Mashrafe Mortaza
-
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ డౌటే.. పీసీబీ ఆఫర్‌కు నో రిప్లై!
బంగ్లాదేశ్- పాకిస్తాన్ టెస్టు సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. బంగ్లాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనకారుల ఆందోళనలు సోమవారం మిన్నంటాయి. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు.ఈ క్రమంలో వారి డిమాండ్లకు తలొగ్గిన హసీనా.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21 నుంచి బంగ్లా- పాక్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ నుంచి విమాన ప్రయాణం అంత సురక్షితం కాదన్న వార్తల నేపథ్యంలో.. ఆటగాళ్లు పాక్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్ క్రికెటర్లను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో పాటు.. అదనంగా మరికొన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పీసీబీ బంగ్లా బోర్డుకు చెప్పింది.రావల్పిండిలో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి స్పందన రాలేదు. బంగ్లా బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఉందని తెలిసింది. బోర్డు కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాయి. 2019-2020లో బంగ్లాదేశ్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది.కాగా షేక్ హసీనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారిపై కూడా నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తజా ఇంటికి ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. ఈ మాజీ పేసర్ కెరీర్ ఎదుగుదలలో హసీనా పాత్ర కూడా ఉందని సమాచారం.అదే విధంగా.. అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా రెండుసార్లు(2019, 2024) గెలిచాడు కూడా! ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబరులో జరగాల్సిన మహిళా టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. -
బంగ్లా మాజీ కెప్టెన్ ఇంటికి నిప్పు.. మంటల్లో కాలిపోయిన ఇల్లు!
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజాకు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారులు అతడి ఇంటికి నిప్పుపెట్టారు. గుంపుగా వచ్చి.. మొర్తజా ఇంటిని చుట్టుముట్టి.. విధ్వంసం సృష్టించారు. ది ఢాకా ట్రిబ్యూన్ ఈ మేరకు వార్త వెలువరించింది.ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోమవారం మరింత ఉధృతమయ్యాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలంటూ నిరసనకారులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయారు. జనాగ్రహాన్ని తాళలేక అప్పటికప్పుడు భారత్‌కు చేరుకున్నారు. విమానంలో హసీనా బయల్దేరి వెళ్తున్నారన్న వార్త తెలిసి.. రన్ వే మీదకు కూడా దూసుకొచ్చారు జనం. విమానం టేకాఫ్ అయ్యేంత వరకు వెంటపడ్డారు.ఈ నిరసన సెగ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ మొర్తజాకు కూడా తగిలింది. 2019లో నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొర్తజా అధికార అవామీ లీగ్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి పదవిని కైవసం చేసుకున్నాడు. ప్రధానీ షేక్ హసీనాతో మొర్తజాకు సత్సంబంధాలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్‌కు హసీనా మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. అవామీ లీగ్ తరఫున టికెట్ ఇచ్చి ఎంపీగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో హసీనాపై ఉన్న జనాగ్రహం మొర్తజాను ఇలా షాక్‌కు గురిచేసింది. అతడి ఇల్లు కాలిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ అత్యుత్తమ కెప్టెన్‌గా మొర్తజా పేరుగాంచాడు. ముఖ్యంగా వన్డేల్లో అతడి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. 88 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అతడు.. 50 మ్యాచ్‌లు గెలిపించాడు.బంగ్లాదేశ్ అత్యుత్తమ పేసర్‌గానూ మొర్తజాకు గుర్తింపు ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు 389 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్ తర్వాత బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ మొర్తజా. లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గానూ రాణించిన మొర్తజా.. 6 టెస్టులు, 220 వన్డేలు,. 54 టీ20లలో కలిపి 2955 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లగా.. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ తాత్కాలికంగా తానే ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. -
మొర్తజాకు కోవిడ్ పాజిటివ్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, మాజీ కెప్టెన్, పార్లమెంట్ సభ్యుడు మష్రఫే మొర్తజా కరోనా బారిన పడ్డాడు. కొన్ని నెలలుగా తన నియోజకవర్గ ప్రజలకు కోవిడ్–19 పట్ల అవగాహన కల్పించడంలో చురుగ్గా పనిచేస్తోన్న 36 ఏళ్ల మొర్తజా శనివారం కరోనా పాజిటివ్‌గా తేలాడు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న అతనికి శుక్రవారం కరోనా పరీక్ష నిర్వహించారు. రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలినట్లు అతని తమ్ముడు మోర్సలిన్ బిన్ మొర్తజా ప్రకటించాడు. ప్రస్తుతం మొర్తజా తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు మోర్సలిన్ తెలిపాడు. ‘రెండు రోజులుగా మొర్తజా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష చేయగా వైరస్ సోకినట్లుగా తెలిసింది. అతని ఆరోగ్యం కోసం ప్రార్థించండి’ అని మోర్సలిన్ పేర్కొన్నాడు. 2018 ఎన్నికల్లో మొర్తజా నరాలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. బంగ్లాదేశ్ తరఫున అతను 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టి20లు ఆడాడు. మొర్తజాతో పాటు మరో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు నఫీస్ ఇక్బాల్, నజ్ముల్ ఇస్లామ్‌లకు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు స్వయాన అన్న అయిన నఫీస్ 2003 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 34 ఏళ్ల నఫీస్ 11 టెస్టుల్లో 518 పరుగులు, 16 వన్డేల్లో 309 పరుగులు సాధించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నజ్ముల్ బంగ్లాదేశ్ తరఫున ఒక టెస్టు, ఐదు వన్డేలు, 13 టి20 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. -
మాజీ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా(36) కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ప్రస్తుతం మష్రాఫ్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలో మోర్తాజా సోదరుడు మాట్లాడుతూ.. ‘నా సోదరుడికి రెండు రోజులుగా జ్వరంగా ఉంది. నిన్న రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉన్నాడు’. అని తెలిపారు. ఇక కరోనా సోకిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్ మోర్తాజా. అంతకుముందు కొన్ని గంటల క్రితమే మరో క్రికెటర్ నఫీస్ ఇక్బాల్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. (దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా) కాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడైన మోర్తాజా ఇప్పటికి క్రికెట్ నుంచి విరమణ పొందలేదు. మర్తాజా తన కెరీర్లో 220 వన్డేలు, 36 టెస్టులు, 54 టీ-20లు ఆడారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన 300 కుటుంబాలకు సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,05,000 మంది కరోనా బారిన పడగా, 1,300 మంది మరణించారు. దాదాపు 43, 000 వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అయిదుగురు అంతర్జాతీయ క్రికెటర్లకు కరోనా నిర్ధారణ జరిగింది. మే నెలలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్‌కు కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. గతవారం పాకిస్తాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శనివారం మోర్తాజా, ఇక్బాల్ కరోనా బారిన పడగా..మరో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు జాఫర్ సర్ఫ్రాజ్, రియాజ్ షేక్ కూడా కరోనా సోకినట్లు తేలింది.(‘ఎందరున్నా జడేజానా అత్యుత్తమం’) -
మా జట్టు ఓటమికి నేనే కారణం: కెప్టెన్
‘ఈ ప్రపంచకప్‌లో మిమ్మల్ని మేం అసంతృప్తికి గురిచేశాం. మీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాం. అందుకు చింతిస్తున్నాం’ అంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తాజా ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్కప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమై.. అభిమానులను, మద్దతుదారులను నిరాశకు గురిచేశామని, ప్రపంచకప్‌లో ఓటమికి తనదే బాధ్యత అని మొర్తాజా ప్రకటించారు. ఒకింత పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించకుండానే బంగ్లాదేశ్ జట్టు వెనుదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నుంచి ఢాకా చేరుకున్న అనంతరం మొర్తాజా విలేకరులతో మాట్లాడారు. ‘మొత్తంగా చూసుకుంటే మా ఆటతీరు సానుకూలంగానే ఉంది. కానీ మామీద ఉంచిన అంచనాలను అందుకోలేకపోయాం. కొన్ని ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చి ఉంటే.. మేం సెమీఫైనల్‌కు చేరేవాళ్లం. ఒకవేళ చివరి మ్యాచ్‌లో గెలిచినా.. టాప్ ఐదో స్థానంలో ఉండేవాళ్లం. కానీ, మేం సెమీస్‌కు రావాలని ప్రేక్షకులంతా కోరుకున్నారు. దురుదృష్టవశాత్తు అది జరగలేదు’ అంటూ మొర్తాజా పేర్కొన్నారు. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి.. ప్రపంచకప్ లీగ్ దశలోనే బంగ్లాదేశ్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లను ఓడించిన బంగ్లా.. పలు టాప్ టీమ్‌లతో హోరాహోరీగా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే, భారత్, పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం, దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంతో బంగ్లా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ‘భారత్‌తో మ్యాచ్ వరకు మాకు సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. కానీ, షకీబుల్ హసన్, ముష్ఫిక్ రహీం తప్ప మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసిందని మొర్తాజా వాపోయాడు.ఈ వరల్డ్‌కప్‌లో షకీబుల్, ముష్ఫిక్‌తోపాటు ఆల్‌రౌండర్ మహమ్మద్ సైఫుద్దీన్ కూడా అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. -
అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్
బర్మింగ్‌హామ్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ క్యాచ్ చేజార్చడం, భారీ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడమే తమ కొంపముంచిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా అభిప్రాయపడ్డాడు. గెలుపు కోసం తాము సాయశక్తులా ప్రయత్నించామని, కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘మా ప్రయత్నం బాగుంది. కానీ ఒక్క మంచి భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టం కలిసిరాలేదు. పరిస్థితులు అనుకూలించలేదు. షకీబ్ అల్ హసన్, ముష్ఫిక్ రహీమ్ అద్భుతంగా ఆడారు. రోహిత్ క్యాచ్ చేజార్చడం నిరాశను మిగిల్చింది. కానీ మైదానంలో ఇవి సాధారణమే. మా తదుపరి మ్యాచ్(పాకిస్తాన్‌తో)కు సర్వశక్తులా పోరాడుతాం. అభిమానుల మద్దుతు అద్భుతం. గెలుపుతో టోర్నీని ముగిస్తాం’ అని మష్రఫె మొర్తజా ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ 9 పరుగుల వద్దే ముగియాల్సింది. దురదృష్టం తమీమ్ చేతుల్లోంచి జారితే... అదృష్టం రోహిత్ బ్యాట్‌ను తాకింది. తమీమ్ క్యాచ్ మిస్ చేయడం. తదనంతరం అతను మూడంకెల స్కోరు దాకా చెలరేగడం జరిగిపోయాయి. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని డీప్ స్క్వేర్ లెగ్‌లో గాల్లోకి లేపాడు. తమీమ్ సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్ శతక్కొట్టాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై సాధించిన సెంచరీలు కూడా క్యాచ్ మిస్ అయ్యాకే సాధించినవేనని తెలిసిందే. (చదవండి: విజయం అదిరె...) -
‘క్రికెటర్లు మనుషులే.. ట్రోలింగ్ వద్దు’
బర్మింగ్‌హామ్: భారత్‌తో కీలక మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు ట్రోలింగ్ పాల్పడవద్దని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తాజా ఆ దేశ అభిమానులకు సూచించాడు. తమ శక్తిమేర పోరాడి అన్ని విభాగాల్లో 100 శాతం రాణించి విజయం కోసం కృషి చేస్తామన్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేడు భారత్-బంగ్లాదేశ్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా మొర్తాజా మీడియాతో మాట్లాడాడు. ‘ ఈ టోర్నీలో భారత్ చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. కానీ ఆఖరి బంతి వరకు శక్తిమేర పోరాడి విజయం కోసం ప్రయత్నిస్తాం. మేం ప్రపంచకప్‌లో ఉంటామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటివరకూ ఆడిన క్రికెట్ కన్నా ఈ మ్యాచ్‌లో ఇంకా మెరుగ్గా రాణించాలి. ప్రపంచశ్రేణి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఆడాల్సింది చాలా ఉంది కాబట్టి మంచి ఫలితాలే సాధిస్తాడని ఆశిస్తున్నాం. ట్రోలింగ్ వద్దు.. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దాడి చేస్తూ విమర్శలు గుప్పించండం సహించరానిది. ఇది ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి మేం పడే కష్టాలు వర్ణాతీతం. క్రికెటర్లు కూడా మనుషులే. ఈ తరహా ట్రోలింగ్ ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతోంది. దయచేసి ట్రోలింగ్‌కు పాల్పడవద్దు. ఇరు జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నాయి. మా అభిమానులు ఖచ్చితంగా మాకు మద్దతుగా ఉండాలి. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. మన దేశాన్ని తక్కువ చేసేలా మేం చేయం. ఇది మా అందరి మెదళ్లలో ఉంది. భారత స్పిన్ ద్వయం.. గత రెండు, మూడేళ్లుగా భారత స్పిన్నర్లు కుల్దీప్, చహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఓడినంత మాత్రాన మేం భారత్‌ను ఓడిస్తామనే ఆలోచన లేదు. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది. సరైన ప్రణాళికలు అమలు చేసి విజయం కోసం ఆఖరి బంతివరకు పోరాడుతాం’ అని మొర్తజా తెలిపాడు. చదవండి: తప్పులు సరిచేసుకుంటారా? -
ఇక సంచలనం అనకండి: మొర్తజా
లండన్: ఇకపై తమ జట్టు పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనం కానే కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా అన్నాడు. ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ‘క్రికెట్లో బంగ్లా సాధించిన ప్రగతి ఇది. ఇంకా దీన్ని మీరు ఆశ్చ ర్యంగానో, సంచలనంగానో చూడొద్దు. మేం సర్వశక్తులు ఒడ్డితే ఏదైనా సాధిస్తామని మాకు తెలుసు. కానీ కొందరు బంగ్లా బాగును కోరుకోవట్లేదు. అయితే మేం మాత్రం ఆటపైనే దృష్టిసారిస్తాం. ఎవరేమనుకుంటే మాకేంటి’ అని మొర్తజా అన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఆట ఎదుగుతూ వచ్చిందని ఆల్‌రౌండర్ షకీబ్ తెలిపాడు. ఆ మెగా ఈవెంట్లో బంగ్లాదేశ్... భారత్, దక్షిణాఫ్రికాలను కంగుతినిపించింది. -
మెగాటోర్నీ ద్వారా అరంగేట్రం!
ఢాకా : వచ్చే నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న క్రికెట్ మెగా ఈవెంట్ ప్రపంచకప్-2019కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బంగ్లాదేశ్ సెలక్టర్లు మంగళవారం వెల్లడించారు. ఇంతవరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని పేసర్ అబు జాయేద్‌కు చోటు కల్పించడం విశేషం. ఇప్పటివరకు ఐదు టెస్టు మ్యాచులాడిన ఇతడికి ఏకంగా మెగా టోర్ని ద్వారా అరంగేట్రం చేసే అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మొసాడిక్ హుస్సేన్ ఆసియా కప్ తర్వాత.. తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక మొర్తజా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టుకు ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడని సెలక్టర్లు పేర్కొన్నారు. కాగా జూన్ 2న కెన్నింగ్టన్ ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌తో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ జర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు మే 26, 28 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టీమిండియాతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ప్రపంచకప్ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తుదిజట్టు : మష్రఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీం, షకీబల్ హసన్(వైస్ కెప్టెన్), సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, సబ్బీర్ రెహ్మాన్, మెహిది హసన్, మహ్మద్ మిథున్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, మొసాడిక్ హుస్సేన్, అబు జాయేద్ Bangladesh Squad for the ICC Cricket World Cup 2019!#CWC19 #RiseOfTheTigers #Tigers pic.twitter.com/pik24tNFGj — Bangladesh Cricket (@BCBtigers) April 16, 2019 -
మొర్తజా గెలిచాడు
ఢాకా: తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తజా ఎంపీగా గెలిచాడు. నరైల్–2 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ తరఫున పోటీ చేసిన 35 ఏళ్ల మొర్తజా 2,74,418 ఓట్లు సాధించాడు. అతడి ప్రత్యర్థి, జాతీయ ఐక్య కూటమి అభ్యర్థి ఫరీదుజ్మాన్ ఫర్హాద్‌కు కేవలం 8,006 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,17,844 కాగా పోలైన వాటిలో 96 శాతం మొర్తజాకే పడటం విశేషం. ‘నరైల్ ఎక్స్‌ప్రెస్’గా పేరుగాంచిన అతడు... నయీముర్ రెహ్మాన్ తర్వాత ఎంపీ అయిన రెండో బంగ్లాదేశీ కెప్టెన్‌గా, క్రికెట్లో ఉంటూనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. -
ఎంపీగా గెలిచిన బంగ్లా కెప్టెన్
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున నరైల్-2 లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ బంగ్లా కెప్టెన్ ఘన విజయం సాధించాడు. 35 ఏళ్ల మొర్తాజాకు మొత్తం 2,74,418 ఓట్లు రాగా, అతడి సమీప ప్రత్యర్థికి 8,006 ఓట్లు వచ్చాయి. తద్వారా క్రికెట్ ఆడుతూనే ఎంపీగా గెలిచిన వ్యక్తిగా మొర్తాజా చరిత్రకెక్కాడు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం 300 స్థానాలకు గాను అవామీ లీగ్ ఏకంగా 288 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు చిన్న హింట్ ఇచ్చాడు. అనుకున్నట్లే అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు. దీంతో 2019 ప్రపంచకప్ తర్వాత ఈ పేసర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. -
ఎన్నికల బరిలో క్రికెటర్!
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో మొర్తజా పోటీ చేస్తున్నట్లు సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మొర్తజాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అధికార పార్టీ అయిన అవామీ లీగ్ తరుపునే మొర్తజా బరిలోకి దిగుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. మొర్తజా తన సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అటు రాజకీయాలు, ఇటు కెరీర్‌ను మోర్తాజా బ్యాలెన్స్ చేసుకోగలడని తాము విశ్వసిస్తున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే అతని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అభిమానులు మోర్తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. -
ఆసియాకప్ ఫైనల్: భారత్ లక్ష్యం 223
దుబాయ్ : భారత్‌తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ 223 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ లిటన్ దాస్ 121(117 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహ్దీ హసన్(32), సౌమ్య సర్కార్లు(33) మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, జాదవ్ రెండు వికెట్లు తీయగా, చహల్, బుమ్రాలు ఒక వికెట్ తీశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు రనౌట్లు కావడం విశేషం. లిటన్ దాస్ ఒక్కడే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఊహించని రీతిలో ఓపెనర్స్ శుభారంభం అందించారు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(32) సాయంతో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. 27వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. కానీ ఈ ఆరంభాన్ని బంగ్లా మిగతా బ్యాట్స్‌మెన్ అందిపుచ్చుకోలేకపోయారు. భారత బౌలర్ల సహనానికే పరీక్ష మారిన లిటన్ దాస్- మెహ్దీ హసన్ జోడిని పార్ట్‌టైం బౌలర్ జాదవ్ విడదీసాడు. మెహ్దీ హసన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది. ఈ క్రమంలో లిటన్ దాస్ 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో కెరీర్లోనే తొలి సెంచరీ సాధించాడు. ఆ వెంటనే మహ్మదుల్లా(4)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్ బాధ్యాతాయుతంగా ఆడాడు. కానీ లిటన్ దాస్, కెప్టెన్ మొర్తాజాలను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ధోని సాయంతో ఇద్దరిని స్టంపౌట్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నజ్ముల్ ఇస్లాం(7)ను సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ మనీష్ పాండే రనౌట్ చేశాడు. చివర్లో సౌమ్య సర్కార్ (33) కూడా రనౌట్ కాగా.. మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన రుబెల్ హొస్సెన్(0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 48.3 ఓవర్లలో 222 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. -
ఆసియాకప్ ఫైనల్ : బంగ్లాదే బ్యాటింగ్
దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. గత అఫ్గాన్ మ్యాచ్ సందర్భంగా విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు తుదిజట్టులోకి వచ్చారు. రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్. పరుగులు చేయడం ముఖ్యమే. కానీ ఫీల్డింగ్ మా జట్టుకు కలిసొస్తుంది. ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం. దురదృష్టవశాత్తు యువ ఆటగాళ్లు ఒకే మ్యాచ్ ఆడగలిగారు.’ అని తెలిపాడు. బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. మోమినుల్ హక్ స్థానంలో నజ్ముల్ ఇస్లామ్ తుది జట్టులోకి వచ్చాడు. బంగ్లా కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ..‘ఫైనల్ చేరిన క్రెడిట్ అంతా మా ఆటగాళ్లదే. కొన్ని మ్యాచుల్లో వారి ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ రోజు చివరిబంతి వరకు పోరాడుతాం. మా జట్టులో స్పిన్నర్ లేడు. దానికోసం జట్టులోకి నజ్ముల్ ఇస్లామ్‌ను తీసుకున్నాం. మాకు మంచి అవకాశం ఉంది. వారిది నెం1 జట్టు. వాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఇది మేం అందిపుచ్చుకుంటే మాకు అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ నెగ్గాలని భారత్ భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సంచలనం సృష్టించాలని బంగ్లా భావిస్తోంది. తుది జట్లు భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ ఇస్లామ్, ముష్ఫికర్, మొహమ్మద్ మిథున్, ఇమ్రుల్ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ -
ఆఖరి బంతి వరకు పోరాడుతాం: బంగ్లా కెప్టెన్
దుబాయ్ : ఆసియాకప్ ఫైనల్లో విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడుతామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా స్పష్టం చేశాడు. మరికొద్ది క్షణాల్లో ఈ భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ సమరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మొర్తజా మాట్లాడుతూ.. గాయాలతో ఒక్కొక్క ఆటగాడు దూరం కావడంతో మేం కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఈ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. మా ఆటగాళ్లకు ఇది ఓ పాఠంలాంటిది. మేం ఖచ్చితంగా చివరి బంతి వరకు పొరాడాలని మా యువ ఆటగాళ్లకు బోధపడిందనుకుంటున్నాను. షకీబ్- ఇమామ్‌లు లేకపోవడం మాకు కష్టమే. ఈ టోర్నీ ఆరంభం ముందు షకీబ్ 50 శాతమే ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ నుంచే తమీమ్ జట్టులో లేడు. కానీ మా ఆటగాళ్లు నిరుత్సాహపడలేదు. గ్రూప్ దశలో అఫ్గాన్, సూపర్-4లో భారత్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికి మేం పోరాడుతాం. ఇప్పటివరకూ మా ఆటతీరుతో మేం గర్వపడ్డాం. అయితే టీమిండియా ఎంతో బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లో ఆ జట్టుతో మేం ఎలా పోరాడతాం అన్నదే ఇక్కడ ప్రధానం. ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్.. అందుకే మేం మానసికంగా బలంగా ఉండి.. చివరి బంతి వరకూ పోరాడాలి’ అని బంగ్లా సారథి పేర్కొన్నాడు. గాయాలతో బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక భారత్‌తో 34 వన్డేలాడిన బంగ్లాదేశ్ కేవలం 5 సార్లు మాత్రమే గెలిచింది. -
వరుస నాలుగు బాల్స్‌లో నాలుగు వికెట్లు
ఫతుల్లా: బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా అరుదైన ఘనతను సాధించాడు. వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మోర్తజా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అబాహనీ లిమిటెడ్ జట్టు తరపున ఆడుతున్న మోర్తజా.. అగ్రానీ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా చివరి ఓవర్లో వరుసగా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దాంతో అబాహనీ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఇలా ఒక బౌలర్ వరుస బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్ చేసిన అబాహనీ జట్టు 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిలో భాగంగా లక్ష్య ఛేదనలో అగ్రానీ బ్యాంక్ జట్టు ధీటుగా బదులిచ్చింది. 49 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరుణంలోబౌలింగ్కు దిగిన మోర్తజా తొలి బంతికి పరుగు ఇచ్చాడు. ఆపై వరుసగా నాలుగు వికెట్లు సాధించి అగ్రానీ జట్టుకు షాకిచ్చాడు. 50 ఓవర్ రెండో బంతికి దిమాన్ ఘోష్‌ను పెవిలియన్‌కు పంపిన మోర్తజా.. మూడో బంతికి అబ్దుర్ రజాక్‌ను అవుట్ చేశాడు. ఇక నాల్గో బంతికి షఫుల్ ఇస్లామ్‌ను ఐదో బంతికి ఫజల్ రాబీని అవుట్ చేశాడు. ఫలితంగా అగ్రానీ జట్టుపై అబాహనీ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మోర్తజా మొత్తంగా ఆరు వికెట్లు సాధించి అగ్రానీ జట్టు పతనాన్ని శాసించాడు. అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్‌లకు గతంలోనే మోర్తజా గుడ్ బై చెప్పడంతో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ 20 సిరీస్‌కు దూరం అయ్యాడు. అదే సమయంలో లీగ్ మ్యాచ్‌లు ఆడుతూ సత్తాచాటుతున్నాడు మోర్తజా. -
మార్గదర్శకుడు మొర్తజా!
గుంపు మనస్తత్వం ప్రమాదకరమైనది. అది కొన్ని పదాలకున్న అర్ధాలను మారుస్తుంది. ప్రతీకలకు కొత్త భాష్యం చెబుతుంది. సందేహాలను లేవనెత్తేవారిని అనుమానంతో చూస్తుంది. ప్రశ్నించడం ద్రోహమంటుంది. దాడులకు దిగు తుంది. వర్తమానంలో ఈ గుంపు మనస్తత్వం నీడ పడని చోటంటూ లేదు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రఫె మొర్తజా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ గుంపు మనస్తత్వం మన దగ్గర మాత్రమే కాదు... ఆ దేశంలో కూడా ఎంతగా వేళ్లూనుకుందో, అది ఎంతటి సమస్యగా మారిందో అర్ధమవుతుంది. మొర్తజా ఆ వ్యాఖ్యల్లో క్రికెట్‌కూ, దేశభక్తికీ ముడిపెట్టే తీరును ప్రశ్నించాడు. ఒక వైద్యుడితో, శ్రామికుడితో పోలిస్తే తాము చేస్తున్నదేమీ లేదని తేల్చిచెప్పాడు. నిజమైన దేశభక్తి ఎలాంటి చర్యల్లో ఇమిడి ఉంటుందో హితవు చెప్పాడు. అకారణంగా, అన వసరంగా ఏదో ఒక పేరు చెప్పి ఒక్కరిని లేదా కొందరిని లక్ష్యంగా చేసుకుని గుంపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి విని, చానెళ్లలో చూసి ఆందోళన పడుతున్నవారికి... ఒక రకమైన నిర్లిప్త స్థితికి, నిరాశామయ వాతా వరణంలోకి జారుకుంటున్నవారికి మొర్తజా చేసిన వ్యాఖ్యలు ఊరటనిస్తాయి. మన పొరుగునున్న ఒక చిన్న దేశం నుంచి ఇలాంటి వివేకవంతమైన స్వరం వినడం సంతోషం కలిగిస్తుంది. ఆ వ్యాఖ్యలు ఉన్మాదంలో కొట్టుకుపోతున్న వారికి మాత్రమే హితవచనాలు కావు... ఇలాంటి సమయాల్లో తమ బాధ్య తేమిటో గుర్తించని దేశదేశాల్లోని సెలబ్రిటీలకు సైతం కర్తవ్యాన్ని గుర్తు చేసే విలువైన మాటలు. మొర్తజా ప్రస్తావించిన ఈ దేశభక్తి సమస్య కంటే ముందు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రను స్పృశించాలి. క్రికెట్ ప్రపంచంలోకి బంగ్లాదేశ్ చాలా ఆలస్యంగా 1999లో అడుగు పెట్టింది. ఆ సంవత్సరం వరల్డ్ కప్‌లో బంగ్లా పాల్గొన్నది. ఆ మరుసటి ఏడాదికి టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయికి చేరుకుంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నప్పుడు...అంటే 1971కి ముందు ఆ ప్రాంతమంటే పాక్‌లో చిన్నచూపు. సైన్యంలోకైనా, క్రికెట్ టీంలోకి అయినా ‘అక్కడి’ నుంచి తీసుకోవడంపై అనధికార నిషేధం అమలయ్యేది. చాలా అరుదుగా మాత్రమే తూర్పు పాకిస్తాన్ యువకులకు చోటు దక్కేది. అది పశ్చిమ ప్రాంతానికీ, మరీ ముఖ్యంగా అక్కడ శిష్ట వర్గంగా చలామణి అయ్యేవారికీ పరిమితమయ్యేది. కనుకనే బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాతగానీ క్రికెట్ ప్రపం చంలోకి ఆ దేశం అడుగుపెట్టలేకపోయింది. అందుకు సంబంధించిన నైపుణ్యం అప్పటివరకూ పూర్తిస్థాయిలో దానికి పట్టుబడలేదు. అంతవరకూ బంగ్లా పౌరులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ టీంలకు మద్దతుదార్లుగా ఉండేవారు. మతం కారణంగా లేదా మెరుగైన ఆట కనబరుస్తున్నారన్న కారణంగా ఎవరైనా పాకిస్తాన్ టీం నెగ్గాలని కోరుకుంటే అలాంటివారిని దేశ ద్రోహులుగా భావిం చేవారు. బంగ్లా టీంలు సైతం మైదానాల్లోకి రావడం మొదలెట్టాక పాకిస్తాన్‌పై క్రికెట్లో నెగ్గినవారినల్లా 1971లో పాక్ సైన్యం సాగించిన దౌష్ట్యాలకు ప్రతీకారం తీర్చుకున్నవారిగా పరిగణించే తత్వం పెరిగింది. ఇలాంటి విపరీత ధోరణులు రాను రాను మరింత బలపడుతున్నాయి. సరిహద్దుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్లు బంగ్లాదేశ్ నుంచి వలసలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నా, ఇరుపక్షాల మధ్యా ఎప్పుడైనా కాల్పులు జరిగినా వెనువెంటనే జరిగే క్రికెట్ క్రీడపై ఆ ప్రభావం ఉంటుంది. అలాంటపుడు తమ టీం ఉంటే సరేసరి... లేనట్టయితే పాకిస్తాన్ టీంను సమర్ధించడం సర్వ సాధారణం. మద్దతు ఎవరికని కాదు... ఆ మద్దతుదారు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడన్నది ప్రధానమైపోతుంది. బంగ్లా హిందువులు భారత్ టీం ఆట తీరును మెచ్చుకుంటే వారికి దేశంకంటే మతం ప్రధానమైపోయిందన్న విమర్శలు మొదలవుతాయి. ఒక్కోసారి ఇది దాడుల వరకూ పోతుంది. మన దేశంలో ముస్లింలు అంతరాంతరాల్లో పాకిస్తాన్ అంటేనే మక్కువ చూపుతారని కొందరిలో ఉండే దురభిప్రాయంలాంటిదే ఇది కూడా. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇది మరింత వెర్రితలలు వేస్తోంది. ఫేస్‌బుక్‌లోనో, మరో చోటనో పెట్టే ఒక వ్యాఖ్య లేదా ఒక ‘లైక్’ ఆగ్రహావేశాలకూ, విద్వేషాలకూ దారితీస్తోంది. కేవలం సామాజిక మాధ్యమాలే కాదు... క్రికెట్ క్రీడతో అల్లుకుని ఉండే కార్పొరేట్ పెట్టుబడులు, లాభార్జన దృష్టి కూడా దాన్నొక క్రీడగా ఉండనివ్వడం లేదు. జాతీయతనో, దేశభక్తినో ప్రేరేపించడానికి అదొక సాకుగా మారింది. అందులో నెగ్గడంపైనే దేశ గౌరవప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నంతగా ప్రచారం జరుగుతోంది. మన టీం నెగ్గితే వీధుల్లోపడి గంతులేయడం, ఓడిన దేశాన్ని కించపరుస్తూ, అవహేళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం ఎక్కువవుతోంది. మన టీం ఓడితే ఆ క్రీడాకారులు ద్రోహులన్నట్టు అవమానిస్తూ మాట్లాడటం, టెలివిజన్ సెట్లు బద్దలు కొట్టడం దేశభక్తికి చిహ్నమవుతోంది. ప్రతిదీ లాభాలు ఆర్జించి పెట్టే సరుకుగా మారినచోట క్రికెట్ లేదా మరో క్రీడ దానికి అతీతంగా ఉండాలనుకోవడం అత్యాశే అయినా...నిష్కారణంగా కొంద రిని శత్రువులుగా, ద్రోహులుగా పరిగణించే మనస్తత్వం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సమాన సామర్ధ్యం గల రెండు టీంలు మైదానంలో నువ్వా నేనా అని తలపడుతుంటే దాన్ని ఆసక్తిగా తిలకించడం, ఆనందించడం, మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని మెచ్చుకోవడం కనుమరుగవుతోంది. క్రికెట్ క్రీడాకారులు, బీసీసీఐ కూడా ఇలాంటి పెడ ధోరణులపై పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క క్రికెట్ అనే కాదు... తినే తిండిని, కట్టే బట్టనూ, ఆచరించే సంస్కృతిని ఎత్తి చూపడం, దాడులకు దిగడం మన దేశంలో రివాజైంది. వీటన్నిటికీ కళ్లు మూసుకోవడం, మౌనంవహించడం బాధ్యతా రాహిత్యం అవుతుందని సెలబ్రిటీలు గమనించాలి. మొర్తజాను చూసైనా కర్తవ్యం గుర్తెరగాలి. -
మాకు దేశభక్తి ఏమిటి?: క్రికెటర్
న్యూఢిల్లీ: క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదంటున్నాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా. డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు దేశభక్తిని అంటగట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. క్రికెటర్లకు, దేశభక్తికి ముడిపెట్టడం తగదని మొర్తాజా తెలిపాడు. 'మేము డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడతాం. మరి అటువంటప్పుడు మాకు దేశభక్తి ఏమిటి. నిజమైన స్టార్లు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్లు, రైతులు, కూలీలు మాత్రమే. నేను ఒక క్రికెటర్ని. ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది డాక్టర్లకు మాత్రమే ఉంది. కానీ డాక్టర్లు కోసం ఎవ్వరూ క్లాప్స్ కొట్టరు. వారికి గుర్తింపు తీసుకురండి. ఇంకొన్ని ప్రాణాల్ని నిలబెడతారు. కొన్ని అద్భుతాలను చేసే శక్తి డాక్టర్లకు ఉంది. వారు రియల్ స్టార్స్. మరి దేశ అభివృద్దికి తోడ్పడే శ్రామికులు కూడా స్టార్లే. దయచేసి క్రికెటర్లను హీరోలుగా గుర్తించొద్దు' అని మొర్తజా ఒక వేదాంత ధోరణిలో మాట్లాడాడు. -
'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు'
శ్రీనగర్:వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఓడిపోవడం తమ జట్టు మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా స్పష్టం చేశాడు. ఆటలో గెలుపు-ఓటములు ఒక భాగమే అయినా, ఆ మ్యాచ్‌లో పరాజయం చెందుతామని ఊహించనే లేదన్నాడు. దీంతో ఆ రోజు జట్టులోని సభ్యులెవ్వరూ కనీసం డిన్నర్ కూడా చేయకుండా అలానే ఉండిపోయామన్నాడు. హాలీ డే ట్రిప్‌లో భాగంగా కశ్మీర్లో ఉన్న మోర్తజా... ఆ మ్యాచ్ కు సంబంధించి స్థానిక యువకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. 'భారత్‌తో ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. మూడు బంతులు ఉండగా రెండు పరుగులు చేయలేక చతికిలబడ్డాం. ఒక పరుగుతో ఓటమి మరింత బాధించింది. ఆ మ్యాచ్‌లో విజయం చేతివరకూ వచ్చి చేజారింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి చెందాం. ఆ రాత్రి ఎవరూ డిన్నర్ కూడా చేయలేదు' అని మోర్తాజా చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. -
'ఆ రెండు క్యాచ్ లు కొంపముంచాయి'
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. అయితే తమ జట్టు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలే ఓటమికి కారణాలుగా మారుతున్నాయని ఆ జట్టు కెప్టెన్ ముష్రాఫే మొర్తజా పేర్కొన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. షేన్ వాట్సన్, జాన్ హెస్టింగ్స్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా విజయం తమ జట్టుదేనని బంగ్లా కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసినా, ఫీల్డింగ్ లోపాల వల్ల ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యామని మొర్తజా అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు కాస్త త్వరగా రాణించి వికెట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చాడు. చివర్లో బౌలర్లు రాణించడంతో ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగామని చెప్పాడు. బంగ్లా జట్టు బుధవారం తమ తదుపరి పోరులో పటిష్ట భారత్ తో తలపడనుందని తెలిపాడు. ఆసీస్ తో మ్యాచ్ లో ఓడినప్పటికీ తమ ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగిందని మొర్తజా వివరించాడు. -
కనిపించని క్రీడాస్ఫూర్తి!
ఢాకా: భారత్‌పై గెలవాలన్న కసిని ప్రదర్శించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదు. ఈ క్రమంలో వారు పూర్తిగా క్రీడాస్ఫూర్తిని మరచిన ఘటన మ్యాచ్‌లో జరిగింది. మొర్తజా వేసిన పదో ఓవర్లో బంతి ధావన్ బ్యాట్‌కు తగిలి కీపర్ ముష్ఫికర్ వైపు వెళ్లింది. దానిపై బౌలర్ అప్పీల్ చేయడం, ఆ వెంటనే అంపైర్ టకర్ అవుట్ ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి. ధావన్ కూడా క్రీజ్ వదిలి పెవిలియన్ వైపు సాగాడు. అయితే అసలు ఆ క్యాచ్‌ను కీపర్ పట్టనే లేదు. అతని చేతుల్లో బంతి పడ్డా పట్టు జారి కింద పడిపోయింది. దీనిని బౌలర్, అంపైర్ గమనించలేదు. కానీ ఫీల్డర్ బంతిని అందుకొని నేరుగా వికెట్లపైకి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. దీనికి బంగ్లా ఆటగాళ్లు రనౌట్ కోసం అప్పీల్ చేశారు! వాస్తవానికి అంపైర్ నిర్ణయం తర్వాత అవుట్ కోసం అప్పీల్ చేయడం సరైంది కాదు. కానీ వారు దానిని పట్టించుకునే స్థితిలో లేరు. చివరకు అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆటగాళ్లకు సర్ది చెప్పాల్సి వచ్చింది. -
'భారత్ ను ఆశ్చర్యపోయేలా చేస్తాం'
మిర్పూర్ (బంగ్లాదేశ్) : భారత్ తో వన్డే సిరీస్‌లో తమ జట్టును ఎంతో ముందుకు నడిపించాలని చూస్తున్నట్లు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్‌కు ముందు రోజు మోర్తాజా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, తమ ఆటతీరుతో రెండు సార్లు ప్రపంచ విజేత భారత్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తామని మోర్తాజా ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్ అనేది మాకు ఎప్పుడు సవాళ్లతో కూడుకున్నదని పేర్కొన్నాడు. అయితే, బంగ్లా ఆటగాళ్లు కెరీర్ లోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నందున ఆటతీరుతో భారత్‌ను ఆశ్చర్యపోయేలా చేస్తామని వన్డే కెప్టెన్ చెప్పాడు. గాయాలనుంచి ప్రస్తుతం తాను కోలుకున్నానని, బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీసు కొనసాగించినట్లు తెలిపాడు. అయితే, భారత్‌తో ఏకైక టెస్టుకు కొన్ని రోజుల ముందు ప్రమాదానికి గురై రెండు చేతులకు స్వల్పగాయాలవడంతో ఆ మ్యాచ్‌కు మోర్తాజా దూరమైన విషయం తెలిసిందే.