
రెండు విడతల్లోనే దోస్త్ అడ్మిషన్లు పూర్తి
జూన్ 16 నుంచి మొదటి సెమిస్టర్ క్లాసులు
వర్సిటీ వీసీల సమావేశంలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పుల దిశగా అడుగులేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల (వీసీ)తో సమావేశం జరిగింది. కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్, దోస్త్ నిర్వహణ, అనుబంధ గుర్తింపు, కొత్త సిలబస్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు డిగ్రీలో ఉన్న బకెట్ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించారు.
ఒక విద్యార్థి ఒక కాలేజీలో చేరినప్పటికీ, ఆ కాలేజీలో లేని, వేరే కాలేజీలో ఉన్న సబ్జెక్టును చదివేందుకు వీలుగా 2023లో బకెట్ విధానం తీసుకొచ్చారు. ఇప్పటికే బకెట్ సిస్టమ్‌లో చేరిన విద్యార్థులు ఆ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్విస్, తెలంగాణ (దోస్త్)ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి వెనక్కు తీసుకుంది. అయితే, రెండు కౌన్సెలింగుల్లోనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. డిగ్రీలో 4.6 లక్షల సీట్లుండగా, 2.25 లక్షల మందే చేరుతున్నారు. దీంతో జీరో అడ్మిషన్లు నమోదయ్యే కాలేజీలు, కోర్సులకు అనుమతి ఇవ్వొద్దని వర్సిటీలకు మండలి సూచించింది.
సిలబస్‌లో మార్పులు
రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో కొత్త సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈసారి 20 శాతం సిలబస్‌ను మార్చబోతున్నట్టు మండలి చైర్మన్ వీసీలకు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వంటి కోర్సులను డిగ్రీ సిలబస్‌లో చేరుస్తున్నట్టు చెప్పారు.
డిజిటల్ ప్లాట్ ఫాంలో బోధన అందించేందుకు టీ–శాట్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని సమావేశం అభిప్రాయపడింది. అసైన్ చేసిన ప్రాజెక్టు వర్క్‌కు 25, మిడ్‌టర్మ్‌కు 25, ఆఖరు సెమిస్టర్‌కు 50 మార్కుల చొప్పున మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30 నాటికి విద్యా సంవత్సరం ముగించాలని నిర్ణయించారు.
యాజమాన్య కోటాకు ఆన్‌లైన్ లేనట్టే
ఇంజనీరింగ్‌లో యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఈసారి ఆన్‌లైన్‌లో చేపడతామని చెప్పిన ఉన్నత విద్యా మండలి యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, ఈసారికి బీ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని వీసీల సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది సీపీగెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని మండలి తీర్మానించింది.
అన్ని వర్సిటీలకు చెందిన 2025–26 సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌కు సమావేశం ఆమోదం తెలిపింది. అన్ని వర్సిటీల పరిధిలో జూన్ 16 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు మొదలవుతాయని అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 20తో సెమిస్టర్ ముగుస్తుంది. నవంబర్ 20 నుంచి రెండో సెమిస్టర్‌కు వెళ్తారు. మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్లకు జూన్ 2 నుంచి క్లాసులు మొదలవుతాయి.