పీజీ ఇంకా ఈజీ  | Courses of one year duration | Sakshi
Sakshi News home page

పీజీ ఇంకా ఈజీ 

Published Thu, Dec 28 2023 5:34 AM | Last Updated on Thu, Dec 28 2023 5:34 AM

Courses of one year duration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది.

జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది.  

ఏడాదిలోనే పూర్తి 
ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్‌) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్‌ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్‌ విధానం అమలు చేయబోతున్నారు.

ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్‌ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్‌ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్‌ వరకు ఒక గ్రేడ్, ప్లస్‌ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్‌కు ఇంకో గ్రేడ్‌ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్‌ స్కిల్‌ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. 
 
ఆన్‌లైన్‌లోనూ అవకాశం 
ఏడాది పీజీ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్‌ అనుసంధాన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పొందుతారు.

ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఫీల్డ్‌ వర్క్‌ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్‌లైన్‌ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement