డిగ్రీకి డిమాండ్‌ పెరిగేనా? | Changes in degree according to market needs | Sakshi
Sakshi News home page

డిగ్రీకి డిమాండ్‌ పెరిగేనా?

Published Sat, May 13 2023 3:25 AM | Last Updated on Sat, May 13 2023 7:53 AM

Changes in degree according to market needs - Sakshi

విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్‌ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు.

మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌తో సమానమైన కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్‌ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది.  ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ను ఆనర్స్‌ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై  ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. 
- సాక్షి , హైదరాబాద్  

రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్‌ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్‌ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు.

హైదరాబాద్‌ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్‌ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్‌ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు.  

కారణాలేంటి? 
♦ సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. 

 ఇంజనీరింగ్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్‌ఈ, ఇతర కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్‌ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. 

 డిగ్రీలో కామర్స్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నా­రు. అకౌంటింగ్‌తోపాటు, కంప్యూటర్‌ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్‌లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు.  

♦ లైఫ్‌ సైన్స్‌కూ ఓ మోస్తరు డిమాండ్‌ పెరుగుతోంది. కా­ర్పొరేట్‌ సెక్టార్‌లో ఉపాధికి అవకాశాలున్నా­య­ని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శా­తం మంది లైఫ్‌ సైన్స్‌ను ఎంచుకుంటున్నారు. త­ర్వా­­త స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులున్నాయి.  

డిమాండ్‌ పెరగొచ్చు
ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్‌ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది.   
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి,  ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement