degree
-
మూడేళ్లకు ముందుగానే ‘డిగ్రీ’
సాక్షి, అమరావతి: ఇక నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలు ఉంటే రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించి నాలుగేళ్లలో ముగించవచ్చు. ఈ మేరకు సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సామర్థ్యం కలిగిన విద్యార్థులు వేగంగా చదువును పూర్తి చేసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక విద్యార్థి కోర్సు వ్యవధిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మూడేళ్ల డిగ్రీని రెండు లేదా రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేయవచ్చు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ డిగ్రీ విద్యలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.సమయం.. ఆర్థిక వనరులు ఆదా!నూతన జాతీయ విద్యావిధానం–2020తో దేశ ఉన్నత విద్యలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సామర్థ్యం కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ యాక్సిలరేటెడ్, స్లో–పేస్డ్ డిగ్రీలపై సిఫార్సులు చేసింది. దీనికి యూజీసీ సైతం ఆమోదం తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందుగానే విద్యార్థి తన డిగ్రీ చదువును ముగించడం ద్వారా త్వరగా వర్క్ ఫోర్స్‌లోకి, ఉన్నత విద్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సమయంతోపాటు ఆర్థిక వనరులను ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో సమతుల్యం చేసుకోవడానికి కూడా ఈ విధానం సహాయపడుతుందని యూజీసీ భావిస్తోంది.విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తల ఆందోళన యూజీసీ ఇప్పటికే డిగ్రీ విద్యలో నిష్క్రమణ ఎంపికలను ప్రవేశపెట్టింది. ఈసారి విద్యాపరమైన సవాళ్ల ఆధారంగా విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించాలనుకునే వారికి అవకాశం ఇస్తోంది. ఇది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ జీవిత బాధ్యతలను సమతుల్యం చేసుకోవాడానికి అనువుగా ఉంటుందని భావిస్తోంది. అయితే డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ఇప్పటికే కోర్ కంటెంట్ తగ్గిపోతుందని, ఇలాంటి చర్యలతో విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీసిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్న క్రమంలో కోర్సు కాల వ్యవధిని తగ్గించడం అంటే విద్య నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్..
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఎం, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ) అమల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా వాటి పేర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై ఆయా కోర్సులను అమెరికాలో పిలుస్తున్న తరహాలో బీఎస్, ఎంఎస్‌గా పిలవనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. దేశంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకే ఇలా పేర్లు మార్చనున్నారు. విస్తృత కసరత్తు అనంతరం.. సంప్రదాయ కోర్సుల పేర్ల వల్ల కలిగే ఇబ్బందులపై జాతీయ నూతన విద్యా విధానం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. క్రెడిట్ విధానం అమలు చేయాలని సూచించిన ఈ విధానం.. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానం భారత్‌లోనూ ఉండాలని కేంద్రానికి సూచించింది. ఈ సూచనల మేరకు గతేడాది యూజీసీ నిపుణులతో ఓ కమిటీని నియమించింది.అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు అక్కడ గుర్తించే డిగ్రీలకన్నా భిన్నంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లు మార్చాలని ప్రతిపాదించింది. స్పెషలైజేషన్ చేసే విద్యార్థులకు దీనివల్ల అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. యూజీసీ సూచనలు ఇలా.. » దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీల కొత్త విధానంపై యూజీసీ లేఖ రాసింది. ఇప్పటివరకు దేశంలో మూడేళ్ల కాలపరిమితి డిగ్రీ కోర్సులున్నాయి. వాటి స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వాటి కాలపరిమితి నాలుగేళ్లు. సంబంధిత సబ్జెక్టులో లోతుగా అధ్యయనం చేసేలా కోర్సును నిర్వహించడం ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. » ఉదాహరణకు బీకాం ఆనర్స్ అనే కోర్సులో సాధారణ కోర్సుతోపాటు నిపుణులు, వివిధ వర్గాల అనుభవజ్ఞులతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలా కోర్సును రూపొందిస్తారు. మన రాష్ట్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో బీఏ, బీకాం ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. » ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని కోర్సులూ అమల్లోకి వచ్చాయి. ఇష్టమైన సబ్జెక్టును ఆన్లైన్ ద్వారా ఏ దేశంలోని వర్సిటీ నుంచైనా చేసే వీలు కల్పి0చారు. ఇలా ప్రపంచ స్థాయిలో విద్యావిధానం ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో బీఏ, బీకాంలను బీఎస్, ఎంఎస్‌లుగా మార్చాలని యూజీసీ భావిస్తోంది. » రాష్ట్రంలోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని కోర్సుల్లో మార్పులు చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను ఎంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణణకు ఒక విద్యార్థి చరిత్ర, భౌతిక శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే విధానం తీసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ డిగ్రీని స్పెషలేషన్ సబ్జెక్టులుగా పేర్కొనాల్సి వస్తోంది. కాబట్టి బీఎస్, ఎంఎస్ వంటి పేర్లు మార్చడం వల్ల అన్ని దేశాల్లో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. -
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.ఎయిర్ కండీషనర్లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?ఏసీ రిమోట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూనివర్సిటీల (ఉస్మానియా, మహాత్మాగాం«దీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన)తోపాటు మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, డీఫార్మసీ కోర్సుల్లో ఫస్టియర్ ప్రవేశాలను దోస్త్ ద్వారా నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్ కన్వినర్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. అడ్మిషన్లకు సంబ ధించిన వివరాలు వెల్లడించారు. ఇంటర్లో విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఎస్కే మహమూద్ అలీ, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ తేదీలు ఇలా... మొదటి విడత ఈ నెల 6 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈ నెల 25 వరకు దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 మధ్య కాలేజీల ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తొలివిడత సీటు అలాట్మెంట్ జూన్ 3న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. రెండో విడత.. జూన్ 4 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే జూన్ 4 నుంచి 14 వరకు కాలేజీల వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్ 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. రెండో విడత సీటు అలాట్మెంట్ జూన్ 18న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ పూర్తి చేయాలి. మూడో విడత.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి మొదలవుతుంది. రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు చాన్స్ ఇస్తారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్ 25న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మూడో విడత సీటు అలాట్మెంట్ జూన్ 29న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 29 నుంచి జూలై 3లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ పూర్తి చేయాలి. ∗ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 29 నుంచి జూలై 5లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ∗ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూలై 1 నుంచి 6 వరకు ఓరియెంటేషన్ తరగతులుంటాయి. ∗ ఫస్టియర్ సెమిస్టర్ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
‘డిగ్రీ’లో క్రీడా రిజర్వేషన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిగ్రీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధన కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏటా 9 వేల మంది క్రీడాకారులు నష్టపోతున్నారని క్రీడారంగ నిపుణులు చెపుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.68 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఉన్నత విద్యామండలి అమలు చేస్తున్న ‘దోస్త్’ప్రవేశాల విధానంలో మాత్రం క్రీడాకారులకు కనీసం ఒక్క సీటూ కేటాయించలేదు. అసలు ఆ కాలమే ఎత్తివేయడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యమేనా..? దోస్త్‌లో దివ్యాంగులు, ఎన్సీసీ నేపథ్యం ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలూ నిర్వహిస్తున్నారు. అయితే క్రీడాకారుల విషయానికొచ్చే సరికి మాత్రం ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడం వల్లే దోస్త్‌లో స్పోర్ట్స్ కోటా పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, క్రీడారంగ విద్యార్థులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల అసోసియేషన్లు కూడా ఉన్నత విద్యామండలికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాయని, అయినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. అన్నివిభాగాలతో పాటు క్రీడాకారులకూ 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా జీవో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని చెబుతున్నారు. న్యాయం జరిగేనా..? డిగ్రీ కోర్సుల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏటా తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి సీఎం కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. డిగ్రీలో క్రీడాకారుల కోటా అమలుకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారుల వాదన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. త్వరలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
‘ప్రభుత్వ డిగ్రీ’తో ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ‘ప్లేస్మెంట్ల’లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్‌ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్–ప్రొఫెషనల్ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. మార్కెట్ ఓరియెంటెడ్ నైపుణ్యం దేశంలోనే నాలెడ్జ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యారి్థనిని ‘జాబ్ రెడీనెస్’ ఓరియెంటేషన్తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రొసెసింగ్, ఎల్రక్టానిక్స్, టూరిజం–హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్íÙప్, గ్రీన్‌జాబ్స్, రిటైల్ సెక్టార్ వంటి రంగాల్లో మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్‌ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను, యాప్‌ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్‌లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రిసోర్స్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్ ట్యూటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో.. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్గ్రూప్, రిటైల్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్, డీమార్ట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, స్టార్టెక్ హెల్త్‌తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్‌ప్లస్, బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బియం, హెచ్1హెచ్ఆర్తో పాటు ట్రాన్స్‌పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్‌సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్‌స్ట్రీట్ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటే ఉద్యోగం.. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎనలిటికల్ థింకింగ్ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. – పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య -
అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్‌లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్‌లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్‌తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
పీజీ ఇంకా ఈజీ
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏడాదిలోనే పూర్తి ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్ విధానం అమలు చేయబోతున్నారు. ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్ వరకు ఒక గ్రేడ్, ప్లస్ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్‌కు ఇంకో గ్రేడ్ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్ స్కిల్ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనూ అవకాశం ఏడాది పీజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్క్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి. -
25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా!
‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన రాజ్‌కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్‌కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్‌కరణ్ ఎట్టకేలకు ఎంఎస్సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రాజ్‌కరణ్ తన సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్‌కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్‌కరణ్‌కు గణితంలో ఎంఎస్సీ చేయాలనే ఆలోచన వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్పూర్)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. ఎట్టకేలకు 2020లో ఎంఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్సీ ఫైనల్‌ను పూర్తి చేశాడు. రాజ్‌కరణ్ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్‌కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ కరణ్ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్‌కరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్ కరణ్ తెలిపాడు. ఫెయిల్యూర్‌తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్ కరణ్ సలహా ఇస్తుంటాడు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
ఇక ‘సింగిల్ స్పెషల్ డిగ్రీ’
అనంతపురం: విద్యా ప్రమాణాల పెంపునకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజాగా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో సింగిల్ సబ్జెక్టు మేజర్‌గా నూతన విద్యా ప్రణాళిక(కర్రిక్యులమ్)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ యూజీలో మూడు సబ్జెక్టుల ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై మేజర్ సబ్జెక్టు ఒక్కటే ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. 2023–24 విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ మొదటి సంవత్సరం 1, 2 సెమిస్టర్లలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో బీఎస్సీ ఎంపీసీలో మూడు సబ్జెక్టుల కాంబినేషన్ ఉండగా, వాటి స్థానంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకుని డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చు. రెండో సెమిస్టర్లో దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒక దానితో పీజీ విద్యను పూర్తి చేసేలా సమూల మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన విద్యా ప్రణాళికను మార్పు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు నూతన సిలబస్‌కు రూపకల్పన చేశారు. డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్టులో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా ఈ విద్యాప్రణాళిక ఉండడం గమనార్హం. త్వరలో ఈ నూతన సిలబస్‌ను అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేయనున్నారు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు: డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలనే నిబంధన పెట్టారు. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటా సైన్స్ , మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే తొలి దఫా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కొత్త విధానంపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించి అడ్మిషన్ కల్పించారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి: ఇప్పటి వరకూ మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయ్యేది. నూతన జాతీయ విద్యావిధానం–2020 అమలులో భాగంగా దేశంలో తొలిసారిగా విద్యా సంస్కరణలను ఏపీలోనే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని అందుబాటులోకి తీసుకువచ్చారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం డిగ్రీని రెండు విధాలుగా విభజించారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించిన వారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా నేరుగా పీహెచ్‌డీకి అర్హత సాధిస్తారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సుగా పరిగణిస్తారు. ఇది పూర్తి చేసిన వారు పీజీలో రెండో ఏడాదిలో చేరవచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆనర్స్ కోర్సుల అమలుకు గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తున్నారు. సింగిల్ సబ్జెక్టుపై ప్రధాన దృష్టి రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే సింగిల్ సబ్జెక్టు స్పెషల్ డిగ్రీ విధానం అమల్లోకి వచ్చింది. ఒక సబ్జెక్టుపై పూర్తి స్థాయి పట్టు సాధించడంతో పాటు, ఇతర సబ్జెక్టుల్లోనూ అవగాహన పెంపొందేలా నూతన విద్యా ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నూతన విద్యా ప్రణాళికను ఉన్నత విద్యా మండలి పూర్తి చేసింది. ఈ అంశాలను బోర్డ్ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశంలో ఆమోదించారు. త్వరలో అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత కొత్త సిలబస్ అమల్లోకి వస్తుంది. – ప్రొఫెసర్ కె.రాంగోపాల్,సీడీసీ డీన్, ఎస్కేయూ -
నాలుగేళ్లలోనే డిగ్రీ+బీఈడీ
సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు.. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
ప్రధాని మోదీ డిగ్రీ పట్టా వివాదం.. జర్నలిస్టు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ పట్టాపై రాజకీయ వివాదం గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. మోదీ ఎడ్యూకేషన్ వివరాలపై కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు తెరదించుతూ ప్రముఖ జర్నలిస్టు శీలా భట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోదీని 1981లో కలుకున్నట్లు శీలా భట్ చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా చదువులపై దృష్టి కేంద్రీకరించిన, క్రమశిక్షణ కలిగిన శిష్యుడిగా ఉండేవాడని తెలిపారు. అప్పుడు మోదీ ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఎన్ఐకి చెందిన ఎడిటర్ స్మితా ప్రకాశ్ నిర్వహించిన ఓ ఇంటర్వూలో ఆమె తెలిపారు. ప్రధాని మోదీకి మెంటర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రవీణ్ సేత్.. తనకూ కూడా మెంటర్‌గా పనిచేశారని జర్నలిస్టు శీలా భట్ తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చదువుకున్న ఓ అభ్యర్థి తనకు ఇంకా గుర్తున్నట్లు శీలా భట్ తెలిపారు. ప్రధానితో పాటు చదువుకున్న ఆయన క్లాస్‌మెట్.. లాయర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నిరక్షరాస్యుడని అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ.. నిజానిజాలను తెలపాలని ఆ లాయర్‌ను కోరినట్లు శీలా భట్ చెప్పారు. కానీ ఆ లాయర్ స్పందించలేదని తెలిపారు. “I met Modi in 1981 when he was doing his MA,” Veteran Journo Sheela Bhatt recalls PM’s student days#Modi #ANIPodcastWithSmitaPrakash #SheelaBhatt Watch the full episode here: https://t.co/IMz0tvhuNX pic.twitter.com/6icGf2O6yz — ANI (@ANI) July 13, 2023 ప్రధాని ఎడ్యూకేషన్ వివరాలపై గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వివరాలను రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేశారు. 2016లో ప్రధాని ఎంఏ డిగ్రీ వివరాలు సమర్పించాలని గుజరాత్ యూనివర్శిటీని ప్రధాన సమాచార కమిషనర్ కోరారు. ఈ అంశంలో గుజరాత్ హైకోర్టు.. కమిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ప్రజలకు చాలా ప్రశ్నలను మిగిల్చిందని అన్నారు. నవీన భారతంలో పారదర్శకతకు కూడా పరిమితులు ఉన్నాయని.. ఇదే పొలిటికల్ సైన్స్ బోధిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రధాని డిగ్రీ సమాచారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని గత నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ప్రధాని డిగ్రీ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్శిటీ పేర్కొంది. అలాంటిదేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
AP: నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా..
సాక్షి, అమరావతి: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా : ఇంటర్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచి్ఛక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. - ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023 - డేటా కరెక్షన్కు చివరి తేదీ 20.7.2023 - పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు - హాల్ టికెట్ల డౌన్లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు - దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: www.nta.ac.in, https://neet. samarth.ac.in/ ఇది కూడా చదవండి: గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్ -
లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్‌లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి. ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్స్ విధానం ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. బోధనలోనూ మార్పులు.. ళీయూజీ ఆనర్స్‌ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు. లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్‌లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆనర్స్ వైపే అందరిచూపు.. విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. – ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి -
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
నేను ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న
-
డిగ్రీకి డిమాండ్ పెరిగేనా?
విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు. మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌తో సమానమైన కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది. ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్‌ను ఆనర్స్ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. - సాక్షి , హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు. కారణాలేంటి? ♦ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ♦ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్వేర్ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. ♦ డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అకౌంటింగ్‌తోపాటు, కంప్యూటర్ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ♦ లైఫ్ సైన్స్కూ ఓ మోస్తరు డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ సెక్టార్లో ఉపాధికి అవకాశాలున్నాయని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శాతం మంది లైఫ్ సైన్స్‌ను ఎంచుకుంటున్నారు. తర్వాత స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులున్నాయి. డిమాండ్ పెరగొచ్చు ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక
-
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్
సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం ఆనర్స్ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్ కోర్సులను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్‌షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. 2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు. ఆర్–సెట్‌ను తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆక్షేపించారు.