
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు.
కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు.
Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe
— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025
అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్‌లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.
తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.
అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్‌లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది.
ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది.