బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజాకు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారులు అతడి ఇంటికి నిప్పుపెట్టారు. గుంపుగా వచ్చి.. మొర్తజా ఇంటిని చుట్టుముట్టి.. విధ్వంసం సృష్టించారు. ది ఢాకా ట్రిబ్యూన్ ఈ మేరకు వార్త వెలువరించింది.
ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోమవారం మరింత ఉధృతమయ్యాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలంటూ నిరసనకారులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయారు. జనాగ్రహాన్ని తాళలేక అప్పటికప్పుడు భారత్‌కు చేరుకున్నారు. విమానంలో హసీనా బయల్దేరి వెళ్తున్నారన్న వార్త తెలిసి.. రన్ వే మీదకు కూడా దూసుకొచ్చారు జనం. విమానం టేకాఫ్ అయ్యేంత వరకు వెంటపడ్డారు.
ఈ నిరసన సెగ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ మొర్తజాకు కూడా తగిలింది. 2019లో నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొర్తజా అధికార అవామీ లీగ్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి పదవిని కైవసం చేసుకున్నాడు. ప్రధానీ షేక్ హసీనాతో మొర్తజాకు సత్సంబంధాలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్‌కు హసీనా మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. అవామీ లీగ్ తరఫున టికెట్ ఇచ్చి ఎంపీగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో హసీనాపై ఉన్న జనాగ్రహం మొర్తజాను ఇలా షాక్‌కు గురిచేసింది. అతడి ఇల్లు కాలిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ అత్యుత్తమ కెప్టెన్‌గా మొర్తజా పేరుగాంచాడు. ముఖ్యంగా వన్డేల్లో అతడి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. 88 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అతడు.. 50 మ్యాచ్‌లు గెలిపించాడు.
బంగ్లాదేశ్ అత్యుత్తమ పేసర్‌గానూ మొర్తజాకు గుర్తింపు ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు 389 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్ తర్వాత బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ మొర్తజా. లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గానూ రాణించిన మొర్తజా.. 6 టెస్టులు, 220 వన్డేలు,. 54 టీ20లలో కలిపి 2955 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లగా.. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ తాత్కాలికంగా తానే ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment