మార్గదర్శకుడు మొర్తజా! | Doctors, farmers and labourers are real stars of nation, not cricketers: Mashrafe Mortaza | Sakshi
Sakshi News home page

మార్గదర్శకుడు మొర్తజా!

Published Wed, Jun 21 2017 1:02 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

మార్గదర్శకుడు మొర్తజా! - Sakshi

మార్గదర్శకుడు మొర్తజా!

గుంపు మనస్తత్వం ప్రమాదకరమైనది. అది కొన్ని పదాలకున్న అర్ధాలను మారుస్తుంది. ప్రతీకలకు కొత్త భాష్యం చెబుతుంది. సందేహాలను లేవనెత్తేవారిని అనుమానంతో చూస్తుంది. ప్రశ్నించడం ద్రోహమంటుంది. దాడులకు దిగు తుంది. వర్తమానంలో ఈ గుంపు మనస్తత్వం నీడ పడని చోటంటూ లేదు. తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ గుంపు మనస్తత్వం మన దగ్గర మాత్రమే కాదు... ఆ దేశంలో కూడా ఎంతగా వేళ్లూనుకుందో, అది ఎంతటి సమస్యగా మారిందో అర్ధమవుతుంది. మొర్తజా ఆ వ్యాఖ్యల్లో క్రికెట్‌కూ, దేశభక్తికీ ముడిపెట్టే తీరును ప్రశ్నించాడు. ఒక వైద్యుడితో, శ్రామికుడితో పోలిస్తే తాము చేస్తున్నదేమీ లేదని తేల్చిచెప్పాడు.

నిజమైన దేశభక్తి ఎలాంటి చర్యల్లో ఇమిడి ఉంటుందో హితవు చెప్పాడు. అకారణంగా, అన వసరంగా ఏదో ఒక పేరు చెప్పి ఒక్కరిని లేదా కొందరిని లక్ష్యంగా చేసుకుని గుంపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి విని, చానెళ్లలో చూసి ఆందోళన పడుతున్నవారికి... ఒక రకమైన నిర్లిప్త స్థితికి, నిరాశామయ వాతా వరణంలోకి జారుకుంటున్నవారికి మొర్తజా చేసిన వ్యాఖ్యలు ఊరటనిస్తాయి. మన పొరుగునున్న ఒక చిన్న దేశం నుంచి ఇలాంటి వివేకవంతమైన స్వరం వినడం సంతోషం కలిగిస్తుంది. ఆ వ్యాఖ్యలు ఉన్మాదంలో కొట్టుకుపోతున్న వారికి మాత్రమే హితవచనాలు కావు... ఇలాంటి సమయాల్లో తమ బాధ్య తేమిటో గుర్తించని దేశదేశాల్లోని సెలబ్రిటీలకు సైతం కర్తవ్యాన్ని గుర్తు చేసే విలువైన మాటలు.

మొర్తజా ప్రస్తావించిన ఈ దేశభక్తి సమస్య కంటే ముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రను స్పృశించాలి. క్రికెట్‌ ప్రపంచంలోకి బంగ్లాదేశ్‌ చాలా ఆలస్యంగా 1999లో అడుగు పెట్టింది. ఆ సంవత్సరం వరల్డ్‌ కప్‌లో బంగ్లా పాల్గొన్నది. ఆ మరుసటి ఏడాదికి టెస్ట్‌ క్రికెట్‌ ఆడే స్థాయికి చేరుకుంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్‌ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నప్పుడు...అంటే 1971కి ముందు ఆ ప్రాంతమంటే పాక్‌లో చిన్నచూపు. సైన్యంలోకైనా, క్రికెట్‌ టీంలోకి అయినా ‘అక్కడి’ నుంచి తీసుకోవడంపై అనధికార నిషేధం అమలయ్యేది. చాలా అరుదుగా మాత్రమే తూర్పు పాకిస్తాన్‌ యువకులకు చోటు దక్కేది. అది పశ్చిమ ప్రాంతానికీ, మరీ ముఖ్యంగా అక్కడ శిష్ట వర్గంగా చలామణి అయ్యేవారికీ పరిమితమయ్యేది. కనుకనే బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాతగానీ క్రికెట్‌ ప్రపం చంలోకి ఆ దేశం అడుగుపెట్టలేకపోయింది.

అందుకు సంబంధించిన నైపుణ్యం అప్పటివరకూ పూర్తిస్థాయిలో దానికి పట్టుబడలేదు. అంతవరకూ బంగ్లా పౌరులు భారత్, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీంలకు మద్దతుదార్లుగా ఉండేవారు. మతం కారణంగా లేదా మెరుగైన ఆట కనబరుస్తున్నారన్న కారణంగా ఎవరైనా పాకిస్తాన్‌ టీం నెగ్గాలని కోరుకుంటే అలాంటివారిని దేశ ద్రోహులుగా భావిం చేవారు. బంగ్లా టీంలు సైతం మైదానాల్లోకి రావడం మొదలెట్టాక పాకిస్తాన్‌పై క్రికెట్‌లో నెగ్గినవారినల్లా 1971లో పాక్‌ సైన్యం సాగించిన దౌష్ట్యాలకు ప్రతీకారం తీర్చుకున్నవారిగా పరిగణించే తత్వం పెరిగింది.

ఇలాంటి విపరీత ధోరణులు రాను రాను మరింత బలపడుతున్నాయి. సరిహద్దుల్లో మన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు బంగ్లాదేశ్‌ నుంచి వలసలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నా, ఇరుపక్షాల మధ్యా ఎప్పుడైనా కాల్పులు జరిగినా వెనువెంటనే జరిగే క్రికెట్‌ క్రీడపై ఆ ప్రభావం ఉంటుంది. అలాంటపుడు తమ టీం ఉంటే సరేసరి... లేనట్టయితే పాకిస్తాన్‌ టీంను సమర్ధించడం సర్వ సాధారణం. మద్దతు ఎవరికని కాదు... ఆ మద్దతుదారు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడన్నది ప్రధానమైపోతుంది. బంగ్లా హిందువులు భారత్‌ టీం ఆట తీరును మెచ్చుకుంటే వారికి దేశంకంటే మతం ప్రధానమైపోయిందన్న విమర్శలు మొదలవుతాయి.

ఒక్కోసారి ఇది దాడుల వరకూ పోతుంది. మన దేశంలో ముస్లింలు అంతరాంతరాల్లో పాకిస్తాన్‌ అంటేనే మక్కువ చూపుతారని కొందరిలో ఉండే దురభిప్రాయంలాంటిదే ఇది కూడా. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇది మరింత వెర్రితలలు వేస్తోంది. ఫేస్‌బుక్‌లోనో, మరో చోటనో పెట్టే ఒక వ్యాఖ్య లేదా ఒక ‘లైక్‌’ ఆగ్రహావేశాలకూ, విద్వేషాలకూ దారితీస్తోంది. కేవలం సామాజిక మాధ్యమాలే కాదు... క్రికెట్‌ క్రీడతో అల్లుకుని ఉండే కార్పొరేట్‌ పెట్టుబడులు, లాభార్జన దృష్టి కూడా దాన్నొక క్రీడగా ఉండనివ్వడం లేదు. జాతీయతనో, దేశభక్తినో ప్రేరేపించడానికి అదొక సాకుగా మారింది. అందులో నెగ్గడంపైనే దేశ గౌరవప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నంతగా ప్రచారం జరుగుతోంది. మన టీం నెగ్గితే వీధుల్లోపడి గంతులేయడం, ఓడిన దేశాన్ని కించపరుస్తూ, అవహేళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం ఎక్కువవుతోంది. మన టీం ఓడితే ఆ క్రీడాకారులు ద్రోహులన్నట్టు అవమానిస్తూ మాట్లాడటం, టెలివిజన్‌ సెట్లు బద్దలు కొట్టడం దేశభక్తికి చిహ్నమవుతోంది.

ప్రతిదీ లాభాలు ఆర్జించి పెట్టే సరుకుగా మారినచోట క్రికెట్‌ లేదా మరో క్రీడ దానికి అతీతంగా ఉండాలనుకోవడం అత్యాశే అయినా...నిష్కారణంగా కొంద రిని శత్రువులుగా, ద్రోహులుగా పరిగణించే మనస్తత్వం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సమాన సామర్ధ్యం గల రెండు టీంలు మైదానంలో నువ్వా నేనా అని తలపడుతుంటే దాన్ని ఆసక్తిగా తిలకించడం, ఆనందించడం, మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని మెచ్చుకోవడం కనుమరుగవుతోంది. క్రికెట్‌ క్రీడాకారులు, బీసీసీఐ కూడా ఇలాంటి పెడ ధోరణులపై పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క క్రికెట్‌ అనే కాదు... తినే తిండిని, కట్టే బట్టనూ, ఆచరించే సంస్కృతిని ఎత్తి చూపడం, దాడులకు దిగడం మన దేశంలో రివాజైంది. వీటన్నిటికీ కళ్లు మూసుకోవడం, మౌనంవహించడం బాధ్యతా రాహిత్యం అవుతుందని సెలబ్రిటీలు గమనించాలి. మొర్తజాను చూసైనా కర్తవ్యం గుర్తెరగాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement