ప్రవేశాల ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎంసెట్–2020 అడ్మిషన్లలో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గత ఏడాది అక్టోబర్ చివర్లో ఆరంభమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ ఏడాది జనవరి 3న చేపట్టగా కన్వీనర్ కోటాలోని 1,04,090 సీట్లలో 72,867 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం మూడో విడత సీట్ల కేటాయింపు ముగియగా కన్వీనర్ కోటాలో 75,515 సీట్లు భర్తీ అవ్వగా 28,575 సీట్లు ఇంకా మిగిలాయి. ఈ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ వర్సిటీ కాలేజీల్లోని సీట్లు 90 శాతానికి పైగా భర్తీ కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు భారీగా మిగిలాయి. కాలేజీలు తగ్గినా.. ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా అనేక పథకాలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉన్నత విద్య ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ఇందుకు దోహదపడిందని, అనేక కాలేజీలను కౌన్సెలింగ్ నుంచి తప్పించినప్పటికీ భారీ సంఖ్యలో చేరికలు ఉండటం గమనార్హమని వారు చెబుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రమాణాలు లేని కాలేజీలు వాటిని సర్దుబాటు చేసుకొనేందుకు ప్రభుత్వం కొంత సమయమిచ్చింది. లోపాలు సరిదిద్దుకోని కాలేజీలపై ఈ విద్యాసంవత్సరం నుంచి చర్యలకు ఉపక్రమించింది. చేరికలు సున్నాకు పడిపోయిన 48 ఇంజనీరింగ్ కాలేజీలను ఈసారి కౌన్సెలింగ్ నుంచి తప్పించింది. అలాగే వర్సిటీలకు నిబంధనల మేరకు ఫీజులు చెల్లించని 82 కాలేజీలకు ఫస్టియర్ సీట్ల కేటాయింపును నిలిపివేసింది. బీఫార్మసీ, డీఫార్మాలో కూడా ఇలాంటి కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగా పలు కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. కాలేజీలు అన్ని విధాలా అర్హతలున్న సిబ్బందిని నియమించుకున్నాయి. ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశాయి. -
ఐస్‌క్రీమ్ ర్యాగింగ్
దాదాపు ముప్పయ్యేళ్ల కిందటి సంఘటన. అవి నేను వాకాడులో ఇంజనీరింగ్ కోర్సులో జాయినయ్యాను. ర్యాగింగ్ ఎక్కవనే చెప్పాలి. ఇంకా ఫ్రెషర్స్ డే జరగకపోవడంతో సీనియర్స్ కంట కనబడటానికి భయపడే వాళ్లం. ఆ సంవత్సరం సీట్లు పెంచడంతో పాటు ఉన్న కాలేజీలకు కొత్త బ్రాంచెస్కు అనుమతి రావడంతో కౌన్సెలింగ్ ఆగకపోవడంతో నాలాంటి వారికి ఏదో మూల ఆశ. కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి. కారణం కంప్యూటర్స్ కోర్సుపై ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకోసం కాలేజీ క్లాసులు ముగిసిన తర్వాత అతి కష్టం మీద సీనియర్స్ కంట కనబడకుండా తప్పించుకుని గూడూరు వెళ్లే బస్సులో కూర్చున్నాను. డబ్బులు బొటాబొటిగా మాత్రమే ఉండటంతో గూడూరులో బస్సు దిగిన తర్వాత రైల్వేస్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాను. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో టికెట్ తీసుకుని మొదటి నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పచార్లు ప్రారంభించాను రేపటి కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తూ. ఎందుకు వచ్చారో తెలియదు, కాని అక్కడకు వచ్చిన మా సీనియర్స్ కంటబట్టాను సరిగ్గా ఐస్‌క్రీమ్ షాపు ముందు. అది ప్లాట్‌ఫామ్‌పైనే. అంతే నా పైప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకుని పారిపోదామా అనిపించింది. వారు ఒక్కసారిగా నా మీద పడ్డంత పని చేశారు. ‘ఇంకా ఫ్రెషర్స్ డే కాలేదు. అప్పుడే సినిమాలకు తయారయ్యావా?’ అని ఒకరు.. ‘గూడురుకు రావద్దని తెలియదా?’ అని మరొకరు.. ఈలోగా సెల్యూట్ చెయ్యబోతే వారించి, అతి వినయం పనికిరాదని గదమాయించారు. వారు నార్మల్ అయ్యాక అసలు విషయం వివరించి చెప్పాను. ‘సరే గూడురు వచ్చినందుకు నీకు జరిమానా.. అందరికీ ఐస్‌క్రీమ్స్ ఇప్పించు’ అన్నారు. అంతే నా గుండె గుభేల్మంది. కారణం డబ్బులు తక్కువగా ఉండటమే. ఐస్‌క్రీమ్ షాపులో పది కప్పులు ఇవ్వమని చెప్పాను. కానీ అందులో ఉన్న ఒక సీనియర్‌కి ఇంకా కోపం తగ్గలేదు కాబోలు. అందుకే నా కప్పు తీసుకుని, దాంతో తినడానికి ఇచ్చిన వెదురు స్పూన్‌ను పట్టాలపైకి విసిరేసి, కప్పు మాత్రమే ఇచ్చాడు. ఐస్‌క్రీమ్ కరగకముందే తినమన్నాడు. చేతివేళ్లు ఉపయోగించవద్దని షరతు విధించాడు. ఒకవేళ నేను అలా తినకపోతే బిల్లు నేనే చెల్లించాలని, తింటే తాను చెల్లిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. షాపతను, సీనియర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కక్షణం ఆలోచించి, కప్పు మీదనున్న మూత తీసి, దాన్ని స్పూన్‌లా మలచి తినడం మొదలుపెట్టాను. వారు కాస్త కంగుతిన్నట్టనిపించింది. ‘నువ్వు కంప్యూటర్స్ కోర్సుకి బాగా సూటవుతావు’ అని మెచ్చుకున్నారు. సీనియర్ బిల్లు పే చేయక తప్పలేదు. ర్యాగింగ్ గురించి విన్నప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకొచ్చి, నవ్వొస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. నాకు కంప్యూటర్స్ కోర్సులో సీటు రాకపోవడం. – కె. వెంకటరమణారావు, కరీంనగర్ -
నేనే నంబర్ 1
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్‌తోపాటు సీట్ల ఎలాట్మెంట్ మొదటి దశ ప్రక్రియ కూడా పూర్తయింది. వీటిలో తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ద్వితీయ ప్రాధాన్యంగా ఈసీఈ, తృతీయ ప్రాధాన్యంలో మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరారు. జిల్లాలోని 32 ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 11వేల సీట్లుండగా ఇప్పటివరకూ 3 వేల 900 సీట్ల వరకూ భర్తీ అయ్యాయి. వీటిలో దాదాపు 800 మంది సీఎస్‌ఈకు ఎంచుకున్నారు. తొలిమూడు ప్రాధాన్యాలుగా నిలిచిన బ్రాంచీల్లో ఉన్న కోర్సులు ప్రాధాన్యం తెలుసుకుందాం... ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ను సంక్షిప్తంగా ఈసీఈ అంటారు. ఇంజినీరింగ్ కోర్సులోనే దీనిని రాయల్ బ్రాంచ్‌గా చెప్పుకోవచ్చు. టెలి కమ్యూనికేషన్, మొబైల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలు కొన్ని సంవత్సరాలుగా సుస్థిర వృద్ధి సాధించడంతో ఈ రంగం ఎంచుకున్నవారి ఉపాధికి ఢోకాలేదు. ప్రారంభంలోనే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ అందుకోవచ్చు. డిజైన్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వంటి హోదాలు పొందవచ్చు. బీటెక్ పూర్తి చేశాక ఎంటెక్‌లో మొబైల్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, గ్లోబల్ నేవిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలీమెటిక్ ఇంజినీరింగ్, బీఎల్ఎస్ఐ వంటి సబ్జెక్టుల్లో ఎంఎస్ చేయవచ్చు. ఈసీఈ బ్రాంచ్‌లో ఎలక్ట్రానిక్ డివైజ్ అండ్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైనింగ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అనాలిసిస్, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, యాంటినాస్ అండ్ వేవ్ ప్రోపగేషన్, ఎలక్ట్రానిక్ మేజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అనలాగ్ కమ్యూనికేషన్స్, రాడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ బ్రాంచ్ చేసినవారు సీఎస్, ఈఈఈ వంటి రంగాల్లో రాణించవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటెల్, శ్యామ్‌సంగ్, సోనీ, ఎల్జీ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సీఎస్ఈ... సీఎస్ఈ విభాగం పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది. ఉత్తమ శ్రేణిలో ఈ కోర్సు పూర్తి చేసినవారికి భారీ వేతనాలతో కొలువు ఖాయం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, మ్యాథ్ మెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్, డిజిటల్ లాజిక్ డిజైన్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్, జావా ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ఫ్ర్మేటింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీ, లైనెక్స్ ప్రోగ్రామింగ్, క్రౌడ్ కంప్యూటింగ్, డేటా వేర్‌హౌస్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసినవారు గూగుల్, అమెజాన్, ఐబీఎం, టీసీఎస్, విప్రో వంటి సంస్థలలో ఉద్యోగ అవకాశాలుంటాయి. మెకానికల్... విస్తృత ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న బ్రాంచ్ మెకానికల్. మానవుని శారీరక శ్రమను తగ్గించే ప్రతి యంత్రం మెకానికల్ ఇంజినీరింగ్ ద్వారా తయారవుతుంది. ప్రతిభ చూపే మెకానికల్ ఇంజినీర్లకు ప్రారంభంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వార్షిక వేతనం ఉంటుంది. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ధర్మో డైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, ౖకైనెటిక్స్ ఆఫ్ మెషినరీ, మెకానిక్స్ ఆఫ్ ప్లూయిడ్ అండ్ హైడ్రాలిక్ మెషిన్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, డిజైనర్ మెషిన్ మెంబర్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ తదితర సబ్జెక్టులుంటాయి. ఇస్రో, ఇండియన్ రైల్వే, మిథానీ, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మహేంద్రవంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
ఎంసెట్: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్ పరీక్షల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని ఇప్పటికీ అధికారులు ప్రకటించారు. ఎంసెట్ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆన్లైన్ ఎంసెట్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఏపీ నుంచి 29,356 మంది ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 7,987 మంది ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు ఐదు రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు. -
ఇంజి'నీరుగారొద్దు'..
♦ కోరుకున్న విద్య కొరివవుతున్నవైనం ♦ పట్టాపై ఉన్న శ్రద్ధ పట్టుపై కరువు ♦ బోధనలోనూ నాణ్యత కరువు ♦ ప్రావీణ్యం ఉంటే ప్రాభవం మీదే.. పెద్దయ్యాకా ఏమవుతావురా? అని చిన్నపిల్లాడినడిగితే టక్కున చెప్పే సమాధానం ‘ఇంజినీరునవుతా’. గుర్తింపు, సంపాదన పుష్కలంగా ఉంటుందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ఇంజినీర్ అనే మాట బుల్లి బుర్రల్లో కూడా ఎక్కించేశారు. తీరా క్షేత్ర స్థాయిలో ఆ విద్య తీరుతెన్నులు భిన్నంగా ఉంటున్నాయన్నది వాస్తవం. ఇంజనీర్స్ డే సందర్భంగా సాంకేతిక విద్య తీరుతెన్నులపై ఓ విశ్లేషణాత్మక కథనం...– కపిలేశ్వరపురం (మండపేట) ఇంజినీర్స్ డే నేపథ్యం ఇదీ... ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఏటా ఇంజనీర్స్ డే గా నిర్వహిస్తుంటారు. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యంగల కోలార్ జిల్లాలోని ముద్దెనహళ్లి గ్రామంలో 1860 సెప్టెంబరు 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. వాస్తవానికి ఆయన పూర్వీకులు కర్నూలు జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు కావడంతో ఆయనతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉంది. ఇంజనీరింగ్ చదివిన అనంతరం ఈయన హైదరాబాద్ నగరంలోని మూసీ నదితోపాటు దేశంలోని అనేక నగరాల్లో డ్యాంలు, భవనాల రూపకల్పనలో ప్రత్యేకత కనబర్చారు. ఈయన సేవలను గుర్తిస్తూ 100వ పుట్టిన రోజున భారత ప్రభుత్వం స్టాంపును ముద్రించింది. 1955లో భారత రత్న పురస్కారం అందించింది. నిబద్ధత గల ఇంజనీర్‌గా నేటి ఇంజనీర్లకు ఈయన ఆదర్శప్రాయుడనడంలో అతిశయోక్తిలేదని చెప్పొచ్చు. ఇంజనీర్స్ డే సందర్భంగా జిల్లాలో సాంకేతిక విద్య తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న కళాశాలలు 1989 వరకూ ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే జిల్లాలో ఉండేవి. 1989 నుంచి 2006 మధ్య కాలంలో కళాశాల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడంతో ప్రస్తుతానికి 32 కళాశాలలు పెరిగాయి. కళాశాలలకు అనుమతులిచ్చిన పాలకులు విద్యార్థులకు కొలువులివ్వడంపై శ్రద్ధ చూపడంలేదన్నది నగ్న సత్యం. ఆల్ ఫ్రీ వ్యవహారంతో కొరవడిన నాణ్యత ప్రభుత్వ నిర్ణయాలు, కంపెనీల వ్యవస్థాపన సమస్యలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థిరత్వం కోల్పోయింది. బయట ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పుడు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అలాంటిప్పుడు రూ.కోట్లు ఖర్చు చేసి స్థాపించిన కళాశాలను నిర్వహించడం యాజమాన్యానికి భారంగా మారుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటును మాత్రమే ఆశించి మిగిలిన అంశాల్లో ఆల్‌ఫ్రీ అంటూ ప్రత్యేక పథకాలను యాజమాన్యం ప్రవేశపెడుతుంది. దీంతో అర్హత, ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరి భారాన్ని మోయలేక భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. కళాశాలను మూసివేయాలంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మూసివేతకు తమకు అభ్యంతరం లేదంటూ విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ తదితర అంశాలను ఏఐసీటీకి తెలియపరచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేసే కంటే ఇబ్బందులతో నెట్టుకురావడమే మేలని యాజమాన్యాలు భావించి నాణ్యత లేకుండానే కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొలువుల కల్పనపై అలసత్వం జిల్లాలోని కళాశాలలు ద్వారా ఏడాదికి సుమారు 13 వేల మంది చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వెనకబడుతుందని విశ్లేషకుల అంచనా. కాకినాడ కేంద్రంగా పనిచేస్తూ 150 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న వికాసకు ఉద్యోగావకాశాలు కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి 2,34,610 దరఖాస్తులొచ్చాయి. నిరుద్యోగులకు దక్కిన ప్రైవేటు ఉద్యోగాలు కేవలం 30,798 మాత్రమే. విద్యార్థులను కలవరపెడుతున్న కంపెనీల కలతలు: ఇంజినీరింగ్ చేసే ప్రతీ విద్యార్థి అంతిమంగా మంచి ఉద్యోగంలో చేరాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకుంటాడు. భారత ఆర్థిక వ్యవస్థలోని ఒడుదుడుకులు నేపథ్యంలో పరిశ్రమలు, ఉపాధి సంస్థలు, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దాని ప్రభావంగానే దేశీయ కార్పొరేట్ రంగంలో తరచూ తలెత్తుతున్న సంస్థాగత కలతలు చదువుకుంటున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో టాటా–మిస్త్రీ వార్, ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు, యాజమాన్యానికి మధ్య కలతలతో వారికి దక్కే అవకాశాలపై ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. పట్టా కాదు..పట్టు సాధించాలి.. ఇంజినీరింగ్ చదవాలన్న కోరిక కొలువు కల్పించదన్న విషయాన్ని నేటి విద్యార్థులు గమనించాలి. సాంకేతిక విద్యపై అవగాహన లేక ఇంటర్మీడియట్లో అధిక మార్కులు వచ్చిన వారు కూడా ఇంజినీరింగ్ కోర్సులో ఫెయిల్ అవుతున్నారు. ఉత్తీర్ణులైనా ఇంటర్వ్యూల్లో నెగ్గుకురాలేకపోతున్నారు. సబ్జెక్టుపై పట్టు లేకపోతే చుక్కాని లేని నావలా జీవితం ఉంటుందని గుర్తించాలి. పట్టా ఎంత ముఖ్యమో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విషయంపై పట్టు సాధించడం మరెంతో ముఖ్యమని గ్రహించాలి. పరీక్షల ముందు మాత్రమే సమయం కేటాయించి బట్టీ పట్టే విధానం సరికాదు. చదవడం, అధ్యాపకుల నుంచి సమగ్రతను పొందడం, ఆ పై విశ్లేషణ చేయడం, సెమినార్ల్లలో ప్రెజెంటేషన్ ఇవ్వడం విద్యార్థికి అలవాటుగా ఉండాలి. సాంకేతిక విద్యా సంస్థలు ఇవీ.. జిల్లాలో జేఎన్టీయూకేకు అనుబంధంగా 32 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వివిధ శాఖల ద్వారా ఏటా 12వేల సీట్లకు ఎంసెట్ నిర్వహించి భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావిత విద్యా సంవత్సరమైన 2016లో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 16,535 మంది పరీక్ష రాయగా 11,067 మంది అర్హత సంపాదించినప్పటికీ 7,400 మంది మాత్రమే కోర్సుల్లో చేరారు. 2017లో 12 వేల సీట్ల్లకు 7,440 మంది చేరడంతో 62శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 4560 సీట్లు అనగా 38 శాతం సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సుమారు 10 కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఏటా టాప్ బ్రాంచిలుగా ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్‌కు విశేష ఆదరణ ఉంటుంది. నిలకడలేని ప్రభుత్వ విధానాలతో మానసిక క్షోభ ఇంజినీరింగ్ విద్యార్థుల భవితవ్యాన్ని రాష్ట్ర ప్రభత్వ విధానాలు ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర విభజన జరగగానే కంపెనీలు వస్తాయని ఆశించిన విద్యార్థులకు నిరాశ ఎదురైంది. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలనే నమ్మలేని విధంగా ఉండడంతో కొలువుల తీరు కొరివిగా కనబడుతోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోర్సులో చేరినప్పుడు గొప్పదనుకున్న బ్రాంచి చదువు పూర్తయ్యాకా తీసికట్టుగా మారుతున్న వైనాన్ని తల్లిదండ్రులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేషనల్ విద్యార్థికి లైబ్రరీయే అమ్మ ఒడి.. నేటి విద్యార్థులు వినోద కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తాను చేరింది వృత్తివిద్యా కోర్సు అని అధిక సమయం పుస్తకాలతో సావాసం చేయాలన్న సంగతిని మర్చిపోయి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వృత్తి విద్యా కోర్సు విద్యార్థికి లైబ్రరీ అమ్మ ఒడిలాంటిదని గుర్తించాలి. చదువు పూర్తిచేసి బయటకు వచ్చిన తర్వాత లైబ్రరీలోని విలువైన పుస్తకాలను చదువుదామన్నా అందుబాటులో ఉండవు. కొందామన్న ఆర్థిక భారాన్ని మోయలేమని గుర్తించాలి. సాధ్యమైనంత సమయాన్ని లైబ్రరీలో గడపాలి. ఆంగ్లంలో ఆరితేరాలి.. భాషాపరమైన నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని విద్యార్థులు గుర్తించాలి. చదివిన చదువు మార్కులను మాత్రమే ప్రతిబింబిస్తే సరిపోదు. నైపుణ్యంపై నడిపించేలా ఉండాలి. పని ప్రదేశంలో ఆంగ్లానికి ప్రాధాన్యమిస్తారు. ఆంగ్ల దినపత్రికలను మొదటి సంవత్సరం నుంచే చదవనారంభించాలి. అవకాశమొస్తే మొహమాటం పడకుండా సెమినార్లలో మాట్లాడుతుండాలి. -
రీ ‘ఇంజనీరింగ్’!
- ఇంజనీరింగ్ కోర్సుల కరిక్యులమ్‌లో సమూల మార్పులు... - అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయం - మోడల్ కరిక్యులమ్ సిద్ధం చేస్తున్న ఏఐసీటీఈ - ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం.. విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందులో భాగంగా మోడల్ కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేయనుంది. ప్రాజెక్టు కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్‌లో సమూల మార్పులు తీసుకురాబోతోంది. థియరీ విభాగాన్ని తగ్గించి ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులపైనా ఒత్తిడిని తగ్గించవచ్చని యోచిస్తోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 15 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను తీసుకువచ్చేందకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులను పక్కాగా అమలు చేసేందుకు ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. థియరీ పరీక్షల్లోనూ క్రెడిట్స్‌ను (మార్కులకు పాయింట్లు) తగ్గించి, ప్రాజెక్టులకే క్రెడిట్స్‌ను పెంచేలా కొత్త కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ట్రైనింగ్ ఓరియెంటెడ్‌గా, డిజైన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ మేరకు సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. విశ్లేషణ సామర్థ్యాలు పెంపు, ల్యాబ్‌లలో శిక్షణ, ప్రాక్టికల్స్, డిజైన్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌ను ప్రస్తుతం వివిధ సబ్జెక్టుల్లో 12 కమిటీలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రాలకు 20% వెసులుబాటు జాతీయ స్థాయిలో ఒకేలా సిలబస్ ఉండేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టినా, రాష్ట్రాలకు 20 శాతం వెసులుబాటు కల్పించేందుకు ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించేలా చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చర్‌కు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యం ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇంకొన్ని రాష్ట్రాల్లో టెక్స్టైల్ టెక్నాలజీకి ప్రా«ధాన్యం ఉంది. ఆయా రాష్ట్రాలు ఆయా రంగాలకు సంబంధించిన సిలబస్‌లో 20 శాతం వరకు మార్పులు చేసుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది. -
విద్యార్థులు కావలెను!
- ఇంజినీరింగ్ కళాశాలల్లో మందకోడిగా ప్రవేశాలు – రెండు కళాశాలల్లో మాత్రమే వంద శాతం విద్యార్థుల చేరిక – చాలా కళాశాలల్లో నామమాత్రంగా భర్తీ –గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవేశాలు జేఎన్టీయూ : ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మందకొడిగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని కళాశాలలుగా నడపాల్సిన విపత్కర పరిస్థితి నెలకొంది. విద్యార్థులు లేకపోవడంతో కొన్ని కళాశాలలు బోసిపోనున్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , అనంతపురం పరిధిలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాల జోరు కొనసాగుతోంది. మరికొన్ని కళాశాలల్లో నామమాత్రంగా సీట్ల భర్తీ అవుతున్నాయి. 100 లోపు ఇంజనీరింగ్ సీట్లు కూడా భర్తి కాని పరిస్థితి. తొలి దఫా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 24వ తేదీతో పూర్తయింది. జేఎన్టీయూ పరిధిలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కలిపి మొత్తం 118 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, కేవలం 32 కళాశాలల్లోనే పూర్తిగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రత్యేక కేటగిరి కింద ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపును వాయిదా వేశారు. దీంతో ప్రతి కళాశాలలోనూ 5 నుంచి 7 ఇంజినీరింగ్ సీట్లు త్వరలో భర్తీ చేస్తారు. ఆ లెక్కన అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటీ , రోటరీపురం) (420 సీట్లకు గాను 413 సీట్లు భర్తీ అయ్యాయి. ), అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో (420 సీట్లకు గాను 413 సీట్లు భర్తీ అయ్యాయి), ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో 240 సీట్లకుగాను 213 సీట్లు, తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల 213 సీట్లకు 208 సీట్లు భర్తీ అయ్యాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 5,565 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 4,187 సీట్లు అందుబాటులో ఉండగా 2,912 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 5 కళాశాలల్లో 100 లోపు సీట్లు భర్తీ అయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరచడంతో సీట్లు మిగిలిపోయాయి. అంచనాలకు మించి సీట్లు మిగిలిపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు దిక్కుతోచడం లేదు. తొలి దఫా కౌన్సెలింగ్‌లో అరకొరగా భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్లను కనీసం రెండో దఫాలోనైనా భర్తీ చేసుకోవడానికి ప్రయత్నాలు ఆయా కళాశాలల యాజమాన్యాలు ముమ్మరం చేశాయి. కళాశాలల వారీగా ఇంజినీరింగ్ సీట్ల భర్తీ : -
ఇంజనీరింగ్‌లో 262 రకాల పేర్లతోనే డిగ్రీలు
ఏఐసీటీఈ ఉత్తర్వులపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో 262 రకాల పేర్లతోనే డిగ్రీలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు వాటిని అమలు చేయాల్సిందేనని తెలిపింది. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఏఐసీటీఈ ఆమోదం లేకుండా వివిధ పేర్లతో డిగ్రీలను ప్రదానం చేస్తుండటంతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. బీటెక్‌లో 45 బ్రాంచీల పరిధిలో 262 రకాల డిగ్రీలనే ప్రదానం చేయాలని స్పష్టం చేసింది. ఎంటెక్‌లోనూ 45 బ్రాంచీల పరిధిలో 594 రకాల డిగ్రీలను ప్రదానం చేయాలని వెల్లడించింది. ఆ డిగ్రీల వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను తమ వెబ్సైట్లో ఉంచింది. -
మాతృభాషలో ఇంజినీరింగ్ విద్య
భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంజినీరింగ్ విద్యను హిందీ మీడియంలో అందించాలని నిర్ణయించుకుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిందే. మధ్యప్రదేశ్ లోని అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ విశ్వ విద్యాలయ ఇంజనీరింగ్ విద్యలోని ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ బ్రాంచ్ లను హిందీ మీడియంలో అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందని, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ మోహన్ లాల్ చిప్పా తెలిపారు. ఇందుకు సంబంధించిన సిలబస్ ను సైతం రూపొందించామని ఆయన వెల్లడించారు. ఒక్కో బ్రాంచిలో 30 సీట్లు ఉంటాయని చెప్పారు. ఒక్క విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నాసరే ఈ యేడాది నుంచే హిందీలో కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని వీసీ స్పష్టం చేశారు. 250 ఏళ్లుగా ఆంగ్లం ఈ దేశ విద్యావ్యవస్థను డామినేట్ చేస్తోందని స్వాంతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కూడా ఈ దుస్ధితి మారలేదని మోహన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ వ్యామోహం నుంచి ప్రజలను బయటపడేసేందుకే తాము హిందీ మీడియంలో కోర్సును ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఇజ్రాయిల్, జపాన్, చైనా, రష్యా, కొరియా, జెర్మనీ, స్వీడన్ లాంటి దేశాలు ఇప్పటికీ ఉన్నత విద్యను ప్రాంతీయ భాషలో అందిస్తున్నాయని గుర్తు చేశారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
► జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలు సిద్ధం ► నేడు ఒకటో ర్యాంకు నుంచి 5 వేల ► ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్ధేశించిన ఏపీ ఎంసెట్-2016 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 15వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సోమవారం మాత్రం కౌన్సెలింగ్ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్‌లో హాజరు కావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. ఎంసెట్-2016 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఇంటర్ మార్కుల జాబితా, పాస్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ స్టడీ సర్టిఫికెట్, టెన్త్ లేదా తత్సమాన అర్హత పరీక్ష మెమో, రెసిడెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, దివ్యాంగులు, ఇతర కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం చూపితేనే ఫీజుల చెల్లింపు ఫీజు రీయింబర్స్మెంట్ పొందగోరు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని విధిగా తీసుకెళ్లాలి. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు కలిగిన ఓసీ, బీసీలు, రూ.2 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆయా సర్టిఫికెట్ల రెండు సెట్ల జెరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించిన తరువాత ఒక సెట్ జెరాక్స్ కాపీలను తీసుకుని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను తిరిగి విద్యార్థులు ఇచ్చేస్తారు. ప్రత్యేక విభాగాలకు విజయవాడలో.. దివ్యాంగులు, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరవ్వాలి. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఒకటో ర్యాంకు నుంచి 1,200 ర్యాంకు వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,201 ర్యాంకు నుంచి 2,400 ర్యాంకు వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2,401 ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 3,701 ర్యాంకు నుంచి 5,000 ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి. -
టీఎస్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనం ఏమిటి? పదో తరగతితోనే ఇంజనీరింగ్ కోర్సుల్లో అడుగుపెట్టాలనుకుంటే దానికి మార్గం.. పాలిటెక్నిక్. ఈ డిప్లొమాల వ్యవధి మూడు/మూడున్నరేళ్లు. కోర్సు పూర్తి చేస్తే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సూపర్వైజరీ స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశించొచ్చు. డిప్లొమా స్థాయిలో నేర్చుకున్న ప్రాక్టికల్ అంశాలతో సొంతంగా ఏదైనా పరిశ్రమను స్థాపించి పదిమందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. టీఎస్‌లో కాలేజీలు, సీట్ల వివరాలు? టీఎస్పాలిసెట్లో మొత్తం 1,03,001 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కాలేజీల సంఖ్య 56 (సీట్లు: 12,000) కాగా, ప్రైవేటు కళాశాలల సంఖ్య 169 (సీట్లు: 46,000). 15% అన్రిజర్వ్డ్ సీట్లకు అర్హులు ఎవరు? మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణవారితోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అర్హులే. పాలిటెక్నిక్‌లో ఎన్ని బ్రాంచ్‌లున్నాయి? ప్రధాన బ్రాంచ్లేవి? పాలిటెక్నిక్‌లో మొత్తం 36 బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ప్రధానంగా.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ వంటివి ప్రధాన బ్రాంచ్‌లుగా పేర్కొనవచ్చు. ఉద్యోగావకాశాలు లభిస్తున్న ఇతర బ్రాంచ్‌ల వివరాలు తెలపండి? సివిల్, మెకానికల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, కెమికల్ కాకుండా మరికొన్ని బ్రాంచ్‌ల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉదాహరణకు ప్యాకేజింగ్ టెక్నాలజీ, షుగర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అభ్యసించినవారికి ఆయా రంగాల్లో జాబ్స్ ఉన్నాయి. మంచి పాలిటెక్నిక్ కళాశాల ఎంపిక ఎలా? గతేడాది పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌లో ఓసీ కేటగిరీలో పదివేల లోపు క్లోజింగ్ ర్యాంకులతో సీట్లు లభించిన కళాశాలలను మంచి కళాశాలలుగా భావించవచ్చు. దీనికోసం గతేడాది కటాఫ్ ర్యాంకులను విద్యార్థులు పరిశీలించాలి. వాటి ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో కళాశాలల జాబితా రూపొందించుకోవాలి. గతేడాది టాపర్స్ చేరిన కాలేజీలతోపాటు కాలేజ్ ఏర్పాటు చేసిన సంవత్సరం, మౌలిక సదుపాయాలు (క్యాంపస్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లేబొరేటరీలు, లైబ్రరీ, క్రీడా మైదానాలు, హాస్టల్స్, క్యాంటీన్ తదితర), ఫ్యాకల్టీ-వారి అర్హతలు, గత ఐదారేళ్లుగా కళాశాలల ఉత్తీర్ణతశాతం, కమ్యూనికేషన్స్కిల్స్-స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలను కాలేజీ ఎంపికలో పరిశీలించాలి. కళాశాల ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా చెల్లించాలా? ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్లో ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250 ఫీజు చెల్లించాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏయే ధ్రువీకరణ పత్రాలు కావాలి? సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్దేశిత తేదీల్లో.. నిర్దేశించిన ర్యాంకుల వారికి జరుగుతుంది. వెళ్లేటప్పుడు టీఎస్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, టీఎస్ పాలిసెట్ హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల మెమో, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు/ఎన్సీసీ/స్పోర్ట్స్/సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి. వెబ్ కౌన్సెలింగ్‌పై నాకు అవగాహన లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏయే తేదీల్లో నిర్వహిస్తారు? వెరిఫికేషన్‌కు ఏ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలి? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మే 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తారు. మధ్యలో 22వ తేది ఒక్కరోజు మినహాయింపు ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ సెంటర్లను కేటాయించారు. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా హెల్ప్‌లైన్ సెంటర్‌కు మీ ర్యాంకుకు నిర్దేశించిన తేదీల్లో వెళ్లాలి. అక్కడ కౌన్సెలింగ్ అధికారులు అన్ని వివరాలు అందిస్తారు. అయితే ఎస్టీ విద్యార్థులు వారికి నిర్దేశించిన కేంద్రాలకు మాత్రమే వెళ్లాలి. అదేవిధంగా ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో-ఇండియన్స్, శారీరక వికలాంగులు, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ఫోర్సెస్ విద్యార్థులు.. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యా భవన్‌కు హాజరుకావాలి. వీరికి అక్కడ మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వీరికి మే 20, 21 తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలేమిటి? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు మే 23 నుంచి మే 30 వరకు చేరాలనుకుంటున్న కళాశాలలను, బ్రాంచ్‌లను http://tspolycet.nic.in లో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగినై ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. అయితే కౌన్సెలింగ్ నోటిఫికేషన్లో పేర్కొన్న ర్యాంకులను, తేదీలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత తేదీల్లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ముందుగా మీరు ఏ కళాశాలల్లో, ఏ బ్రాంచ్‌ల్లో చేరాలనుకుంటున్నారో వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలినవాటిని ఎంపిక చేసుకోవాలి. వీలైనన్ని కళాశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ఎంట్రీకి తప్పనిసరిగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలా? కళాశాలల ఎంపిక కోసం తప్పనిసరిగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదంటే ఇంట్లో నెట్ సౌకర్యమున్న సిస్టమ్ అవసరం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9.0 ఉన్న బ్రౌజర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మీకు ఏ మాత్రం వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన లేకుంటే హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లడం మంచిది. ఒకసారి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మార్చుకునే వీలుందా? మీరు ఎంపిక చేసుకున్న కళాశాలలను, బ్రాంచ్‌లను మార్చుకునే వీలు కూడా ఉంది. మే 31న ఫస్ట్ ర్యాంకర్ నుంచి చివరి ర్యాంకర్ వరకు తాము ఇచ్చిన ఆప్షన్స్‌ను మార్చుకునే వీలుంది. ఆ తర్వాత ఇక కుదరదు. సీటు వచ్చిన సంగతి ఎలా తెలుస్తుంది? ఆప్షన్స్ ఎంట్రీ తర్వాత జూన్ 1న మీకు ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్‌లో సీటు లభించిందో తెలుసుకోవచ్చు. దీని కోసం https://tspolycet.nic.inలో క్యాండిడేట్స్ లాగిన్‌ను క్లిక్ చేసి ఐసీఆర్ ఫామ్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పాస్వర్డ్, పుట్టినతేది ఎంటర్ చేసి సీట్ ఎలాట్మెంట్ ఆర్డర్‌ను జూన్ 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటు లభించినవారు ఫీజు ఎంత చెల్లించాలి? కళాశాలలో సీటు లభించినవారు.. ఆయా కళాశాలను బట్టి రూ.3800 నుంచి 15,500 మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. సీటు ఎలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును నిర్దేశిత కళాశాలలో పే చేయాలి. నాకు ఆర్థిక స్థోమత లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందా? ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు నిర్దేశిత సంవత్సర ఆదాయానికి తక్కువగా ఉన్న ఓసీ/బీసీ/ఎస్సీ/ఎస్టీలు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇందుకోసం మీసేవ కార్యాలయాల నుంచి జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఫీజురీయింబర్స్‌మెంట్ వివరాల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను తెలుసుకుంటుండాలి. -
ఇంజనీరింగ్‌లో.. అమ్మాయిలు
టాప్ స్టోరీ పాలిసెట్‌లో అమ్మాయిలకు మంచి ర్యాంకులు.. ఎంసెట్ ఫలితాల్లో పెరిగిన అమ్మాయిల ఉత్తీర్ణత శాతం.. జేఈఈ మెయిన్‌లో రాణించిన అమ్మాయిలు..ఇవి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల వైపు అమ్మాయిలు మొగ్గుచూపుతున్నారనడానికి నిదర్శనం! ఒకప్పుడు ఇంజనీరింగ్ కోర్సులంటే.. అబ్బాయిలే కింగ్‌లు..ఆ ట్రెండ్ మారింది.. నేడు మేము సైతం అంటూ అమ్మాయిలు దూసుకుపోతున్నారు! ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత.. కోర్సులో అకడమిక్‌గా రాణించడం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించే దశ వరకు అమ్మాయిలు దీటుగా ముందడుగు వేస్తున్నారు. త్వరలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అమ్మాయిలు కోరుకుంటున్న బ్రాంచ్‌లు.. కెరీర్ అవకాశాలపై ఫోకస్.. జాతీయస్థాయిలో మెరుగవుతున్న తీరు ఇటీవల కాలంలో సాంకేతిక విద్యా సంస్థల్లో మహిళల సంఖ్య ఏటా క్రమేణా పెరుగుతోంది. పదేళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్ అంటే అబ్బాయిలే అనే భావన ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. బీటెక్ కోర్సుల్లో అమ్మాయిలు అబ్బాయిలకు దీటుగా పోటీపడుతున్నారు. జాతీయస్థాయిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో గత ఐదేళ్ల కాలంలో పురుషులు, మహిళల మధ్య నిష్పత్తి పరంగా వ్యత్యాసం తగ్గుతుండటం విశేషం. 2005 నుంచి 2010 వరకు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో పురుషులు-మహిళల నిష్పత్తి సగటున 10:1గా ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఆ నిష్పత్తి 7:1కు చేరడమే ఇంజనీరింగ్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోందనడానికి నిదర్శనం. ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అమ్మాయిలు చేరేలా ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ వంటి కోర్సుల్లో ప్రత్యేక స్కాలర్షిప్స్; మేనేజ్మెంట్ కోర్సుల్లో జండర్ డైవర్సిటీ వెయిటేజీ పేరిట ప్రత్యేక విధానాలు అమలు చేస్తుండటం అమ్మాయిలు ఆయా కోర్సుల్లో చేరేలా ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అంతేకాకుండా 33శాతం రిజర్వేషన్ విధానం కూడా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యా కోర్సుల్లో మహిళల సంఖ్య క్రమేణా పెరగడానికి తోడ్పడుతోంది. తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న మద్దతు కూడా అమ్మాయిలు ప్రొఫెషనల్ కోర్సుల్లో దూసుకుపోయేలా చేస్తోంది. కొన్ని బ్రాంచ్‌లపై ఆసక్తి బీటెక్ దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థినులు కొన్ని బ్రాంచ్‌లపైనే ఆసక్తి చూపుతున్నారు. సీఎస్ఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ బ్రాంచ్‌లనే తమ తొలి ప్రాథమ్యాలుగా పేర్కొంటున్నారు. వీటి ద్వారా కెరీర్ పరంగానూ మంచి జాబ్స్ లభిస్తాయని, కార్యాలయం దాటి బయటకు వచ్చే అవసరం లేకుండానే విధులు నిర్వహించొచ్చని ఆశిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఐఐటీల నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ వరకు అమ్మాయిలు ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌ల ఆధారంగా ఇది ప్రస్ఫుటమవుతోంది. సీఎస్ఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ద్వారా మంచి జీతభత్యాలు అందే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ల్యాబ్ ఎక్స్పరిమెంట్ సంబంధిత ఉద్యోగాలు పొందొచ్చు అనే అభిప్రాయం నెలకొంది. అందుకే ఎక్కువ శాతం ఈ బ్రాంచ్‌లకు ఓటేస్తున్నారు. కోర్ బ్రాంచ్‌లపై అనాసక్తి కోర్ బ్రాంచ్‌లైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి బ్రాంచ్‌లలో చేరేందుకు అమ్మాయిలు నేటికీ అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం ఉంది. సివిల్ ఇంజనీరింగ్; మెకానికల్ ఇంజనీరింగ్; ఆటోమొబైల్; మైనింగ్ తదితర బ్రాంచ్‌ల్లో రాణించాలంటే.. అకడమిక్ స్థాయి నుంచే ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్ విషయంలో ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫీల్డ్ వర్క్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న బ్రాంచ్‌లు ఇవి. అంతేకాకుండా కోర్ బ్రాంచ్‌ల ద్వారా లభించే జాబ్ నేచర్ కూడా అధిక శాతం మంది అమ్మాయిలు కోరుకునే ఇన్‌హౌస్ జాబ్‌కు భిన్నంగా ఉంటుందనే కారణంతో ఈ బ్రాంచ్‌ల్లో చేరే అమ్మాయిల శాతం ఏడు నుంచి పది శాతం మధ్యలోనే ఉంటోంది. కోర్ బ్రాంచ్‌లు.. ఫీల్డ్ వర్క్ తప్పనిసరా? కోర్ బ్రాంచ్‌లలో ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుందా.. అంటే పరిస్థితులు మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెకానికల్, సివిల్ వంటి వాటిలో సైతం ఆటోమేషన్ అమలవుతోంది. సాఫ్ట్వేర్స్ ఆధారంగా కంప్యూటర్స్ వినియోగిస్తూ కాలు కదపకుండా విధులు నిర్వర్తించే అవకాశముంది. ఆ సాఫ్ట్వేర్స్ వినియోగానికి సంబంధించిన నైపుణ్యాలు కూడా ఇప్పుడు అకడమిక్‌గానే లభిస్తున్నాయి. ఏసీ గదుల్లో పని చేయొచ్చనుకునే సీఎస్ఈ, ఐటీ వంటి బ్రాంచ్‌ల విషయంలోనూ ఇప్పుడు ఒక్కోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొబిలిటీ సమస్య ఎక్కువ మంది ఇబ్బందిగా భావిస్తున్న ‘మొబిలిటీ’ సమస్య సాంకేతికంగా అన్ని విభాగాల్లో సహజంగా మారింది. కాబట్టి మహిళలు సాఫ్ట్వేర్, సీఎస్ఈ వంటివి అనుకూల బ్రాంచ్‌లు.. సివిల్, మెకానికల్ వంటివి క్లిష్టమైన బ్రాంచ్‌లు అనే ధోరణి వీడాలనేది నిపుణుల అభిప్రాయం. ఆసక్తి ఉంటే కోర్ బ్రాంచ్‌ల్లోనైనా రాణించొచ్చని సూచిస్తున్నారు. ఆధునిక యుగంలో సానుకూల దృక్పథంతో అన్నిటా రాణించగలమనే మానసిక స్థైర్యంతో అమ్మాయిలు ముందడుగు వేయాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అమ్మాయిలకు బెస్ట్ బ్రాంచ్ ఏది! ఫలానా బ్రాంచ్ అమ్మాయిలకు బెస్ట్ బ్రాంచ్ అని తే ల్చలేం అంటున్నారు నిపుణులు. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే జాబ్ మార్కెట్ అవకాశాలు, నేచర్ ఆఫ్ జాబ్‌ను, జీతభత్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నది నిపుణుల అభిప్రాయం. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. సబ్జెక్ట్ నాలెడ్జ్, నైపుణ్యాలుండి ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో ప్రతిభను చూపడం ద్వారా మంచి అవకాశాలు అందుకోవచ్చు. ప్రస్తుతం సీఎస్ఈ బ్రాంచ్ వేతనాల విషయంలో కొంత ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ తదితర బ్రాంచ్‌లు నిలుస్తున్నాయి. ఆయా బ్రాంచ్‌ల్లోనే ఎన్నో స్పెషలైజ్డ్ విభాగాలు, దానికి అనుగుణంగా జాబ్ నేచర్ ఉంటోంది. సాధారణంగా సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ ఇంజనీర్లు ఇన్హౌస్లోనే పనిచేస్తుంటే.. సివిల్ ఇంజనీర్‌కు సైట్లో ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలో విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి, అవకాశాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు!! ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో ప్రవేశిస్తున్న విద్యార్థినులు ఉన్నత విద్య, పరిశోధన వంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే వీటికి ఆస్కారం కల్పించే కెమికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ వంటి కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. వాళ్లు లేబొరేటరీల్లో రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు ఉండి తమ ల్యాబ్ వర్క్ పూర్తి చేసుకున్నాకే ఇంటికి వెళుతున్నారు. వారు ఇంజనీరింగ్‌లో నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారనడానికి ఇవే నిదర్శనాలు. - ప్రొఫెసర్ ఎ.జయశ్రీ, డెరైక్టర్, ఐఎస్టీ, జేఎన్టీయూహెచ్. అమ్మాయిలు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్లివే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్. వీటిలో అబ్బాయిలకు దాదాపు సమానంగా అంటే.. 45 నుంచి 50 శాతం మధ్యలో విద్యార్థినుల సంఖ్య ఉంటోంది. -
రేపే ఏపీ ఎంసెట్
బాలాజీచెరువు(కాకినాడ): ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించే ఏపీ ఎంసెట్-2016కు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 355 కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ 191 కేంద్రాల్లోను జరుగుతుందన్నారు. హైదరాబాద్ జోన్-ఎలో 12, జోన్-బిలో 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ. 10 వేల ఫైన్‌తో హాజరయ్యే 88 మందికి కాకినాడ జేఎన్టీయూలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. -
ఆసెట్‌కు 21,586 దరఖాస్తులు
* 27 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు * మే 5 నుంచి ప్రవేశ పరీక్షలు ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ, సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షకు 21,586 దరఖాస్తులు వచ్చినట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఒ.అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సెట్‌కు 18,546, ఆఈట్‌కు 2,210, ప్రవేశ పరీక్ష అవసరం లేకుండా ప్రవేశం కల్పించే కోర్సులకు 830 దరఖాస్తులు వచ్చాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే.. లైఫ్ సెన్సైస్‌కు 3001, ఫిజికల్ సైన్స్‌లో 1655, మ్యాథ్‌మెటిక్స్ సైన్స్‌లో 2372, కెమికల్ సెన్సైస్‌కు 4581, జియాలజీలో 244, హ్యూమానిటీస్, సోషల్ సైన్స్‌కు 5319, ఇంగ్లిష్‌కు 736, తెలుగులో 638 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష వేళలివి.. ప్రవేశ పరీక్షలను మే 5, 6 తేదీలలో నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు లైఫ్ సైన్స్, జియాలజీ కోర్సులకు, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హ్యూమానిటీస్, సోషల్సెన్సైస్కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు, ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులకు, మే 6వ తేదీ ఉదయం 9 గంటలకు కెమికల్ సెన్సైస్, 11.30 గంటలకు మ్యాథమెటికల్ సెన్సైస్, మధ్యాహ్నం 2.30 గంటలకు ఫిజికల్ సెన్సైస్, ఇంగ్లిష్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు... విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య, గాయత్రీ విద్యా పరిషత్, ఏయూ ఆర్ట్స్ కళాశాల, దూరవిద్యా కేంద్రం, శ్రీకాకుళం గాయత్రీ సైన్స్, మేనేజ్మెంట్ కళాశాల, విజయనగరం ఎంఆర్ అటానమస్ కళాశాల, కాకినాడ ఐడియల్ కళాశాల, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి పీజీ కళాశాల, భీమవరం కె.జి.ఆర్.ఎల్ కళాశాల, విజయవాడ ఎస్.ఆర్.ఆర్, సివిఆర్ డిగ్రీ కళాశాల, గుంటూరు జేకేజీ కళాశాల, అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో ఆసెట్ పరీక్షలు జరుగుతాయి. ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ (ఆఈట్) ప్రవేశ పరీక్ష విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల(ఎంవిపీ కాలనీ), డాక్టర్ ఎల్.బి.కళాశాల, ఏయూ దూరవిద్యా కేద్రం, కాకినాడ ఐడియల్ కళాశాల, విజయవాడ ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష జరుపుతారు. ఈ నెల 27వ తేదీ నుంచి www.audoa.in.www.andhrauniversity.edu.in/doa వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును. శారీరక వైకల్యం కలిగిన వారు ముందుగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించి సహాయకుడి అనుమతి పొందవచ్చును. పరీక్ష కేంద్రంలో ఒక గంట ముందుగా విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తరువాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి నేడు ఒకటి నుంచి 15 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒకటో ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. నూతన విధానం అమలు.. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని కళాశాలలను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలో హెల్ప్‌లైన్ కేంద్రంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు భద్ర పరచుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థి సంబంధిత కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సిన విధానం గత ఏడాది వరకు ఉండేది. తాజా మార్పుల ప్రకారం సీట్ అలాట్మెంట్ అయ్యాక విద్యార్థి కోరుకున్న కళాశాలలో సీటు రాని పక్షంలో తనకు ఇచ్చిన పాస్వర్డ్ ఆధారంగా ఆన్లైన్లో పూరించే వివరాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ రైట్ మార్క్ వేస్తే సరిపోతుంది. దీంతో తదుపరి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. ఇందుకోసం వెబ్ కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు అత్యంత గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. నేటి కౌన్సెలింగ్ ఇలా.. గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు హాజరుకావాలి. ఎస్టీ విభాగ విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలనకు గుంటూరులో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాల్సి ఉంది. ఏఎన్‌యూలో.. ఏఎన్‌యూ: ఏఎన్‌యూ ఆన్లైన్ సెంటర్లో ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏఎన్‌యూ ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సింహాచలం, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. రామచంద్రన్‌లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ఓపెన్, బీసీ కేటగిరీల అభ్యర్థులు 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు 450 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఒరిజినల్ మార్కుల జాబితాలు, ఆరు నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హత ఉన్నవారు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ కార్డు , అన్ని పత్రాల ఒక సెట్ జిరాక్సు కాపీలను తప్పకుండా తెచ్చుకోవాలని సూచించారు. -
బీటెక్ తర్వాత దారులెన్నో
మనదేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసుకుంటున్నారు. వీరిలో చాలామందికి తమ భవిష్యత్ కెరీర్‌పై స్పష్టత ఉండటం లేదు. ఉన్నత విద్యవైపు అడుగులు వేయాలా? ఉన్నతోద్యోగం వైపు దృష్టి సారించాలా? ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహంతో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ఉండే ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలపై విశ్లేషణ.. ఉన్నత విద్య ఎంటెక్ బీటెక్ పూర్తయ్యాక ఉన్నత విద్యనభ్యసించాలంటే మనదేశంలో, విదేశాల్లో అనేక అవకాశాలున్నాయి. మనదేశంలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) రాసి ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సులు అభ్యసించొచ్చు. ఈసారి ఐఐటీ- కాన్పూర్.. గేట్-2015ను నిర్వహిస్తోంది. ఏటా ఫిబ్రవరి మొదటి/రెండో వారంలో ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. ప్రస్తుతం గేట్ పరీక్షలు జరుగుతున్నాయి. గేట్ ఉత్తీర్ణతతో ఎంఈ/ఎంటెక్‌లో చేరితే ప్రతి నెలా రూ.12,400 స్కాలర్షిప్ కూడా పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరమయ్యేవారికి కొన్ని కార్పొరేట్ సంస్థలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) వంటి సంస్థలు చేయూతనందిస్తున్నాయి. భారీ మొత్తాల్లో స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు అందిస్తున్నాయి. మరిన్ని వివరాలకు www.ugc.ac.in, www.dst.gov.in చూడొచ్చు. వివిధ బ్యాంకులు కూడా విద్యా రుణాలను అందిస్తూ బాసటగా నిలుస్తున్నాయి. విదేశీ విద్య బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించడమే అంటే అతిశయోక్తి కాదు. విదేశాల్లో చదవాలంటే జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలు రాసి అందులో మంచి స్కోర్ సాధించాలి. తర్వాత ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుని చేరాలనుకుంటున్న యూనివర్సిటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ముందుగానే పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేసి ఉంచుకోవాలి. సంబంధిత యూనివర్సిటీలో ప్రవేశం ఖరారయ్యాక వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ets.org/toefl, www.ets.org/gre చూడొచ్చు. మేనేజ్మెంట్ కోర్సులు బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు మేనేజ్మెంట్ కోర్సులపైనే ఉంటుంది! కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్), జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ), కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) వంటి ప్రవేశ పరీక్షలు రాసి బీస్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సులు అభ్యసించొచ్చు. అయితే మిగతా మేనేజ్ మెంట్ ఎంట్రెన్స్ టెస్టుల కంటే క్యాట్‌కు ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతుంటారు. ఎందుకంటే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ల్లో పీజీ మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించాలంటే క్యాట్‌లో స్కోర్ తప్పనిసరి. మన రాష్ట్రంలో ఎంబీఏ కోర్సులు అభ్యసించాలంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్)లో ర్యాంకు సాధించాలి. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎంబీఏ చదవొచ్చు. విదేశాల్లో మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించాలంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) లాంటి పరీక్షల్లో మంచి స్కోరు సాధించాలి. విదేశాలనగానే చాలామందికి అమెరికా మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ మంచి విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిని కూడా విద్యార్థులు పరిశీలించి మంచి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం సంబంధిత యూనివర్సిటీల వెబ్సైట్లతోపాటు కెరీర్ ఓరియెంటెడ్ వెబ్‌పోర్టళ్లను చూడాలి. పీహెచ్డీ ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలంటే ఆవిష్కరణలు జరగాలి. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) వంటి వాటి ద్వారా పరిశోధనలకు పెద్దపీట వేస్తోంది. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తే అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వివిధ పరిశోధనశాలల్లో శాస్త్రవేత్తగా పనిచేయొచ్చు. అదేవిధంగా వర్సిటీల్లో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించవచ్చు. ప్రతి ఏటా సీఎస్ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో జేఆర్ఎఫ్ సాధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ చదువుతూ మొదటి రెండేళ్లు నెలకు * 25 వేల స్కాలర్షిప్ పొందొచ్చు. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ హోదా కల్పిస్తారు. అంతేకాకుండా ప్రతినెలా * 28,000 స్కాలర్షిప్ లభిస్తుంది. ఇతర ఖర్చులకోసం ప్రతి ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌ను చెల్లిస్తారు. జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ కలిపి మొత్తం ఐదేళ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. ఉద్యోగాలు ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో బీటెక్ చదివినవారు మంచి ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి లక్షల జీతాలతో ఎంపికవుతున్నారు. కానీ అంతగా పేరులేని కళాశాలల్లో చదివిన విద్యార్థులు సరైన ఉద్యోగావకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. కోరుకున్న ఉద్యోగం పొందాలంటే అభ్యర్థికి కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ ఉండడం తప్పనిసరి. కాబట్టి ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ వంటివాటిని పెంపొందించుకోవాలి. టీచింగ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉన్నత విద్య అవసరాన్ని గుర్తించాయి. ఈ దిశగా ఎన్నో విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ప్రైవేటు రంగంలో అనుమతించిన విశ్వవిద్యాలయాలే కాకుండా, రానున్న ఐదేళ్లకాలంలో మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటిలో బోధన రంగంలో అపార అవకాశాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రానున్న కాలంలో ఎక్కువ ఉద్యోగాలు బోధన రంగంలోనే ఉంటాయన్నది నిర్వివాదాంశం. ఎంఈ/ఎంటెక్/పీహెచ్డీ పూర్తిచేస్తే అపార అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు.. చక్కటి అవకాశం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జాతీయ స్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే.. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. ప్రభుత్వ రంగంలో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించే అద్భుత అవకాశం సొంతమవుతుంది. ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి ఏడాది నుంచే ఈ పరీక్షకు సిద్ధమైతే సులువుగా విజయం సాధించొచ్చు. తద్వారా అత్యున్నత స్థాయికి చేరొచ్చు. ఈ పరీక్ష ద్వారా ఈ కింది విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేసే విభాగాలు.. ⇒ ఇండియన్ రైల్వే సర్వీస్ అ ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్ ⇒ సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్ ⇒ ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ ⇒ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ ⇒ బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ అ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణత. వయోపరిమితి: ప్రకటనలో నిర్దేశించిన తేదీ నాటికి 21-30 ఏళ్లు. మొత్తం నాలుగు బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. అవి.. సివిల్ (కేటగిరీ-1), మెకానికల్ (కేటగిరీ-2), ఎలక్ట్రికల్ (కేటగిరీ-3) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (కేటగిరీ-4). ఎంపిక: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) అనే రెండు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్: upsc.gov.in కొన్ని ప్రవేశ పరీక్షలు గేట్ దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) -బెంగళూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్లు)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్‌తో ఎంటెక్/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రాథమిక స్థాయి నియామకాలకు గేట్ స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఎంటెక్‌లో సీటు, ఉద్యోగం.. ఈ రెండు లక్ష్యాలను.. సాధించే అవకాశాన్ని గేట్ కల్పిస్తోంది. ఐఐఎస్సీ, ఏడు ఐఐటీలు కలిసి సంయుక్తంగా గేట్‌ను నిర్వహిస్తున్నాయి. అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ (10+2 తర్వాత నాలుగేళ్లు)లలో బ్యాచిలర్స్ డిగ్రీ. లేదా మ్యాథ్స్/సైన్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ/చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నిర్దేశించిన విధంగా ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా ఏఎంఐఈ వంటి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. రిక్రూట్మెంట్కు కూడా: ప్రతిష్టాత్మక సంస్థ ఆధ్వర్యంలో.. పారదర్శకతతో కూడిన నిర్వహణ కావడంతో పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్మెంట్ కోసం గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. రిక్రూట్మెంట్స్ కోసం ఆయా సంస్థలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆ స్కోరు ఆధారంగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. అధిక శాతం వెయిటేజీ మాత్రం ఇస్తున్నాయి. దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్లకు కేటాయిస్తున్నాయి. నోటిఫికేషన్ సమయంలో ఆ వివరాలను వెబ్సైట్లో పేర్కొంటాయి. వెబ్సైట్: http://gate.iitk.ac.in/GATE2015/ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహణ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు) అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అర్హులే. ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, రిటెన్ ఎబిలిటీ టెస్ట్/అకడమిక్ రికార్డ/పని అనుభవం/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూల ద్వారా.. పరీక్ష: క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రవేశం: మనదేశంలో ఐఐఎంలే కాకుండా దాదాపు ప్రముఖ బిజినెస్ స్కూళ్లన్నీ క్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. వెబ్సైట్: www.catiim.in ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్టార్టప్స్ ఈ మధ్య కాలంలో అందరినోటా వినిపిస్తున్న పదాలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ (ఈ-సెల్)లు ఉన్నాయి. ఉద్యోగం కంటే సొంతంగా స్వయం ఉపాధిని పొందాలనుకునేవారికి ఇవి అండగా నిలుస్తున్నాయి. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఫండింగ్‌ను కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్టప్ ఏర్పాటుకు సహాయ సహకారాలు, విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు అందించడంతోపాటు స్టార్టప్స్‌పై వర్కషాప్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలే కాకుండా బిట్స్ పిలానీ క్యాంపస్‌లు, ఐఐఐటీ-హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు కూడా స్టార్టప్స్‌కు మంచి ప్రోత్సాహం అందిస్తున్నాయి. ప్రస్తుతం జాబ్ మార్కెట్ బాగుంది! ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంతో బాగుంది. ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాలనుకునేవారు ఎంటెక్ లేదా ఎంబీఏ కోర్సులను అభ్యసించొచ్చు. ఎంటెక్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ పూర్తికాగానే చేయడం మంచిది. ఎంబీఏ చేయాలనుకునేవారు కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి అనుభవం పొందిన తర్వాత తమ చదువును కొనసాగించొచ్చు. దేశంలో ప్రముఖ బీ-స్కూల్స్ సైతం వర్క్ఎక్స్పీరియన్స్ ఉన్నవారి కోసం ప్రత్యేక మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులో భాగంగా కేస్ స్టడీస్‌కు వారి పని అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘గేట్’ రాయడం ద్వారా ఉన్నత విద్య అవకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. - వి. ఉమామహేశ్వర్, ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ -
చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్..
ప్రస్తుత విద్యార్థుల్లో, మన స్నేహితుల్లోనో, బంధువుల్లోనో రంజిత్, వెంకట్, సురేశ్ లాంటివారెందరో కనిపిస్తుంటారు. ఎన్నో కారణాలతో కోర్సు, కెరీర్ ఎంపిక విషయంలో రాజీ ధోరణితో వ్యవహరించి ఆపై అనాసక్తంగా, అయిష్టంగా అకడమిక్స్‌తో భారంగా కాలం వెళ్లదీస్తూ.. మానసికంగా కుంగిపోతున్న వారెందరో..! ఇలాంటి వారందరూ ఇప్పుడు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులు అభ్యసించొచ్చు. అన్నిటికీ మించి మనసు మెచ్చే కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు.అందుకు మార్గం.. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్). దేశంలోని విద్యాసంస్థల్లో అందిస్తున్న కోర్సుల్లో ఏకరూపత, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెంచే దిశగా యూజీసీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమే.. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)పై ఫోకస్.. 1. రంజిత్‌కు ఇంజనీరింగ్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఆసక్తి. కానీ ఎంట్రెన్స్‌లు, ప్రవేశాల నిబంధనల కారణంగా ఇంజనీరింగ్‌లో సీటు పొందలేకపోయాడు. ప్రస్తుతం బీకాం చదువుతున్నాడు. కానీ మనసంతా ఇంజనీరింగ్ కోర్సుపైనే! 2. వెంకట్.. ఓ సాధారణ కళాశాలలో బీఎస్సీ అభ్యసిస్తున్నాడు. వాస్తవానికి మంచి కాలేజీలో చేరాలనే అభిలాష. పరిస్థితులు అనుకూలించక సీటు దొరికిన కళాశాలలోనే చదువుతున్నాడు. కానీ భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో రాణించగలనా..? అనే బెంగ!! 3. సురేశ్.. డిగ్రీలో ఉండగానే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మరో సంవత్సరంలో డిగ్రీ పూర్తవుతుందనగా.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కోర్సు పూర్తిచేయలేకపోయాననే దిగులు.. రెండేళ్లు చదివిన చదువు వృథాగా పోయిందనే బాధ.. ఉన్నత కోర్సులు అభ్యసించడానికి వీలులేదా? అనే ఆందోళన!!! మీ కెరీర్ ఎంపిక.. మీ చేతుల్లోనే సీబీసీఎస్ అంటే ఐఐటీలు, బిట్స్ వంటి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో కొన్నేళ్ల క్రితం నుంచే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అమలవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీలు తప్పనిసరిగా సీబీసీఎస్ విధానం అమలు చేయాలని యూజీసీ తాజాగా మార్గనిర్దేకాలు జారీ చేయడంతో ఇప్పుడిది అందరి నోటా వినిపిస్తోంది. దాంతో అసలు సీబీసీఎస్ అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే ప్రశ్నలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తలెత్తున్నాయి. సీబీసీఎస్ అంటే.. ఏదైనా ఒక కోర్సులో చేరిన విద్యార్థి కోర్ సబ్జెక్ట్‌లకు తగిన ప్రాధాన్యమిస్తూనే.. వాటిని మేజర్ సబ్జెక్ట్స్‌గా చదువుతూ... కోర్సుతో సంబంధం ఉన్నా, లేకున్నా తనకు ఇష్టమైన ఇతర సబ్జెక్ట్‌లను అదనంగా మైనర్/ఎలక్టివ్స్‌గా అభ్యసించేందుకు అవకాశం కల్పించే విధానం. దీనివల్ల విద్యార్థులకు ప్రధానంగా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లభిస్తుంది. ఫలితంగా.. భవిష్యత్తులో ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా కెరీర్ అవకాశాలను విస్తృతం చేసుకునే వీలుంటుంది. యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ కేవలం విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్కే పరిమితం కాకుండా.. కరిక్యులం, టీచింగ్-లెర్నింగ్ విధానాలు, మూల్యాంకనం, ఫలితాల్లో విస్తృత మార్పులకు నాంది పలుకనుంది. కీలక మార్పు.. క్రెడిట్స్ సీబీసీఎస్ విధానంతో అకడమిక్స్‌లో రానున్న కీలక మార్పు.. క్రెడిట్స్. ఇప్పటివరకు ఏదైనా కోర్సును ఎంచుకుంటే.. సంబంధిత కోర్సులోని ఒక్కో సబ్జెక్ట్‌కు గరిష్టంగా కేటాయించిన మార్కులకు విద్యార్థులు పొందిన మార్కులు గణనలోకి వచ్చేవి. తాజా విధానంలో ఒక గ్రూప్‌లోని ప్రతి సబ్జెక్ట్‌కు దాని పరిధి, ప్రాధాన్యత ఆధారంగా సెమిస్టర్ వ్యవధిలో.. టీచింగ్-లెర్నింగ్ అంశాలను పరిగణిస్తూ గరిష్టంగా కొన్ని క్రెడిట్స్ కేటాయిస్తారు. ఇది ప్రతి సబ్జెక్ట్‌కు మారుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్న ఐఐటీ-హైదరాబాద్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. సెమిస్టర్లో వారానికి మూడు లెక్చర్స్ చొప్పున సెమిస్టర్‌కు గరిష్టంగా 42 లెక్చర్స్ ఉండే ఒక సబ్జెక్ట్‌కు మూడు క్రెడిట్స్ ఇచ్చే విధానం అమలవుతోంది. ఈ క్రెడిట్స్ సంఖ్యలోనూ సెమిస్టర్ వారీగా మార్పులు ఉంటాయి. మొదటి సెమిస్టర్లో 18 క్రెడిట్స్ ఉంటే.. రెండో సెమిస్టర్లో 15.5 క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థుల అభీష్టానికే పెద్దపీట క్రెడిట్ సిస్టమ్‌లో మరో ముఖ్యమైన అంశం.. అభ్యసనం పరంగా విద్యార్థుల అభీష్టానికే పెద్దపీట వేయడం. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి క్లాస్ రూం టీచింగ్, ప్రాక్టికల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలా సంబంధిత అన్ని అంశాల సమ్మేళనంతో గరిష్టంగా నిర్దిష్ట సంఖ్యలో క్రెడిట్స్ కేటాయిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పొందాల్సిన క్రెడిట్స్‌ను కూడా నిర్దేశిస్తారు. ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశం. తమ సొంత శైలిలో అభ్యసన మార్గాలను ఎంచుకునేందుకు ఈ క్రెడిట్ సిస్టమ్ ఆస్కారమిస్తుంది. ఇష్టమున్నా, లేకున్నా గంటల తరబడి క్లాస్ రూంలో కూర్చోవాలనే పరిస్థితులకు స్వస్తి పలుకుతుంది. బిట్స్ ఈ విషయంలో ఇప్పటికే ముందంజలో ఉంది. బిట్స్ క్యాంపస్‌ల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ పేరుతో అమలు చేస్తున్న విధానం ప్రకారం.. విద్యార్థులకు కచ్చితంగా క్లాస్‌కు హాజరుకావాలనే నిబంధన నుంచి వెసులుబాటు లభిస్తోంది. దీంతో తమకు నచ్చిన రీతిలో క్లాస్‌రూం అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. పాఠాలపై పట్టు సాధించొచ్చు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ దిశగా సీబీసీఎస్‌లోని మరో ప్రధాన అంశం.. విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెంచడం. తాజాగా యూజీసీ జారీ చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం- ఒక గ్రూప్‌లో కోర్సుల స్వరూపాన్ని మూడు రకాలుగా నిర్ణయించింది. అవి.. కోర్ కోర్సు: ఒక గ్రూప్‌నకు సంబంధించి తప్పనిసరి అయిన కోర్ సబ్జెక్ట్‌లు అభ్యసించడం. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్ కోర్సులనే మేజర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఎలక్టివ్ కోర్సు: కోర్ గ్రూప్, సబ్జెక్ట్స్‌తో సంబంధం లేకుండా విద్యార్థుల ఆసక్తి మేరకు తమకు నచ్చిన సబ్జెక్ట్‌లను అభ్యసించేందుకు వీలు కల్పించే కోర్సులు. ఉదాహరణకు బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎకనామిక్స్ వంటి కోర్సులు. ఈ తరహా టీచింగ్-లెర్నింగ్ విధానం అమలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని యూజీసీ నిర్దేశించింది. ఫలితంగా విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లభిస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో ఎలక్ట్రిక్ పరికరాల తయారీలో అవసరమయ్యే మెకానికల్ నైపుణ్యాలను సొంతం చేసుకునే విధంగా మెకానికల్‌ను సైతం ఎలక్టివ్సగా ఎంచుకోవచ్చు. ఫౌండేషన్ కోర్సు: ఒక గ్రూప్‌నకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పించే కోర్సులివి. యూజీసీ తాజా నిర్దేశకాల ప్రకారం- ఫౌండేషన్ కోర్సును కూడా కంపల్సరీ ఫౌండేషన్, ఎలక్టివ్ ఫౌండేషన్ అని రెండు రకాలుగా వర్గీకరించింది. కంపల్సరీ ఫౌండేషన్ ఉద్దేశం విద్యార్థి చేరిన గ్రూప్‌లో ప్రాథమిక అవగాహన కల్పించడం. ఇది అన్ని కోర్సులకు తప్పనిసరి. ఎలక్టివ్ ఫౌండేషన్ మాత్రం విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు. దీనివల్ల మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ సొంతమవుతుంది. సీఎస్ఈ విద్యార్థి లిబరల్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌ను అభ్యసించొచ్చు. అంటే.. కోర్ అవసరాల దృష్ట్యా కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ చేస్తూనే వ్యక్తిగత ఆసక్తి మేరకు కథక్ నృత్యాన్నో లేదా సంగీతాన్నో అధ్యయనం చేయొచ్చు. నిరంతర మూల్యాంకనం సీబీసీఎస్ విధానంలో మరో ప్రత్యేకత.. నిరంతర మూల్యాంకన విధానం. ఒక ఏడాది కోర్సును ఆరు నెలల వ్యవధి చొప్పున రెండు సెమిస్టర్లుగా విభజిస్తారు. 15 నుంచి 18 వారాల వ్యవధిలో ఉండే ఒక్కో సెమిస్టర్లో గరిష్టంగా 90 టీచింగ్ అవర్స్ ఉండాలి. కోర్సుకు గరిష్టంగా కేటాయించిన క్రెడిట్స్, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారికి క్రెడిట్స్ కేటాయిస్తారు. కోర్ కోర్సుల విషయంలో మాత్రం మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం తగ్గకుండా సెమిస్టర్ చివర్లో థియరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మార్కుల స్థానంలో గ్రేడింగ్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క మార్కు తక్కువ వచ్చినా పర్సంటేజీల్లో తేడాలు వచ్చి.. ఎంతో వెనుకంజలో ఉంటాం, అవకాశాలు దూరమవుతాయే మోనని విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో అకడమిక్ పర్సంటేజీలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇకపై ఇలాంటి పరిస్థితి నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. సీబీసీఎస్‌లో భాగంగా అన్ని గ్రూప్‌ల్లో, అన్ని స్థాయిల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా ఎస్‌జీపీఏ (సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్), సీజీపీఏ (క్యుమిలేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్) విధానాలు అమలుకానున్నాయి. సెమిస్టర్లో ఒక కోర్సుకు కేటాయించిన గరిష్ట క్రెడిట్స్, విద్యార్థి పొందిన గ్రేడ్ పాయింట్‌ను గుణించి వాటి మొత్తం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఉదా.. ఒక సెమిస్టర్లో మూడు క్రెడిట్లు ఉన్న కోర్సులో 10 గ్రేడ్ పాయింట్లు పొందితే లభించే క్రెడిట్ పాయింట్స్ 30. ఇది ‘ఒ’ (ఎక్సలెంట్) గ్రేడ్‌కు సమానం. ఇలా ప్రతి కోర్సుకు సెమిస్టర్ వారీగా క్రెడిట్, గ్రేడ్ పాయింట్లను లెక్కించి.. కోర్సు పూర్తయ్యేనాటికి విద్యార్థి పొందిన క్రెడిట్ పాయింట్స్ మొత్తం ఆధారంగా గ్రేడ్ జారీ చేస్తారు. మార్కుల నుంచి గ్రేడ్లకు మార్చే క్రమంలో ఉన్నత విద్యకు అవసరమైన కనీస అర్హత మార్కులకు సరితూగే విధంగా ఈ గ్రేడ్లు ఉంటాయి. ఉదాహరణకు యూజీసీ నెట్‌కు కనీస అర్హత పీజీలో 55 శాతం మార్కులు. దీన్ని పరిగణనలోకి తీసుకుని 55 శాతం మార్కుల శ్రేణిని బి+ లేదా బిగా ఉండేలా చూడాలని యూజీసీ పేర్కొంది. మెచ్చిన కాలేజీకి మార్గం సీబీసీఎస్ విధానంలో విద్యార్థులకు ఎంతో మేలు చేసే అంశం.. మెచ్చిన కాలేజీలో అభ్యసనం చేసే అవకాశం లభించనుండటం. క్రెడిట్ ట్రాన్స్ఫర్ పేరుతో అమలు చేయనున్న కొత్త విధానంలో.. ఒక కళాశాలలో కొన్ని క్రెడిట్స్ పొందిన విద్యార్థి కొన్ని రోజుల తర్వాత మరో కళాశాల లేదా యూనివర్సిటీకి తన ఎన్‌రోల్‌మెంట్‌ను బదిలీ చేసుకొని కోర్సును కొనసాగించొచ్చు. మౌలిక సదుపాయాల లేమి, ఫ్యాకల్టీ కొరత వంటి సమస్యలున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో అభ్యసిస్తున్న లక్షల మంది విద్యార్థులు ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌తో మేలైన ఫలితాలు, మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ‘డిస్కంటిన్యూ’ బెంగకు స్వస్తి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో భాగంగా అమలు చేయనున్న క్రెడిట్ ట్రాన్స్ఫర్ విధానంతో ఆయా కోర్సులను మధ్యలో ఆపేసిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తాజా విధానంతో ఏదైనా కోర్సులో చేరి మధ్యలో ఆపేసిన విద్యార్థులు మళ్లీ తమ కోర్సు కొనసాగించొచ్చు. అప్పటివరకు పొందిన క్రెడిట్స్ లేదా మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. విద్యార్థుల కోణంలో విలువైన సమయం వృథా అయిందనే బెంగ తీరడంతోపాటు కోర్సును పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అదనపు కోర్సులు, క్రెడిట్స్ సీబీసీఎస్ విద్యార్థులకు అందనున్న మరో అద్భుత అవకాశం.. అదనపు కోర్సులు, క్రెడిట్స్ పొందే వీలు లభించడం. నిర్దిష్ట వ్యవధిలోని ఒక ప్రోగ్రామ్ (ఇప్పటివరకు కోర్సు)లో చేరిన తెలివైన విద్యార్థి సదరు ప్రోగ్రామ్‌కు కేటాయించిన గరిష్ట క్రెడిట్స్‌ను, కనీస అర్హత క్రెడిట్స్‌ను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన సమయంలో వేరే కోర్సులను అభ్యసించి అదనపు క్రెడిట్స్ సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు బహుముఖ నైపుణ్యాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. మారనున్న స్వరూపాలు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో భాగంగా ఇప్పటివరకు మనం కోర్సు, డిగ్రీగా భావిస్తున్న వాటి పిలుపులు కూడా మారనున్నాయి. ఇక నుంచి కోర్సులను (డిగ్రీ, డిప్లొమా, పీజీ) ప్రోగ్రామ్‌లుగా పేర్కొననున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పేపర్‌గా పిలుస్తున్న సబ్జెక్ట్‌లు ఇక పై కోర్సులుగా మారనున్నాయి. ఇలా స్వరూపం నుంచి సర్టిఫికేషన్ వరకూ.. పలు కొత్త మార్పులకు నాంది పలకనున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్.. యువత సమర్థ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు మార్గం వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీసీఎస్.. సాధ్యమేనా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అమలు దిశగా యూజీసీ శరవేగంగా కదులుతుండగా.. మరోవైపు ఈ విధానం మన దేశంలో అమలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా మొదలైంది. ప్రస్తుతం దేశంలో యూనివర్సిటీల స్థాయిల్లో కోర్సులు, సిలబస్, టీచింగ్-లెర్నింగ్ విధానాలు వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సిలబస్, కరిక్యులం రూపొందిస్తేనే సీబీసీఎస్ ద్వారా సత్ఫలితాలు ఆశించడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న సీబీసీఎస్ సమర్థంగా అమలు కావాలంటే మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి. కానీ రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లో అధిక శాతం యూనివర్సిటీలు ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సీబీసీఎస్ వాస్తవ ఉద్దేశం నెరవేరాలంటే ముందుగా ఇన్స్టిట్యూట్ల స్థాయిలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. క్షేత్ర నైపుణ్యాల దిశగా.. యూజీసీ రూపొందించిన సీబీసీఎస్ విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే క్షేత్ర నైపుణ్యాలు అందించేందుకు దోహదపడుతుంది. ప్రాక్టికాలిటీ, నిరంతర మూల్యాంకనం వంటి విధానాలతో విద్యార్థుల అకడమిక్‌గా ప్రతిభావంతులవుతారు. అదే విధంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ విధానం ఫలితంగా.. కోర్సు, కాలేజీ ఎంపికలో ఎంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది. కరిక్యులం, సిలబస్ రూపకల్పన వంటి విషయాల్లో సహకరించేందుకు యూజీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే సీబీసీఎస్ లక్ష్యం. - డాక్టర్ డి.ఎన్.రెడ్డి, చైర్మన్ డీఆర్డీఓ-ఆర్ఏసీ, యూజీసీ సభ్యులు ఆచరణ సాధ్యమే.. దేశంలోని యూనివర్సిటీల్లో వేర్వేరు సిలబస్‌లు, బోధన పద్ధతులు అమలవుతున్న తరుణంలో సీబీసీఎస్ ఆచరణ సాధ్యమేనా అని సందేహించక్కర్లేదు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో విజయవంతమైన ఈ విధానం రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లోనూ సమర్థంగా అమలు చేయొచ్చు. సీబీసీఎస్‌కు సంబంధించి యూజీసీ త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వనుంది. దాని మేరకు కరిక్యులంలోనూ ఏకరూపత (యూనిఫార్మిటీ) లభించే అవకాశాలున్నాయి. అది కార్యరూపం దాల్చితే సీబీసీఎస్ విజయవంతం అవుతుంది. - ప్రొఫెసర్ మొహమద్ మియాన్, వీసీ-మనూ (యూజీసీ సభ్యులు) మేలైన నిర్ణయం.. సీబీసీఎస్‌లో పేర్కొన్న పలు అంశాల ప్రకారం- విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. థియరిటికల్ నాలెడ్జ్, మార్కులు/పర్సంటేజిలు అనే ఆలోచనలకు దూరంగా ఉంచేసీబీసీఎస్ ఎంతో అవసరం. కానీ ఈ విధానాన్ని అమలు చేయాలంటే ముందస్తు కసరత్తు చేయాలి. ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచి అవసరమైన మార్పులు తేవాలి. విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.ఇప్పటికే బిట్స్ క్యాంపస్‌ల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. ఫలితంగా విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు పెంచుకుంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులు సీబీసీఎస్ విధానాన్ని కోర్ నైపుణ్యాలను పెంచుకునేందుకు సాధనంగా ఉపయోగించుకోవాలి. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు, డెరైక్టర్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్ టెక్నికల్ విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలు.. సీబీసీఎస్ వల్ల టెక్నికల్ విద్యార్థులు విభిన్న రంగాల్లో నైపుణ్యాలు పొందొచ్చు. ఇలాంటి విధానం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. ఇంజనీరింగ్ విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో పలు విభాగాల (మార్కెటింగ్, అకౌంట్స్, ఫైనాన్స్ తదితర) వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోర్ సబ్జెక్ట్లే కాకుండా.. ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్ చేతికి చేరే వరకు అవసరమైన అన్ని విభాగాల గురించి అవగాహన పొందడం కెరీర్ పరంగా కలిసొస్తుంది. దీనికి సీబీసీఎస్‌లోని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ మార్గం వేస్తుంది. ఇప్పటికే ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇలాంటి విధానాలు అమలవుతున్నాయి. - ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్ (అకడమిక్స్), ఐఐటీహెచ్ -
ఇంజనీరింగ్ విద్యకు వివిధ మార్గాలు..
ఏటా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు.. వివిధ రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దోహదం చేస్తున్న ఎంట్రెన్స్ టెస్టులు, వాటి వివరాలు... మన ఇంటర్మీడియెట్ సిలబస్ అన్ని జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సరిపోతుంది. ప్రశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టత, మార్కులు వంటి అంశాల్లో మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ పరంగా కొంత సమన్వయం చేసుకోగలిగితే అన్ని ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఇంటర్‌తో సమాంతరంగా సిద్ధం కావచ్చు. అంతేకాకుండా ఒక పరీక్షకు మరొ పరీక్షకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది. ఈ సమయం కూడా సంబంధిత పరీక్షకు చక్కగా సన్నద్ధమవ్వడానికి దోహద పడుతుంది. ఇంటర్మీడియెట్ తర్వాత: ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలుంటాయి కాబట్టి మొత్తం సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఇంటర్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. భిన్నంగా: కొన్ని ఇన్స్టిట్యూట్లు ప్రవేశపరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోపాటు ఇంగ్లిష్, ఇతర విభాగాల్లో కూడా ప్రశ్నలు ఇస్తున్నాయి. బిట్‌శాట్‌లో లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీపై ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ కోసం బొమ్మల చిత్రీకరణ, అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ కోసం సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి. ఎంసెట్ ఇతర ఎంట్రెన్స్‌లతో పోలిస్తే ఎంసెట్‌కు సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు వేగం కూడా ముఖ్యం. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లతో పోలిస్తే ఎంసెట్‌లో దాదాపు రెట్టింపు ప్రశ్నలుంటాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదివితే 160 మార్కులకుగాను 110మార్కులకు పైగా సాధించవచ్చు. ఎంసెట్ 160 ప్రశ్నల్లో 70శాతం ప్రశ్నలు సులభంగా లేదా మధ్యస్థంగా ఉంటాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమ ప్రాధాన్యం లభిస్తుంది పరీక్ష ప్రశ్నించే విభాగాలు, ప్రశ్నలు రాత పరీక్ష తేదీ ఎంసెట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (80 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) మే లో బిట్‌శాట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (45 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ (10 ప్రశ్నలు), ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ(15 ప్రశ్నలు) మే 3-4వ వారం, 2015 ఎస్ఆర్ఎం ఫిజిక్స్ (35 ప్రశ్నలు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు), కెమిస్ట్రీ (35 ప్రశ్నలు) ఆఫ్‌లైన్ ఏప్రిల్ 26, ఆన్లైన్ ఏప్రిల్ 19-22, 2015 విట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) ఏప్రిల్ 8-19, 2015 జేఈఈ మెయిన్ బీఈ/బీటెక్ కోర్సు కోసం పేపర్ -1కు హాజరు కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల సంఖ్య ప్రతి ఏడాది మారుతూంటుంది.గత పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సులో చేరాలనుకునే వారు పేపర్-2 రాయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 18, 2014. పరీక్ష తేదీ (ఆఫ్‌లైన్): ఏప్రిల్ 4, 2015. (ఆన్లైన్): 2015, ఏప్రిల్ 10, 11. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్‌కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ముగింపు: మే 7, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. కేఎల్‌యూ, గీతం, విజ్ఞాన్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నాయి. సబ్జెక్ట్‌ల వారీగా.. మ్యాథమెటిక్స్ బిట్‌శాట్‌లో కాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో హయ్యర్ ఆర్డర్, నంబర్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. మిగతా పరీక్షలకు సంబంధించి సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. -ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఫిజిక్స్ భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. {పతి చాప్టర్ వెనుక ఇచ్చే అదనపు ప్రశ్నలతోసహా ప్రిపేరవ్వడం లాభిస్తుంది. ఈ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులు స్కోర్ చేస్తే మెరుగైన ర్యాంక్‌ను సాధించవచ్చు. {పథమ సంవత్సరం సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. 1) గతిశాస్త్రం, 2) ద్రవ్య ధర్మాలు, 3) ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రం. {దవ్య ధర్మాలు, ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రాల్లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించటం చాలా ప్రధానం. ఉష్ణగతికశాస్త్రంలో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం, కేంద్రక, పరమాణు భౌతిక శాస్త్రాలను క్షుణ్నంగా చదవాలి. {పతి పాఠ్యాంశంలోని సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను తప్పకుండా సాధన చేయాలి. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ తేలికవుతుంది. {పతి చాప్టర్లో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను ఒక చోట చేర్చి చదివితే వాటి మధ్య పోలికలు తేలికగా తెలుస్తాయి. ప్రిపరేషన్ ప్రయోజనకరంగా సాగుతుంది. -పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు జ్ఞాపక శక్తి ఆధారంగా ఉంటున్నాయి. కాబట్టి పీరియూడిక్ టేబుల్, ఎస్-బ్లాక్, పి-బ్లాక్ వంటి సులువైన అంశాలను నిర్లక్ష్యం చేయొద్దు. కెమికల్ ఈక్విలిబ్రియుంలో రిలేషన్‌షిప్స్‌ను బాగా నేర్చుకోవాలి. అయానిక్ ఈక్విలిబ్రియుంలో ప్రాబ్లమ్స్, బఫర్ సొల్యూషన్స్, సాల్ట్ హైడ్రాలిసిస్, సొల్యుబిలిటీ ప్రొడక్ట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఎలక్ట్రోలైటిక్ కండెక్టెన్స్, ఎలక్ట్రాలిసిస్ వంటి అంశా లపై దృష్టి సారించాలి. థర్మోడైనమిక్స్‌లో ఫస్ట్ లా అప్లికేషన్స్, స్పాంటెనిటీకి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అకాడమీ పుస్తకంలోని రీజెంట్స్ను తప్పకుండా చదవాలి. కైనటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కైనటిక్స్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్, బాండింగ్స్, ఆక్సియాసిడ్స్, ఆక్సైడ్ తదితరాలను విధిగా నేర్చుకోవాలి. కాంప్లెక్స్ కంపౌండ్స్లో ఐసోమార్సిజం, బాండింగ్‌పై దృష్టి సారించాలి. ఎంసెట్‌తో పోల్చితే బిట్‌శాట్‌లో ప్రశ్నల క్లిష్టత కొంచెం ఎక్కువ. మెటలర్జీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, బయోమాలిక్యుల్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. విట్ పరీక్ష కోసం కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, లిపిడ్స్ వంటి అంశాలలోని వర్గీకరణలు, ఉదాహరణలను బాగా నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి-బ్లాక్ ఎలిమెంట్స్‌కు సంబంధించి అకాడమీ పుస్తకాల్లోని అంశాలను బాగా చదవాలి. -టి. కృష్ణ, డాక్టర్ ఆర్కే క్లాసెస్, హైదరాబాద్. -
చేయని తప్పుకు శిక్షా?
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించవలసిన సర్కారు..ముందుచూపు కొరవడి వారిని అగమ్యగోచరంలో పడేసింది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పు కారణంగా ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి రెండో కౌన్సెలింగ్ విద్యార్థులు దూరమయ్యారు. ఆ యువలోకం, వారి తల్లిదండ్రుల ఆవేదనకు అద్దంపట్టే ప్రయత్నంలో భాగంగా ‘తప్పెవరిది-శిక్షెవరికి’ అనే అంశంపై మంగళవారం సాక్షి నిర్వహించిన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. వైశాఖీ జల ఉద్యానవనంలో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు, విద్యావేత్తలు సైతం తమ వాణిని కుండబద్దలుకొట్టినట్టు ప్రకటించారు. ఇంజినీరింగ్ రెండో కౌన్సెలింగ్ లేకపోవడంతో దిక్కుతోచని విద్యార్థులకు బాసటగా నిలిచిన సాక్షికి అభినందనలు వెల్లువెత్తాయి. ‘ముందు చూపులేని ప్రభుత్వ విధానాలు, అధికారుల్లో ప్రణాళిక లేమి,సమన్వయలోపం వల్లే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ గందరగోళంలో పడింది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు సైతం సీట్లు దక్కించుకోని దుస్థితి ఏర్పడింది. విద్యార్థుల చదువును ప్రభుత్వం కేవలం ఆర్థికభారంగా చూస్తున్నందునే ప్రస్తుతం కౌన్సెలింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఇంజినీరింగ్ సీట్లు ఉన్న నేపథ్యంలో ఎంసెట్‌ను రద్దు చేస్తేనే మేలు. ఇకనైనా ప్రస్తుత అనుభవాలతో ప్రభుత్వ యూనివర్సిటీలకు స్వేచ్చ ఇవ్వాలి’ అని విద్యావేత్తలు, న్యాయనిపుణులు సూచించారు. సాక్షి చేపట్టిన అక్షర యజ్ఞంతో కచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే బాసటగా నిలబడతామని ముందుకువచ్చారు. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మంగళవారం నగరంలోని వైశాఖి జల ఉద్యానవనం ఫంక్షన్ హాల్లో ‘తప్పెవరిది? శిక్షెవరికి?’ పేరుతో సాక్షి చర్చావేదిక నిర్వహించింది. దీనికి వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు, సీటు దక్కని బాధితులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమసందేహాలను నిపుణులతో పంచుకున్నారు. తమ కష్టాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పి అండగా నిలబడే ప్రయత్నం చేసిన సాక్షిని మనసారా అభినందించారు. ర్యాంకు వచ్చినా ఫలితం శూన్యం ప్రొఫెసర్ జేమ్స్ స్టిఫన్, విస్టమ్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని అంశాలపైనా మాట్లాడుకున్న అధికారులు లక్షలమంది విద్యార్థులకు సంబంధించిన ఎంసెట్ గురించి కనీసం ముందుచూపుతో ఆలోచించలేదు. ప్రణాళిక లేకుండా ఉన్నత విద్యా మండలి పనిచేసింది. విద్యార్థుల బాధలు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు సెకండ్ కౌన్సెలింగ్ లేక నిస్సహాయులుగా మారారు. ఇప్పటికే రాష్ట్రంలో సరైన సమయంలో కౌన్సెలింగ్ జరగక ఎందరో పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లి పోయారు. విద్యార్థులే కాక కాలేజీ యాజమాన్యాలు, అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు సైతం నష్టపోతున్నారు. సెకండ్ కౌన్సెలింగ్ ద్వారా మరింత మంచి అవకాశాన్ని పొందే అవకాశం విద్యార్థికి ఉంటుంది. ఈ చాన్స్ లేకపోవడంతో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఒకే ఒక్క కౌన్సెలింగ్‌తో అంధకారంలోకి నెట్టేశారు ఎంసెట్‌లో విజయం సాధించేందుకు పదో తరగతి నుంచే విద్యార్థులు కలలు కంటారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులూ కోరుకుంటారు. కానీ ఒకే ఒక కౌన్సెలింగ్‌తో విద్యార్థులను రోడ్డున పడేశారు. ప్రభుత్వం వచ్చి మూడు నెలలవుతోంది. సరైన ప్రణాళికతో పనిచేసి ఉంటే మూడు దఫాల కౌన్సెలింగ్ పూర్తి చేయవచ్చు. సర్కార్ నిర్లక్ష్యం సామాన్య విద్యార్థులకు శాపంగా మారింది. అసలు ఎంసెట్ కౌన్సెలింగ్ వృథా. లక్షల్లో సీట్లు అందుబాటులో ఉండగా అదే సంఖ్యలో విద్యార్థులున్నారు. అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎంసెట్ ఎందుకు? ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్ ద్వారా న్యాయం చేయవచ్చు. ప్రభుత్వం కూడా ఇకపై యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుంబంధ కాలేజీలకు స్వేచ్చ ఇవ్వాలి. సెకండ్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వకపోతే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదముంది. తల్లిదండ్రులపై భారం లేకుండా చూడాలి ప్రొఫెసర్ బి.రాజశరత్ కుమార్, లెనోరా ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రస్తుత కౌన్సెలింగ్ సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయలోపం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 30 వేల మంది విద్యార్థులు సెకండ్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాథమిక విద్యకు ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించడాన్ని భారంగా చూస్తోంది. దీని వలనే సమస్యంతా. ప్రభుత్వం ఈ ఫీజుల పథకాన్ని కొనసాగించలేక ఈ ఎత్తులు వేస్తోంది. ఏటా రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండు రాష్ట్రాలు భారంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల పెత్తనం పెరుగుతోంది. పేద విద్యార్థులే కౌన్సెలింగ్‌లో మిగిలిపోతున్నారు. నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలు?
బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు వివరాలను తెలపండి? -నరేష్, భద్రాచలం. వ్యవసాయ రంగంలో నాణ్యత, వ్యాపార నిర్వహణ అంశాలకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే విధంగా బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు కూర్పు ఉంటుంది. ఈ కోర్సు సిలబస్.. దాదాపుగా బీఎస్సీ(అగ్రికల్చర్) మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఫారెస్ట్రీ, హోమ్ సైన్స్, స్టాటిస్టిక్స్-మ్యాథమెటిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్, ప్రాసెస్ ఆఫ్ ప్లాంటింగ్, కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ యూసేజ్, క్రాఫ్ట్ ఫిజియాలజీ తదితర అంశాలు ఉంటాయి. బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. వీరికి వివిధ బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, సీడ్స్ కంపెనీలో ప్రొడక్షన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లలో, అగ్రి ఇన్సూరెన్స్ కంపెనీలు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఇరిగేషన్ సంస్థలు, డెయిరీ-పౌల్ట్రీ సంబంధిత పరిశ్రమలు, ఆక్వాకల్చర్ రంగాల్లో మార్కెటింగ్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్/నేచురల్ సెన్సైస్/మ్యాథమెటిక్స్). ఈ కోర్సు తర్వాత పీజీ చేసే అవకాశం కూడా ఉంది. వివరాలకు:www.angrau.ac.in ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు, కోర్సు పూర్తి చేసిన వారికి ఉండే అవకాశాలు తెలియజేయగలరు? -రమేశ్, నిజామాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.uohyd.ernet.in ఐఐటీ, రూర్కీ.. ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitr.ac.in, www.iitg.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రాలో ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథ్స్) అందుబాటులో ఉంది. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.bitmesra.ac.in కోర్సు పూర్తిచేసిన తర్వాత రీసెర్చ్, కంప్యుటేషన్, డేటా మైనింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ రంగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి? -దేవెందర్, సూర్యాపేట. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎయిరోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు. ఐఐటీ-మద్రాస్ కోర్సులు:బీటెక్(ఏరోస్పేస్ ఇంజనీరింగ్),బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ(ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ అప్లయిడ్ మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ. వెబ్సైట్: www.iitm.ac.in ఐఐటీ-బాంబే కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) వెబ్సైట్: www.iitb.ac.in ఐఐటీ-కాన్పూర్ కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) వెబ్సైట్: www.iitk.ac.in ఐఐటీ-ఖరగ్‌పూర్. కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ వెబ్సైట్: www.iit-kgp.ac.in ఈ ఇన్స్టిట్యూట్లలో జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. www.sakshieducation.com లో ఐబీపీఎస్ క్లర్క్ స్టడీ మెటీరియల్ హైదరాబాద్: పోటీ పరీక్షల సమగ్ర సమాచారానికి కేరాఫ్ సాక్షిఎడ్యుకేషన్ డాట్ కామ్. వీఆర్వో మొదలుకొని ప్రతిష్టాత్మక సివిల్స్ దాకా అన్ని పరీక్షలకూ అభ్యర్థులకు మార్గదర్శినిగా నిలుస్తోంది. ఈ కోవలోనే తాజాగా విడుదలైన ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షకు చదవాల్సిన సమాచారాన్నంత అందుబాటులో ఉంచింది. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఏపుస్తకాలు చదవాలి? తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు ఎలా సాధించాలి? వంటి వాటితో పాటు చాప్టర్ల వారీగా నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్, షార్ట్ కట్స్, వివరణలతో కూడిన ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్లను అందిస్తోంది. పోటీ పరీక్షల్లో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్, జీకేలకు సంబంధించి సమగ్ర సమాచారం వెబ్సైట్లో పొందుపరిచింది. క్లర్క్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్(స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ), ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగానికి 40 మార్కులు. అన్ని సబ్జెక్టులు కలిపి దాదాపు 5000 పైగా ప్రశ్నల నిధి అందుబాటులో ఉంది. ఈ ప్రశ్నల నిధిని సాధన చేసి అభ్యర్ధులు మంచి మార్కులు సాధించొచ్చు. వెబ్సైట్: http://www.sakshieducation.com/Banks/Index.htm -
కోర్సులందు.. ఇంజనీరింగ్ కోర్సు వేరయా!
నేడు సమాజంలో చక్కటి హోదా, భారీ వేతనాలు, పేరుప్రతిష్టలు సంపాదించి పెట్టే రంగాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల ప్రభావం, పారిశ్రామిక అభివృద్ధితో మన నగర యువతకు ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే అటు తల్లిదండ్రులకు.. ఇటు విద్యార్థులకు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కోర్సు అంటే ముందు ఇంజనీరింగ్ అనే చెప్పాలి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో దాదాపు 150కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఇంజనీరింగ్ తర్వాత మెడిసిన్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ/కంపెనీ సెక్రటరీషిప్, బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జర్నలిజం వంటి కోర్సులు నిలుస్తున్నాయి. వీటికి సంబంధించిన కోర్సులను అందించే సంస్థలు కూడా నగరంలో కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కోర్సులతో పోలిస్తే ఇంజనీరింగ్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్న అంశాలేమిటి? ఇంజనీరింగ్‌కు, మిగిలిన కోర్సులకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, పోలికలు ఏమిటో తెలుసుకుందాం.. ఇంజనీరింగ్ వర్సెస్ మెడిసిన్: ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఇంటర్న్‌షిప్‌తో కలిపి ఐదున్నరేళ్లు. మ్యాథ్స్ సూత్రాలు, భౌతిక శాస్త్ర భావనలపై పట్టు ఉండటం ఇంజనీరింగ్ ఔత్సాహి కులకు తప్పనిసరి. మానవ శరీర నిర్మాణం, వ్యాధులు, ఆధునిక చికిత్సా పద్ధతులు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారు మెడిసిన్‌ను ఎంచుకోవాలి. మూలనపడి ఉన్న యంత్రాలను సైతం బాగుచేయగల సత్తా ఇంజనీర్‌కు ఉండాలి. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురాగల నైపుణ్యాన్ని డాక్టర్లు పుణికి పుచ్చుకోవాలి. ఇంజనీరింగ్ - లా ఏదైనా గ్రూప్‌లో నిర్దేశిత మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించినవారు లాయర్ కావచ్చు. ఇందుకోసం మన రాష్ట్రంలో లాసెట్, జాతీయస్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత మూడేళ్ల లా కోర్సు ఉంది. ఇంజనీరింగ్‌తో పోలిస్తే విస్తృత అధ్యయనం లాయర్లకు తప్పనిసరి. వివిధ కేసుల అధ్యయనం, దేశ, విదేశాల్లో ఆయా కేసుల్లో కోర్టుల తీర్పుల గురించి తెలుసుకోవాలి. ఇక ఇంజనీర్లకు సునిశిత పరిశీలన జ్ఞానం ఉండాలి. వివిధ యంత్రాలు, యంత్ర పరికరాలకు సంబంంధించిన సూక్ష్మ పరికరాలపై అవగాహన పెంచు కోవాలి. ఎన్ని కేసుల్లో విజయం సాధించారు? ఎలాంటి కేసుల్లో వాదించారు? అనే విషయాలపై లాయర్ల ప్రతిభ, సంపాదన ఆధారపడి ఉంటుంది. ఏయే కొత్త ఆవిష్కరణలు చేశారు? ప్రస్తుతమున్న టెక్నాలజీకి కొత్తగా ఎలాంటి సొబగులు అద్దారు? అనే అంశాలపై ఇంజనీర్ల కెరీర్, వేతనాలు ఆధారపడి ఉంటాయి. ఇంజనీరింగ్ - చార్టర్డ్ అకౌంటెన్సీ/ కంపెనీ సెక్రటరీషిప్ ఇంటర్లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా సీఏ/సీఎస్ చేయొచ్చు. పూర్తిస్థాయిలో సీఏ/సీఎస్‌గా మారాలంటే దాదాపు నాలుగేళ్లు పడుతుంది. సీఏ, సీఎస్‌లు ఇద్దరూ వ్యాపార రంగంలో కీలకపాత్ర పోషిస్తారు. సీఏ.. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను ఎలాంటి తప్పులు లేకుండా రూపొందిస్తాడు. కంపెనీ వ్యవహారాలు చట్టబద్ధంగా సాగడంలో సీఎస్‌దే ప్రధానపాత్ర. పరిశోధనల్లో, యంత్రపరికరాల రూపకల్పనలో ఇంజనీర్ క్రియాశీలకంగా ఉంటాడు. సూత్రాలు/నియమాల ఆధారంగా యంత్ర నిర్మాణం, పనితీరును పరీక్షిస్తాడు. ఇక వేతనాల విషయానికొస్తే తమ రంగంలో కొత్త ఆవిష్కరణలు తక్కువ కాబట్టి చాలా మంది సీఏ/సీఎస్ల కెరీర్ ఎక్కువ జీతంతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. ఇంజనీర్లకు మొదట తక్కువ జీతం ఉన్నా ఆ తర్వాత పరిశోధనలు - నూతన ఆవిష్కరణలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇంజనీరింగ్ - బ్యాంకింగ్: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించినవారికి పీజీ స్థాయిలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వినియోగదారులు చేసే ప్రతి లావాదేవీలో లాభం గురించి బ్యాంకర్ ఆలోచిస్తే, ప్రతి యంత్రంతో ఉత్పత్తి పొందడానికి ఇంజనీర్ ప్రయత్నిస్తుంటాడు. ఆదాయాలు, అప్పులు, వడ్డీలు వీటికి సంబంధించిన విధులు బ్యాంకింగ్ వృత్తిలో భాగంగా ఉంటాయి. పరిశోధన, డిజైన్, అభివృద్ధి, ఆవిష్కరణలు ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో ఉంటాయి. తను చేసిన ఆవిష్కరణకు గుర్తింపు లభిస్తే.. ఇంజనీర్ కెరీర్‌కు ఆకాశమే హద్దు. సంబంధిత ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు కూడా సొంతమైతే బిలియనీర్‌గా ఎదుగుతాడు. ఇంజనీరింగ్ - జర్నలిజం: ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపు తీసుకున్నవారైనా జర్నలిస్ట్ కావొచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), ిపీజీలో ఎంసీజే/ఎంఏ (జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్) చేసిన వారు పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టొచ్చు. జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జర్నలిస్టు ముందు కనీస అవగాహనతో తన వృత్తిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అనుభవంతో పూర్తిస్థాయిలో పరిపూర్ణుడిగా తయారవుతాడు. కానీ ఇంజనీర్ పరిశ్రమకు అవసరమైన సాంకేతిక అంశాలను ముందే నేర్చుకుని ఉద్యోగంలో మెళకువలు తె లుసుకుంటాడు. మంచి స్టోరీలు రాయడం, ఎక్కువ మంది పాఠకులను ఆకట్టుకోవడంపై జర్నలిస్టు కెరీర్ ఆధారపడి ఉంటుంది. జనంతో మమేకమైన జర్నలిస్టులకు పేరుప్రఖ్యాతులు వచ్చినట్లే, ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంజనీర్లకు గుర్తింపు లభిస్తుంది. జర్నలిస్టులు, ఇంజనీర్ల విజయంలో బృంద సహకారం తప్పనిసరి. ఇంజనీర్ - ఫ్యాషన్ డిజైనర్: ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ ఉత్తీర్ణులైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అభ్యసించవచ్చు. అప్పటివరకు ఉన్న ఫ్యాషన్లను తోసిరాజని వినూత్నమైన ఫ్యాషన్ డిజైన్‌ను ఫ్యాషన్ డిజైనర్ రూపొందిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకుంటాడు. ఇంజనీర్ కూడా ఫ్యాషన్ డిజైనర్లానే ఎప్పటికప్పుడు తన నైపుణ్యాలను పెంచుకుంటాడు. తద్వారా కొత్త ఆవిష్క రణలకు నాంది పలుకుతాడు. చూడగానే ఆకర్షించే ఉత్పత్తుల కోసం ఇంజనీర్లు, ఫ్యాషన్ డిజైనర్లు ప్రయత్నిస్తారు. అందులో సక్సెస్ అయిన వారికే తర్వాతి ప్రాజెక్టు సిద్ధంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌తో విస్తృత అవకాశాలు! ‘‘భారతీయ విద్యారంగంలో.. ఇంజనీరింగ్ విద్య చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూ టర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీలతోపాటు మల్టీడిసిప్లినరీ బ్రాంచ్‌లైన నానోటెక్నాలజీ, మెకట్రానిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ తదితర విభిన్న రంగాల్లో ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థికి.. సమస్యను విశ్లేషించే సామర్థ్యాలుండాలి. అందుబాటులో ఉన్న టెక్నాలజీ, టూల్స్‌ను వినియోగించి కొత్త ప్రొడక్ట్స్‌ను తయారు చేయగలగాలి. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంచే ఉద్దేశంతో కళాశాలలు ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సొసైటీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్(ప్రాక్టికల్)ను ప్రవేశపెడుతోంది. ఇంజనీరింగ్ అయినా ఇతర డిగ్రీ కోర్సులైనా... విద్యార్థుల్లో నైపుణ్యాలు, సామర్థ్యం, జ్ఞానం పెంచడానికి ఉద్దేశించినవే. అభిరుచి, ఆసక్తి, లక్ష్యాల ఆధారంగా తమ కెరీర్‌ను నిర్ణయించే కోర్సులను విద్యార్థులు ఎంచుకోవాలి. తమకు తగిన కోర్సును విజయవంతంగా అభ్యసించినప్పుడే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది’’ - ప్రొఫెసర్ ఎం. వెంకట్‌దాస్, హెచ్ఓడీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ -
ఈ ఇన్స్టిట్యూట్లు.. ఉజ్వల భవితకు వేదికలు..
సాధారణంగా ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు అంటే మనకు గుర్తొచ్చేది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు). అందుకు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యకు ఉన్న క్రేజ్ ఒక కారణమైతే.. ఐఐటీలు, ఐఐఎంలు అందిస్తున్న కోర్సులకున్న డిమాండ్ మరో కారణం..! ఐఐటీలు, ఐఐఎంలే కాకుండా.. ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ వరకూ.. ఎన్నో విభాగాల్లో మరెంతో పేరెన్నికగల పబ్లిక్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అద్భుతమైన కోర్సులు అందిస్తూ.. ఉజ్వల భవితకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇవే కాకుండా ఆయా కోర్సుల్లో మరెన్నో ప్రముఖ ప్రయివేటు విద్యా సంస్థలూ ఉన్నాయి. కొత్త విద్యా సంవ త్సరం ప్రారంభమైన తరుణంలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లపై ఈ వారం ఫోకస్.. ఆర్ట్స్.. విభాగంలో అనేక కళాశాలలు ఆర్ట్స్.. పలకడానికి రెండక్షరాలే. కానీ ఈ విభాగం పరిధి ఎంతో విస్తృతం. పదుల సంఖ్యలో కోర్సులు. హిస్టరీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఎకనామిక్స్.. ఇలా అనేకం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో స్పెషలైజేషన్స్, కాంబినేషన్స్‌తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్ విభాగంలో.. నిరంతరం సామాజిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా భిన్నమైన కోర్సులకు రూపకల్పన చేస్తూ.. అనేక ప్రముఖ ప్రభుత్వ కళాశాలలు గుర్తింపు పొందుతున్నాయి. గతంలో పోటీ పరీక్షలకు మాత్రమే ఉపయుక్తం అనే రీతిలో ఉండే ఆర్ట్స్ కోర్సులకు.. ఆధునిక రూపమిస్తూ కార్పొరేట్ కల్చర్‌కు శ్రీకారం చుడుతున్నాయి ఈ కాలేజీలు. ప్రముఖ ఆర్ట్స కళాశాలలు: లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ - ఢిల్లీ మిరండా హౌస్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ)- ఢిల్లీ నేషనల్ పీజీ కాలేజ్- లక్నో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ - ఢిల్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ - హైదరాబాద్ నిజాం కాలేజ్ - హైదరాబాద్ ఇంజనీరింగ్.. ఐఐటీలతోపాటు.. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలతోపాటు మరెన్నో ప్రభుత్వరంగ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో రాణించాలనుకుంటున్న ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. మరోవైపు పరిశ్రమ అవసరాలకు తగిన రీతిలో నిపుణులైన భవిష్యత్తు ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నాయి. బీటెక్ స్థాయిలో కోర్ బ్రాంచ్‌లు మొదలు.. పీహెచ్డీ స్థాయిలో.. సమకాలీన అవసరాలకు అనుగుణంగా సరికొత్త స్పెషలైజేషన్స్ అందిస్తూ విద్యార్థి లోకం, పరిశ్రమ వర్గాల నుంచి ఆదరణ పొందుతున్నాయి. ప్రముఖ సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (16 క్యాంపస్‌లు) iii ఐటీలు ఎన్ఐటీలు యూనివర్సిటీ క్యాంపస్‌ల ఇంజనీరింగ్ కళాశాలలు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ సైన్స్‌కు సమున్నత విద్యా సంస్థలు సైన్స్‌కు సంబంధించి ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్ ఇలా.. అన్ని విభాగాల్లోనూ మంచి పేరున్న ఇన్స్టిట్యూట్లు ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యాయి. ప్యూర్ సెన్సైస్‌లో.. ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వంటి విద్యాసంస్థలతోపాటు వివిధ కేంద్రీయ, రాష్ర్ట స్థాయి యూనివర్సిటీలు అద్భుత కోర్సులకు వేదికలుగా నిలుస్తున్నాయి. అకడెమిక్ బోధనతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ పరిశ్రమ వర్గాల గుర్తింపు పొందుతున్నాయి. వీటిలో బ్యాచిలర్ నుంచి, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వరకు అధ్యయన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సైన్స కళాశాలలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగళూరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ - బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - శిబ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్-బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ - భువనేశ్వర్ కామర్స్‌లో.. ఎవర్గ్రీన్ కళాశాలలు కామర్స్.. బ్యాచిలర్ స్థాయి నుంచి పీహెచ్డీ వరకు నేటి పోటీ ప్రపంచంలో విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న విభాగం. పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలతో ఆయా సంస్థల వ్యాపార అవసరాలకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. కామర్స్ అంటే పద్దుల నిర్వహణ మాత్రమే అనేది గతం. ఇప్పుడు సంస్థలకు అనేక నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం పెరుగుతోంది. వీటిని అందించే విధంగా ప్రభుత్వ రంగంలో దేశవ్యాప్తంగా వివిధ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతూ గుర్తింపు పొందుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మొదలు ఎన్నో కళాశాలలు కామర్స్ విభాగంలో విభిన్న కోర్సులను అందిస్తూ కెరీర్ పరంగానూ చక్కటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రముఖ కాలేజీలు: రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ - ఢిల్లీ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ - ఢిల్లీ నిజాం కాలేజ్ - హైదరాబాద్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్- న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ - న్యూఢిల్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ - హైదరాబాద్ బెనారస్ హిందూ యూనివర్సిటీ - వారణాసి మేనేజ్మెంట్.. మేనేజ్మెంట్ కోర్సులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు కేరాఫ్ అనేది నిస్సందేహం. వీటికి ధీటుగా ప్రభుత్వ రంగంలో మరెన్నో మేనేజ్మెంట్ కళాశాలలు.. వ్యాపార నిర్వహణలో మెళకువలను అందిస్తూ విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు తగిన రీతిలో తీర్చిదిద్దుతున్నాయి. ఈ విషయంలో సెంట్రల్ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు. వీటితోపాటు రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు ప్రముఖంగా ఆదరణ పొందుతున్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోటీపడుతూ నాణ్యమైన విద్యనందిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్- న్యూఢిల్లీ బెనారస్ హిందూ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ న్యాయశాస్త్రం.. నేషనల్ లా యూనివర్సిటీస్ ఒకప్పుడు కేవలం న్యాయవాద వృత్తికి మాత్రమే సోపానంగా నిలిచిన న్యాయశాస్త్రం.. ఇప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంది. ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, కార్పొరేట్ కల్చర్ల నేపథ్యంలో న్యాయశాస్త్ర ప్రాధాన్యం పెరిగింది. ప్రతి రంగంలోనూ.. ప్రతి సంస్థలోనూ అంతర్గతంగా న్యాయ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు సాగించేందుకు, సదరు సంస్థ చట్టాలకు అనుగుణంగా సమర్థంగా పనిచేసేందుకు న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 నేషనల్ లా యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో నల్సార్ యూనివర్సిటీకి దేశవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ఇదేవిధంగా న్యాయ విద్యలో మరికొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఉత్తమ ప్రమాణాలతో లా కోర్సులు అందిస్తూ విద్యార్థులకు కార్పొరేట్ అవకాశాలు అందిస్తున్నాయి. ప్రముఖలా విద్యా సంస్థలు: నేషనల్ లా యూనివర్సిటీలు (మొత్తం 14) ఫ్యాకల్టీ ఆఫ్ లా - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ లా - బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా - ఉస్మానియా యూనివర్సిటీ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ - విశాఖపట్నం బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ మెడికల్ కోర్సుల్లో మెరుగైన ఇన్స్టిట్యూట్లు మెడికల్.. ఎంబీబీఎస్ అంటే ఎయిమ్స్, జిప్మర్ వంటివి మాత్రమే మనకు తెలుసు. అయితే, వీటితోపాటు మరెన్నో ప్రముఖ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ ఔత్సాహికులకు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ నుంచి డీఎన్బీ వరకు అన్నిస్థాయిల్లో కోర్సులను అందిస్తూ.. వైద్య విద్య ఔత్సాహికుల ఆదరణ పొందుతున్నాయి. వీటిలో ప్రవేశించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. ప్రముఖ వైద్య కళాశాలలు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ - న్యూఢిల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ - పుణె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ జీటీబీ హాస్పిటల్ - ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ - బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ - హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ - అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ - లక్నో ఫ్యాషన్ కోర్సులకు కేరాఫ్.. నిఫ్ట్ క్యాంపస్‌లు.. ఫ్యాషన్ టెక్నాలజీ.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులోనూ ఎన్నో విభాగాలు. కంటికి ధరించే కళ్లజోడు నుంచి కాళ్లకు ధరించే షూస్ వరకు కొత్త డిజైన్లు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ నైపుణ్యాలను అందించే కోర్సులు.. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు. ఫ్యాషన్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలకు రూపకల్పన చేసింది. ఆ తర్వాత క్రమంలో మరెన్నో ప్రభుత్వరంగ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ప్రముఖ ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - 15 సెంటర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్ - జైపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అపేరల్ మేనేజ్మెంట్ (గుర్గావ్) వంటి మరికొన్ని సంస్థలు.. ఇటీవల కాలంలో ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఎన్నో కోర్సులను అందిస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్‌కు.. వెరీ ఫైన్ కాలేజెస్.. చిత్ర లేఖనం, శిల్ప కళ, ఫొటోగ్రఫీ ప్రధాన కోర్సులుగా భావించే ఫైన్ ఆర్ట్స్ విభాగంలోనూ ఎన్నో ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్లు రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మొదలు.. దేశవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీలు.. ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ప్రారంభంలోనే రూ. వేలల్లో జీతాలు అందుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తి, అభిరుచికి తోడుగా ఈ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే అవకాశాలకు ఆకాశమే హద్దు. ప్రముఖ విద్యా సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ - హైదరాబాద్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎం.ఎస్. యూనివర్సిటీ- బరోడా) ఫ్యాకల్టీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ - బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (జామియా మిలియా యూనివర్సిటీ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (కురుక్షేత్ర యూనివర్సిటీ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ) నిఫ్ట్లలో ప్రవేశం కెరీర్‌కు బెస్ట్ లిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీల్లో ప్రవేశం పొందితే అద్భుత కెరీర్‌కు పునాది పడినట్లే. ఈ కోర్సుల్లో రాణించాలంటే సహజ ఆసక్తి, సృజనాత్మకత, మార్కెట్ ట్రెండ్స్ అధ్యయనం వంటి స్కిల్స్ అవసరం. ఈ మూడు లక్షణాలకు అకడెమిక్ నైపుణ్యాలు తోడైతే కెరీర్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. - ఎన్.జె. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్-హైదరాబాద్ ప్రత్యామ్నాయ వేదికలు ఎన్నో.. మేనేజ్మెంట్ ఔత్సాహిక విద్యార్థులకు ఐఐఎంలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇవి కూడా ఐఐఎంలకు సరితూగే విధంగా బోధన ప్రమాణాలు పాటించడంతోపాటు.. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త స్పెషలైజేషన్స్ అందిస్తున్నాయి. వీటిపై అవగాహన ఏర్పరచుకుంటే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. - ప్రొఫెసర్॥ఎం.ఎల్.సాయి కుమార్, డీన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ప్రామాణిక కళాశాలల్లో చేరితే పరిధి విస్తృతం ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి ప్రామాణిక కళాశాలల్లో ప్రవేశం పొందితే.. అవకాశాల పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో ఎన్నో పేరెన్నికగల కళాశాలలు కొత్త కాంబినేషన్లు అందిస్తూ కార్పొరేట్ రంగ అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. - ప్రొఫెసర్ టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్ సైన్స్ కోర్సుల్లో మేటి భవిష్యత్తు.. ప్యూర్‌సైన్స్ కోర్సుల విషయంలో విద్యార్థులకు ఎన్నో ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా సైన్స్ అంటే బీఎస్సీ, బీజెడ్సీ కోణంలో ఆలోచిస్తారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశిస్తారు. అయితే ఈ విభాగంలో పేరెన్నిక గల ఇన్స్టిట్యూట్లలో అడుగుపెడితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. - ప్రొఫెసర్॥రాజశేఖరన్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. -
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈనెల 10 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు షెడ్యూలు సిద్ధం చేసినా దానిని అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రవేశాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడితే, వెంటనే కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశాల కమిటీ శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమైంది. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడంతో నోటిఫికేషన్ జారీ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడితే 12 లేదా 13వ తేదీల్లో ప్రవేశాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. సోమవారం తరువాత జీఓలు జారీ అయితే ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీల మధ్యలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు అభ్యర్థన.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, తరగతుల ప్రారంభం విషయంలో తమకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును అభ్యర్థించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశాల ప్రకారం సాంకేతిక విద్యా కోర్సుల్లో ఈనెల 15నాటికి మొదటి దశ ప్రవేశాలు పూర్తి కావాలి. 22వ తేదీలోగా రెండో దశ ప్రవేశాలు పూర్తి కావాలి. 29వ తేదీలోగా చివరి దశ ప్రవేశాలు పూర్తి కావాలి. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలి. -
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది. ఈనెల 28 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ఇదిలాఉండగా, డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 28 నుంచి చేపట్టాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. 28వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని, 5వ తేదీన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
ట్రిపుల్ఐటీకి 35,877 దరఖాస్తులు
పెరుగుతున్న ఆదరణ గతేడాది కంటే 2వేలు అధికంగా దరఖాస్తులు మొత్తం సీట్లు మూడువేలు సీటొస్తే ఆరేళ్లవరకూ అన్నీఫ్రీయే నూజివీడు : ట్రిపుల్‌ఐటీలో అందిస్తున్న ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరడానికిగాను 35,877 దరఖాస్తులు అంది నట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కంటే రెండువేల దరఖాస్తులు అధికంగా రావడం గమనార్హం. రాష్ట్రంలోని నూజివీడు, బాసర, కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్క దానిలో వెయ్యి సీట్ల చొప్పున మొత్తం మూడువేల సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరడానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్జీయూకేటీ అధికారులు గత నెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 16వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు పంపడానికి గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో పంపిన దరఖాస్తుల ప్రింట్అవుట్లను ఈనెల 21 సాయంత్రం 5గంటల లోపు ఆర్జీయూకేటీకి అందాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులలో సక్రమంగా ఉన్నవి ఎన్ని, ఇన్వేలిడ్ దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రిపులఐటీలోని ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా మొదటి రెండు సంవత్సరాల పీయూసీ, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగు విద్యను బోధించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి సెలక్షన్ జాబితాను జులై 7న ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. జులై 23, 24వతేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించి 28నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ట్రిపుల్ ఐటీలపై ఆసక్తి ఎందుకంటే ఏడాదికేడాది ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థులలోను,వారి తల్లిదండ్రులలోను ఆసక్తి పెరుగుతుండడంతో ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 32వేల దరఖాస్తులు రాగా, అంతకుముందు 28వేలువచ్చాయి. ఈ ఏడాది 35వేలు దాటాయి. ట్రిపుల్‌ఐటీలో సీటు లభిస్తే ఆరేళ్లపాటు ఎలాంటి ఫీజులు చెల్లించకుండా నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేయవచ్చు. అంతేగాకుండా పీయూసీ నుంచే ఏసీ తరగతి గదులుతోపాటు విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు సైతం ఇస్తారు. భోజన, వసతి సదుపాయాలతో పాటు డ్యూయల్ డిగ్రీలు, మైనర్కోర్సులు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవేగాక విద్యార్థులకు సంగీతం, నృత్యం, యోగాలలో కూడా ప్రతి రోజూ శిక్షణ ఇస్తుంటారు. ఇన్ని అవకాశాలు వేరే ఎక్కడా లేని నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. -
రేపు ఎంసెట్... నేడు పాలిసెట్, పీసెట్ ప్రవేశ పరీక్షలు
* ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష * 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2014 గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష... మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటలకు వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇంజనీరింగ్ అభ్యర్థులను ఉదయం 9 గంటలకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారిని మధ్యాహ్నం 1:30గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్‌కు మొత్తంగా 3,94,543 మంది విద్యార్థులు (ఇంజనీరింగ్‌కు 2,81,695 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,11,777 మంది) హాజరుకానున్నట్లు తెలిపారు. ఆన్లైన్ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు లేనందున ఎంసెట్‌లో వారి అర్హతను, ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని నిర్ధారించేందుకు కుల ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు. నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పీసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) బుధవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో జరుగుతుందని కన్వీనర్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. పురుషుల విభాగంలో బుధవారం నుంచి జూన్ 13 వరకు, మహిళల విభాగంలో జూన్14 నుంచి జూన్18వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పురుషుల విభాగంలో 20,545 మంది, మహిళల విభాగంలో4,068 మంది చొప్పున మొత్తం 24,631 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. తొలిరోజు హాల్‌టికెట్ నంబర్ 10001 నుంచి 10604 వరకు అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. నేడు పాలిసెట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పాలిసెట్-2014)ను ఈనెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని 68 ప్రాం తాల్లో 649 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. బాలికల కోసం ప్రత్యేకంగా 12 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,54,060 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కీని ఈ నెల 28న, ఫలితాలను జూన్ 4న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదలవుతుంది. జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇంటర్లో ప్రవేశాలకు 26నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి ఆయా కాలేజీల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ కథనం ప్రకారం.. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా కాలేజీల్లో అందజేయాలి. జూన్ 30వ తేదీతో మొదటి దశ ప్రవేశాలు పూర్తవుతాయి. తరగతులు జూన్ 4నుంచి ప్రారంభం అవుతాయి. పదోతరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం ఎంపిక ఉం టుంది. ప్రతి సెక్షన్లో 88 మందికి మించకుండా ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. 26నుంచి ఓయూసెట్ హాల్‌టికెట్లు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూసెట్-2014 హాల్‌టికెట్లు ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓయూసెట్‌కు రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసిందని, మొత్తం 64 వేలకు పైగా దరఖాస్తులు అందాయని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.శివరాజ్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా చూస్తే 79 వేల మంది విద్యార్థులు వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలు జూన్ 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి. 26, 27 తేదీల్లో ఎండీఎస్ కౌన్సెలింగ్ విజయవాడ, న్యూస్‌లైన్: డెంటల్పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీఎస్) కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 26, 27 తేదీల్లో విజయవాడలోని యూనివర్శిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.బాబూలాల్ తెలిపారు. 30న సెకండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న ఉదయం 11గంటలకు వర్సిటీలో మెడికల్ బోర్డు పరిశీలించనున్నట్లు తెలిపారు. పీజీ సీట్ల వివరాలు, ఇతర సమాచారాన్ని కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్శిటీ వెబ్సైట్ జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. తెలుగు వర్సిటీ దూరవిద్య తరగతులు హైదరాబాద్, న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం విద్యార్థులకు బుధవారం నుంచి కాంటాక్టు తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ప్రథమ సంవత్సరం ఎంఏ తెలుగు, సంస్కృతం, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జ్యోతిషం, ఎంసీజే, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, బీఏ స్పెషల్ తెలుగు, బీఏ కర్ణాటక సంగీతం(మొదటి/నాల్గవ సంవత్సరం), సినిమా రచన డిప్లొమా కోర్సు విద్యార్థులకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులను హైదరాబాదులోని విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, సంగీత విశారద, లలిత సంగీతం, జ్యోతిషం సర్టిఫికెట్, జ్యోతిషం డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సు విద్యార్థులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు తమ వార్షిక పరీక్ష ఫీజును జూన్ 10లోగా చెల్లించాలని రిజిస్ట్రార్ ఆశీర్వాదం సూచించారు. -
ప్రశాంతంగా జేఈఈ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఐఐటీ, ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం తిరుపతిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) ప్రశాంతం గా జరిగింది. రాయలసీమ జిల్లాలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరిగాయి. 28 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాల, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు జరగడంతో టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి పద్మావతి వర్సిటీ వరకు రోడ్లు జనాలతో కిటకిటలాడాయి. పరీక్ష కేంద్రాల వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం, విద్యార్థులకు గైడ్ చేసే సహాయకుల సంఖ్య తక్కువగా ఉండడంతో పలువురు ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులంతా ఒక్కసారిగా చుట్టుముట్టడంతో వారికి సంబంధించిన గదుల కేటాయింపు బోర్డు వద్ద, లోపలికి ప్రవేశించే ద్వారం వద్ద తోపులాట జరిగింది. 90 శాతం పైగా హాజరు జేఈఈ ప్రవేశ పరీక్షకు 90 శాతం పైగా హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్ -1 ప్రవేశ పరీక్షకు 14,547 మంది దరఖాస్తు చేయగా 13,751 మంది హాజరయ్యారు. 95 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 2,515 మందికి గాను 2,285 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 91 శాతం హాజరు నమోదైంది. ఈ ప్రవేశ పరీక్షకు శ్రీవిద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ రోహిత్ పండా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. -
ఇంజనీరింగ్ కోర్సుకు పునాది.. ద్వితీయ సంవత్సరం
మంచి ఇంజనీర్‌గా పేరుతెచ్చుకోవడం.. కోరుకున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించడం.. ఇవీ ఇంజనీరింగ్‌లో చేరిన ప్రతి విద్యార్థి కనే కలలు.. శ్రమ, పట్టుదల, అంకిత భావం వంటి సద్గుణాలను ఆయుధాలుగా మల్చుకున్నప్పుడే అనుకున్న కలలను సాకారం చేసుకోవచ్చు.. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌లో ప్రతి ఏడాది కీలకం అనే అంశాన్ని గమనించాలి.. ఒక సంవత్సరం బాగా చదివి, మరో ఏడాదిని నిర్లక్ష్యం చేయడానికి కుదరదు.. ఒకరకంగా నాలుగేళ్లు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి.. ముఖ్యంగా రెండో ఏడాదిలో అడుగుపెట్టిన విద్యార్థులు.. మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి తేడాను గుర్తించి తదనుగుణంగా అడుగులు వేయాలి.. అప్పుడే కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు చక్కని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలు.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. ఇందులో హ్యుమానిటీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ అంశాలను బోధిస్తారు. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌ను కూడా మొదటి సంవత్సరంలోనే పరిచయం చేస్తారు. ఇంటర్మీడియెట్‌తో పోల్చితే.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియెట్‌కు కొనసాగింపుగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరాన్ని పేర్కొనవచ్చు. కాబట్టి ద్వితీయ సంవత్సరం నుంచే ఎంచుకున్న బ్రాంచ్‌కు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడడం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. కోర్-ఇంటర్ డిసిప్లినరీ: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు అనుగుణంగా.. ఆయా బ్రాంచ్‌లలోని ప్రాథమిక అంశాలతోపాటు, ఇతర బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో కంప్యూటర్ ప్రోగ్రామ్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్, డిజిటల్ లాజిక్ డిజైన్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంతేకాకుండా కోర్ సబ్జెక్ట్‌లు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్ విద్యార్థికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను బోధిస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. రెండో సంవత్సరంలో థియరీ ఎక్కువగాను, ప్రాక్టికల్ వర్క్ తక్కువగా ఉంటుంది. ఇంటరాక్షన్: రెండో సంవత్సరంలో ప్రతి రోజూ తరగతులకు హాజరు కావాలి. ఏరోజు పాఠాలను ఆరోజే సాధన చేయాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సాధారణంగా మొదటి సంవత్సరం అంతా కామన్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే రెండో సంవత్సరంలో మాత్రమే విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్‌ల్లోకి అడుగుపెడతారని చెప్పొచ్చు. ఇక్కడే బ్రాంచ్‌ల వారీగా ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెసర్స్ చెప్పే లెక్చర్స్ వినే, వారితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కాబట్టి సంబంధిత ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడూ నివృత్తి చేసుకోవాలి. కాన్సెప్ట్-ప్రాక్టికల్: తరగతి గదిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేస్తేనే పరీక్షల్లో ఎక్కువ స్కోరింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కేవలం తరగతులకు హాజరైతే సరిపోతుంది.. ప్రాక్టికల్స్ అవసరం లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏదైనా అంశాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. ప్రయోగాత్మక పరిజ్ఞానం లేకుండా కేవలం పుస్తక విజ్ఞానం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి పరీక్షలకు పక్కాగా సిద్ధం కావాలంటే ఈరెండు విభాగాల్లోనూ పట్టు సాధించాలి. ఒకరకంగా చెప్పాలంటే.. ద్వితీయ సంవత్సరంలోని ఆరు సబ్జెక్టులు, రెండు ల్యాబ్స్‌పై సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్నీ ముఖ్యమే: మరో విషయం.. ఇంజనీరింగ్‌లో ఒక సబ్జెక్టు తేలిక, మరొకటి కష్టంగా ఉండదు. అన్ని సబ్జెక్టులూ ముఖ్యమే. దేనికీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేం. అందుకే ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్టులపై పట్టు సాధిస్తే.. తృతీయ సంవత్సరాన్ని సులువుగానే గట్టెక్కవచ్చు. ఒకరకంగా ల్యాబ్స్‌లో విద్యార్థి ప్రాక్టికల్స్‌ను ఎంత సమర్థంగా నేర్చుకుంటే ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్‌లో అంత మంచి స్కోరింగ్ చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌గా రూపొందవచ్చు. అవగాహనకు ప్రాధాన్యత: ఇంజనీరింగ్‌లో స్కోరింగ్‌లో ఇంటర్నల్స్దీ ప్రధానపాత్ర. కోర్సు మధ్యలో నిర్వహించే ఇంటర్నల్స్‌లో విద్యార్థులు సులువుగా మార్కులు సాధించొచ్చనే ధోరణితో వ్యవహరించొద్దు. ఇంటర్నల్స్‌ను పక్కాగా ప్రిపేరైతేనే సెమిస్టర్ పరీక్షల్లోనూ సులువుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ మార్కులపై దృష్టిసారించి తద్వారా మంచి మార్కుల శాతాన్ని పొందడానికి కృషిచేయాలి. ఇంటర్నల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిని తేలిగ్గా తీసుకోరాదు. ప్రాబ్లమ్ ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్ సాగిస్తే వీటిల్లో విజయం సాధించడం సులభం. ఒకరకంగా చెప్పాలంటే ద్వితీయ సంవత్సరంలోని సబ్జె క్టులను చదవడం కంటే.. ఆయా పాఠ్యాంశాల మూల భావన (కాన్సెప్ట్)ను అవగాహన చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే.. బీటెక్‌లో ప్రశ్నలను మార్చిమార్చి అడుగుతుంటారు. మనకు బాగా అవగాహన ఉన్న అంశాన్ని సైతం జటిలం (ట్విస్ట్) చేసే విధంగా ప్రశ్నలు సంధిస్తుంటారు. అందుకే సబ్జెక్టును చదివి అవగాహన చేసుకోవడంతోపాటు ల్యాబ్‌లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తేనే ద్వితీయ సంవత్సరంలోని రెండు సెమిస్టర్లలో మంచి స్కోరింగ్ చేయవచ్చు. మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, ఇంజనీరింగ్ మ్యాగజైన్లను చదువుతూ సబ్జెక్టుపై పట్టు సాధించాలి. విద్యార్థులు మొదటి సంవత్సరంలో సీ- ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, రెండో సంవత్సరంలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్‌లలో ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు. కాబట్టి ప్రారంభం నుంచే ఈ సబ్జెక్ట్లపై దృష్టి సారించి.. ఎక్కువ శ్రమ చేయడం లాభిస్తుంది. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే.. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ టాపిక్ మీద ఎటు వంటి ప్రశ్నలు వస్తున్నాయో క్షుణ్నంగా తెలుసుకోవాలి. కనీసం 60 శాతం సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి. ప్రణాళిక ప్రకారం: ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరడంతోనే అపరిమిత స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తుంటారు. దాంతో చదువు ద్వితీయ ప్రాధాన్యతగా మారిపోతుంది. దీంతో కొన్ని బ్యాక్‌లాగ్స్ మిగిలి పోతాయి. దాంతో రెండో సంవత్సరం ప్రారంభమయ్యేసరికి ఈ బ్యాక్‌లాగ్స్ కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించాలి. మరో ప్రధాన సమస్య ర్యాగింగ్. రెండో సంవత్సరానికి చేరడంతో సీనియర్ అయిపోయామనే భావంతో వ్యవహరిస్తుంటారు. జూనియర్లను ర్యాగింగ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు. సుప్రీంకోర్ట జడ్జిమెంట్ ప్రకారం ర్యాగింగ్ చేయడం శిక్షార్హం. కాబట్టి ఈ అంశానికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే.. ద్వితీయ సంవత్సరాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. మొదటి రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారిని మార్గదర్శనం చేస్తుండాలి. పునాది: మరో కీలకాంశం.. ఇంజనీరింగ్ కోర్సులోని చివరి రెండేళ్లూ (మూడు, నాలుగు సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివని చెప్పొచ్చు. కాబట్టి రెండో సంవత్సరం సబ్జెక్ట్లపై ఎంత పట్టు సాధిస్తే.. మిగతా రెండేళ్లు రాణించడం అంత సులభమవుతుంది. దాంతోపాటు కోర్సు పూర్తయ్యాక హాజరయ్యే వివిధ పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాశాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి రెండో సంవత్సరాన్ని మొత్తం నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యకే తలమానికంగా పేర్కొనవచ్చు. రెండో సంవత్సరం కోర్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఈ దశలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నించాలి. కోర్సు మొత్తానికి దిశానిర్దేశం జరిగేది ఇక్కడే. మంచి మార్కులు సాధించాలన్నా..పూర్తి కోర్సుపై అవగాహన ఏర్పడాలన్నా ఈ ద్వితీయ సంవత్సరమే కీలకమనే విషయాన్ని గమనించాలి. ఇక్కడే ప్రారంభించాలి: చాలా మంది విద్యార్థులు నాలుగో సంవత్సరం వచ్చే వరకు కూడా కెరీర్ పట్ల ఒక అవగాహనను ఏర్పర్చుకోరు. ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో ఎప్పుడూ సందిగ్ధతలో ఉంటారు. అలా కాకుండా రెండో సంవత్సరం నుంచే భవిష్యత్ దిశగా ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. స్వదేశం, విదేశాల్లో పీజీ చేయడమా? మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకోవడమా? ఉద్యోగం దిశగా ప్రయత్నం చేయడమా? ఇలా ఒక అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. తర్వాత దానికనుగుణంగా సన్నాహాలను ఈ రెండో సంవత్సరం నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే.. మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్, నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలతో సమయం సరిపోదు. విదేశాల్లో పీజీ చేసే ఉద్దేశం ఉంటే మూడో సంవత్సరంలోనే అందుకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే విదేశీ వర్సిటీల్లో చేరేందుకు నిర్వర్తించాల్సిన సన్నాహాలకు ఏడాదికి పైగా పడుతుంది. కాబట్టి సదరు పరీక్షల ప్రిపరేషన్, కోచింగ్ వంటి వ్యవహారాలను రెండో ఏడాది నుంచే ప్రారంభించాలి. గేట్, ఐఈఎస్, క్యాట్ తదితర పోటీ పరీక్షల గురించి కూడా ఈ సంవత్సరంలోనే దృష్టి సారించడం మంచిది. అకడమిక్ కార్యకలాపాలతో సమాంతరంగా వీటికి సమయం కేటాయించాలి. సాఫ్ట్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఆంగ్ల భాషపై పట్టు సాధించడం వంటి అంశాలను మెరుగుపరుచుకోవడానికి తగినంత ప్రాధాన్యతనివ్వాలి. వృథా కాకుండా : ప్రతీ యూనివర్సిటీలో రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలో మూడు లేదా ఆరు వారాల పాటు ఏదైనా పరిశ్రమలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇండస్ట్ట్రియల్ ట్రైనింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో తనకు ఆసక్తి ఉన్న పరిశ్రమ గురించి ఇంటర్నెట్ లేదా మరే మాధ్యమం ద్వారానైనా అవగాహన ఏర్పర్చుకుని అందులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడం మంచిది. చాలా మంది విద్యార్థులు ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేకపోయినా వేసవి సెలవులను వృథా కానీయకుండా ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేయడం మంచిది. దీని వల్ల చదివిన సబ్జెక్ట్లపై పట్టు చిక్కుతుంది. ఇంజనీరింగ్ విద్యకే కీలకమైన అన్వయించే సామర్థ్యం (అప్లికేషన్ స్కిల్స్) అలవడుతుంది. తరగతిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేయాలి. ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో రెండో సంవత్సరంలోనే ఒక స్పష్టతకు రావాలి. రెండేళ్లూ (3, 4 సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివి. ఇంజనీరింగ్ పోటీ పరీక్షల్లోని అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలే. బ్యాక్‌లాగ్స్ లేకుండా, ర్యాగింగ్ వంటి అంశాలకు దూరంగా ఉండాలి. ప్రొ. పి.ఎస్. అవధాని, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం. -
2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా, 32 కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ రాలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఒక్క అడ్మిషన్ రానీ కళాశాలలు 13 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 32కు చేరింది. తుది విడత సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఆదివారం రాత్రి ఎస్.ఎం.ఎస్. ద్వారా అభ్యర్థులకు చేరవేశారు. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు 1,02,105, ఫార్మసీ సీట్లు 8,345 మిగిలిపోయాయి. వీటికి అదనంగా యాజమాన్య కోటాలో దాదాపు లక్ష సీట్లు ఖాళీగా ఉన్నట్టు అంచనా. అంటే ఈ ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటాలో కలిపి మొత్తంగా 2 లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మిషన్ల విషయంలో నాణ్యతలేని కళాశాలలు ఈ ఏడాది ఘోరంగా దెబ్బతిన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో దాదాపు 40 వేల మంది రాష్ట్ర విద్యార్థులు డీమ్డ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు. 2,19,729 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఉపాధి అవకాశాలు కరువవడంతో కేవలం 1,31,396 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది న అభ్యర్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని, ఫీజును చెల్లించాల్సిన వారు చలానా ద్వారా ఇండియన్ బ్యాంకు, లేదా ఆంధ్రా బ్యాంకులో చెల్లించి అక్టోబర్ 5లోగా కళాశాలలో రిపోర్ట చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ సూచించారు. అడ్మిషన్ రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు హెల్పలైన్ సెంటర్లో అక్టోబర్ 7లోపు సంప్రదించి రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవచ్చు. కళాశాలలో రిపోర్ట చేసినప్పటికీ అక్టోబర్ 7వ తేదీ అనంతరం రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు కళాశాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అక్టోబర్ 10వ తేదీ తరువాత మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్లు పొందవచ్చు. స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ మధ్య నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. భర్తీ తీరు: 55 కళాశాలల్లో 5 లోపు మాత్రమే అడ్మిషన్లు వచ్చాయి. 20 లోపు మాత్రమే అడ్మిషన్లు ఉన్న కాలేజీల సంఖ్య 102గా ఉంది. 100 సీట్ల లోపు నిండిన కళాశాలలు 260 ఉన్నాయి. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 609 ప్రైవేటు, 34 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 266 ప్రైవేటు ఫార్మసీ, 12 యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా.. 1,24,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఠ తుది విడతకు 2 కోర్సులకు కలిపి 1,23,085 సీట్లు అందుబాటులో ఉండగా 28,023 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలి విడతలో 1,26,390 మంది సీట్లు పొందినప్పటికీ కేవలం 1,11,505 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్ట చేశారు. ఫార్మసీలో మిగిలిన 8,345 సీట్లను బైపీసీ విభాగం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు బదిలీ చేయనున్నారు.