ఇంటర్, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కొత్త వెసులుబాటు !
యూజీసీ యోచన
న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్‌లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్‌లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది.
డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు. ‘‘ లెవల్ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు.
డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్ నుంచి 50 శాతం క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్‌ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment