ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా? | Doubts On Implementation Of The Process Of Inter And Degree College Affiliations | Sakshi
Sakshi News home page

ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా?

Published Sat, Mar 11 2023 9:48 AM | Last Updated on Sat, Mar 11 2023 10:14 AM

Doubts On Implementation Of The Process Of Inter And Degree College Affiliations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈసారి మేలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా దాని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆదేశాలు జారీ అయి రెండు నెలలైనా ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభం కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. 

జాప్యాన్ని నివారించాలనుకుంటున్నా.. 
ఏటా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ విద్యాసంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ జరుగుతుండటంతో గుర్తింపు రాకుండానే చాలా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనలు పాటించనందుకు ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నప్పటికీ అప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది విద్యాశాఖకు తలనొప్పిగా మారుతోంది. దీన్ని నివారించేందుకే ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసేలోగా గుర్తింపు పక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. 

నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్న యాజమాన్యాలు.. 
రాష్ట్రంలోని 1,856 ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల్లో దాదాపు 400 కాలేజీలు ఇరుకైన ప్రదేశాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకున్నా ఆయా బోధన సాగిస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస మౌలిక వసతుల్లేవు. దీనిపై ఇంటర్‌ బోర్డు కొన్నేళ్లుగా నోటీసులిస్తున్నా యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవట్లేదు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే ఆయా యాజమాన్యాలు తాము నడిపే కాలేజీల ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే గుర్తింపు ప్రక్రియ సాధ్యం కానుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్, మే నాటికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌  నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ముందే అనుబంధ గుర్తింపు ఎలా ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుర్తింపు అనుకున్నట్టు పూర్తవ్వడం కష్టమేనని బోర్డు వర్గాలు అంటున్నాయి. 

డిగ్రీ సీట్లపై స్పష్టత ఏది? 
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4.6 లక్షల సీట్లున్నాయి. వాటిల్లో ఏటా భర్తీ అవుతున్నవి సుమారు 2.25 లక్షల సీట్లే. సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని కోర్సుల్లో జీరో ప్రవేశాలుంటున్నాయి. వాటిని రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ఏటా చెప్పడమే తప్ప కార్యాచరణకు దిగడం లేదు.

ఈ ఏడాది దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్‌ చేయగా వచ్చే ఏడాది ఇలాంటి సమస్య రాకుండా కాలేజీలే అవసరం లేని సీట్లను వదులుకోవాలనే అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా విభిన్న కోర్సుల సమ్మేళనంతో డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్ట్స్‌ విద్యార్థి కూడా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుచేసే అవకాశం ఇస్తామంటున్నారు. ఇది జరగాలంటే ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్‌ లేని కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవాలి. వచ్చే మే నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. కానీ ప్రైవేటు కాలేజీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు కోర్సులను మార్చుకోవడం, అందుకు తగ్గ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నాయి. 

వర్సిటీలను అప్రమత్తం చేశాం 
మార్పులను స్వాగతించేలా ప్రైవేటు కాలేజీలకు నచ్చజెప్పి వారి భాగస్వామ్యాన్ని పెంచుతాం. ఈ దిశగా అన్ని వర్సి­టీలను అప్రమత్తం చే స్తాం. విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులనే తీసుకోవడం కాలేజీలకు మంచిది. డిమాండ్‌ లేకుండా అనుమతులివ్వడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం.
– ప్రొఫెసర్‌  ఆర్‌.లింబాద్రి,రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement