
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.
బైసరన్ లోయలో
భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.
కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం
ఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్‌నే నిందిస్తారు. కశ్మీర్‌లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.
ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.
తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.
ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు.
ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముక్తకంఠంతో ఖండించారు
ఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.
చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్